సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాలనే నిర్ణయానికి అనుగుణంగా జూన్ 4 వరకు ఉద్యోగాల భర్తీ చేయరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. వెయిటేజీ మార్కుల వివాదంపై పలు వ్యాజ్యాలు విచారణ దశలోనే ఉన్నందున జూన్ 4వ తేదీ వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్ ట్రాన్స్‌కోలకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఆదేశాలిచ్చింది.
టీఎస్ ట్రాన్స్‌కోలో ఇంజనీరింగ్ పోస్టులు, స్టాఫ్ నర్సు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ సమయంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా చేయడం వల్ల ఓపెన్ కేటగిరీలో ప్రతిభ చూపే అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందంటూ పలు వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపే వ్యవధి లేనందున విచారణ జూన్ 4కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు నియామకాలు చేపట్టరాదని మధ్యంతర ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment