హైదరాబాద్ కేంద్రాలకూ హాల్ టికెట్ల జారీ
సాక్షి, అమరావతి: గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈనెల 26న నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను ఏపీ ఆన్‌లైన్ సంస్థ పరిష్కరించిందని, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సజావుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అభ్యర్థులు తమ దృష్టికి తీసుకురాగానే ఏపీ ఆన్‌లైన్‌తో చర్చించామని, సర్వర్‌లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇలా అయ్యిందని గుర్తించి వెంటనే సరిదిద్దే ప్రయత్నాలు చేశామన్నారు.
ఈ విషయంలో అభ్యర్థులు తమ సమస్యలపై appsc.halltickets@aptonline. inకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. కులం, స్థానికత తదితర అంశాల్లో తప్పులు చోటు చేసుకున్నట్లు కొంతమంది నుంచి సమాచారం వస్తోందని, అలాంటి అంశాలను సరిచేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పిస్తుందన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు కంప్యూటర్ టెస్టు ఉంటుందని కొందరి నుంచి వస్తున్న సమాచారం సరైనది కాదన్నారు. ఈ విషయంలో కొత్తగా ఎలాంటి అర్హత నిబంధనలు మార్పు చేయలేదని, నోటిఫికేషన్‌లో ఉన్న మేరకే వర్తిస్తాయన్నారు. ఇలా ఉండగా, హైదరాబాద్ కేంద్రాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్న వారికి కూడా మంగళవారం నుంచి హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. కాగా, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువును ఈనెల 17వ తేదీవరకు పొడిగించినట్లు కార్యదర్శి సాయి తెలిపారు.
గ్రూప్–2 హాల్ టికెట్ల సమస్యకు పరిష్కారం
Published Wed, Feb 15 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
Advertisement