
స్నేహితునితో ఆమె పరారీ
సెల్ఫీ పోస్టు చేసి భర్త ఆత్మహత్య
తుమకూరు జిల్లాలో ఘోరం
తుమకూరు: ప్రేమించుకున్నారు, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి తాళితో ఒక్కటయ్యారు. కానీ ఆమె మరొకరిపై మోజుపడి కట్టుకున్నోడికి ద్రోహం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలే వద్దనుకున్నాడు. తన స్నేహితుడే భార్యను తీసుకెళ్లడంతో విరక్తి చెందిన భర్త సెల్ఫీ వీడియో తీసి, చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని, తనకు న్యాయం చేయాలని స్నేహితులను కోరుతూ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి ఉరి వేసుకున్నాడు.
చిచ్చుపెట్టిన స్నేహితుడు
హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం జిల్లాలోని గుబ్బి పట్టణంలోని గట్టి లేఅవుట్ బడావణెలో జరిగింది. వివరాలు.. నాగేష్ (35), 12 సంవత్సరాల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. నాగేష్ ఇటీవల సొంత ఇల్లు విక్రయించి గట్టి లేఅవుట్ బడావణెలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు.
అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజిత మనసు మార్చాడు, ఇటీవల ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విరక్తి చెందిన నాగేష్.. మిత్రుడు భరత్ తన భార్య రంజితతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని, పరారు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment