సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 9,231 ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లను జారీచేసింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్ (http://treirb.telangana.gov.in)లో అందుబాటులో ఉంచింది.
ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లను ప్రకటనలో నిర్దేశించిన తేదీల్లో విడుదల చేస్తామని బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. దాదాపు ఏడాదిపాటు కసరత్తు చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఎట్టకేలకు ప్రకటన జారీచేయడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకులాల్లో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
నెల రోజులు గడువుతో..
గురుకుల బోర్డు జారీచేసిన నోటిఫికేషన్లు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పోస్టుల వారీగా దరఖాస్తుల తేదీ ప్రారంభం, ముగింపు, పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఎప్పుడు పెడతారన్న వివరాలను వాటిలో వెల్లడించారు. కొన్నిరకాల పోస్టులకు ఈనెల 17వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. మరికొన్నింటికి ఈ నెల 24న, 28న మొదలుకానున్నాయి. అన్ని కేటగిరీల పోస్టులకు దరఖాస్తులు మొదలైన నాటి నుంచి నెలరోజుల పాటు గడువు ఉంటుంది.
దాదాపు అన్ని పోస్టులకు మే నెలలో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. గడువు ముగిశాక నెలన్నర నుంచి రెండు నెలల పాటు సన్నద్ధతకు అవకాశం ఉంటుందని.. తర్వాత అందుబాటులో ఉన్న తేదీల్లో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రస్థాయిలో ఇతర నియామక బోర్డులతో సమన్వయం చేసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లను పూర్తిగా పరిశీలించి.. ఇబ్బందిలేని రోజుల్లో పరీక్షల నిర్వహణను ఖరారు చేయనున్నట్టు వెల్లడించాయి.
సైలెంట్‌గా ప్రకటన విడుదల
గురుకుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్లను టీఆర్‌ఈఐఆర్‌బీ గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రకటనలను సదరు నియామక సంస్థ విడుదల చేయడం, మీడియా సమావేశం పెట్టి వెల్లడించడం జరుగుతుంది. గతంలో గురుకుల నియామకాల బోర్డు ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి బోర్డు చైర్మన్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశారు. కానీ ఇప్పుడు భారీగా గురుకుల ఉద్యోగాల భర్తీ చేపడుతున్నా.. కేవలం ఒకట్రెండు పత్రికల్లో యాడ్ (అడ్వర్టైజ్‌మెంట్) రూపంలో ఇవ్వడం గమనార్హం.
ఓటీఆర్ ఉంటేనే దరఖాస్తు...
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మాదిరిగానే గురుకుల నియామకాల బోర్డు కూడా ఓటీఆర్ (వన్‌టైమ్ రిజిస్ట్రేషన్) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం కేవలం డిగ్రీ లెక్చరర్ కేటగిరీకి మాత్రమే ఓటీఆర్‌ను అనుసరించగా.. ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు ఓటీఆర్ తప్పనిసరి చేసినట్టు నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఓటీఆర్ ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాకే గురుకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా ఓటీఆర్ ఆప్షన్లను సిద్ధం చేశారు. ప్రతి అభ్యర్థి విద్యార్హతలు, బోనఫైడ్‌లు, కుల ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ ప్రక్రియతో వెబ్‌సైట్‌పై తీవ్ర ఒత్తిడి పడేఅవకాశం ఉండడంతో.. దరఖాస్తులకు ఐదు రోజుల ముందుగానే ప్రారంభించినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. గురుకుల కొలువుల దరఖాస్తు ఫీజు గతంలో రూ.600గా ఉండేది. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఫీజు నిర్ధారించే అవకాశం ఉందని అంటున్నారు.
త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు
గురుకుల విద్యాసంస్థల్లో దాదాపు 12వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 9వేల ఉద్యోగాల భర్తీకి గతేడాది జూన్‌లోనే అనుమతులు వచ్చాయి. 2022–23 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో మరిన్ని విద్యాసంస్థలు తెరవడంతో.. వాటిలోని పోస్టులను కూడా ఒకేదఫాలో భర్తీ చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ల జారీ కోసం బోర్డు వేచిచూసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం మరో 2,225 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది.
అయితే తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో 9వేలకుపైగా ఉద్యోగాలనే ప్రకటించారు. మిగతా కొలువులకు సంబంధించి త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు, ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలు, ఇతర సాంకేతిక కాలేజీల్లో పోస్టులు మంజూరైనా.. వాటికి సంబంధించిన సర్వీసు నిబంధనలు ఖరారు కాలేదు. దీనిపై స్పష్టత రాగానే ఉద్యోగ ప్రకటనలు రానున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.
గురుకుల కొలువులు 9,231
Published Fri, Apr 7 2023 2:52 AM | Last Updated on Fri, Apr 7 2023 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment