ఫేక్‌ ఐఏఎస్‌ పక్కా ప్లాన్‌: కారుకు సైరన్‌, కలెక్టర్‌ నేమ్‌ ప్లేట్‌.. | Fake IAS Duped People In Mancherial | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఐఏఎస్‌ పక్కా ప్లాన్‌: కారుకు సైరన్‌, కలెక్టర్‌ నేమ్‌ ప్లేట్‌..

Published Tue, Apr 13 2021 10:16 AM | Last Updated on Tue, Apr 13 2021 2:41 PM

Fake IAS Duped People In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల: తాను ఐఏఎస్‌ అయ్యాయని నమ్మించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. నిరుద్యోగులను టార్గెట్‌ చేసుకుని వారి నమ్మించి అందినకాడికి దండుకుంటున్నాడు. దీనికి మంచిర్యాల జిల్లాకేంద్రాన్ని అడ్డాగా చేసుకున్నాడు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటికిపైగా వసూలు చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన బర్ల లక్ష్మినారాయణ ఐఏఎస్‌ అయ్యానంటూ గ్రామంలో ప్రచారం చేశాడు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుని ఆదిత్య ఎన్‌క్లేవ్స్‌లో ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నాడు.

రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 40మంది నుంచి రూ.కోటికిపైగా వసూలు చేశాడు. ఐఏఎస్‌గా అవతారమెత్తి ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని అందిన సమాచారం మేరకు మంచిర్యాల పోలీసులు లక్ష్మినారాయణ ఉండే ఇంటిపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కార్యాలయంలో టేబుల్‌పై కలెక్టర్‌ బి.లక్ష్మినారాయణ ఐఏఎస్‌ నేమ్‌ ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అతడి బాధితులు మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ విషయమై మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్యను వివరణ కోరగా.. నకిలీ ఐఏఎస్‌ పేరట ఊద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కానీ.. పూర్తి వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. 


లక్ష్మీనారాయణ (ఫైల్‌)

రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని.. 
లక్ష్మీనారాయణది మా పొరుగు ఊరు రేకులపల్లి. కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. మా అన్నయ్యను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ఆయన కారుకు సైరన్‌ పెట్టుకుని కొద్దిరోజులు తిరిగాడు. మా అన్నయ్య ద్వారా ఈయన నాకు పరిచయమయ్యాడు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెబితే నాతోపాటు మా ఊరికి చెందినవారు.. మా బంధువులు కలిసి సుమారు రూ.3లక్షలు ఇచ్చాం. ఆర్నెళ్లయ్యింది. కొంతకాలంగా కనినిపించకపోవడంతో ఆందోళన చెందాం. చివరకు మంచిర్యాల పోలీసులు పట్టుకున్నారని తెలిసింది. వెంటనే వచ్చి ఫిర్యాదు చేశాం. 
- సంతోష్, బీర్పూర్‌ 

చదవండి: చాటింగ్‌ చేసి నిండా ముంచిన ‘వంటలక్క’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement