సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో ఆదాయమార్గాలు సన్నగిల్లి ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యా శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో విద్యా శాఖకు రూ.25,737.62 కోట్లు కేటాయించింది.
► ఇందులో పాఠశాల విద్యకు ఏకంగా 22,604.01 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్నే మానవ వనరుల అభివృద్ధి, విద్యాభివృద్ధి ద్వారా మెరుగైన సమాజాభివృద్ధి అంశాలతో ప్రారంభించడం విశేషం.
► అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఈ అంశాలను నొక్కిచెప్పింది.
► ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక వసతుల కల్పనకు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
► కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా 1 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువులు కొనసాగించడానికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లల తల్లులకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
► నాడు–నేడు పథకం కింద తొలి దశలో 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లు ప్రతిపాదించింది.
► 2020–21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును కిట్‌గా జగనన్న విద్యాకానుక కింద అందించనున్నారు.
► విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన, శుచికరమైన పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. బెల్లం, చిక్కీ, పులిహోర, పొంగలి, కూరగాయల పలావు తదితరాలు వడ్డిస్తున్నారు. వంట పని వారికి నెలవారీ పారితోషికం రూ.వేయి నుంచి రూ.3 వేలకు పెంచారు.
► జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది.
► ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా ఎంపిక చేసి రూసా పథకం కింద నిధులు కేటాయించనుందని ప్రభుత్వం పేర్కొంది.
► ఉన్నత విద్యకు బడ్జెట్‌లో రూ.2,276.97 కోట్లు కేటాయించడం విశేషం.
► సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం రూ.856.64 కోట్లు కేటాయించింది.
యూనివర్సిటీలకు నిధుల వరద
► ప్రభుత్వం ప్రతి వర్సిటీ న్యాక్ గ్రేడ్,, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) వంటివి సాధించి ఉన్నత ప్రమాణాలతో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో రెవెన్యూ గ్రాంటుతోపాటు కేపిటల్ గ్రాంట్‌ను కూడా కేటాయించింది.
► అరకులో వైఎస్సార్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది.
► కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీల ఏర్పాటుకు వీలుగా కేటాయింపులు చేసింది.
► ఇవే కాకుండా కొత్తగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ అనే సంస్థకు కూడా రూపకల్పన చేసి నిధుల కేటాయింపులు జరిపింది.
► ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంక్చ్ఠులను సాధించేందుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కేపిటల్ గ్రాంట్‌ను కేటాయించింది.
మానవాభివృద్ధే అసలైన అభివృద్ధి
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యతనిస్తూ నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ బడ్జెట్‌లో విద్యకు ఇతోధిక కేటాయింపులు చేశారు. ముఖ్యంగా జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించారు. ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ బలోపేతం కావాలన్న లక్ష్యం ప్రభుత్వంలో కనిపిస్తోంది. మానవాభివృద్ధే అసలైన అభివృద్ధి’ అని అంటున్నారు.. ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన ఏమన్నారంటే..
► నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, డిగ్రీ కళాశాలల అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతోంది.
► గతంలో విద్యారంగానికి కేటాయింపులు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ముక్కలు ముక్కలుగా చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా సమగ్రంగా చేస్తున్నారు.
► పరిశ్రమలు ఎవరు పెట్టాలన్నా భూమి, విద్యుత్ వంటివే కాకుండా నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఎంతో అవసరం. దీనికోసం ముఖ్యమంత్రి పాఠశాల స్థాయి నుంచే ఒక ప్రణాళికాబద్ధ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
► ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ పునాది వంటిది. రాబోయే నాలుగైదేళ్లలో మంచి పరిణామాలు కనిపిస్తాయి.
► పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతోపాటు విశాఖ కేంద్రంగా నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
► నాలుగు త్రిబుల్ ఐటీల్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏకీకృతం చేసి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక చేపడుతోంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పడమే లక్ష్యంగా ఈ నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక ఉంటుంది.
► విద్యారంగ బడ్జెట్ ఒక్కటే కాకుండా నవరత్నాల్లోని పలు సంక్షేమ కార్యక్రమాలు విద్యకు, తద్వారా మానవాభివృద్ధికి దోహదపడేవే. వాటిని కూడా కలుపుకుంటే విద్యా కేటాయింపులు మరింత ఎక్కువవుతాయి. సంక్షేమంపై చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు.
బడ్జెట్, పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం
ఉభయ సభలు ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అరగంట పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని, సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లను, పలు బిల్లులను ఆమోదించారు.
అత్యుత్తమ బడ్జెట్
విద్యారంగానికి 6.4 శాతం బడ్జెట్ కేటాయిస్తున్న నార్వే దేశాన్ని ప్రపంచంలోనే మొట్ట మొదటి స్థానంగా చెప్పుకుంటాం. మన భారత దేశ బడ్జెట్‌లో కూడా విద్యకు కేటాయిస్తున్నది 3.4 శాతమే. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యకు అత్యధికంగా రూ.22,604 కోట్లు, అంటే 10.05 శాతం కేటాయించడం చాలా సంతోషం. ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు, అసమానతలకు ఏకైక మార్గం విద్యే అనే జగమెరిగిన సత్యాన్ని, మన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో చూపించారు.
– డాక్టర్ బీవీఎస్ కుమార్, చైర్మన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment