మరో 593 గ్రూప్-2 పోస్టులు
- భర్తీకి అనుమతిస్తూ సర్కారు నిర్ణయం
- టీఎస్‌పీఎస్సీకి అప్పగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
- ఇప్పటికే 434 పోస్టులకు నోటిఫై మొత్తంగా 1,027 పోస్టుల
- భర్తీకి సన్నాహాలు త్వరలోనే నోటిఫికేషన్
- జారీ అయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరో 593 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటి భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి అనుమతి నిస్తూ శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 434 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా, ఆ పరీక్ష నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులతోపాటు తాజాగా అనుమతించినవి కలిపి మొత్తంగా 1,027 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా అనుమతించిన పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత జీఏడీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి.
త్వరలోనే నోటిఫికేషన్..
434 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులూ వచ్చాయి. కానీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు, యువత నుంచి భారీగా డిమాండ్‌లు వచ్చాయి. అదే సమయంలో తమకు అదనంగా పోస్టులు అవసరమని పలు ప్రభుత్వ విభాగాలు సీఎస్ రాజీవ్ శర్మ దృష్టికి తీసుకెళ్లాయి.
మరోవైపు మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో వెయ్యికిపైగా పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమని.. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై సీఎస్ ఆదేశాల మేరకు తమకు అదనంగా కావాల్సిన పోస్టుల వివరాలను వివిధ ప్రభుత్వ విభాగాలు నివేదికలు సమర్పించాయి. ఆ ఫైలుకు తాజాగా ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ పోస్టులతో నోటిఫికేషన్ జారీకి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.
కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులివే: తాజాగా భర్తీ చేయనున్న 593 పోస్టుల్లో... వ్యవసాయం-సహకార శాఖ పరిధిలోని కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 62; సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 90; ఆర్థిక శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 28; న్యాయ శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10; పరిశ్రమల శాఖలోని హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ విభాగం పరిధిలో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 20; కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 3; వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 46; డిప్యూటీ తహసీల్దార్ 259; ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ 64; దేవాదాయశాఖ పరిధిలో కార్యనిర్వహణాధికారి గ్రేడ్-1 పోస్టులు 11 ఉన్నాయి.