2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి ప్రభాకర్ అంటించిన చురక జ్ఞాపకం వచ్చింది. దేశ ప్రజాబాహుళ్యం స్థితిగతుల్ని పాలకులు పరిశీలించకపోబట్టే శ్రమ విలువను 75 ఏళ్లుగా గణించలేకపోయారు. ప్రణాళికలకూ, ఆచరణలో అమలు చేయని అతిశయోక్తులకూ మాత్రం తక్కువేమీ లేదు! భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కాస్తా నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు.
దేశ తొలి ప్రధానమంత్రి పదవిలోకి రాక ముందు, దేశానికి స్వాతంత్య్రమనేది ఏ పరిస్థితుల్లో ‘నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదో’ ఇలా స్పష్టం చేశారు: ‘‘ప్రత్యేక హక్కులనూ, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ తమ హక్కుల్ని తాముగా వదులుకున్నట్టు చరిత్రకు దాఖలాల్లేవు. సాంఘిక మార్పులు రావా
లంటే ఒత్తిడి, లేదా బల ప్రయోగం అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం, ఈ స్వార్థ ప్రయోజనాలకు భరతవాక్యం పలకడమనే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థ ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదు’’.
ఇంతకన్నా మరో గొప్ప సత్యాన్ని 1992లో సుప్రసిద్ధ అమెరికన్ పత్రిక ‘టైమ్’ ప్రకటించింది: ‘‘కమ్యూనిజం పతనం కావొచ్చు. కానీ క్యాపిటలిజమూ, ప్రజాస్వామ్యమూ శాశ్వతంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ జయప్రదం కాగలగవన్న గ్యారంటీ ఏమీ లేదు’’! ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పెరిగి పెద్ద మహమ్మారి రూపం దాల్చిన అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ‘చిట్కా వైద్యాల’తో ఉపశమింప జేసుకోవడమే గానీ ఆ సంక్షోభ లక్షణాలు ఈ రోజుకీ సమసిపోలేదు. కనుకనే అమెరికా ఆశీర్వాదాలతోనే నెలకొన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో అత్యున్నత స్థాయి అధికారిగా, సలహాదారుగా ఈ సంస్థలను విశ్వసించి రంగంలోకి దిగి ఎలాంటి దారుణానుభవం చూడవలసి వచ్చిందో వివరించారు డేవిసన్ బుధూ. ఇప్పటికీ అమెరికా, ప్రపంచబ్యాంకు సంస్థలను నమ్ముతున్న భారత నాయకులు డేవిసన్ బుధూ అనుభవాల నుంచి గుణపాఠం తీసుకోలేక పోతున్నారు. చివరికి ఆంగ్లో – అమెరికన్ సంస్థలే భారత ఆర్థిక వ్యవస్థను పాలకులు నిర్వహిస్తున్న తీరుపై వ్యంగ్యాస్త్రాలు వదులు తున్నా ‘మనసూ, చర్మం’ మందబారిపోయి దులిపేసుకునే దశలో ఉన్నారు.
ఆసియా, ఆఫ్రికాలలో తన దారుణానుభవాలను డేవిసన్ ఇలా గుండె బరువుతో ప్రపంచం కళ్లముందుంచారు (బుధూ 1988లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ కామ్డెసెస్‌కు రాసిన సుదీర్ఘ రాజీనామా): ‘‘మీరు లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలకూ, ప్రజలకూ అందించమని నా చేతికి అందించిన వరల్డ్ బ్యాంక్ – ఐ.ఎం.ఎఫ్ సంస్కరణల ఔష ధాన్నీ, రకరకాల చిట్కాలనూ (బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్) సంవత్సరాల తర బడిగా అందజేస్తూనే వచ్చాను. కానీ ఏళ్ల తరబడిగా ఈ దేశాల్లో గడించిన అనుభవం దృష్ట్యా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందు కంటే, ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్ల సామాన్య ప్రజల రక్తంతో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. మలినమై పోయిన ఈ నా చేతుల్ని కడుక్కోవడానికి నేను తీసు కున్న మంచి నిర్ణయమే ఈ రాజీ నామా. అయ్యా! కామ్డెసెస్ గారూ! ఈ దేశాల్లో మనం చేస్తున్న పనుల వల్ల పేదల రక్తం నదులై పారుతోంది. ఒక్కోసారి నాలో నేననుకుంటాను – ఐఎంఎఫ్ బ్యాంకుల తరఫున మీ పేరిట, మీకు ముందు పని చేసిన అధిపతుల పేరిట లేదా మీ అధికార ముద్రల చాటున నేను చేయ వలసి వచ్చిన పాపాలను కడిగేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో దొరికే సబ్బులు కూడా ఏ మూలకూ చాలవని.’’ (ఎనఫ్ ఈజ్ ఎనఫ్: 1988).
కాగా, కడిగి పారేసిన ఆ ‘సబ్బుల్ని’ ఇండియాలో మొదటగా పీవీ నరసింహారావు హయాంలో అందుకుంటే, వాటిని ఆంధ్రప్రదేశ్‌లో వాడి ప్రజలకు ‘టోపీ’ పెట్టడానికి ప్రయత్నించినవాడు ప్రపంచ బ్యాంక్ ‘పెంపుడు బిడ్డ’ చంద్రబాబు! ఇక భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది బీజేపీ పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. ఆ పథకం కింద కేటాయింపులన్నీ దారి మళ్లుతున్నాయి. పైగా 2023 బడ్జెట్ ఏడాది కాలపరిమితికి మించకపోయినా, దేశ స్వాతంత్య్రం వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అంటే 2047 నాటి ‘లక్ష్యాల దిశగా ఈ బడ్జెట్ ఉంద’ని స్వయంగా ప్రధానమంత్రి ‘కోత’ కోయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు.
ఇండియా లాంటి వర్ధమాన దేశాలలోని కారుచౌక కూలీరేట్ల ఫలితంగా విదేశీ కంపెనీలు పోటీ మీద ఇండియాలో ప్రవేశించి, ఉద్యోగుల్ని తొలగించడం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోగా ఆ విధానాలనే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఎసరు పెట్టడంలో పాలకులు అనుసరిస్తూ, ప్రైవేటు వారికి ‘ఆదర్శం’గా నిలుస్తున్నారు. దీన్ని ఎవరో కాదు, స్వయానా ‘అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ డైరెక్టర్ సి.ఫ్రెడ్ బెర్గ్‌స్టెన్ ఎదురు తన్నిన ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ బ్యాక్‌లాష్) అని వర్ణించాల్సి వచ్చింది. ‘వ్యవస్థాగతమైన సర్దుబాట్లు అంటే, ‘ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగాల నుంచి పౌరుల్ని తొలగించేయడమేనని బెర్గ్‌స్టెన్ స్పష్టం చేశాడు. స్విస్ బ్యాంకులు, తదితర విదేశీ బ్యాంకుల్లోకి దొంగ చాటుగా ప్రవేశించిన డబ్బును తిరిగి దేశంలోకి తెచ్చి దేశ ప్రజలకు కుటుంబం ఒక్కింటికి రూ. 15 లక్షల చొప్పున పంచుతామన్న పాల కులు ఆచరణలో మొండి చేయి చూపించడం మరపురాని అనుభవంగా మిగిలి పోయింది. ‘కోవిడ్’ వల్ల ప్రజా బాహుళ్యానికి కల్గిన నష్టం కన్నా దాని పేరిట జరిగిన మిలాఖత్ వ్యాపార లావాదేవీల వల్ల ప్రజ లకు వాటిల్లిన నష్టం ఎక్కువ.
పోతన భాగవత కథల్లో ‘రహూగణుడ’నే ఒక అహంకారి ఉంటాడు. అతడెక్కిన పల్లకీ ఈ దేహమే. కానీ, దాన్ని మోసే బోయీలు ‘ఓంకారాన్ని’ వల్లిస్తూ నడుస్తారు, అలసట తెలియకుండా ఉండటం కోసం. పల్లకీలో కూర్చున్నవాడి ప్రయాణం మాత్రం సుఖంగానే సాగుతుంది. నేడు మన దేశ ప్రజల్ని పాలకులు పల్లకీ బోయీలుగా మార్చారు. నేటి దేశ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఆంత్రోపాలజిస్ట్ గ్లెన్ డేవిస్‌స్టోన్ వెల్లడించాడు: ‘‘పాలకులు వ్యవసాయం పేరిట వెచ్చిస్తున్న డబ్బంతా రైతాంగ శ్రేయస్సుకు కాదు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుతున్న పారిశ్రామిక వేత్తల శ్రేయస్సు కోసం’’.క్రీ.పూ. 2100 సంవత్సరంలోనే సుమేరియా ఏలికలు ఆర్థిక వ్యవస్థను ప్రజాపరం చేసి ఎలా ప్రజా బాహుళ్యాన్ని కరువు కాటకాలు లేకుండా కాపాడుతూ వచ్చిందీ చరిత్ర నమోదు చేసింది. బాబిలో నియా, ఈజిప్టులలో సహితం రాచరిక పాలనల్లోనూ ప్రజలు సుఖంగా జీవించారన్న చరిత్ర దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారత ప్రజలకు మసకబారని ఉషోదయాన్ని 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పాలకులు ప్రసాదించగల స్థితిలో లేకపోవడం విషాదకరం. కరెన్సీ సంక్షోభం వల్లనే దేశ పరిస్థితులు ఒడుదొడుకుల్లో పడ్డా యని పాలకులు చెప్పే మాటలు విని సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ గతంలో ఓ కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్‌లో ఉన్న పేద లంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ‘ఇది మనం పుట్టినప్పటి నుంచీ నోరు మూసుకుని అనుభవిస్తున్నదే కదరా’ అనుకుంటారు. ఆ తంతే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతూండటం సిగ్గుచేటు.
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment