Visakhapatnam Railway Zone
-
రైల్వే జోన్ పనులకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం: ఐదున్నరేళ్ల తర్వాత కలల జోన్ పనులకు రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులకు రూ.149.16 కోట్లతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ టెండర్లు పిలిచింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వేకు కేటాయించిన ముడసర్లోవ భూముల్లోనే జోన్ జీఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణంగా ఈ కార్యాలయం రూపు దిద్దుకోనుంది. టెండర్లు ఖరారు చేసిన 24 నెలల్లోనే భవన నిర్మాణం పూర్తి చేయాలని షరతులు విధించింది. ఈ ఏడాది జనవరిలోనే ముడసర్లోవ భూములు అప్పగిస్తే.. అవి ముంపు భూములంటూ అబద్ధాలతో గోబెల్స్ ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అవే భూములు దిక్కంటూ జోన్ కార్యాలయ పనులకు సిద్ధం చేయడం గమనార్హం. రెండు బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 9 అంతస్తులతో హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ నిర్మించనున్నారు. ప్రతి భవనానికి రెండు యాక్సెస్ పాయింట్లు, రెండు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీటీరోడ్స్, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్ ఏరియా, పార్కింగ్ పావ్డ్ ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, బిల్ట్ అప్ ఏరియా, బేస్మెంట్, పార్కింగ్ ఇలా.. ప్యాకేజీలుగా పనులు విభజించారు. అసలేం జరిగిందంటే..రోడ్డు విస్తరణలో భాగంగా పెందుర్తి ట్రాన్సిట్ కారిడార్ మంజూరు చేసిన సమయంలో రోడ్డు నిర్మాణానికి, రైల్వే భూముల్లో తరాలుగా ఉన్న మురికివాడల అభివృద్ధికి మొత్తం 26.11 ఎకరాలు అవసరమయ్యాయి. దీనిపై రైల్వే అధికారులతో దఫ దఫాలుగా జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. చివరికి 1ః2 నిష్పత్తిలో అంటే 52.22 ఎకరాలు ముడసర్లోవలో ఇచ్చే ప్రతిపాదనకు రైల్వే అధికారులు అంగీకరించారు. ముడసర్లోవ స్థలం రైల్వేకు ఇచ్చేందుకు 2013 ఫిబ్రవరి 2న నం.55/12తో జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేశారు. దీనిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబర్ 26న జీవో ఎంఎస్ నం.254 జారీ చేసింది. విశాఖపట్నం రూరల్‌లోని ముడసర్లోవలో సర్వే నెం.26లో జీవీఎంసీకి చెందిన సుమారు 270 ఎకరాలు పోరంబోకు ఉండగా, ఇందులో 52 ఎకరాలు రైల్వే శాఖకు అప్పగించేందుకు నిర్ణయించారు. అప్పట్లో రైల్వే అధికారులతో సంయుక్తంగా తనిఖీలు చేసి, వారు ఆమోదించిన తర్వాతే భూమి అప్పగింత చర్యలు చేపట్టారు. జీవీఎంసీ, రైల్వేల మధ్య 2013లో ఒప్పందం కుదిరితే 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా, భూమి ఇవ్వకుండా జాప్యం చేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములు అందిస్తే.. దానిపైనా విష ప్రచారం చేశారు. ఏ నిర్మాణాలకైనా అనుకూలంవాస్తవానికి రైల్వేకు ఇచ్చిన ఈ ప్రాంతం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అది మిక్స్డ్ జోన్. ఏ విధమైన భవనాలైనా నిర్మించుకునేందుకు అనుకూలమైన స్థలంగా ధ్రువీకరించారు. ఆ భూమి చెరువు బ్యాక్ వాటర్‌లో లేదని, ముడసర్లోవ రిజర్వాయర్‌లో భాగం కాదని, ముంపునకు గురయ్యే అవకాశమే లేదని మాస్టర్ ప్లాన్‌లో స్పష్టం చేశారు. ఈ విషయంపై రైల్వే అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, లేఖలూ రాలేదు. అక్కడ ఉన్న ఆక్రమణల్ని తొలగించి.. స్థానికులతో సంప్రదింపులు చేసి.. సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించి రెవిన్యూ శాఖ మొత్తం స్థలానికి కంచె కూడా వేసింది. రైల్వేకు ఇవ్వాల్సిన 52.22 ఎకరాల భూమిని క్లియర్ టైటిల్‌తో సిద్ధం చేశారు. వాల్తేరు డీఆర్ఎంకు ఈ ఏడాది జనవరి 2న లేఖలు రాసి.. అప్పగించారు. నాడు అది ముంపు ప్రాంతమంటూ అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. ఇప్పుడు అదే భూమి అద్భుతమంటూ పొగడటం గమనార్హం.తాత్కాలిక సేవలు ఎప్పుడో మరి?2019 ఫిబ్రవరి 28న కేబినెట్ ఆమోద ముద్ర వేస్తూ.. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే.. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు ఇవ్వాలా వద్దా.. అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. ఒకవేళ బిల్డింగ్ నిర్మాణంతో పని లేకుండా.. జోన్ కార్యకలాపాలు ప్రారంభించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ.. తను సమర్పించిన జోన్ డీపీఆర్‌లోనూ పొందు పరిచారు. -
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై నోరు మెదపని రైల్వే బడ్జెట్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ విశాఖపట్నం రైల్వే జోన్ కూత వినిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బుధవారం 2023–24 వార్షిక బడ్జెట్లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే అంశంపై కేంద్రం మౌనం దాల్చింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఇచ్చిన హామీకి కట్టుబడి రైల్వే జోన్‌ను ఆచరణలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కీలక ప్రతిపాదనలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయినప్పటికీ కేంద్ర వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బడ్జెట్లో రైల్వేశాఖకు కేటాయింపులపై పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం విధానమేమిటన్నది స్పష్టం కాదు. ‘బ్లూ బుక్’ వస్తేనే.. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు కేటాయింపులపై సమగ్ర వివరాలతో ‘బ్లూ బుక్’ శుక్రవారం విజయవాడలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయానికి చేరుతుంది. అది వస్తేగానీ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కేటాయింపులు ఏమిటన్నది తెలియదు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల కోసం సర్వేలు, కొత్త ఆర్వోబీల నిర్మాణం, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు, కొత్త రైళ్ల కేటాయింపులు మొదలైన అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుంది. స్పష్టత ఇవ్వని కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను కొన్ని నెలల క్రితమే సూత్రప్రాయంగా ప్రారంభించినప్పటికీ.. జోన్ వాస్తవంగా ఆచరణలోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఈసారి కేంద్ర బడ్జెట్లో అయినా స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎలాంటి స్పష్టతను కేంద్రం ఇవ్వలేదు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాలకోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు కేటాయించింది కూడా. కానీ రైల్వే జోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసుకువచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా! ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దు చేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లతోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై విశాఖపట్నంతోపాటు యావత్ రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివిజన్‌ను ఏకంగా రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. ఆయన కూడా ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తూ విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
ఆశల పట్టాలపై రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ బడ్జెట్ రైలు ఈసారైనా రాష్ట్రంలో ఆగుతుందా.. దీర్ఘకాలిక రైల్వే ప్రాజెక్టులను గమ్యస్థానానికి చేరుస్తుందా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24కు గాను కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్లో అంతర్భాగంగానే రైల్వే బడ్జెట్‌ను కూడా ఆమె సమర్పిస్తారు. దీంతో ఈసారైనా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. రైల్వే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర రైల్వేశాఖకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపింది. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న నాలుగు ప్రధాన ప్రాజెక్టులతోపాటు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్, ఆర్వోబీల నిర్మాణాన్ని ఆమోదించాలని కోరింది. ప్రధానంగా భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్విభజన చట్టం హామీలను గుర్తుచేస్తూ విశాఖపట్నం రైల్వేజోన్ ఆచరణలోకి వచ్చేలా చూడాలని కోరింది. ఆ చట్టం ప్రకారం కొత్తగా రెండులైన్లకు పచ్చజెండా ఊపాలని ప్రతిపాదించింది. ఈ నాలుగు.. ఇంకెన్నేళ్లు? రాష్ట్రంలో 4 ప్రధాన ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. అహేతుక రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో భూసేకరణ వ్యయాన్ని భరిస్తామని, ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టులు.. ► కడప–బెంగళూరు రైల్వేలైన్‌ను రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో 268 కిలోమీటర్ల మేర నిర్మించాలని 2008–09 బడ్జెట్లో ఆమోదించారు. నాలుగుదశల ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు మొదటిదశ కింద కడప–పెండ్లమర్రి లైన్లో కేవలం రూ.350 కోట్ల పనులు చేశారు. 1,531 ఎకరాలను భూమిని సేకరించి ఇస్తామని, ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ► నడికుడి–శ్రీకాకుళహస్తి రైల్వేలైన్ పనులు 20 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని అందించడంతోపాటు ఆ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేందుకు ఈ ప్రాజెక్టును 2009లో ఆమోదించారు. రూ.2,400 కోట్లతో ఆమోదించిన ఈ ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాల మేరకు రూ.4,500 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు 1,300 కోట్ల మేర పనులు చేశారు. భూసేకరణ ప్రక్రియను తాము త్వరగా పూర్తిచేస్తామని, మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే భరించి త్వరలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► రాయదుర్గం–తుముకూరు ప్రాజెక్టును రూ.3,404 కోట్లతో ఆమోదించారు. ఇప్పటివరకు రూ.520 కోట్ల పనులే చేశారు. మిగిలిన నిధులను కూడా కేంద్రమే కేటాయించి ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► కీలకమైన కొవ్వూరు–నరసాపురం లైన్ వ్యయాన్ని కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తం రూ.2,125 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు వరకు రూ.300 కోట్ల పనులు మాత్రమే కేంద్ర రైల్వేశాఖ పూర్తిచేసింది. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని, అందుకు భూసేకరణను దాదాపు పూర్తిచేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రెండు కొత్త లైన్లకు ప్రతిపాదన రాష్టపునర్విభజన చట్టం ప్రకారం రెండు రైల్వేలైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వేలైన్‌కు రూ.709 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించారు. ఆ రైల్వేలైన్‌కు ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొండపల్లి–కొత్తగూడెం మధ్య కొత్త రైల్వేలైన్ వేయాలని ప్రతిపాదించింది. అందుకోసం సర్వే నిర్వహించి డీపీఆర్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. 28 ఆర్వోబీలు నిర్మించాలి రాష్ట్రంలో లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అందుకోసం 54 ఆర్వోబీల నిర్మాణాన్ని గతంలోనే ప్రతిపాదించింది. వాటిలో 26 ఆర్వోబీలను రైల్వేశాఖ ఇప్పటికే ఆమోదించింది. మిగిలిన 28 ఆర్వోబీలను కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. డోన్‌లో లోకోషెడ్ ఏర్పాటుచేయాలి కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్‌ల సెకండరీ మెయింటనెన్స్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకోసం 100 ఎకరాలు కేటాయిస్తామని తెలిపింది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కొత్త రైళ్లు కావాలి రాష్ట్రానికి కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్‌ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగాఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ వేయాల్సి ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలు ఎక్కించాలి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ ఏడాది అయినా ఆచరణరూపం దాలుస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఆశగా, ఆసక్తిగా చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి డీపీఆర్‌ను రూపొందించింది కూడా. 900 ఎకరాల రైల్వే భూములను గుర్తించి అందులో 150 ఎకరాల్లో ప్రధాన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో 170 మంది గెజిటెడ్ అధికారులు, 1,200 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒత్తిడితో జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించింది. అన్నీ ఉన్నా సరే.. విశాఖపట్నం రైల్వే జోన్ ఇంకా ఆపరేషన్లోకి రాలేదు. వాల్తేర్ డివిజన్‌ను కొనసాగిస్తూ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో అయినా రైల్వే జోన్ ఆపరేషన్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీమ, ఉత్తరాంధ్ర మధ్య ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ రాయలసీమను ఉత్తరాంధ్రతో అనుసంధానిస్తూ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు ఈ ప్రత్యేక కారిడార్‌తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల కార్గో రవాణా ఊపందుకుంటుందని తెలిపింది. తద్వారా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో రాయలసీమకు నేరుగా రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. -
‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?
సెగ ఎటు నుంచి తగిలితే నేమి, ఎనిమిదేళ్లుగా పిడచ కట్టుకుని ఉన్న ఘనీభవ స్థితి అయితే నెమ్మదిగా కరగడం మొదలయ్యినట్లుగా ఉంది. ఉన్నట్టుండి ‘ఢిల్లీ’ ఫోకస్ ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌పైన పడడంతో ఇక్కడి ప్రజలు, ఇటువంటి మార్పు పట్ల ఆనందంగా ఉన్నారు. కేంద్రం 2015 డిసెంబర్ 23న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ప్రకటన చేశాక, ఆ దిశలో తొలి అడుగులు ఆశాజనకంగా అనిపిస్తున్నాయి. అంతే కాదు ప్రధాని విశాఖ పర్యటనకు ముందు ఒక ‘పైలెట్ టీమ్ టూర్’ కూడా జరిగింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ‘సదరన్ క్యాంపస్’ ప్రారంభించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్; వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోర్టు సిటీ కాకినాడ వచ్చి... విదేశీ వాణిజ్యం మా ప్రభుత్వ ప్రాధాన్యం అని చెప్పివెళ్లారు. మరి ఇది మీ ఆంతర్యం కనుక అయితే, మీరు మాకు చేస్తున్న మంచిని ‘ఓపెన్’గా మాతో పంచుకోవడానికి ఇబ్బంది ఎందుకన్నదే మాకు అర్థం కానిది. విశాఖ రైల్వే జోన్ విషయమే తీసుకుందాం. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, విశాఖ పట్టణంలోని వైర్ లెస్ కాలనీలోని 35 ఎకరాల రైల్వే భూమిలో రూ. 110 కోట్లతో జోనల్ కేంద్ర కార్యా లయాల భవన నిర్మాణానికి ఆర్కిటెక్టులు ఇచ్చిన డిజైన్లు రైల్వేబోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఇంతలో ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో– ‘సెంటర్–స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్’ అంటూ, అందులో రైల్వే జోన్ ఎజెండా మొదటి అంశమని చంద్రగ్రహణం రోజు తెలిపింది. జోన్ ప్రతిపాదన మీ వద్ద సజీవంగా ఉందనే సంగతి ఇంత డొంక తిరుగుడుగా అదీ ఒక ఆంగ్ల పత్రిక చేసిన వెతుకులాట వల్ల మాకు తెలియడం, అంత అవసరమా? ప్రజలు, ప్రాంతము రెండూ ఇక్కడివే అయినప్పుడు; మాకు జరిగే ఏ మేలైనా, అది మీరు అధినేతగా ఉన్న ఈ దేశంలోనిదే కదా? ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పటి నుంచి మీరు ఢిల్లీ పీఠంపై ఉంటూ, ఇంకా మా రాష్ట్రాన్ని ‘ఓన్’ చేసుకోలేక పోవడం ఏమిటి? మోదీజీ విశాఖ రాక వైపు చూస్తున్నప్పుడు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్న సహజ సందేహాలు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి నంబర్ 10–11 మధ్య క్షిపణి ప్రయోగం జరగనుంది. క్షిపణి సముద్రం మీద శ్రీలంక, ఇండోనేషియాల మధ్యగా ప్రయాణించే దిశలో 2,200 కి.మీ. మేర ‘నో ఫ్లయ్ జోన్’ అని మనదేశం ఇప్పటికే ప్రకటించింది. అయితే, మన క్షిపణి అనుపానులు అంచనా వేయడానికి, ఇప్పటికే చైనా స్పై షిప్ ‘యువాన్ వాంగ్–6’ హిందూ మహాసముద్రం జలాల్లోకి ప్రవేశించి, బాలి దీవుల్లో బస చేసింది. మన తూర్పు సరిహద్దున చైనా చేస్తున్న రెండవ కవ్వింపు చర్య ఇది. ఆగస్టులో కమ్యూనికేషన్ – నిఘా చర్యల రీసెర్చ్ నౌక – ‘యువాన్ వాంగ్–5’ శ్రీలంక హంబన్ తోట పోర్టులో వారం రోజులు తిష్ట వేసింది. అది ఇక్కడకు వచ్చి వెళ్ళాక, మన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ... చైనా నౌకలు శాటిలైట్ మోనిటరింగ్‌తో రాకెట్లు, ఇంటర్ కాంటి నెంటల్ మిస్సైల్స్ ఉపయోగించే అవకాశం ఉందనీ, మన న్యూక్లియర్ స్టేషన్లు, పోర్టుల భద్రతకు నిఘా, రక్షణ చర్యలు చేపట్టాలనీ తమిళనాడు రాష్ట్ర ఇంటి లిజెన్స్ ఏజెన్సీని ఆదేశించింది. (క్లిక్ చేయండి: ‘రాజనీతి’లో రేపటి చూపు!) ఈ నేపథ్యంలో ప్రధాని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ కేంద్రమైన విశాఖ వస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రాదేశిక అవసరాల బాధ్యతతో, ‘ఫెడరల్’ స్పూర్తితో దేశం తూర్పు సరిహద్దుల్లో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నది. వాటిని గ్రేడింగ్ చేసి ర్యాంకులు వెల్లడించేది మీరే కనుక, మా పురోగతి ముందు మీకు తెలిశాకే, అవి మాకు తెలిసేది. కేరళలో– ఈ ఏడాది ఎం.ఏ. ‘డీసెంట్రలైజేషన్ అండ్ లోకల్ గవర్నెన్స్’ పీజీ కోర్సు మొదలుపెడితే, ఇక్కడది ఇప్పటికే అమలులో ఉంది. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటం, ఇప్పుడు దేశం అవసరం. దీని పట్ల మీ ‘ఓపెన్ మైండ్’ మా అవసరం. (చదవండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
విశాఖ రైల్వే జోన్ వదంతులపై రైల్వే మంత్రి స్పందన
సాక్షి, ఢిల్లీ: రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోమారు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తున్న దరిమిలా.. బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘‘విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మొద్దు. రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉంది’’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా తెలియజేశారు. ఇదీ చదవండి: విశాఖ రైల్వే జోన్.. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయ్! -
విశాఖ రైల్వే జోన్ తధ్యం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ‘‘విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదన్న ఎంపీ జీవీఎల్.. విశాఖ రైల్వే జోన్ పై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. -
వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలోనే.. 129 ఏళ్ల అనుబంధం
వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలో మిగిలిపోనుందా? రైల్వే జోన్ ఏర్పాటు కోసం డివిజన్ విచ్ఛిన్నం అనివార్యమా?.. అంటే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటనతో అవుననే తేలిపోయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు పార్లమెంట్లో స్పష్టం చేశారు. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. 129 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విభజనతో నీరుగారిపోతోంది. వాల్తేరు డివిజన్‌ని కొనసాగించాలని ప్రజాప్రతినిధుల విన్నపాలను పక్కన పెట్టడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్.. తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా.. వాల్తేర్ డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. గతంలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్.. ఇప్పుడు రాయగడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుందని కేంద్రం పేర్కొంది. డివిజన్‌ను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ.. మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనలతోపాటు జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో వెల్లడించారు. చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..! వాల్తేరే డివిజన్ కీలకం తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. భూ సర్వేకు సన్నద్ధం ఇప్పటికే జోన్‌కు సంబంధించిన ఓఎస్డీ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఓఎస్డీ ఆధ్వర్యంలో జోన్ ప్రధాన కార్యాలయ సముదాయానికి సంబంధించిన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మిగిలిన కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసేందుకు భూ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. విశాఖలో సమగ్ర వనరులు జోన్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభించినా. విశాఖపట్నం సమగ్ర వనరులతో సిద్ధంగా ఉంది. తాత్కాలిక జోనల్ కార్యాలయంగా వాల్తేరు డీఆర్ఎం ఆఫీస్‌ని వినియోగించనున్నారు. శాశ్వత కార్యాలయం నిర్మించాలంటే సుమారు 20 ఎకరాల స్థలం అవసరమని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇందుకు అవసరమైన స్థలాలు విశాఖ పరిసర ప్రాంతాల్లో మెండుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో, ముడసర్లోవ పరిసరాల్లోనూ 70 ఎకరాల వరకు ఖాళీ స్థలాలున్నాయి. దీంతో పాటు మర్రిపాలెం, గోపాలపట్నం పరిసరాల్లోనూ స్థలాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు.. ఇప్పటికే విశాఖలో ఆఫీసర్స్ క్లబ్, రైల్వే సంస్థలు, క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాళ్లు.. ఇలా ఎన్నో వసతులు ఉన్నాయి. ఉద్యోగులు ఎందరు వచ్చినా వారికి కావల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో.. ఎప్పుడు జోన్ ప్రకటన వచ్చినా ఉద్యోగులు వెంటనే విశాఖకు రావచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలందరం నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా.. మొట్టమొదట కోరేది రైల్వే జోన్ గురించే. కేంద్ర మంత్రివర్గం జోన్ ఏర్పాటుకు ఆమోదించడం హర్షణీయం. అయితే వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరి నిమిషం వరకూ వాల్తేరు డివిజన్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. – ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ ఆర్ఆర్బీ ఏర్పాటుకు కృషి చేస్తాం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఆనందంగా ఉంది. రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదనపు రైళ్లు, రైల్వే లైన్లు వస్తాయి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుకు కావల్సిన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి నివేదిస్తాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తీసుకొస్తాం. – డా.బీవీ సత్యవతి, అనకాపల్లి ఎంపీ వాల్తేరు డివిజన్ కొనసాగించాల్సిందే.. జోన్ ఏర్పాటు చేసే సమయంలో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరుని విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు దేశ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. – డా. పెదిరెడ్ల. రాజశేఖర్, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ -
రైల్వే ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న కొత్త లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్ ప్రాజెక్టులకు 2022–23 కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈ బడ్జెట్లో కేంద్రం రూ.7,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన రూ.5,812 కోట్ల కంటే ఇది 21 శాతం ఎక్కువ. ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబించాయి. 2022–23 బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు ► నడికుడి – శ్రీకాళహస్తి కొత్త లైన్‌కు రూ.1,501 కోట్లు కేటాయించింది. 309 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ. 2,289 కోట్లతో 2011–12లో చేపట్టారు. తగినన్ని నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు 46 కి.మీ. పనులే పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► కోటిపల్లి–నరసాపూర్ కొత్త లైన్‌కు కేంద్రం రూ.358 కోట్లు కేటాయించింది. 57 కి.మీ. ఈ లైన్‌ను రూ.2,120 కోట్లతో 2000–01లో ప్రారంభించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు వేగంగా సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు తాజా బడ్జెట్లో ఎక్కువ నిధులిచ్చింది. ► కడప – బెంగళూరు కొత్త లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాయలసీమను కర్ణాటకతో మరింతగా అనుసంధానిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.2,706 కోట్లతో చేపట్టే 255 కి.మీ. కొత్త లైన్‌కు 2008–09లో ఆమోదం లభించింది. ఏపీ పరిధిలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే మొదటి దశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుత బడ్జెట్లో రూ.289 కోట్లు కేటాయింపుతో మిగిలిన పనులు జోరందుకోనున్నాయి. ► 221 కిలోమీటర్ల విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నరసాపూర్–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో రూ.1,681 కోట్లు కేటాయించడం విశేషం. 2011–12లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు తగినన్ని నిధుల్లేక నత్తనడకన సాగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నాలతో గత రెండు బడ్జెట్లలో ఎక్కువ నిధులిచ్చారు. దీంతో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 144 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇప్పుడు భారీగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ► విజయవాడ– గూడూరు మూడో లైన్‌కు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. 288 కి.మీ. మేర నిర్మించే మూడో లైన్లో ఇప్పటికి 55 కి.మీ. మేరే పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈసారి ఎక్కువ నిధులు కేటాయించారు. ► రాష్ట్రం నుంచి దేశ రాజధానికి వెళ్లే కీలకమైన విజయవాడ– కాజీపేట మార్గంలో మూడో లైన్‌కు రూ.592 కోట్లు కేటాయించారు. రూ.1,953 కోట్లతో 220 కి.మీ. నిర్మించే ఈ లైన్లో నిధులు లేక ఇప్పటివరకు 17.5 కి.మీ. పనులే పూర్తి చేశారు. తాజా కేటాయింపులతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► రూ.3,631 కోట్లతో 401 కి.మీ. గుంటూరు – గుంతకల్ డబ్లింగ్‌ను 2016–17లో ఆమోదించారు. అరకొర నిధులతో ఇప్పటి వరకు 92 కి.మీ. పనులే చేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.803 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నాయి. ► గుత్తి–ధర్మవరం డబ్లింగ్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. రూ.714 కోట్లతో 91 కి.మీ. ఈ ప్రాజెక్టును 2015–16లో ఆమోదించారు. ఇప్పటివరకు 57 కి.మీ. పనులు పూర్తయ్యాయి. ► దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు రైల్వే స్టేషన్లలో బైపాస్ లైన్ల కోసం రూ.407.47 కోట్లు కేటాయించారు. వాటిలో విజయవాడ, రేణిగుంట, గుత్తి, తెలంగాణలో కాజీపేట, వాడి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ► చిత్తూరు జిల్లా పాకాల – అనంతపురం జిల్లా ధర్మవరం మార్గం విద్యుదీకరణకు రూ.131 కోట్లు, కర్నూలు జిల్లా నంద్యాల – వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మార్గంలో విద్యుద్దీకరణకు రూ.51 కోట్లు కేటాయించారు. ► కర్నూలులో మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.58 కోట్లు కేటాయించారు. ► తిరుపతి రైల్వే స్టేషన్లో దక్షిణ ముఖద్వారం పనులకు రూ.3 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.6.5 కోట్లు కేటాయించారు. ప్రత్యేక జోన్ లేకపోవడంతో ఏపీకి తీవ్ర నష్టం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లేకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మరోసారి సుస్పష్టమైంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పూర్తిగా ఒడిశాకే ప్రాధాన్యమిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేసిందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో మొత్తం 12 కొత్త లైన్ల పనులకు నిధులు కేటాయిస్తే వాటిలో ఏపీ పరిధిలోని నౌపడ–గుణుపూర్– తెరుబలి లైన్ ఒక్కటే ఉంది. అది కూడా 20 శాతమే ఏపీలో ఉంటుంది. 80 శాతం ఒడిశాలోనే ఉంటుంది. ఆ లైన్‌కు కూడా కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఇక ఈ జోన్ పరిధిలో 28 డబ్లింగ్ పనులకు నిధులివ్వగా, ఏపీ పరిధిలోనివి నాలుగే ఉన్నాయి. వాటిలో కూడా అత్యధిక భాగం ఒడిశాకు ప్రయోజనం కలిగించేవే. ఒడిశాలోని టిట్లాఘర్ – ఏపీలోని విజయనగరం మూడోలైన్‌కు రూ.961 కోట్లు కేటాయించారు. కొత్తవలస–ఒడిశాలోని కోరాపుట్ డబ్లింగ్ పనులకు రూ.348.94 కోట్లు ఇచ్చారు. ఒడిశాలోని ఖుర్దారోడ్, ఏపీలోని విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు కలిపి రూ.4.18 కోట్లు కేటాయించారు. ఒడిశాలోని భద్రక్ –ఏపీ లోని విజయనగరం మూడోలైన్ మిగులు పనులకు రూ.కోటి మాత్రమే కేటాయించారు. ప్రత్యేక జోన్ ప్రకటించి ఉంటే ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చి ఉండేవని నిపుణులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి రిక్తహస్తమే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చి.. తక్కిన సంస్థలకు ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశపరిచింది. గతంలో ఆయా సంస్థలకు కనీసం లక్షల్లో అయినా కేటాయింపులు చూపేది. ఈ సారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోల‘వరం’ లభించలేదు.. ► రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ► ఈ ప్రాజెక్టులో 41.15 కాంటూర్ వరకూ వచ్చే ఏడాది నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూసేకరణ చేయడానికి రూ.3,197.06 కోట్లు, జలాశయం.. కుడి, ఎడమ కాలువల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి తక్షణం రూ.4 వేల కోట్లు వెరసి.. 2022–23 బడ్జెట్లో కనీసం రూ.ఏడు వేల కోట్లను విడుదల చేయాలని అనేక సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ► ఆ తర్వాత 45.72 మీటర్లలో నీరు నిల్వ చేయడానికి వీలుగా నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ చేయడానికి రూ.26 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. అయినా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కేంద్ర జల్ శక్తి శాఖకు బడ్జెట్లో కేటాయించిన రూ.18,967.88 కోట్లలో భారీ నీటి పారుదలకు రూ.1,400 కోట్లు.. భారీ, మధ్యతరహా నీటి పారుదలకు రూ.6,922.81 కోట్లు వెరసి రూ.8,322.81 కోట్లు కేటాయించింది. ► ఇందులో నుంచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు నుంచి రుణం తీసుకుని.. పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 2016–17 బడ్జెట్ నుంచి ఇదే తీరు ► పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 2016 సెప్టెంబరు 7న కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు.. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని, రాష్ట్రానికి విడుదల చేస్తామని పెట్టిన షరతుకు నాటి టీడీపీ సర్కార్ అంగీకరించింది. దాంతో 2016–17 నుంచి బడ్జెట్లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించని కేంద్రం.. నాబార్డు ద్వారా రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తోంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రూ.751.80 కోట్లను పోలవరానికి విడుదల చేసిన కేంద్రం.. ఇటీవల బడ్జెట్లో మిగిలిన రూ.320 కోట్లను విడుదల చేసింది. 2022–23లోనూ ఇదే రీతిలో పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏకాభిప్రాయం తర్వాతే నదుల అనుసంధానం ► నదుల అనుసంధానాన్ని కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో.. కెన్–బెత్వా నదుల అనుసంధానాన్ని రూ.44,605 కోట్లతో చేపట్టింది. ఈ పనులకు బడ్జెట్లో రూ.1,400 కోట్లు కేటాయించింది. ► నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్లో పేర్కొంది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. రాష్ట్ర అవసరాలు తీరాక, మిగిలిన నీటిని కావేరికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నాలుగు నదుల పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా.. ► ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్), నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) తదితర పథకాలను కేంద్ర జల్ శక్తి శాఖ ద్వారా అమలు చేస్తోంది. ► ఏఐబీపీకి బడ్జెట్లో రూ.3,239 కోట్లు, కాడ్వామ్‌కు రూ.1,044 కోట్లు, ఎన్‌హెచ్‌పీకి రూ.800 కోట్లను కేటాయించింది. ఈ మూడు పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.250 నుంచి రూ.300 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కేంద్ర విద్యా సంస్థలకు మొండిచెయ్యి ► కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా పెట్రోలియం, సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చింది. తక్కిన ఏ సంస్థకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. కనీసం గతంలో లక్షో, రెండు లక్షలో కేటాయింపులు చూపేది. ఈసారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించ లేదు. ► రాష్ట్ర విభజన చట్టం కింద ఏపీలో 7 జాతీయ విద్యా సంస్థలతో పాటు మరో 9 సంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఆయా సంస్థల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ► ఆయా సంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణానికి, బోధన, బోధనేతర అవసరాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా సరైన విధంగా నిధుల కేటాయింపు కావడం లేదు. ఫలితంగా ఆయా సంస్థలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొలువుదీరలేదు. ► ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ వర్సిటీకి రూ.56.56 కోట్లు కేటాయించినట్లు చూపించారు. 2020–21లో కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2021–22లో రూ.60.35 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో కేటాయింపులు చూపినా, విడుదల చేసింది మాత్రం రూ.20.11 కోట్లు మాత్రమే. ► ఏపీ, తెలంగాణలకు కలిపి గిరిజన వర్సిటీల ఏర్పాటుకు రూ.44 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో చూపించారు. ఏపీకి ఇందులో రూ.22 కోట్లు కేటాయించారు. 2020–21లో గిరిజన వర్సిటీకి కేటాయించింది కేవలం రూ.89 లక్షలు మాత్రమే. 2021–22లో రూ.26.9 కోట్లు కేటాయింపులు చూపి, కేవలం రూ.6.68 కోట్లు మాత్రమే విడుదల చేశారు. తక్కిన సంస్థల ఊసేలేదు ► బడ్జెట్లో సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీ తప్ప ఇతర విద్యా సంస్థలు, విద్యేతర సంస్థలకు సంబంధించిన ప్రస్తావనే లేదు. విభజన చట్టం కింద రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ అనంతపురంలో ఏర్పాటు కాగా, గిరిజన వర్సిటీ విజయనగరం జిల్లా సాలూరులో ఇంకా ఏర్పాటు కావలసి ఉంది. ► తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), తాడేపల్లి గూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఐఐఐటీడీ), గుంటూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. ► మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, విశాఖపట్నంలో పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ రిఫైనరీ తదితర సంస్థల గురించి కనీస ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు. -
రైల్వే ప్రాజెక్టుల బాధ్యత కేంద్రానిదే
సాక్షి, అమరావతి, సాక్షి, విజయవాడ/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘రైల్వేలు లాభాపేక్షతో నడిచే వ్యాపార సంస్థ కాదు.. రాష్ట్రం వాటా నిధులు రాలేదని రైల్వే ప్రాజెక్టులను నిలుపుదల చేస్తే సహించేది లేదు. కోవిడ్‌తో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏ రాష్ట్రం కూడా తమ వాటాను పూర్తిగా సమకూర్చలేదు. అలాగని రైల్వే ప్రాజెక్టుల పనులు నిలిపివేస్తామంటే సమ్మతించేది లేదు..’ అని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు విభజన హామీలన్నీ కచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య గురువారం విజయవాడలో పార్లమెంట్ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై రైల్వే శాఖ ఉదాశీన వైఖరిపై వైఎస్సార్ సీపీ ఎంపీలు మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కంటే వాటాలే ముఖ్యమా? సమావేశం ప్రారంభమైన వెంటనే విశాఖ రైల్వే జోన్ గురించి వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రస్తావించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. అయితే ఇది తమ పరిధిలో లేదని, రైల్వే శాఖ పరిధిలోని అంశమని మాల్య తెలిపారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను వెల్లడించడం తమ బాధ్యతని, అదే విషయాన్ని రైల్వే శాఖకు గట్టిగా నివేదించాలని ఎంపీలు సూచించారు. రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాల మృతుల కంటే రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. దీనిపై రాష్ట్ర వాటా నిధులు రావాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొనడంపై ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీలతో సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య కోవిడ్ పరిస్థితులతో దేశంలో అన్ని రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిందనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం వాటా నిధులు రాలేదని ఆర్వోబీలు, ఆర్యూబీల పనులు పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సమంజమని నిలదీశారు. ప్రజల ప్రాణాల కంటే వాటాల అంశం ముఖ్యమా? అని అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో ఆర్వోబీల నిర్మాణానికి అవసరమైన రూ.530 కోట్లను కేంద్రమే భరించేందుకు 2020 డిసెంబర్లో సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని అనకాపల్లి ఎంపీ సత్యవతి గుర్తు చేశారు. గుజరాత్ కూడా ఆర్వోబీల నిర్మాణానికి తమ వాటా నిధులు సమకూర్చలేదన్న విషయాన్ని కాకినాడ ఎంపీ వంగా గీత ప్రస్తావించారు. కోటిపల్లి – నరసాపురం రైల్వే పనులకు 2001 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సమకూర్చడం లేదనే విషయాన్ని ఎంపీ మార్గాని భరత్ రైల్వే అధికారులకు గుర్తు చేశారు. అతి ముఖ్యమైన ఆ రైల్వే లైను పనులను చేపట్టకుండా ఎన్నేళ్లు నిలుపుదల చేస్తారని ప్రశ్నించారు. పల్నాడు – ఢిల్లీ రైలు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వే ప్రాజెక్టుల పురోగతిని గజానన్ మాల్యా ఎంపీలకు వివరించారు. గుంటూరు –గుంతకల్ డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జయవాడ–భీమవరం, గుడివాడ–మచిలీపట్నం డబ్లింగ్ పనులతోపాటు విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. విజయవాడ–గూడూరు మూడో లైన్ పనులు 30 కి.మీ. మేర పూర్తయ్యాయని, మరో 60 కి.మీ. పనులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం మార్గంలో విద్యుదీకరణ పనులు త్వరగా పూర్తి చేసి లైన్‌ను ప్రారంభించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. నల్లపాడు – పగిడిపల్లి మధ్య డబుల్ లైన్ చేయాలని, మాచర్ల, రేపల్లెలో పిట్లైన్స్, మెయింట్‌నెన్స్ కోసం వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. మిర్చి, పత్తి తదితర వాణిజ్య పంటలకు కేంద్రంగా, పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతున్న పల్నాడు నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రైలు సదుపాయం కల్పించేలా కృషి చేయాలన్నారు. గుంటూరు నుంచి న్యూఢిల్లీకి అన్ని తరగతుల రైళ్లు ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చింతా అనూరాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, తలారి రంగయ్య, ఎన్.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, ఎస్.సంజీవ్ కుమార్, పి.బ్రహ్మానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, విజయవాడ డీఆర్ఎం షీలేంద్రమోహన్, గుంటూరు, గుంతకల్లు డివిజన్ అధికారులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఒత్తిడి తెస్తాం: వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల అంశాన్ని సాకుగా చూపిస్తూ రైల్వే ప్రాజెక్టులను ఆలస్యం చేస్తే సమ్మతించేది లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం లోక్‌సభలో వైఎస్సార్సీపీ విప్ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని కోరామన్నారు. రెండున్నరేళ్లుగా రైల్వే ప్రాజెక్టుల గురించి పట్టుబడుతున్నా కాలయాపన చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులపై పంపిన ప్రతిపాదనలపై రైల్వే శాఖ అధికారుల స్పందన ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు త్వరలోనే విడుదల చేస్తుందని, ఈలోగా పనులు ప్రారంభించాలని కోరినట్లు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాశ్ చంద్రబోస్ తెలిపారు. ఆర్వోబీల నిర్మాణంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ వంగా గీత విమర్శించారు. -
‘జోన్’ పట్టాలెక్కించండి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంట్‌లోని రైల్వే మంత్రి కార్యాలయంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఎంపీల బృందంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనూరాధ ఉన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ► ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్లు దాటినా ఇప్పటికీ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి రూ.13వేల కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి జోన్‌గా రాణిస్తుంది. ► రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ కీలకం. దేశంలోని కొన్ని రైల్వే జోన్ల కంటే కూడా వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుంది. వాల్తేరు డివిజన్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ► విశాఖ –అరకు మధ్య నడిచే రైలుకు అదనంగా 5 విస్టాడోమ్ కోచ్‌లను కేటాయించాలి. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఉన్న ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ ఆవరణలో కంటైనర్ తయారీ విభాగాన్ని నెలకొల్పాలి ► రాష్ట్రానికి చెందిన ఉద్యోగార్ధులు ఆర్ఆర్బీ పరీక్షలు రాసేందుకు సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ► నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కర్నూలులో కోచ్ వర్క్‌షాప్ నెలకొల్పాలి. విజయవాడ–విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలి. తిరుపతి–పాకాల–చిత్తూరు–కాట్పాడి మధ్య డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలి. ► విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూముల్లో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న 800 నిరుపేద కుటుంబాలు ఇళ్ల క్రమబద్ధీకరణకు సహకరించాలి. ఆ భూమికి బదులు గా అజిత్‌సింగ్‌నగర్ రైల్వే స్థలానికి సమీపంలోనే ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
పట్టాలెక్కని రైల్వే జోన్
సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’గా విశాఖ జోన్‌ను 2019 ఫిబ్రవరి 27న కేంద్రం ప్రకటించింది. అయితే, వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడలో కలిపారు. మరో భాగాన్ని రాయగఢ్ డివిజన్‌గా పేరు మార్చారు. రాయగఢ్ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంటుంది. గతంలో వాల్తేరు డివిజన్ మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉండేది. గతంలో చంద్రబాబు హయాంలోనే వాల్తేరు డివిజన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో విలీనం చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటివరకు విశాఖ రైల్వే జోన్‌కు కేవలం రూ.3.40 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. దీనికి రైల్వే శాఖ ఓఎస్డీని నియమించగా.. జోన్ నిర్మాణానికి రూ.169 కోట్లు అవసరమని సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించారు. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకుంది. రైల్వే జోన్ ఇంకా డీపీఆర్ దశలోనే ఉందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ప్రకటించారు. డీపీఆర్ పరిశీలనలో ఉన్నందున జోన్ కార్యాచరణకు కాల పరిమితి నిర్ణయించలేదన్నారు. వాల్తేరు డివిజన్‌ను పూర్తిగా జోన్లోకి చేర్చాలన్న అంశంపై కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది. చంద్రబాబు హయాంలో ఈస్ట్‌కోస్ట్‌లో విలీనం ఆదాయం విషయంలో వాల్తేరు డివిజన్ దేశంలో 4వ స్థానంలో ఉండేది. సరకు రవాణా, టికెట్ విక్రయాల ద్వారా రూ.7 వేల కోట్లకు పైగా ఈ డివిజన్ నుంచే రైల్వేకు ఆదాయం సమకూరేది. 2003లో చంద్రబాబు సీఎంగా.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్లో అధికంగా ఆదాయం ఉన్న వాల్తేరు డివిజన్‌ను విలీనం చేశారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నోరెత్తలేదు. విశాఖ నుంచి ప్రధాన డివిజన్‌ను ఈస్ట్‌కోస్ట్ జోన్లో విలీనం చేసినా.. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధిక ఆదాయం గల వాల్తేరు డివిజన్‌ను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ జోన్లో 2003లో కలపడంతో ఆ జోన్‌కు వాల్తేరు డివిజన్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. -
బడ్జెట్ రైలు ఏపీలో ఆగేనా!
సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రకటించే రైల్వే బడ్జెట్‌పై ఏపీ వాసులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తోంది. కానీ ఆ మేరకు ఏపీకి రైల్వే పరంగా నిధులు, పనులు మాత్రం మంజూరు కావడం లేదు. ఈ సారైనా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు, పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్ పచ్చ జెండా ఊపుతుందా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో పురోగతి ఉంది. పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 46 కి.మీ. రైల్వే లైన్ పూర్తయింది. విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో ఈ ఆర్థిక ఏడాది 106 కి.మీ. మేర విద్యుదీకరణ మార్గం పూర్తయింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ.1,158 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. రాష్ట్రంలో నర్సరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్లకు సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. కోస్తా రైల్వే లైన్ అయిన మచిలీపట్నం–బాపట్లకు కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. కడప–బెంగళూరు కొత్త రైలు మార్గానికి గత బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అయితే ఈ దఫా ఈ మార్గం పూర్తి చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. గతంలో గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్‌కు నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో తెలంగాణ కంటే ఏపీకే ప్రాధాన్యత కేంద్ర బడ్జెట్లో గత ఏడాది రైల్వే శాఖకు కేటాయించిన నిధుల్లో ఏపీకి తెలంగాణ కంటే సింహభాగం కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.6,846 కోట్ల కేటాయింపుల్లో ఏపీకి సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.4,666 కోట్లు కేటాయించారు. ధర్మవరం–పాకాల–కాటా్పడి (290 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్ల అంచనాలతో ఈ రెండు ప్రాజెక్టుల్ని మంజూరు చేశారు. ఈ దఫా కొత్త రైలు మార్గాలపై కోటి ఆశలున్నాయి. ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టులతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గం లాభసాటి కాదని రైల్వే బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. -
విశాఖ జోన్ పరిధిపై స్పష్టత!
సాక్షి, విశాఖపట్నం: విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లను విలీనం చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌పై ఒకింత స్పష్టత వచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. వాల్తేరు డివిజన్లో కొంతభాగాన్ని విజయవాడ, మరికొంత భాగాన్ని కొత్తగా ఏర్పడబోయే రాయగడ డివిజన్లో కలుపుతున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై స్పష్టతనిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ డివిజన్‌లోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను పూర్తిగా చేర్చింది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రాయగడ డివిజన్లో కలుపుతారని భావించారు. విశాఖ రైల్వే జోన్ పరిధి ఏపీ సహా తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో కొంతమేర విస్తరించి ఉంటుంది. ఈ జోన్ పరిధిలోకి మూడు ఏ–1 కేటగిరి స్టేషన్లు, ఎ కేటగిరి స్టేషన్లు 21, బి కేటగిరి స్టేషన్లు 20 వచ్చాయి. అయితే దీనిపై ఇంకా తమకు అధికారిక ఉత్తర్వులు అందలేదని విశాఖ రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. కాగా, జోన్ పరిధిలోని తిరుపతి, రాయనపాడులో మెకానికల్ వర్క్‌షాపులు, విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, నర్సాపూర్, గుంతకల్, మచిలీపట్నంలో కోచ్ మెయింటెనెన్స్ డిపోలున్నాయి. అలాగే విశాఖ, గుత్తి, గుంతకల్లు, విజయవాడలో డీజిల్ లోకోషెడ్లు.. విజయవాడ, గుంతకల్లు, విశాఖలో ఎలక్ట్రిక్ లోకోషెడ్లు, రేణిగుంటలో ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్, రాజమండ్రిలో మెము కార్‌షెడ్డు ఉన్నాయి. విశాఖ, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నల్లపాడు, తిరుపతి, గుంతకల్లులో పాసింజర్ కోచ్ కేర్ డిపోలు, విజయవాడ, గుత్తిలో వ్యాగన్ మెయింటెనెన్స్ డిపోలున్నాయి. విజయవాడ, గుంతకల్లు, గుత్తిలో రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, విశాఖ, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడులో డివిజనల్ ఆస్పత్రులు.. గుంటూరులో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం హెల్త్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. -
‘విశాఖ’ వేదన!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే విభజన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయం రైల్‌నిలయం. గణాంకాల కార్యాలయం లేఖాభవన్, రైల్ నిర్మాణ్ భవన్ వంటి ప్రధాన పరిపాలన, నిర్వహణ కేంద్రాల్లో గురువారం ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే, పాత దక్షిణమధ్య రైల్వేల మధ్య ఉద్యోగుల విభజన తప్పనిసరి కావడంతో అన్ని ప్రధాన కేంద్రాల్లో విభజన అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా సికింద్రాబాద్ కేంద్రంగా పని చేసిన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు ఏపీకి తరలి వెళ్లవలసి రావడంతో ఉద్వేగానికి గురవుతున్నారు. మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండకపోవచ్చునని, తప్పనిసరిగా విశాఖ జోన్‌కు వెళ్లవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో పని చేస్తూ ఇక్కడే స్థిరపడి సొంత ఇళ్లు, ఆస్తులు సంపాదించుకొన్న వారు ఇప్పుడు ఉన్నఫళంగా కొత్త జోన్‌కు వెళ్లవలసి రావడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘చాలా కాలంగా పని చేస్తూ సొంత ఊళ్లనే మరిచిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి. తిరిగి ఎక్కడ స్థిరపడాలి. చాలా గందరగోళంగా ఉంది.’’ అని రైల్‌నిలయంలో పని చేస్తున్న అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. నగరంలోనే హైదరాబాద్ డివిజన్ , సికింద్రాబాద్ డివిజన్ల ప్రధాన కార్యాలయాలు ఉన్నప్పటికీ విభజన ప్రభావం డివిజనల్ ఉద్యోగులపైన ఉండబోదు. కేవలం జోనల్ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు మాత్రమే రెండు జోన్ల మధ్య బదిలీ కావలసి ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు, ఉద్యోగులు, విశాఖ, విజయవాడ, తదితర ప్రాంతాల్లో పని చేస్తున్నప్పటికీ వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. హైదరాబాద్‌లో పని చేస్తున్న వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రైల్నిలయంపై ప్రభావం... దక్షిణమధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌నిలయంలో సుమారు 1500 మంది ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది పని చేస్తున్నారు. జోన్‌లోని మొత్తం 6 డివిజన్ల కార్యాలకలాపాలను ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. పరిపాలన, మానవ వనరుల విభాగం, ఆపరేషన్స్, విజిలెన్స్, ప్రజాసంబంధాలు, కమర్షియల్, తదితర విభాగాలతో పాటు, ఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం కూడా రైల్నిలయంలోనే ఉంది. విభజన నేపథ్యంలో సుమారు 750 మందికి పైగా విశాఖ జోన్‌కు తరలి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రైల్‌నిలయంలోని ఏడంతస్థుల భవనంలో సగానికి పైగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నేత అరుణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంత భాగాన్ని రైల్‌నిలయం కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే నిర్వహిస్తుంది. విభజన అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దీని పరిధిలో ఉంటాయి. ఉద్యోగుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది.అలాగే దక్షిణమధ్య రైల్వేలో కొత్త లైన్ల నిర్మాణం, కొత్త భవనాలు, కట్టడాలు,తదితర కార్యాలయాలను చేపట్టి పర్యవేక్షించే రైల్నిర్మాణ్ భవన్లో సుమారు 650 మంది పని చేస్తున్నారు. లేఖా భవన్లో మరో 500 మందికి పైగా ఉన్నారు. ఈ రెండు కార్యాలయాల్లోనూ సగం మంది కొత్త జోన్‌కు తరలి వెళ్లవలసిందే. తగ్గనున్న ఏ–1 స్టేషన్లు... జోన్ విభజన దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే జోన్లో ఏ–1 స్టేషన్ల సంఖ్య తగ్గనుంది. విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లు కొత్త జోన్‌కు బదిలీ అవు తాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు మాత్రమే మిగులుతాయి.దీంతో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు తగ్గే అవకాశం ఉన్న ట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ ఒక్కటే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్‌గా మారింది. కొత్తగా కాజీపేట్ డివిజన్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని మజ్దూర్ యూనియన్ నాయకులు అరుణ్ కోరారు. విశాఖ–సికింద్రాబాద్నెట్వర్క్ పెరిగే అవకాశం దక్షిణమధ్య రైల్వే విభజన పట్ల ఉద్యోగ వర్గాల్లో కొంత విముఖత ఉన్నప్పటికీ కొత్త జోన్ వల్ల ప్రయాణికులకు మరిన్ని అదనపు రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే ఈ కారిడార్‌లో కొత్త రైళ్లను విశాఖ వరకు పొడిగించేందుకు అవకాశం లేకపోవడంతో కాకినాడ నుంచే మళ్లిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు, దక్షిణమధ్య రైల్వేకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఉత్తరాంధ్రకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పెరగడం లేదు. కొత్త రైళ్లు నడపాలని అనేక ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈస్ట్‌కోస్ట్ నుంచి సహకారం లభించకపోవడంతో వాయిదా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే సౌత్‌కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేలు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్న దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తారు ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇంత ఉన్న పళంగా జోన్ పైన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయాం. ఇప్పటికిప్పుడు జోన్ విభజించడం వల్ల ఉద్యోగులు, వారి పిల్లలు ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడ చదువుకోవాలి. చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ల పరిస్థితి ఏంటీ. చిన్న జోన్ల వల్ల రైల్వేకు నష్టమే కానీ లాభం మాత్రం ఉండబోదు. – ఉమా నాగేంద్రమణి, దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆందోళన మొదలైంది జూనియర్ ఉద్యోగుల్లో అప్పుడే ఆందోళన కనిపిస్తోంది. ఆప్షన్లు ఇస్తామంటారు కానీ, కిందిస్థాయికి వచ్చేటప్పటికీ బలవంతపు బదిలీలు తప్పవు. పారదర్శకత పాటించాలి. ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే వారిపైన ప్రభావం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.– అరుణ్‌కుమార్, సహాయ ప్రధాన కార్యదర్శి, మజ్దూర్ యూనియన్ నిరుద్యోగం అలాగే ఉంటుంది విశాఖ పట్నంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటును ఆంధ్ర ప్రజలు ఆహ్వానించినప్పటికీ , అక్కడవున్న నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగిపోదు. జోన్ రాకతో ముఖ్య కార్యాలయానికి మాత్రమే అధికారులు,సిబ్బంది అవసరం ఉంటుంది. గుంతకల్ , విజయవాడ , గుంటూరు డివిజన్ లో పని చేస్తున్న స్టాఫ్ యధావిధిగా వుంటారు. ఏ రైల్వే నుండైనా బదిలీలపై వచ్చే అవకాశం ఉంటుంది. వేరే చోట పని చేస్తున్న అధికారులు అనధికారులు కొత్త జోన్ కు రావడానికి ప్రయత్నిస్తారు. ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడివి. – నూర్, దక్షిణమధ్య రైల్వే రిటైర్డ్ అధికారి -
ఎక్కడి వాళ్లక్కడే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అయిన ప్రత్యేక రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినా రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల ఆధారంగా విభజన జరిగే అవకాశం కనిపించడం లేదు. దీంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు విశాఖ రైల్వే జోన్ (దక్షిణ కోస్తా), ఏపీలోని కొన్ని ప్రాంతాలు దక్షిణ మధ్య రైల్వే (హైదరాబాద్ కేంద్రం) పరిధిలోనే కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే యావత్తూ ఒక యూనిట్‌గా ఉన్నందున రాష్ట్రాల సరిహద్దులు ప్రాతిపదికగా తీసుకోబోమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ ప్రాంతంలోని మిర్యాలగూడ.. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో కొనసాగనుంది. అలాగే ఏపీ పరిధిలోని కర్నూలు టౌన్ హైదరాబాద్ కేంద్రంగా ఉండే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి రానుంది. బదిలీలకు అవకాశం లేదు... ఆరు డివిజన్లతో ఉన్న దక్షిణ మధ్య రైల్వేను కేంద్రం రెండు భాగాలుగా విభజించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందెడ్ డివిజన్లు పాత జోన్లో కొనసాగుండగా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో కొత్తగా దక్షిణ కోస్తా జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతోంది. ఈ ఆరు జోన్లలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోన్ విడిపోయినప్పటికీ ఈ సిబ్బంది మాత్రం ఎక్కడి వారక్కడే ఉండనున్నారు. తెలంగాణకు చెందిన వారు దక్షిణ మధ్య రైల్వేకు, ఏపీకి చెందిన వారు దక్షిణ కోస్తా జోన్‌కు బదిలీ అయ్యే అవకాశం లేదు. రైల్ నిలయం నుంచి బదిలీ కావాల్సి ఉన్నా... దక్షిణమధ్య రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న సికింద్రాబాద్ రైల్ నిలయంలో దాదాపు 1,700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా ఆరు డివిజన్లకు సంబంధించిన విధులను పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు మూడు డివిజన్లతో కొత్త జోన్ ఏర్పాటవుతున్నందున ఇందులో సగం మంది ఆ జోన్ పరిధిలోకి మారాల్సి ఉంటుంది. కానీ 90 శాతం మంది బదిలీకి సిద్ధంగా లేరు. విద్య, వైద్యం సహా ఇతర వసతులు, వాతావరణం కారణంగా ఎక్కువ మంది హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. బదిలీకి సంబంధించి వారికి ఆప్షన్ అవకాశం ఉండటంతో ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఉంటామని చెప్పనున్నారు. దీంతో ప్రత్యేక అవసరాల రీత్యా రైల్వేశాఖనే కొంత మంది పేర్లతో బదిలీ చేసే అవకాశం ఉంది. గతంలో కలకత్తా కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్... తదుపరి ఈ మూడు జోన్లుగా మారింది. కానీ ఎక్కువ మంది సిబ్బంది కోల్‌కతా విడిచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో అక్కడి ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వేశాఖ వారిని అలాగే కొనసాగిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతాలోని రైల్వే ప్రధాన కార్యాలయంలో 2 వేల మంది సిబ్బంది అదనంగా కొనసాగుతున్నారు. అదే పద్థతిలో రైల్ నిలయంలో కూడా అదనంగా సిబ్బంది కొనసాగే అవకాశం ఉంది. కాజీపేట డివిజన్ ఊసేది? విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటయితే కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా మహారాష్ట్రలోని నాందెడ్ ఇక్కడ ఓ డివిజన్‌గా ఉంది. దాని పరిధిలో ఆదిలాబాద్ లాంటి తెలంగాణ ప్రాంతాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని, అందుకే వాటిని కలుపుతూ కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆదేశంలో దాని ప్రస్తావన లేదు. విశాఖ–హైదరాబాద్ మధ్య కొత్త రైళ్లకు అవకాశం... తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద నగరం విశాఖపట్నం మధ్య ప్రయాణికుల అవçసరాలకు తగ్గ సంఖ్యలో రైళ్లు నడవటం లేదు. విశాఖపట్నం తూర్పు కోస్తా జోన్ పరిధిలోని వాల్తేరు డివిజన్లో ఉండటంతో అక్కడి యంత్రాంతం దీన్ని పట్టించుకోలేదు. దక్షిణమధ్య రైల్వే నుంచి ప్రతిపాదనలు వెళ్లినా అమలు కాలేదు. ఇప్పుడు విశాఖ కూడా కొత్త జోన్ పరిధిలోకి రావడంతో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ రైళ్లకు సంబంధించి జోన్ డీఎం ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. కొత్త జోన్ డీఎం నుంచి ప్రతిపాదనలు వస్తే రైల్వే బోర్డు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్ఆర్బీ సికింద్రాబాద్‌లోనే..... రైల్వే ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ బోర్డు కీలకంగా ఉంటుంది. సికింద్రాబాద్ కేంద్రంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) కార్యాలయం కొనసాగుతోంది. ఇప్పుడు కొత్త జోన్ ఏర్పడ్డా ఆర్ఆర్బీ కార్యాలయం మాత్రం సికింద్రాబాద్ కేంద్రంగానే ఉండనుంది. విశాఖపట్నంలో మరో కేంద్రం ఏర్పాటుకు రైల్వే బోర్డు సిద్ధంగా లేదని సమాచారం. దీంతో రెండు జోన్లకు కలిపి సికింద్రాబాద్ కార్యాలయమే పర్యవేక్షించనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కాజీపేటల్లో కొనసాగుతున్న కొన్ని రైల్వే సంస్థలు యథాప్రకారం ఎక్కడివక్కడే కొనసాగనున్నాయి. వాటిని తరలించకుండా విశాఖపట్నం జోన్లో కొత్తవి ఏర్పాటు చేసే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఐదు దశాబ్దాల బంధం... దక్షిణమధ్య రైల్వే జోన్ 1966లో ఏర్పాటైంది. సదరన్ రైల్వేలో భాగంగా ఉన్న హూబ్లీ, విజయవాడ డివిజన్లు, సెంట్రల్ జోన్‌లోని షోలాపూర్, సికింద్రాబాద్ డివిజన్లను కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేశారు. సదరన్ రైల్వేలో ఉన్న గుంతకల్ డివిజన్‌ను 1977లో విలీనం చేశారు. తర్వాత షోలాపూర్‌లో మళ్లీ సెంట్రల్ రైల్వేలో కలిపారు. ఆ సమయంలో సికింద్రాబాద్ డివిజన్‌ను హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లుగా విభజించారు. 2003లో జరిగిన జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ సమయంలో గుంటూరు, గుంతకల్లు అమలులోకి వచ్చాయి. అదే సమయంలో హూబ్లీని నైరుతి జోన్లో కలిపారు. ఇవీ ప్రధాన విభాగాలు... జోనల్ హెడ్‌క్వార్టర్స్: సికింద్రాబాద్ వర్క్‌షాప్స్: మొత్తం 5. లాలాగూడలో మూడు, తిరుపతి, రాయనపాడులో ఒకటి చొప్పున డీజిల్ లోకోషెడ్స్: కాజీపేట, గుత్తి, గుంతకల్, మౌలాలి, విజయవాడ. ఎలక్ట్రిక్ లోకో షెడ్స్: సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ. శిక్షణ కేంద్రాలు: మొత్తం 25. (సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ, గుంతకల్, గుత్తి, వాషిమ్) ఆసుపత్రులు: లాలాగూడ (300 బెడ్స్), విజయవాడ (203 బెడ్స్), గుంతకల్ (131 బెడ్స్), రాయనపాడు (25 బెడ్స్), నాందెడ్ (30 బెడ్స్) ఇదీ స్వరూపం... మొత్తం డివిజన్లు (తాజా విభజనకు ముందు): 6 (హైదరాబాద్, సికింద్రాబాద్, నాందెడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్) మొత్తం రైళ్లు: నిత్యం 275 ఎక్స్‌ప్రెస్‌లు, 348 ప్యాసింజర్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం సిబ్బంది: పోస్టుల సంఖ్య 97,548, సిబ్బంది సంఖ్య 79,069 డివిజన్లవారీగా ట్రాక్ (కి.మీ.): విజయవాడ: 2,041, సికింద్రాబాద్: 2,649, గుంతకల్: 2,238, గుంటూరు: 658, హైదరా>బాద్ 86 -
కల ఫలించింది కానీ..!
ఐదు దశాబ్దాల కల.. ఐదేళ్ల పోరాటం.. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం.. ఫలించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒడిషాను నొప్పించకుండా ప్రధాన ఆదాయ వనరైన కేకే లైన్‌ని వారికే కట్టబె ట్టేసి.. రైల్వే జోన్ హోదాని మాత్రం విశాఖకు అప్పగించింది. ఆర్థిక పరిపుష్టి, వనరులతో ముడిపడిన అభివృద్ధి మార్గమైన కేకే లైన్‌ను తాజాగా ఏర్పాటయ్యే విశాఖ జోన్ నుంచి మినహాయించడం గమనార్హం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ కాలంలోనే తెరపైకి వచ్చిన రైల్వేజోన్ డిమాండ్‌ను రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్ సీపీ బలంగా వినిపించి పోరాటాలు చేసింది. సాక్షి, విశాఖపట్నం: సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కొత్త జోన్లో ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్లో సగాన్ని మాత్రమే విలీనం చేసింది. దీంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు మంచి ఆదాయ వనరైన కొత్తవలస–కిరండల్ (కేకే) లైన్ రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు, ఖుర్దా, సంబల్పూర్ డివిజన్లున్నాయి. వాల్తేరు డివిజన్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. దేశంలో అధిక ఆదాయం కలిగిన జోన్లలో తూర్పు కోస్తా రైల్వే జోన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జోన్ ద్వారా ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో వాల్తేరు డివిజన్లో ఉన్న కేకే లైన్ చాలా కీలకం. ఈ డివిజన్ నుంచి సుమారు రూ.7,500 కోట్లు ఆదాయం వస్తుండగా ఒక్క కేకే లైన్ నుంచే రూ.7 వేల కోట్లు లభిస్తోంది. కేకే లైన్ కథేంటంటే.. విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో కిరండల్–కొత్తవలస (కేకే) లైన్ ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారింది. 2003 వరకు ఇది ఆగ్నేయ రైల్వే పరిధిలో ఉండేది. 2003లో తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటయ్యాక అందులో విలీనమైంది. తూర్పు కోస్తా రైల్వే జోన్ వాల్తేరు డివిజన్లో.. కొత్తవలస–కిరండల్ లైన్ అత్యంత కీలకమైనదిగా రైల్వే భావిస్తుంది. తూర్పు కోస్తాకు వెన్నెముకగా నిలిచిన ఈ కేకే లైన్ నిర్మాణానికి జపాన్ ఆర్థిక సాయం అందించింది. దేశంలోనే అతిపెద్ద బ్రాడ్‌గేజి లైన్‌గా కేకే లైన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. 1960లో మొదలయిన ట్రాక్ నిర్మాణ పనులు 1968కి పూర్తయ్యాయి. అప్పట్నుంచి ఈ లైన్ అందుబాటులోకొచ్చింది. విశాఖ నుంచి చత్తీస్‌గఢ్‌లోని కిరండల్ వరకు 446 కిలోమీటర్ల వరకు కేకే లైన్ పరిధి ఉంది. సింగిల్ ట్రాక్ ఉన్న ఈ లైన్‌ను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మీదుగా తూర్పు కనుమల్లోంచి కిరండల్ వరకు వేశారు. మధ్యలో 58 చోట్ల కొండలను తవ్వి గుహల్లోంచి రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ లైన్లో 48 రైల్వే స్టేషన్లున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి.. విశాఖ పోర్టు వరకు ఐరన్ ఓర్ (ముడి ఇనుప ఖనిజం) రవాణా అవుతుంది. విశాఖ పోర్టుకు రోజుకు సగటున 10–12 ర్యాక్‌లు (వ్యాగన్లు) ఈ ఖనిజాన్ని రవాణా చేస్తుంటాయి. ఒక్కో ర్యాక్ సుమారు రూ.80 లక్షల నుంచి కోటి విలువైన ఐరన్ ఓర్‌ను తీసుకెళ్తాయి. ఈ ఐరన్ ఓర్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. ఇందులో అత్యధికంగా జపాన్‌కు ఎగుమతి అవుతోంది. ఇవికాకుండా విశాఖ నుంచి ఒక ఎక్స్‌ప్రెస్, మరో పాసింజరు రైలు, రాయగడ నుంచి మరో మూడు రైళ్లు ఈ లైన్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు వాల్తేరు డివిజన్‌కు ఏటా సమకూరే రూ.7,500 కోట్లలో కేకే లైన్ ద్వారా వచ్చే రూ.7 వేల కోట్లు ఇకపై రాయగడ డివిజన్పరం కానుంది. ఫలితంగా ఈ రూ.7 వేల కోట్లను ప్రస్తుత వాల్తేరు డివిజన్ కోల్పోనుంది. విభజన చట్టంలో పేర్కొన్నా.. దాదాపు యాభై ఏళ్ల నుంచే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని పేర్కొన్నా ఒడిశా ఒప్పుకోవడం లేదని కొన్నాళ్లు, సాంకేతికంగా సాధ్యం కాదని మరికొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. నిపుణుల కమిటీ పేరుతో తీవ్ర జాప్యం చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, ఉద్యమాలు జరిగినా నాన్చివేత వైఖరినే ప్రదర్శించింది. ఎన్నికలు సమీపించడం, మార్చి 1వ తేదీన ప్రధాని మోదీ విశాఖకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు జోన్‌పై ప్రకటన వెలువడింది. ముగిసిన వాల్తేరు డివిజన్ ప్రస్థానం: డీఆర్ఎం కొత్త జోన్‌కు సంబంధించిన విధివిధానాలు, పరిధులపై స్పష్టత రావాల్సి ఉందని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం.ఎస్.మాథుర్ బుధవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. విశాఖ జోన్‌గా మారడంతో ప్రస్తుతం ఉన్న డిఆర్‌యం కేడర్ జనరల్ మేనేజర్‌గా మారనుందన్నారు. 125 ఏళ్ల వాల్తేర్ డివిజన్ ప్రస్థానం నేటితో ముగిసిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని, నిర్ణయం తీసుకున్నాక త్వరలోనే ఆచరణలోకి వస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జోన్‌పై నిర్ణయం వెలువడడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. ఇదీ కొత్త జోన్ పరిధి.. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న కొత్త జోన్ పరిధి ఇలా ఉండనుంది. విజయవాడ డివిజన్ 959 కి.మీలు, గుంతకల్లు 1,354 కి.మీలు, గుంటూరు డివిజన్ 628 కి.మీలు వెరసి 2,931 కి.మీల పరిధి ఉంది. వాల్తేరు డివిజన్ పరిధి 1,106 కి.మీ ఉంది. ఇప్పుడు ఇందులో సగం వరకు రాయగడ డివిజన్‌కు వెళ్లనుంది. అంటే దాదాపు 600 కి.మీలు కొత్త జోన్లో కలిసే అవకాశం ఉంది. ఈ లెక్కన కొత్తగా ఏర్పాటయ్యే సౌత్ కోస్టు రైల్వే జోన్ పరిధి 3,500 కి.మీల వరకు ఉండనుంది. దక్షిణ మధ్య రైల్వే ఇక మీదట హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లకు మాత్రమే పరిమితం కానుంది. జోన్‌తో ప్రయోజనాలివీ.. - కొత్త రైల్వే లైన్లు - కొత్త ప్రాజెక్టులు - రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ఏర్పాటు ద్వారా ‘సి’ తరగతి ఉద్యోగాల నియామకాలకు వీలు. - రైల్వే రిక్రూట్మెంట్ సెంటరు కూడా వస్తుంది. - జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటుతో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్తగా రెండు, మూడు వేల క్వార్టర్ల నిర్మాణం జరుగుతుంది. - డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లను నడపవచ్చు. - దీంతో కొత్త రైళ్ల కోసం రైల్వే బోర్డుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. - లోకల్ ట్రైన్లకు కూడా నడుపుకోవచ్చు. - విశాఖలో ప్లాట్‌ఫారాల సంఖ్య పెరుగుతుంది. - రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు పెరుగుతాయి. - జోన్ కేంద్రంలో జోనల్ ఆసుపత్రి ఏర్పాటవుతుంది. - ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - విశాఖ ప్రగతికి రైల్వే జోన్ దోహదం చేసినా కేకే లైన్ ఒడిశాకు తరలిపోవడం మాత్రం ప్రతికూల అంశం. -
నాటకాలు కట్టి పెట్టండి
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ముఖ్యంత్రి చంద్రబాబు పెద్ద డ్రామాలాడుతున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన రామాయపట్నం పోర్టు గురించి కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం సీఎంకు లేదన్నారు. దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి అనువుగా లేదని నీతి అయోగ్ తేల్చితే ఆ సమయంలో రామాయపట్నం పోర్టు ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కోరుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. రామాయపట్నం కోసం రోడ్డెక్కడం కొత్తకాదని, నాలుగేళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నామన్నారు. రామాయపట్నం పోర్టుకు అన్ని విధాలా అనుకూలమని తేలినప్పటికీ దాని కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. దుగరాజపట్నంలో పోర్టు నిర్మించకపోతే రామాయపట్నంలో నిర్మించమని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని నిలదీశారు. నాలుగేళ్లుగా చోద్యం చూస్తున్నారు.. కడపలో స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నారు అదీ లేదు, విశాఖలో రైల్వే జోన్ నిర్మిస్తామన్నారు అదీ లేదు. నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంటూ చోద్యం చూస్తున్నారని ఎంపీ వైవీ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేస్తూ ప్రజాస్వామ్య పద్దతిలో బంద్చేస్తే కేసులుపెట్టి జైళ్లలో పెట్టారన్నారు. ప్రకాశం జిల్లా ఆవిర్భవించి అర్ధ శతాబ్దమైనా ప్రజలకు కనీసం తాగునీటిని కూడా అందించలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తామంటూ ఓట్లు వేయించుకొని జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిల్లాపై సీఎంకు శతృత్వ భావం: మాజీ మంత్రి వడ్డే ప్రకాశం జిల్లాపై ముఖ్యమంత్రి శతృత్వ భావంతో ఉన్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రూ.24 వేల కోట్లతో రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదిస్తే అప్పటి ఎంపీ చింతా మోహన్ దానిని దుగరాజపట్నానికి హైజాక్ చేశారన్నారు. దుగరాజపట్నం పోర్టుకు అనువైందికాదని రెండు నిపుణుల కమిటీలు స్పష్టం చేసినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం దానివైపే మొగ్గు చూపుతున్నారన్నారు. చంద్రబాబు చిన్నవాడా, తెలియనివాడా, తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి కృష్ణపట్నం పోర్టు ప్రయోజనాల కోసం రామాయపట్నానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా సర్వతాభివృద్ధికి రామాయపట్నం పోర్టు అవసరం ఉన్నా, దానికి అనుకూలంగా వ్యవహరించడంలేదన్నారు. రామాయపట్నం పోర్టుపై రెండు మూడు నెలల్లో ప్రకటన చేయకుంటే జిల్లాలో తిరిగే నైతిక హక్కును ముఖ్యమంత్రి కోల్పోతారన్నారు. -
విశాఖకు జోన్ ఇవ్వమని మళ్లీ కోరుతున్నా
అమరావతిని బెంగళూరు, హైదరాబాద్‌తో అనుసంధానించాలి: సీఎం సాక్షి, విజయవాడ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మంజూరు చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును మరోసారి కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేవన్నారు. విజయవాడ–హౌరా మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన హమ్ సఫర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 00890)ను గురువారమిక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి రైల్వేమంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు తదితరులు పచ్చ జెండా ఊపి వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించారు. సత్యనారాయణపురంలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ కేంద్రంలో త్రీఫేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సిమ్యులేటర్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను వీడియో లింక్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో అమరావతిని అనుసంధానం చేయాలన్నారు. కొత్తగా మంజూరైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి దోహదపడతాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’
-
‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’
అనకాపల్లి : తన ప్రాణం పోయినా సరే విశాఖ రైల్వేజోన్ సాధించేవరకూ పోరాటం చేస్తానని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధన కోసం ఆయన ఇవాళ్టి నుంచి 11 రోజులు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రైల్వేజోన్ కోసం విశాఖ ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజలు ఓడారని, బీజేపీ ఎంపీ హరిబాబు పదేపదే చెబుతున్నారని, అయితే ఇక్కడ గెలిచిన నేతలు ఢిల్లీలో మాత్రం పోరాటం చేయలేకపోతున్నారన్నారు. కాగా అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర అనకాపల్లి నుంచి మొదలై చిట్టివలస వరకూ సాగుతుంది. రైల్వేజోన్ రావాల్సిందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నాయని, ఇప్పుడు రైల్వే జోన్ రాకుండా చేస్తున్నాయన్నారు. రైల్వేజోన్ కోసం తీవ్రమైన పోరారం చేయాల్సి ఉందని, రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, మరో లక్ష కోట్ల అప్పుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. అప్పులు తెచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని ధర్మాన అన్నారు. తెలంగాణ కంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైల్వేజోన్ రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అందరూ పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. విశాఖకు రైల్వేజోన్ రావాలంటే గుడివాడ అమర్నాథ్ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ... వెనుకబాటుతనం ఇక్కడే ఉందని, విశాఖకు రైల్వే జోన్ రావాలని అన్నారు. రైల్వే జోన్ వస్తే కొన్నివేల ఉద్యోగాలు వస్తాయని, అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్రకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలన్నారు. -
వార్ జోన్
⇒లక్ష్యం : విశాఖ రైల్వే జోన్ ⇒11 రోజులు.. 200 కి.మీ. ⇒అమర్ ఆత్మగౌరవయాత్ర ⇒వైఎస్ఆర్సీపీ పోరాటంలో కీలక అంకం ⇒నేడు అనకాపల్లిలో ప్రారంభం విశాఖ రైల్వే జోన్.. ఉత్తరాంధ్రుల ఆశ.. శ్వాస.. దశాబ్దాల ఈ ఆకాంక్షను అణగదొక్కే ప్రయత్నాలు.. రైల్వేజోన్‌ను పట్టాలు తప్పించి వేరే ప్రాంతానికి తరలించే కుట్రలకు కొదవలేదు. ఎన్నో ఉద్యమాల.. పోరాటాల ఫలితంగా రాష్ట్ర విభజన చట్టంలో చోటు దక్కించుకున్న జోన్ ప్రతిపాదనకు నీళ్లొదిలే రీతిలో అధికార పార్టీలు దుర్నీతిని పాటిస్తుంటే.. జోన్ సాధనే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ అదే బాటలో కదం తొక్కుతోంది.. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశనంలో గతంలో నిరవధిక దీక్ష చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్.. మరో ముందడుగు వేస్తున్నారు.. అదే 11 రోజుల సుదీర్ఘ పాదయాత్ర.. ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక.. జోన్ కోసం జనఘోషను ఢిల్లీకి మోసుకెళ్లే ఆత్మగౌరవ యాత్ర. గురువారం అనకాపల్లిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర పల్లె పట్టణ ప్రాంతాలను స్పృశిస్తూ.. వారి గుండె గొంతుకలను తట్టిలేపుతూ చిట్టివలస వరకు సాగుతుంది. -
రైల్వే జోన్ సాధించే వరకూ పోరాటం
రాంబిల్లి (యలమంచిలి): విశాఖ రైల్వే జోన్ సాధించేవరకు పోరాటం ఆగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్ స్పష్టం చేశారు. గోకివాడలో గురువారం ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వే జోన్ సాధన కోసం ఈ నెల 22 నుంచి ఆత్మ గౌరవ యాత్ర పేరిట తాను పాదయాత్రను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పాదయాత్రకు అందరూ మద్దతు పలకాలని కోరారు. విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రైల్వే జోన్‌ను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు రైల్వే జోన్ హామీ ఇచ్చారని ఇప్పుడు అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. రైల్వే జోన్‌తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమర్నా«థ్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నానేపల్లి సాయివరప్రసాద్, ద్వారపురెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభు’ వెనకడుగు!
రైల్వే జోన్ ప్రకటనపై సందిగ్ధం? విశాఖపట్నం : విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపై కే ంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తందానతాన పాడుతోంది. ఈ రైల్వే జోన్‌పై ప్రకటనే తరువాయి అంటూ తొలుత లీకులివ్వడం, వాటిని అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నారని, అదే రోజు విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా హడావుడి చేస్తున్నారు. ఇటీవలే సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ఈ నెల 20న విజయవాడ వస్తున్నారు. ఆ రోజు రాత్రి విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త రైలును ప్రారంభించనున్నారు. ఆ మర్నాడు విశాఖలో యోగా దినోత్సవంలో పాల్గొంటారని తొలుత సమాచారం అందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సురేష్ ప్రభు 21న విశాఖ రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోజు రైల్వే మంత్రి విశాఖ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. దీనిపై రైల్వే వర్గాలు కూడా స్తబ్దుగానే ఉన్నాయి. రైల్వే మంత్రి రాకపై ఆ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. శనివారం రాత్రి వరకూ విశాఖలోని బీజేపీ శ్రేణులకు కూడా రైల్వే మంత్రి పర్యటన ఖరారయినట్టు సమాచారం లేదు. ఒకవేళ ఆయన ఆఖరి నిమిషంలో వచ్చినా విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన అనుమానమేనని చెబుతున్నారు. ఆందోళనల భయంతోనే..? రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు తాత్సారం చేస్తూ వస్తోంది. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ, బీజేపీలు తప్ప వైఎస్సార్సీపీ, వామపక్షాలు, లోక్‌సత్తా, పలు ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, న్యాయవాదుల సంఘాలూ ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్‌లో అమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ ఆకాంక్ష ఉత్తరాంధ్ర వాసుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో యోగా దినోత్సవం నాడు విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనను ఆయా పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు రైల్వే మంత్రిని గట్టిగా నిలదీసే అవకాశాలున్నాయి. ఈ సంగతి తెలిసే ఆయన విశాఖ రాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రధానితో విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన రైల్వే జోన్‌పై ప్రకటన చేయించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. -
అమర్నాథ్తో దీక్ష విరమింపజేసిన వైఎస్ జగన్
విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ సాధన కోసం నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గుడివాడ అమర్నాథ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష విరమింపజేశారు. సోమవారం విశాఖపట్నం వచ్చిన వైఎస్ జగన్.. విమానాశ్రయం నుంచి నేరుగా కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అమర్నాథ్ను పరామర్శించారు. అనంతరం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వైఎస్ జగన్ వెంట వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు ఉన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అమర్నాథ్ చేస్తున్న నిరాహార దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు బలవంతంగా ఆయన్ను అంబులెన్స్‌లో విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి తరలించారు.