సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చి.. తక్కిన సంస్థలకు ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశపరిచింది. గతంలో ఆయా సంస్థలకు కనీసం లక్షల్లో అయినా కేటాయింపులు చూపేది.
ఈ సారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోల‘వరం’ లభించలేదు..
► రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.
► ఈ ప్రాజెక్టులో 41.15 కాంటూర్ వరకూ వచ్చే ఏడాది నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూసేకరణ చేయడానికి రూ.3,197.06 కోట్లు, జలాశయం.. కుడి, ఎడమ కాలువల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి తక్షణం రూ.4 వేల కోట్లు వెరసి.. 2022–23 బడ్జెట్‌లో కనీసం రూ.ఏడు వేల కోట్లను విడుదల చేయాలని అనేక సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
► ఆ తర్వాత 45.72 మీటర్లలో నీరు నిల్వ చేయడానికి వీలుగా నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ చేయడానికి రూ.26 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. అయినా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కేంద్ర జల్ శక్తి శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.18,967.88 కోట్లలో భారీ నీటి పారుదలకు రూ.1,400 కోట్లు.. భారీ, మధ్యతరహా నీటి పారుదలకు రూ.6,922.81 కోట్లు వెరసి రూ.8,322.81 కోట్లు కేటాయించింది.
► ఇందులో నుంచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు నుంచి రుణం తీసుకుని.. పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
2016–17 బడ్జెట్ నుంచి ఇదే తీరు
► పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 2016 సెప్టెంబరు 7న కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు.. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని, రాష్ట్రానికి విడుదల చేస్తామని పెట్టిన షరతుకు నాటి టీడీపీ సర్కార్ అంగీకరించింది. దాంతో 2016–17 నుంచి బడ్జెట్‌లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించని కేంద్రం.. నాబార్డు ద్వారా రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తోంది.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రూ.751.80 కోట్లను పోలవరానికి విడుదల చేసిన కేంద్రం.. ఇటీవల బడ్జెట్లో మిగిలిన రూ.320 కోట్లను విడుదల చేసింది. 2022–23లోనూ ఇదే రీతిలో పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏకాభిప్రాయం తర్వాతే నదుల అనుసంధానం
► నదుల అనుసంధానాన్ని కేంద్రం బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో.. కెన్–బెత్వా నదుల అనుసంధానాన్ని రూ.44,605 కోట్లతో చేపట్టింది. ఈ పనులకు బడ్జెట్‌లో రూ.1,400 కోట్లు కేటాయించింది.
► నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్‌లో పేర్కొంది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. రాష్ట్ర అవసరాలు తీరాక, మిగిలిన నీటిని కావేరికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నాలుగు నదుల పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా..
► ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్), నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌పీ) తదితర పథకాలను కేంద్ర జల్ శక్తి శాఖ ద్వారా అమలు చేస్తోంది.
► ఏఐబీపీకి బడ్జెట్‌లో రూ.3,239 కోట్లు, కాడ్వామ్‌కు రూ.1,044 కోట్లు, ఎన్‌హెచ్‌పీకి రూ.800 కోట్లను కేటాయించింది. ఈ మూడు పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.250 నుంచి రూ.300 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా.
కేంద్ర విద్యా సంస్థలకు మొండిచెయ్యి
► కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా పెట్రోలియం, సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చింది. తక్కిన ఏ సంస్థకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. కనీసం గతంలో లక్షో, రెండు లక్షలో కేటాయింపులు చూపేది. ఈసారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించ లేదు.
► రాష్ట్ర విభజన చట్టం కింద ఏపీలో 7 జాతీయ విద్యా సంస్థలతో పాటు మరో 9 సంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఆయా సంస్థల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది.
► ఆయా సంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణానికి, బోధన, బోధనేతర అవసరాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా సరైన విధంగా నిధుల కేటాయింపు కావడం లేదు. ఫలితంగా ఆయా సంస్థలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొలువుదీరలేదు.
► ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ వర్సిటీకి రూ.56.56 కోట్లు కేటాయించినట్లు చూపించారు. 2020–21లో కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2021–22లో రూ.60.35 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో కేటాయింపులు చూపినా, విడుదల చేసింది మాత్రం రూ.20.11 కోట్లు మాత్రమే.
► ఏపీ, తెలంగాణలకు కలిపి గిరిజన వర్సిటీల ఏర్పాటుకు రూ.44 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో చూపించారు. ఏపీకి ఇందులో రూ.22 కోట్లు కేటాయించారు. 2020–21లో గిరిజన వర్సిటీకి కేటాయించింది కేవలం రూ.89 లక్షలు మాత్రమే. 2021–22లో రూ.26.9 కోట్లు కేటాయింపులు చూపి, కేవలం రూ.6.68 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
తక్కిన సంస్థల ఊసేలేదు
► బడ్జెట్‌లో సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీ తప్ప ఇతర విద్యా సంస్థలు, విద్యేతర సంస్థలకు సంబంధించిన ప్రస్తావనే లేదు. విభజన చట్టం కింద రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ అనంతపురంలో ఏర్పాటు కాగా, గిరిజన వర్సిటీ విజయనగరం జిల్లా సాలూరులో ఇంకా ఏర్పాటు కావలసి ఉంది.
► తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), తాడేపల్లి గూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), కర్నూలులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఐఐఐటీడీ), గుంటూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి.
► మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), విజయవాడలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంటు, విశాఖపట్నంలో పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ రిఫైనరీ తదితర సంస్థల గురించి కనీస ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు.
రాష్ట్రానికి రిక్తహస్తమే
Published Wed, Feb 2 2022 3:34 AM | Last Updated on Wed, Feb 2 2022 8:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment