కోతలు.. కొత్త పథకాలు | Budget allocations reduced by five percent compared to last time | Sakshi
Sakshi News home page

కోతలు.. కొత్త పథకాలు

Published Thu, Feb 2 2023 5:47 AM | Last Updated on Thu, Feb 2 2023 5:47 AM

Budget allocations reduced by five percent compared to last time - Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు కోత పెట్టింది. ప్రధాన పథకాలన్నింటికీ కేటాయింపులను తగ్గించి వేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్య రంగానికి మాత్రం కాస్త నిధులు ఇచ్చింది. 

భారీగా తగ్గిన కేటాయింపులు
202223 బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,51,521 కోట్లను కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో 5% తక్కువగా రూ. 1,44,214 కోట్లకు మాత్రమే ప్రతిపాదించారు.మొత్తంగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు శాతాన్ని చూస్తే.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది 3.84% ఇవ్వగా, ఈసారి 3.20 శాతానికి తగ్గి పోయింది. ఫసల్‌ బీమా యోజన, పీఎం కిసాన్, కృషి వికాస్‌ యోజన పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడేలా అమల్లోకి తెచ్చిన ‘మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌’కు, పంటలకు మద్దతు ధర లభించేందుకు తెచ్చిన ‘పీఎం–ఆశ’ పథకాలను కేంద్రం పక్కన పెట్టేసింది.

వ్యవసాయానికి రుణ సాయం.. 
దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు, తక్కువ వడ్డీతో మరిన్ని రుణాలు అందేలా చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. గత ఏడాది (రూ.18 లక్షల కోట్లు) కన్నా 11 శాతం అధికంగా ఈసారి రూ.20 లక్షల కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బ్యాంకులు పంట రుణాలకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తాయని.. కేంద్రం అందులో 2 శాతాన్ని భరిస్తుండటంతో రైతులకు ఏడు శాతం వడ్డీకే రుణాలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.6 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
 
► ఎక్కువ పొడవు పింజ ఉండే పత్తి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు క్లస్టర్‌ ఆధారిత విధానాన్ని అనుసరిస్తామని నిర్మల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ విధానం)తో విత్తనాల నుంచి మార్కెటింగ్‌ వరకు వ్యాల్యూ చైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 

మత్స్య రంగానికి ఊపు కోసం..
► దేశంలో చేపల ఉత్పత్తి, రవాణాను మెరుగుపర్చేందుకు ‘ప్రధాన్‌ మంత్రి మత్స్య సంపద యోజన’ కింద రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో రొయ్యల దాణా దిగుమతిపై కస్టమ్స్‌ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. 

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. 
► దేశంలో సహజ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (ఎరువులు), పురుగు మందులను పంపిణీ చేసేందుకు 10వేల ‘బయో–ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్‌’లతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
► పశు, వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు ‘గోబర్ధన్‌ (గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో–ఆగ్రో రీసోర్సెస్‌ ధన్‌)’ పథకం కింద రూ.10 వేల కోట్లతో కొత్తగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహజవాయువును విక్రయించే అన్ని సంస్థలు తప్పనిసరిగా 5శాతం బయో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ను అందులో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

భూమిని కాపాడేందుకు ‘పీఎం–ప్రణామ్‌’! 
ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి ప్రోగ్రామ్‌ ఫర్‌ రీస్టోరేషన్, అవేర్‌నెస్, నరిష్‌మెంట్‌ అండ్‌ అమెలియరేషన్‌ ఆఫ్‌ మదర్‌ ఎర్త్‌ (పీఎం–ప్రణామ్‌)’ పథకాన్ని చేపడుతున్నట్టు నిర్మల తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 
► ఉద్యాన పంటల కోసం.. తెగుళ్లు సోకని, నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేందుకు రూ.2,200 కోట్లతో ‘ఆత్మనిర్భర్‌ క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించనున్నట్టు 
తెలిపారు. 
► గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తలు ‘అగ్రి స్టార్టప్స్‌’ను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు ‘అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌ (ఏఏఎఫ్‌)’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 
► వ్యవసాయ రంగంలో రైతు ఆధారిత, సమ్మిళిత పరిష్కారాల కోసం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
► ‘మిష్తి’ పథకం కింద దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచనున్నట్టు తెలిపారు.

‘శ్రీ అన్న’తో తృణధాన్యాల హబ్‌గా.. 
దేశాన్ని తృణధాన్యాల హబ్‌గా మార్చేందుకు ‘శ్రీ అన్న’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌’ను దీనికి వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఇది తృణధాన్యాల ఉత్పత్తి, పరిశోధన, సాంకేతిక అంశాల్లో అత్యుత్తమ విధానాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకునేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుందని వివరించారు. తృణధాన్యాల వినియోగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఎందరో చిన్న రైతులు వీటిని పండించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారని వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్‌ ఐఐఎంఆర్‌ ఏంటి? 
దేశంలో తృణధాన్యాల దిగుబడి పెంచడం, కొత్త వంగడాల రూపకల్పన కోసం హైదరాబాద్‌లో ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)’ను ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) పరిధిలో ఇది పనిచేస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాల పంటలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఐఐఎంఆర్‌ దేశ విదేశాలకు చెందిన తృణధాన్యాల సంస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా.

పల్లెకు నిధులు కట్‌!
గ్రామీణాభివృద్ధికి తగ్గిన కేటాయింపులు ఉపాధి హామీపై చిన్నచూపు ఇళ్లు, తాగునీటికి మాత్రం ఊరట..  మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామంటూ భారీగా పెట్టుబడి నిధులను కేటాయించిన మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధి విషయంలో ఈసారి కాస్త చిన్నచూపు చూసింది. ప్రధానమైన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (ఫ్లాగ్‌షిప్‌) నిధుల కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు (సవరించిన అంచనా) రూ. 1,81,121 కోట్లు కాగా, 2023–24 బడ్జెట్లో కేటాయింపులను 13 శాతం మేర తగ్గించి రూ.1,57,545 కోట్లకు పరిమితం చేసింది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భారీగా కోత పెట్టడం గమనార్హం.

ఉపాధి ‘హామీ’కి కోత...
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కేటాయింపుల్లో భారీగా కోత పడింది. 2022–23లో కేటాయింపుల సవరించిన అంచనా రూ.89,400 కోట్లతో పోలిస్తే 32 శాతం మేర తగ్గించేశారు. కాగా, 2022 జూలై–నవంబర్‌ కాలంలో ఈ స్కీమ్‌ కింద పనులు చేసేందుకు ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య కోవిడ్‌ ముందస్తు స్థాయిలకు చేరినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం.

గ్రామీణ రోడ్లు.. జోరు తగ్గింది (పీఎంజీఎస్‌వై)
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత మెరు గుపరిచేందుకు రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు వెచ్చి స్తోంది. అయితే, తాజా బడ్జెట్లో ఈ ఫ్లాగ్‌షిప్‌ స్కీమ్‌కు కేటాయింపులను మాత్రం పెంచలేదు. 2023–24లో 38,000 కిలోమీటర్ల మేర పక్కా రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంటికి ఓకే... (పీఎంఏవై) 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి పెద్దపీట వేసేలా తాజా బడ్జెట్లో కొంత మెరుగ్గానే కేటాయింపులు జరిపారు. ప్రధానంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్‌ తరహాలోనే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్‌ను నెలకొల్పుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రకటించారు. ఏటా రూ.10,000 కోట్లను ఈ ఫండ్‌కు ఖర్చు చేస్తామని, దీన్ని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు 2023–24లో 57.33 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌...
దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన (ఓడీఎఫ్‌)ను పూర్తిగా తుడిచిపెట్టడానికి 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్‌ పథకం (ఎస్‌బీఎం) కిందికి ఘన వర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ పథకానికి మాత్రం తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో 2023–24లో 13,500 కమ్యూనిటీ/పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, 3 లక్షల గ్రామాలను ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీరు నిర్వహణ కిందికి తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం.

తాగునీటికి నిధుల పెంపు... 
స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్‌ జీవన్‌ మిషన్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. దీనిలో భాగంగా 2023–24లో 4 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచారు.

భారత్‌ నెట్‌...
భారత్‌ నెట్‌ కింద దేశంలోని పల్లెలన్నింటికీ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగా 2023–24లో 17,000 గ్రామ పంచాయితీలను కొత్తగా హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా అనుసంధానించనున్నారు. అలాగే 78,750 కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5,50,000 ఫైబర్‌–టు–హోమ్‌ కనెక్షన్లు కూడా ఇవ్వాలనేది లక్ష్యం. 

రహదారులపై ప్రగతి పయనం
ఎన్‌హెచ్‌ఏఐకు 2022–23 బడ్జెట్‌లో కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్‌లో రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయింపులను రూ.20,000 కోట్లు(13.90 శాతం) పెంచింది. జాతీయ రహదారుల రంగానికి 2022–23లో రూ.1.99 లక్షల 
కోట్లు కేటాయించగా, దీన్ని తర్వాత రూ.2.17 లక్షల కోట్లుగా సవరించింది. తాజా బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement