అట్టాడ వెంకటరమణ మూర్తి, దాట్ల కీర్తి
గ్రూప్–1 ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు, మరో అధికారి ప్రతిభ చూపారు. వీరిలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నతోద్యాగాలకు సిద్ధమై విజయం సాధించగా, మరొకరు సివిల్స్ శిక్షణ తీసుకుంటూ గ్రూప్–1 ఉద్యోగానికి అర్హత సాధించారు.
డిప్యూటీ కలెక్టర్‌గా కీర్తి
విజయనగరం పూల్‌బాగ్: విజయనగరం జిల్లా బీసీ సంక్షేమాధికారి దాట్ల కీర్తి గ్రూప్ –1లో విజేతగా నిలిచారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపి కయ్యారు. ఆమె రాష్ట్ర స్థాయిలో 8, ఉత్తరాంధ్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఆమె గత మూడేళ్లుగా జిల్లా బీసీ సంక్షేమాధి కారిగా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఆమె డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆమె తల్లి దాట్ల నిర్మల విశాఖపట్నం జిల్లా చోడపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తుండగా, తండ్రి జగన్నాథ రాజు హెచ్‌సీ వెంకటాపురం మండలం జెడ్పీహెచ్ లో స్కూల్ అసిస్టెంట్(సైన్సు)గా పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. కీర్తి స్వస్థలం విశాఖజిల్లా మాకివారిపాలెం మండలంలోని రాజులనగరం. కీర్తికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
రాణించిన రైతు బిడ్డ
గుర్ల: గుర్ల మండలంలోని నాగళ్లవలసకి చెందిన అట్టాడ అప్పలనాయుడు ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు గరివిడి ఫేకర్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కుమారుడు వెంకటరమణ మూర్తి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ చూపడంతో ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆయన గ్రూపు–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన గరివిడిలోని గోదావరి స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో పుటపర్తిలోని శ్రీ సత్యసాయి విద్యాలయాల్లో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో మూడేళ్లుగా శిక్షణ తీసుకున్నారు. మొదటి ప్రయత్నం విఫలం అయిన నిరాశ చెందకుండా చదువుతున్నారు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైనా చేరలేదు. సివిల్స్‌లో రాణించి ఐఏఎస్ అవ్వాలన్నదే అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు అప్పలనాయుడు, పద్మావతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అసిస్టెంట్ ట్రజరీ అధికారిగా సన్యాసిరావు
వేపాడ: మండలంలోని బంగారయ్యపేట ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరిణి సన్యాసిరావు గ్రూపు–1లో విజేతగా నిలిచారు. అసిస్టెంట్ ట్రజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆయనది ఎల్.కోట మండలం గొల్జాం స్వగ్రామం. తల్లిదండ్రులు తరిణి రామారావు, ఈశ్వరమ్మల ప్రోత్సాహంతో ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. 2006లో డీఎస్సీ క్వాలిఫై అయ్యారు. 2008 ఫిబ్రవరి 28న ఎస్.కోట మండలం వెంకటరమణపేట ఎంపీయూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ 2009 వరకు పనిచేశారు. 2009 ఆగస్టు నుంచి 2017 జూలై వరకు ఎంపీయూపీఎస్ జాకేరులో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి నేటివరకు ఎంపీపీఎస్ బంగారయ్యపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన గ్రూపు–1లో విజయం సాధించడంతో తల్లిదండ్రులతో పాటు భార్య పద్మశ్రీ, కుమారై లిఖితరామ్, కుమారుడు భార్గవ్‌రామ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం)
Comments
Please login to add a commentAdd a comment