సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్ అనగానే యావత్తు దేశం ఎదురుచూసేది.. ఏ ప్రాంతానికి ఏ రైలు వస్తుంది, కొత్త రైల్వే లైన్లు ఏ ప్రాంతానికి మంజూరవుతాయి అని ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. కానీ, శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రైల్వే ప్రస్తావనకు కేటాయించిన సమయం రెండుమూడు నిమిషాలు మాత్రమే.అందులోనే కొన్ని విషయాలు ప్రస్తావించారే తప్ప కొత్త రైళ్లు, లైన్లు, సర్వేలు వంటి వాటి ఊసే లేదు. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టకుండా సాధారణ బడ్జెట్‌లో కలిపేసిన తర్వాత, రైల్వేకు చెందిన వివరాలను సంక్షిప్తంగా వెల్లడిస్తున్నారు. కానీ తాజా బడ్జెట్ ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావనతోనే సరిపుచ్చటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థూలంగా నాలుగైదు విషయాలతో సరిపుచ్చినప్పటికీ, జోన్ల వారీగా వివరాలను ఆ తర్వాత కూడా వెల్లడించలేదు. పింక్‌బుక్ పేరుతో ఉండే పూర్తి వివరాల పుస్తకాన్ని మరుసటి రోజో, ఆ తర్వాతనో విడుదల చేసేవారు. ఈసారి ఆ పింక్ బుక్‌ను ఐదో తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. అంటే అప్పటి వరకు జోన్ల వారీగా కేటాయింపుల విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉండదు.
రైల్‌నిలయానికి సమాచారం లేదు
దక్షిణ మధ్య రైల్వేకు చేసిన కేటాయింపులకు సంబంధించి రైల్ నిలయంకు ఎలాంటి సమాచారం అందలేదు. ‘బడ్జెట్‌లో రైల్వేలకు సం బంధించి కనీస వివరాలు కూడా వెల్లడించకపోవటాన్ని తొలిసారి చూస్తున్నాం. కొన్ని ప్రధాన ప్రాజెక్టులు, చేపట్టబోయే కొత్త సంస్కరణలు, కొత్త రైళ్లు లాంటి వివరాలైనా వెల్లడించాల్సింది. ఇక జోన్ల వారీగా కేటాయింపు లు ఎప్పుడిస్తారో కూడా సమాచారం లేదు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి అడిగినా చెప్పలేదు. ఐదో తేదీన పార్లమెంటు లో పింక్‌బుక్‌ను విడుదల చేసిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.6,100 కోట్ల మేర నిధులు కేటాయించారని, ప్రస్తుతం పనులు జరుగుతున్న మనోహరాబాద్–కొత్తపల్లి, మహబూబ్‌నగర్ డబ్లింగ్, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులు, మెదక్–అక్కన్నపేట, భద్రాచలం–సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర కేటాయింపులున్నాయని సమాచారం. ఓ హైస్పీడ్ కారిడార్, రెండు రైళ్ల ప్రస్తావన ఉందని చెబుతున్నారు.
బడ్జెట్‌లో కూతపెట్టని రైల్వే!
Published Sun, Feb 2 2020 2:16 AM | Last Updated on Sun, Feb 2 2020 2:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment