సాక్షి, కృష్ణా: గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఫలితాలను రిలీజ్ చేశారు. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలను ప్రకటించారాయన. నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియ పూర్తి చేసింది.
ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రికార్డు సమయంలోనే గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించాం. గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా పూర్తి చేశాం. మొదటిసారిగా సీసీ కెమెరాలను వినియోగించాం. 111 పోస్టులకి 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్ధులని ఎంపిక చేశాం. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం ఇదే.
ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ర్యాంకర్ల వివరాలు
ఫస్ట్ ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ( బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ)
సెకండ్ ర్యాంకర్ - భూమిరెడ్డి భవాని ( అనంతపురం)
మూడవ ర్యాంకర్ - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న
నాలుగవ ర్యాంకర్ - కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ( అనంతపురం జెఎన్ టియు)
అయిదవ ర్యాంకర్ - భానుప్రకాష్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటీ)
ఆ పుకార్లు నమ్మొద్దు
ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల విషయంలో.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పుకార్లపైనా చైర్మన్ గౌతమ్ సవాంత్ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని, గ్రూప్ -2 కి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని, అలాగే.. గ్రూప్-1 వంద పైనా పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని’’ తెలిపారాయన.
గ్రూప్-1 ప్రక్రియ సాగిందిలా..
గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు.
జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ.
Comments
Please login to add a commentAdd a comment