Fake IAS
-
ఐఏఎస్ అధికారినంటూ.. నటి, ఎంపీకి నకిలీ టీకా
కోల్‌కతా: ఐఏఎస్ అధికారిని.. వ్యాక్సినేషన్ క్యాంప్‌ని ప్రారంభించాల్సిందిగా నటి, ఎంపీ మిమి చక్రవర్తిని కోరడమే కాక.. ఆమెకు కూడా నకిలీ వ్యాక్సిన్ వేసిన ఓ వ్యక్తిని కోల్‌కతా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. టీకా తీసుకున్న తర్వాత ఆమె మొబైల్‌కు ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో అనుమానించిన మిమి చక్రవర్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు మిమి చక్రవర్తిని బురిడీ కొట్టించిన వ్యక్తి దేవాంజన్ దేవ్‌ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ కోల్‌కతా సమీపంలోని కస్బా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మిమి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి తనను తాను ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపాడు. నన్ను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరాడు. అతడు చేస్తున్నది మంచి పని కావడంతో సరే అన్నాను. టీకా తీసుకునేలా జనాలను ప్రోత్సాహించడం కోసం నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను’’ అని తెలిపారు. ‘‘వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. దాని గురించి నిందితుడిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత టీకా తీసుకున్నట్లు కోవిన్ నుంచి నా సెల్‌కు ఎలాంటి మెసేజ్ రాలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి.. నాతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిని ప్రశ్నించాను. వారు కూడా నాలానే తమకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని.. టీకా వేసుకున్నట్లు ఎలాంటి మెసేజ్ రాలేదని తెలిపారు. ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతను నీలిరంగు బెకన్, నకిలీ స్టిక్కర్ ఉన్న కారులో నా దగ్గరకు వచ్చాడు’’ మిమి చక్రవర్తి అని తెలిపారు. మిమి చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దేవాంగన్ దేవ్‌ని అరెస్ట్ చేశారు. ఇక వ్యాక్సినేషన్ క్యాంప్‌లో దాదాపు 250 మందికి టీకా వేశారు. వీరందరికి వేసిన వ్యాక్సిన్ నిజమైనదా.. కాదా అనే దాని గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఏ డోస్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ లేకపోవడంతో ప్రస్తుతం వాటిని కోల్‌కతాకు పంపినట్లు అధికారులు తెలిపారు. చదవండి: నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు -
ఫేక్ ఐఏఎస్ పక్కా ప్లాన్: కారుకు సైరన్, కలెక్టర్ నేమ్ ప్లేట్..
సాక్షి, మంచిర్యాల: తాను ఐఏఎస్ అయ్యాయని నమ్మించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని వారి నమ్మించి అందినకాడికి దండుకుంటున్నాడు. దీనికి మంచిర్యాల జిల్లాకేంద్రాన్ని అడ్డాగా చేసుకున్నాడు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటికిపైగా వసూలు చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన బర్ల లక్ష్మినారాయణ ఐఏఎస్ అయ్యానంటూ గ్రామంలో ప్రచారం చేశాడు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుని ఆదిత్య ఎన్‌క్లేవ్స్‌లో ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40మంది నుంచి రూ.కోటికిపైగా వసూలు చేశాడు. ఐఏఎస్‌గా అవతారమెత్తి ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని అందిన సమాచారం మేరకు మంచిర్యాల పోలీసులు లక్ష్మినారాయణ ఉండే ఇంటిపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కార్యాలయంలో టేబుల్‌పై కలెక్టర్ బి.లక్ష్మినారాయణ ఐఏఎస్ నేమ్ ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అతడి బాధితులు మంచిర్యాల పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ విషయమై మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్యను వివరణ కోరగా.. నకిలీ ఐఏఎస్ పేరట ఊద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కానీ.. పూర్తి వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. లక్ష్మీనారాయణ (ఫైల్) రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని.. లక్ష్మీనారాయణది మా పొరుగు ఊరు రేకులపల్లి. కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. మా అన్నయ్యను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ఆయన కారుకు సైరన్ పెట్టుకుని కొద్దిరోజులు తిరిగాడు. మా అన్నయ్య ద్వారా ఈయన నాకు పరిచయమయ్యాడు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెబితే నాతోపాటు మా ఊరికి చెందినవారు.. మా బంధువులు కలిసి సుమారు రూ.3లక్షలు ఇచ్చాం. ఆర్నెళ్లయ్యింది. కొంతకాలంగా కనినిపించకపోవడంతో ఆందోళన చెందాం. చివరకు మంచిర్యాల పోలీసులు పట్టుకున్నారని తెలిసింది. వెంటనే వచ్చి ఫిర్యాదు చేశాం. - సంతోష్, బీర్పూర్ చదవండి: చాటింగ్ చేసి నిండా ముంచిన ‘వంటలక్క’ -
ఈ బాబాయ్ బిల్డప్ అంతా ఇంతా కాదు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతున్న బిల్డప్ బాబాయ్ మహమ్మద్ సల్మాన్ (37) అనే వ్యక్తి చెన్నపట్టణ తహశీల్దార్ సమయస్పూర్తితో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. సల్మాన్‌ను తమదైన శైలిలో విచారించిన పోలీసులు చాలా విషయాలే రాబట్టారు ఈమేరకు రామనగర ఎస్పీ అనూప్‌శెట్టి అందించిన వివరాల ప్రకారం... నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఇతడి సహచరులు సల్మాన్‌ను ఐఏఎస్ అధికారి అని బిల్డప్‌లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంచరించేవారు. ఖరీదైన ఇన్నోవా కారుపై కర్ణాటక గవర్నమెంట్ అని రాసుకుని తిరిగేవారు. మండ్య, మైసూరు, రామనగర, చెన్నపట్టణ, మాగడి, గంగావతి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ అమాయకులను గుర్తించి ఇళ్ల స్థలాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలు వచ్చేలా చేస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఆర్డీపీఐ అధికారిగా చెప్పుకుని విధానసౌధ, ఎంఎస్ బిల్డింగ్‌లోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లి అధికారులను ప్రశ్నలు వేసి బెదిరించే వారు. అంగనవాడీ, ఉర్దూ, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పాఠశాలలను దత్తత తీసుకుంటామని నమ్మబలికేవారు. కర్ణాటక రాష్ట్ర సమగ్ర జనస్పందన వేదిక పేరుతో ఒక నకిలీ సంస్థను సృష్టించి ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడినని చెప్పుకుని అధికారులను బెదిరించేవాడు. శివమొగ్గ తాలూకా అబ్బలుగెరె గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో 7వ సంతానంగా జన్మించాడు. 2014లో శివమొగ్గ జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చే కొందరికి పనులు చేయించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో బెంగళూరు వచ్చాడు. నెలమంగల తాలూకా లక్కేనమళ్లి సొండేకొప్పరోడ్డులో నివసించేవాడు. అనంతరం ఇన్నోవా కారు తీసుకుని నకిలీ సంస్థ పేరు ఒకటి రాయించి రవికుమార్ అనే వ్యక్తిని డ్రైవర్ కం గన్‌మ్యాన్‌గా నియమించుకున్నాడు. నిందితుడి నుండి ఇన్నోవా కారు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మొబైళ్లు, పోలీసుల డ్రస్సులు, లాఠీలు, టోపీలు, పలు నకిలీ ప్రభుత్వ రబ్బర్ స్టాంపులు, కొందరు వ్యక్తుల అధార్ కార్డులు, ప్రభుత్వానికి సంబంధించిన దాఖలు పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏం తమాషానా ‘డీసీపీ రెడ్డి’ని మాట్లాడుతున్నా..!
సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎస్ నుంచి ఎస్ఎస్బీ వరకు వివిధ విభాగాల పేర్లు, అనేక హోదాలు వాడేసి మోసాలకు పాల్పడుతూ గురువారం మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన సూడో కర్నాటి గురువినోద్‌కుమార్ రెడ్డి తన పేరును ట్రూకాలర్ యాప్‌లో ‘డీసీపీ రెడ్డి సార్’గా సేవ్ చేసుకున్నాడు. దీనికి తోడు కేవలం బీఎస్ఎన్ఎల్కు చెందిన నెంబర్లనే వాడి ఫోన్లు చేయడంతోనే ఎక్కువ మంది అతడి బుట్టలో పడ్డారు. ఇతని తొలిసారి కటకటాల్లోకి పంపింది అతడి స్వస్థలమైన గిద్దలూరు పోలీసులే. అప్పట్లో అక్కడ స్టేషన్ విజిట్‌కు వెళ్లి బుక్కయ్యాడు. ఈ మోసగాడి చేతిలో దగా పడిన వారు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఆన్లైన్లో జాబితా చెక్ చేయడంతో... వినోద్ ప్రకాశం జిల్లా, గిద్దలూరు నుంచి 2017లో హైదరాబాద్‌కు వచ్చి సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. ఏ పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయాడు. అప్పటికే బంధువులు, స్నేహితులకు ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకున్నాడు. 2016లో సివిల్స్ రాసి ఐపీఎస్‌కు ఎంపికైనట్లు బోగస్ ఐడీ కార్డు తయారు చేశాడు. దీనిని తీసుకుని తన స్వస్థలానికి వెళ్లి అందరినీ నమ్మించాడు. తన తండ్రితో పాటు మేనమామనూ ఓసారి హైదరాబాద్ తీసుకువచ్చి జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ) వద్దకు తీసుకువెళ్లాడు. విజిటింగ్ అవర్స్‌లో అకాడమీ లోపలికి తీసుకెళ్లి తిప్పడంతో పాటు తాను ఐపీఎస్ అయినందుకే లోపలకు వచ్చే అనుమతి వచ్చిందని, ఇందులోనే తాను శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పాడే. మరోసారి తన ఊరికి వెళ్లినప్పుడు మరింత బిల్డప్ ఇవ్వాలనే ఉద్దేశంతో గిద్దలూరు ఠాణాను సందర్శించాడు. అక్కడి ఎస్సైకి తాను ఐపీఎస్ అని చెప్పడంతో ఆయన ఏకంగా తన కుర్చీనే ఇచ్చి కూర్చోబెట్టారు. ఇతడి మాటతీరు, వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన అతను ఆపై అతడి స్నేహితుల వద్ద ఆరా తీశారు. ఈ నేపథ్యంలో వినోద్ తాను 2016లో ఐపీఎస్‌కు ఎంపికైనట్లు చెప్పినట్లు తెలిసింది. ఆ ఏడాది ఐపీఎస్‌కు ఎంపికైన వారి జాబితాను ఎన్పీఏ అధికారిక వెబ్సైట్లో పరిశీలించిన ఎస్సై జరిగిన మోసాన్ని గ్రహించాడు. వెంటనే వినోద్‌ను తన ఠాణాకు పిలిచి అరెస్టు చేసి జైలుకు పంపాడు. వివాహితనూ ట్రాప్ చేసిన వినోద్... ఈ సూడోగాడు రైళ్లల్లో ప్రయాణించిన ప్రతిసారీ అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బందికి తన బోగస్ ఐడీ కార్డు చూపించే వాడు. ఇటీవల చెన్నై నుంచి ప్రయాణిస్తూ నకిలీ గుర్తింపుకార్డుతో పాటు మాజీ మేజర్ ఇంటి నుంచి చోరీ చేసిన డమ్మీ పిస్టల్ చూపించి ఐపీఎస్ అధికారిగా నమ్మించాడు. దీంతో వారు అతడికి రాచమర్యాదలు చేయడంతో పాటు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వారికీ ఈ విషయం చెప్పి నిశ్శబ్ధంగా ఉండాలని, ఆయన్ను డిస్ట్రబ్ చెయ్యవద్దంటూ హడావుడి చేశారు. అదే బోగీలో వినోద్‌తో కలిసి ప్రయాణించిన ఓ వివాహిత ఈ హంగామాకు ఆకర్షితురాలైంది. ఇద్దరూ తమ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తన ఫేస్బుక్ పేజ్‌లో ఎయిర్‌ఫోర్స్ నుంచి వివిధ విభాగాల యూనిఫాంతో కూడిన ఫొటోలు చూసిన ఆమె పూర్తిగా అతడి వల్లో పడిపోయింది. అప్పటి నుంచి తరచూ ఫోన్లో, సోషల్‌మీడియా ద్వారా ఆమెతో సంప్రదింపులు కొనసాగించిన వినోద్ మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు. ఈ మాటల నేపథ్యంలోనే ఆమె భర్త శామీర్‌పేట్ జినోమ్ వ్యాలీలోని ఓ సంస్థలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. అతడి ఉద్యోగం పోగొట్టడంతో పాటు వివాహిత కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే ఆమె తనతో వస్తుందని వినోద్ భావించాడు. జినోమ్ వ్యాలీ డేటా పొంది... దీంతో రంగంలోకి దిగిన వినోద్ జినోమ్ వ్యాలీలో ఉన్న ఆ సంస్థ నిర్వాహకుల వివరాలు సంగ్రహించాలని భావించాడు. వెంటనే శామీర్‌పేట్ పోలీసులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా ఫోన్ చేసి ఆ వ్యాలీలో ఉన్న అన్ని సంస్థల వివరాలు కావాలని కోరడంతో పోలీసులు ఈ–మెయిల్ ద్వారా పంపారు. అందులో తనకు కావాల్సిన కంపెనీ వివరాలు ఎంచుకున్న వినోద్ సదరు సంస్థ నిర్వాహకుడి ఫోన్ చేశాడు. ఫలానా వ్యక్తిపై (సదరు వివాహిత భర్త) కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు తెలపాలని కోరాడు. ఇలా చెప్తే ఆయన ఉద్యోగం పోతుందని పథకం వేశాడు. అయితే ఫోన్‌కాల్‌లో వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన సంస్థ నిర్వాహకుడు నేరుగా అధికారిక లేఖ తీసుకుని లేదా స్థానిక పోలీసుల ద్వారా రావాలంటూ స్పష్టం చేశాడు. దీంతో వెంటనే శామీర్‌పేట పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడి మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమ నుంచి కంపెనీల డేటా తీసుకున్న ‘ఐపీఎస్ అధికారి’ ప్రమేయాన్ని శంకించారు. అప్పట్లో ఆయన కాల్ చేసిన నెంబర్‌కు కాల్‌బ్యాక్ చేయగా, ట్రూకాలర్‌లో ‘డీసీపీ రెడ్డి సార్’గా ఉన్నప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించినా, స్పందన లేకపోవడంతో లోతుగా ఆరా తీసి నకిలీ పోలీసుగా గుర్తించారు. దీంతో వినోద్‌పై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. ఒకే ఒక్క మంచిపని.. తన కుటుంబంతో పాటు స్నేహితులు, అపరిచితులను మోసం చేసిన వినోద్ ఒక్క మంచిపని చేశాడు. అతడి స్నేహితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి సోదరి అనారోగ్యానికి గురైంది. కరీంనగర్లో ఆమెకు చికిత్స చేసిన వైద్యులు రూ.1.2 లక్షల బిల్లు వేశారు. వారికి కాల్ చేసిన ‘డీసీపీ రెడ్డి సార్’ బేరసారాలు లేకుండా రూ.40 వేల కన్సెషన్ ఇప్పించాడు. వినోద్‌ను అరెస్టు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్ తదితరాలతో పాటు శక్తిమంతమైన బైనాక్యులర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని దేని కోసం సంగ్రహించాడనే కోణంపై ఆరా తీస్తున్నారు. వీటిని వినియోగించి ప్రైవేట్ గూçఢచర్యం నిర్వహించడం వంటివి చేశాడా అనే విషయమై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇతడి మూడు ఎన్ఐఏ డైరీలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అవి ఇతడికి ఎలా చేరాయనే అంశాన్నీ పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతగాడు బోగస్ ఐడీ కార్డులు తయారు చేయించిన ప్యారడైజ్‌లోని దుకాణం ఇప్పుడు మూతపడినట్లు పోలీసులు గుర్తించారు. వినోద్‌ను గాంధీనగర్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ ఐఏఎస్ హల్చల్
బెంగళూరు : ఓ నకిలీ ఐఏఎస్ పలు ప్రభుత్వ విభాగాల్లో హల్చల్ సృష్టించడంతోపాటు నిరుద్యోగులను వంచించి లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి పోలీసులకు చిక్కాడు. దాంతో నకిలీ ఐఏఎస్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయచూరు ఎస్పీ నాగరాజు వివరాలు మీడియాకు వెల్లడించారు. నకిలీ ఐఏఎస్ అవతారమెత్తిన ఢిల్లీకి చెందిన కబీర్ హస్మీ, ముంబైకి చెందిన సర్వేష్‌కుమార్‌ను కార్యదర్శిగా నియమించుకొని రిచ్మండ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి అక్రమాలకు తెర తీశారు. అందులో భాగంగా క్రీడా శాఖ, యువజన సేవా శాఖ ఉప కార్యదర్శి కబీర్ హస్మీ ఈనెల 7న రాయచూరు నెహ్రూ యువక కేంద్రానికి పరిశీలన కోసం వస్తారని ఈనెల 5న సాయంత్రం 5 గంటలకు రాయచూరు జిల్లాధికారి కార్యాలయానికి ఢిల్లీ నుంచి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. దీంతో ఇన్చార్జి జిల్లాధికారి జ్యోత్స్న ప్రభుత్వ అతిథి గృహంతోపాటు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కబీర్హాస్మీ రాయచూరులో క్రీడా, యువజన సేవా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. తనది 2007 ఐఏఎస్ బ్యాచ్ అని కబీర్హాస్మీ మాటల సందర్భంలో చెప్పడంతో ఇన్చార్జి జిల్లాధికారి జ్యోత్స్న అప్రమత్తమయ్యారు. తమిళనాడులో ఉన్న తన జూనియర్ ఐఏఎస్ అధికారిని సంప్రదించారు. కబీర్ హష్మి అనే ఐఏఎస్ చదివిన అభ్యర్థి ఎవరూ లేరని తెలియడంతో వెంటనే సదర్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని కబీర్ హష్మిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అతను ఐఏఎస్ కాదని, బీకాం చదివి యుపీఎస్సీ పరీక్షలు రాసినట్లు తేలింది. అంతేగాకుండా రాయచూరు వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురినుంచి రాయచూరులోని జలాల్ నగర్‌కు చెందిన ఉబేదుల్లా సహకరించడంతో రూ. 15,42,000లు వసూలు చే సినట్లు తేలింది. అదేవిధంగా రాయచూరులోని ఏపీఎంసీలో డెరైక్టర్ పదవి ఇప్పిస్తామని చెబుతూ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తితో రూ.12 లక్షలు వసూలు చేసి వ్యవసాయ శాఖ మంత్రిమండలి ప్రధాన కార్యదర్శి నరేంద్ర భూషణ పేరుతో నకిలీ నియామకపు పత్రం అందజేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు ఇచ్చిన ఆధారాలతో ముంబైకి చెందిన సర్వేశకుమార్, రాయచూరుకు చెందిన ఉబేదుల్లాను అరెస్టు చేసి వారి నుంచి రూ. 15లక్షల 42వేలు వసూలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.