సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నియామక సంస్థలు వరుసగా ప్రకటనలు జారీ చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులంతా..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ఎంపిక చేసుకున్న పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు పెద్ద సంఖ్యలో కొలువుల భర్తీకి ప్రకటనలు జారీ చేశాయి. దాదాపు 15 రకాల పోస్టులకు ప్రకటనలు విడుదల చేసిన నియామకసంస్థలు... ఈనెల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపడుతున్నాయి.
ఈ మేరకు ప్రారంభ, చివరి తేదీలను ఖరారు చేశాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈపాటికే ప్రారంభం కాగా.. మరికొన్నింటికి అతి త్వరలో ఆన్‌లైన్‌లో మొదలుకానుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రకటనలు జారీ చేసి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టడంతో అభ్యర్థుల్లోనూ కొంత అయోమయం నెలకొంది. ఏయే పోస్టులకు సన్నద్ధం కావాలి? వేటికి దరఖాస్తు చేస్తే బాగుంటుంది? ఎందులో విజయవంతం అయ్యే అవకాశం ఉంది? అన్న ఆలోచనలో నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు.
చివరిదాకా ఆగొద్దు...
టీఎస్‌పీఎస్సీ, టీఎస్‌ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీలు దాదాపు 20 వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేశాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన తేదీలు ప్రకటించాయి. ఒక్కో పోస్టుకు దరఖాస్తు గడువును కనిష్టంగా మూడు వారాల నుంచి నాలుగు వారాల సమయాన్ని కేటాయిస్తూ తేదీలను ఖరారు చేశాయి. అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తుకు గడువు ఎక్కువ రోజులే ఇచ్చినప్పటికీ ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే మేలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రక్రియ మొదలైన వారం రోజుల్లోనే దరఖాస్తు చేసుకుంటే ఆందోళన ఉండదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి ప్రత్యేకంగా సూచించారు. చివరి నిమిషంలో తత్తరపాటు లేకుండా ఉండేందుకు ముందుగానే పని ముగించుకోవాలని అన్నారు. గతంలో సాంకేతిక సమస్యలు, సర్వర్ సమస్యలు, ఇతరత్రా ఇబ్బందుల కారణంగా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడటాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు ముందస్తు దరఖాస్తు వల్ల తొలి ప్రాధాన్యత ఇచ్చిన చోటే పరీక్ష సెంటర్ కేటాయించే అవకాశం ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment