బాబు వచ్చాడు... జాబు పోయింది!
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా ఉద్యోగుల గెంటివేత
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా మూడు నెలల క్రితం ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రతినిధి చొప్పున ఎన్నికల సర్వే, పార్టీ కార్యకలాపాల కోసం 294 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ నాయకులను ఎన్నుకునేందుకు కొందరు నిరుద్యోగ యువతిలను కూడా రిక్రూట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచాయి... ఎన్నికలు ముగిశాయి... ఫలితాలు వచ్చాయి... బాబు గెలిచాడు... అయితే పర్మినెంట్ అనుకున్న ఉద్యోగాలు ఉన్న పళంగా పోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఈ ఉద్యోగులు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద బాబుతో ములాఖత్ కోసం పడిగాపులు కాసారు. ట్రస్ట్ భవన్‌లోకి అనుమతించకపోవడంతో కేబీఆర్ పార్కు వద్ద ఆకలిడప్పులతో అలమటిస్తూ ఉండిపోయారు. మీకు హామీలు ఎవరు ఇచ్చారో వారిని తీసుకొని రండంటూ ట్రస్టు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశాడని బాధితులు వాపోయారు.
సాక్షాత్తు ట్రస్ట్ భవన్‌లోనే మాకు శిక్షణా తరగతులు ఇచ్చారని, చంద్రబాబు కూడా కొన్నిసార్లు తమతో ముఖాముఖి అయి మాట్లాడిన సందర్భాలున్నాయని ఇలా మోసపోతామని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకునేటప్పుడే అందరు ఉన్నత చదువులు చదివి ఉండాలని మంచి భవిష్యత్ ఉంటుందని, రూ. 18 వేల జీతం అని చెప్పారని వారు బాధపడుతున్నారు. ధర్నా చేయడానికి వచ్చిన వీరందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెల కొంది. లోకేష్ వచ్చాక నిర్ణయం చెబుతామని ట్రస్ట్‌భవన్ వర్గాలు చెప్పడంతో వారు ఎటు పాలుపోని స్థితిలో ఉన్నారు.