సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కమిషన్‌కు గత కొద్ది రోజులుగా పూర్తిస్థాయి కార్యదర్శి లేకుండాపోయారు. దీంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారుల మధ్య సమన్వయలేమితో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు. ఇన్‌చార్జ్ కార్యదర్శిగా వ్యవహరించిన అడిషనల్ కార్యదర్శి డి.రమాదేవి గత నెల 30న పదవీ విరమణ చేశారు. సాధారణంగా పదవీ విరమణ చేసే అధికారి ఎవరైనా తదుపరి వచ్చే అధికారికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలి.
ఆర్థికాంశాలతోపాటు అప్పటివరకు జరిగిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో వివరించి వెళ్లాలి. కళావతి అనే అధికారిణికి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా ఆ పని చేయకుండానే రమాదేవి వెళ్లిపోయారు. ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగానికైనా సమాచారం ఇచ్చి వెళ్లాల్సి ఉన్నా అదీ చేయలేదని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కళావతి చార్జ్ తీసుకోలేకపోవడంతో కమిషన్.. కార్యదర్శి/ఇన్‌చార్జ్ కార్యదర్శి లేక అనాథగా మారింది. రమాదేవికి, కళావతికి మధ్య విభేదాలుండడంతోనే చార్జ్ అప్పగించలేదని, రమాదేవి అగ్రకులానికి చెందినవారు కావడం, కళావతి ఇతర వర్గానికి చెందినవారనే కారణంతో రమాదేవి చార్జ్ ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.
కమిషన్‌కు కార్యదర్శి లేదా ఇన్‌చార్జ్ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలి. ఆ పోస్టు ఖాళీగా ఉండకూడదనే నిబంధన ఉంది. గత వారం రోజులుగా ఆ పోస్టులో ఎవరూ లేకపోయినా కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం విచిత్రం. చార్జ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన రమాదేవి మళ్లీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా వచ్చి చక్రం తిప్పాలనే ప్రయత్నాల్లో ఉన్నారని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.
బోర్డు తీరూ అంతే..
కాగా, కమిషన్ బోర్డు తీరూ అలాగే ఉందనే విమర్శలు ఉన్నాయి. కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. తప్పనిసరిగా చైర్మన్ లేదా బోర్డు సభ్యుడు కమిషన్‌లో ఉండాలి. ప్రస్తుతం కమిషన్ బోర్డులో చైర్మన్‌తోపాటు ఆరుగురు సభ్యులున్నారు. ఇటీవల వీరంతా కలసి పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు అధ్యయనం కోసం వెళ్లారు. దాదాపు 5 రోజుల పాటు కమిషన్ ఎవరూ లేకుండా ఉంది. కమిషన్ నిబంధనల ప్రకారం.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. చైర్మన్ లేదా ఒక్క సభ్యుడైనా కమిషన్‌లో ఉండాల్సి ఉన్నా అందుకు భిన్నంగా చైర్మన్ అందరినీ టూర్‌కు తీసుకుపోయారు.
పనిచేయడానికి ముందుకురాని అధికారులు
ప్రస్తుతం కమిషన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కార్యదర్శిగా పనిచేయడానికి సమర్థులైన అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇంతకు ముందు కార్యదర్శిగా పనిచేసిన ఐఆర్‌ఎస్ అధికారి సాయి డిప్యుటేషన్ గడువు ముగియగానే తన శాఖకు వెళ్లిపోయారు. ఆయన తీసుకున్న నిర్ణయాలపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన్నే మరికొన్ని రోజులు కొనసాగాలని అడిగినా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును కార్యదర్శిగా నియమించినా ఆయన పట్టుమని పదిరోజులు కూడా ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడలేదు. ప్రయత్నాలు చేసుకొని మరీ ఇక్కడి నుంచి వేరే పోస్టులోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలన్నీ కమిషన్‌లో పరిస్థితికి దర్పణం పడుతున్నాయని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment