దీక్ష భగ్నానికి యత్నం
అమర్‌నాథ్‌ను బలవంతంగా కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్‌ను సాధించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకోసం జరుగుతున్న ఉద్యమంపై మాత్రం ఉక్కుపాదం మోపింది. కుటిల యత్నాలతో అణచివేత చర్యలకు ఒడిగట్టింది. విశాఖకు రైల్వే జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ నాలుగు రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం రాత్రి పది గంటల సమయంలో పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు.
ఆదివారం ఉదయం నుంచి వెల్లువలా వచ్చిన నాయకులు, ప్రజల రద్దీ రాత్రి తగ్గింది. దీక్షా శిబిరంలో ఉన్నవారు విశ్రమిస్తున్న సమయంలో ఒక్కసారిగా వందలాది మంది మఫ్టీలో, యూనిఫాంలోనూ ఉన్న పోలీసులు వచ్చి చుట్టుముట్టారు. అక్కడున్నవారు తేరుకునే లోపే క్షణాల్లో అమర్‌నాథ్‌ను దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారికి పక్కకు నెట్టివేస్తూ రోడ్డుపై సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లోకి ఎత్తి పడేశారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐఆర్‌సీయూ విభాగంలో ఉంచారు. ఆస్పత్రిలోనూ అమర్‌నాథ్ దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యానికి నిరాకరిస్తున్నారు.పోలీసులు తనను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చినా అక్కడే దీక్ష కొనసాగిస్తానని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
20న అమర్‌నాథ్ వద్దకు వైఎస్ జగన్ :బొత్స
రైల్వే జోన్ సాధన కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన గుడివాడ అమర్‌నాథ్‌కు సంఘీభావం తెలపడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్డి ఈ నెల 20న విశాఖ నగరానికి వస్తున్నారని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన ఆదివారం దీక్షా శిబిరం వద్ద విలేకరులతో మాట్లాడారు.ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని బొత్స వెల్లడించారు.