
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్, సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టులకు ఇప్పటివరకు అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తుండగా..తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్త సర్కారు ప్రవేశపెట్టింది. దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. www. telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పూరించిన దరఖాస్తును secy-ser-gad@telangana.gov. in ఈమెయిల్ ద్వారా సమర్పించాలని స్పష్టం చేశారు.
మూడు పేజీల దరఖాస్తు
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు పేజీల దరఖాస్తును రూపొందించింది. విద్యార్హతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఉద్యోగి అయితే నియామకం వివరాలు, విధులు, సాధించిన విజయాలు తదితర పూర్తి సమాచారాన్ని పొందుపరచాలి. అకడమిక్, మేనేజ్‌మెంట్, న్యాయశాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగం, హ్యుమానిటీస్ లేదా వారి పనిని గుర్తించే రంగానికి సంబంధించిన వివరాలను, నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రత్యేకతలు, విజయాలను 200 పదాల్లో వివరించాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడాలని సీఎస్ తెలిపారు.
సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన
చైర్మన్, మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్, మెంబర్‌లను గవర్నర్ నియమిస్తారు. ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్‌పీఎస్సీ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మరో సభ్యురాలి రాజీనామా
టీఎస్‌పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. ఆరేళ్ల పాటు కొనసాగాల్సిన తాను రెండున్నరేళ్లకే రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల టీఎస్‌పీఎస్సీలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ మార్పు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment