పట్టుబడిన మహమ్మద్ సల్మాన్ (ఫైల్)
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతున్న బిల్డప్ బాబాయ్ మహమ్మద్ సల్మాన్ (37) అనే వ్యక్తి చెన్నపట్టణ తహశీల్దార్ సమయస్పూర్తితో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. సల్మాన్‌ను తమదైన శైలిలో విచారించిన పోలీసులు చాలా విషయాలే రాబట్టారు ఈమేరకు రామనగర ఎస్పీ అనూప్‌శెట్టి అందించిన వివరాల ప్రకారం... నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఇతడి సహచరులు సల్మాన్ను ఐఏఎస్ అధికారి అని బిల్డప్‌లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంచరించేవారు. ఖరీదైన ఇన్నోవా కారుపై కర్ణాటక గవర్నమెంట్ అని రాసుకుని తిరిగేవారు. మండ్య, మైసూరు, రామనగర, చెన్నపట్టణ, మాగడి, గంగావతి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ అమాయకులను గుర్తించి ఇళ్ల స్థలాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలు వచ్చేలా చేస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు.
ఆర్‌డీపీఐ అధికారిగా చెప్పుకుని విధానసౌధ, ఎంఎస్ బిల్డింగ్‌లోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లి అధికారులను ప్రశ్నలు వేసి బెదిరించే వారు. అంగనవాడీ, ఉర్దూ, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పాఠశాలలను దత్తత తీసుకుంటామని నమ్మబలికేవారు. కర్ణాటక రాష్ట్ర సమగ్ర జనస్పందన వేదిక పేరుతో ఒక నకిలీ సంస్థను సృష్టించి ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడినని చెప్పుకుని అధికారులను బెదిరించేవాడు. శివమొగ్గ తాలూకా అబ్బలుగెరె గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో 7వ సంతానంగా జన్మించాడు.
2014లో శివమొగ్గ జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చే కొందరికి పనులు చేయించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో బెంగళూరు వచ్చాడు. నెలమంగల తాలూకా లక్కేనమళ్లి సొండేకొప్పరోడ్డులో నివసించేవాడు. అనంతరం ఇన్నోవా కారు తీసుకుని నకిలీ సంస్థ పేరు ఒకటి రాయించి రవికుమార్ అనే వ్యక్తిని డ్రైవర్ కం గన్‌మ్యాన్‌గా నియమించుకున్నాడు. నిందితుడి నుండి ఇన్నోవా కారు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మొబైళ్లు, పోలీసుల డ్రస్సులు, లాఠీలు, టోపీలు, పలు నకిలీ ప్రభుత్వ రబ్బర్ స్టాంపులు, కొందరు వ్యక్తుల అధార్ కార్డులు, ప్రభుత్వానికి సంబంధించిన దాఖలు పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment