నకిలీ ఐఏఎస్ హల్‌చల్
బెంగళూరు : ఓ నకిలీ ఐఏఎస్ పలు ప్రభుత్వ విభాగాల్లో హల్‌చల్ సృష్టించడంతోపాటు నిరుద్యోగులను వంచించి లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి పోలీసులకు చిక్కాడు. దాంతో నకిలీ ఐఏఎస్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయచూరు ఎస్పీ నాగరాజు వివరాలు మీడియాకు వెల్లడించారు.
నకిలీ ఐఏఎస్ అవతారమెత్తిన ఢిల్లీకి చెందిన కబీర్ హస్మీ, ముంబైకి చెందిన సర్వేష్‌కుమార్‌ను కార్యదర్శిగా నియమించుకొని రిచ్‌మండ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి అక్రమాలకు తెర తీశారు. అందులో భాగంగా క్రీడా శాఖ, యువజన సేవా శాఖ ఉప కార్యదర్శి కబీర్ హస్మీ ఈనెల 7న రాయచూరు నెహ్రూ యువక కేంద్రానికి పరిశీలన కోసం వస్తారని ఈనెల 5న సాయంత్రం 5 గంటలకు రాయచూరు జిల్లాధికారి కార్యాలయానికి ఢిల్లీ నుంచి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. దీంతో ఇన్‌చార్జి జిల్లాధికారి జ్యోత్స్న ప్రభుత్వ అతిథి గృహంతోపాటు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కబీర్‌హాస్మీ రాయచూరులో క్రీడా, యువజన సేవా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు.
తనది 2007 ఐఏఎస్ బ్యాచ్ అని కబీర్‌హాస్మీ మాటల సందర్భంలో చెప్పడంతో ఇన్‌చార్జి జిల్లాధికారి జ్యోత్స్న అప్రమత్తమయ్యారు. తమిళనాడులో ఉన్న తన జూనియర్ ఐఏఎస్ అధికారిని సంప్రదించారు. కబీర్ హష్మి అనే ఐఏఎస్ చదివిన అభ్యర్థి ఎవరూ లేరని తెలియడంతో వెంటనే సదర్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని కబీర్ హష్మిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అతను ఐఏఎస్ కాదని, బీకాం చదివి యుపీఎస్‌సీ పరీక్షలు రాసినట్లు తేలింది. అంతేగాకుండా రాయచూరు వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురినుంచి రాయచూరులోని జలాల్ నగర్‌కు చెందిన ఉబేదుల్లా సహకరించడంతో రూ. 15,42,000లు వసూలు చే సినట్లు తేలింది.
అదేవిధంగా రాయచూరులోని ఏపీఎంసీలో డెరైక్టర్ పదవి ఇప్పిస్తామని చెబుతూ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తితో రూ.12 లక్షలు వసూలు చేసి వ్యవసాయ శాఖ మంత్రిమండలి ప్రధాన కార్యదర్శి నరేంద్ర భూషణ పేరుతో నకిలీ నియామకపు పత్రం అందజేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు ఇచ్చిన ఆధారాలతో ముంబైకి చెందిన సర్వేశకుమార్, రాయచూరుకు చెందిన ఉబేదుల్లాను అరెస్టు చేసి వారి నుంచి రూ. 15లక్షల 42వేలు వసూలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.