► గ్రూపు-2 భర్తీ.. అదనపు పోస్టులు ఇచ్చే అవకాశం
► ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగులకు తప్పని నిరాశ
సాక్షి, హైదరాబాద్
ఈ ఏడాది కూడా నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. టీఎస్‌పీఎస్సీ గ్రూపు-2 పోస్టుల భర్తీకి ‘కొత్త’ సమస్య వచ్చి పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఆటంకంగా మారనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాకే గ్రూపు-2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా ప్రభుత్వ వైఖరి ఉంది. దీంతో గ్రూపు-2 పరీక్ష ఇప్పట్లో నిర్వహించే పరిస్థితిలేదు. ఫలితంగా 5,64,431 మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు మిగిలే అవకాశముంది. 439 పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. కానీ, పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంగా పరీక్షను వాయిదా వేశారు. దీంతో ప్రభుత్వం అదనపు పోస్టులు ఇచ్చే అంశంపై దృష్టి సారించింది.
ఈ మేరకు మరో 460 పోస్టులు వస్తాయని అభ్యర్థులు భావించారు. ఇంకా టీఎస్‌పీఎస్సీకి వాటి వివరాలు అందలేదు. ఈలోగా జిల్లాల విభజన అంశం ముందుకు వచ్చింది. ఈ పోస్టుల భర్తీకి జోనల్ సమస్య ఆటంకంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాకే అదనపు పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాల విభజనలో భాగంగా ఒక జిల్లాలోని మండలాలు మరో జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో ఏ పోస్టు ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది? ఏ జోన్ పరిధిలోకి వెళ్తుందన్న గందరగోళం నెలకొంది.
ఐదో జోన్ పరిధిలో ఉన్న వరంగల్‌లోని మూడు మండలాలు, ఆరో జోన్‌లోని నల్లగొండ జిల్లాకు చెందిన 11 మండలాలను కలిపి కొత్తగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే ఆరో జోన్‌లో ఉన్న మెదక్ జిల్లాలోని 12 మండలాలు, ఐదో జోన్ పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని 5 మండలాలు, వరంగల్ జిల్లాలోని 4 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనలు జోనల్ సమస్యకు దారి తీసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక, గ్రూపు-2 ఖాళీలు స్పష్టంగా ఏయే జిల్లాలో ఎన్ని ఉన్నాయన్న వివరాలు తెలుస్తాయని, అప్పుడే ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది.
కొత్త జిల్లాల తర్వాతే?
Published Mon, Jul 4 2016 3:11 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement
Advertisement