సర్కారుపై జగన్ సంధించిన ఉత్తరాంధ్ర తూటా | ys jagan fire on tdp govt | Sakshi
Sakshi News home page

సర్కారుపై జగన్ సంధించిన ఉత్తరాంధ్ర తూటా

Published Wed, Mar 9 2016 11:33 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

సర్కారుపై జగన్ సంధించిన ఉత్తరాంధ్ర తూటా - Sakshi

సర్కారుపై జగన్ సంధించిన ఉత్తరాంధ్ర తూటా

ఆ హామీలు ఏమయ్యాయి?
•  రైల్వే జోన్ సాధనలో విఫలం
•  ప్రత్యేక ప్యాకేజీ, హోదా ఊసే లేదు జాడలేని పరిశ్రమలు
•  అసెంబ్లీ వేదికగా నిలదీసిన ప్రతిపక్ష నేత
•  సమాధానం చెప్పలేక పాలకులు ఉక్కిరిబిక్కిరి
 

విశాఖ రైల్వే జోన్ ఏమైంది?..
ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడ??
పెట్టుబడుల ఒప్పందాలు.. పరిశ్రమల జాడేదీ???..
అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సర్కారుపై సంధించిన ప్రశ్నాస్త్రాలు ఇవి. బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో జగన్ ప్రత్యేకంగా విశాఖ, ఉత్తరాంధ్ర అంశాలను ప్రస్తావిస్తూ పాలకపక్షాన్ని, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. నిరుత్తరురాలిని చేశారు.

 
విశాఖపట్నం: రాష్ట్రానికి చెందిన పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్ర వాణిని అసెంబ్లీలో బలంగా వినిపించడం ద్వారా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకత చాటుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం చేసిన ప్రసంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కడిగిపారేశారు. వై.ఎస్.జగన్ తన ప్రసంగంలో ఉత్తరాంధ్ర సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. విశాఖ జిల్లాతోపాటు ఉత్తరాంధ్రవాసులు దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్లను అసెంబ్లీలో లేవనెత్తారు. కేసులకు భయపడి విభజన హామీలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని విరుచుకుపడ్డారు.  ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ప్రస్తావించిన అంశాలపై ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోవడం విస్మయపరిచింది.

రైల్వే జోన్ ఏమైంది?
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటులో వైఫల్యంపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు రైల్వే జోన్ అంశం ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని విశాఖ ప్రజలతోపాటు తమ పార్టీ డిమాండు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమైందని జగన్ విమర్శించారు.
 
ప్రత్యేక ప్యాకేజీ, హోదా ఏమయ్యాయి
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీతో హోదా కల్పిస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని వై.ఎస్.జగన్  ప్రస్తావించారు. బుందేల్‌ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇస్తామన్న హామీ అమలయ్యేలా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని.. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న విషయం తెలియదా అని నిలదీశారు. ఇంతటి కీలకమైన అంశంపై చిత్తశుద్ధి చూపించడం లేదని ప్రభుత్వంపై  ధ్వజమెత్తారు.
 
ఏవీ పరిశ్రమలు?
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని ప్రభుత్వం చెబుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు లోగుట్టును వై.ఎస్.జగన్ ఎండగట్టారు. భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ. 4.67లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం  చంద్రబాబు వెల్లడించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంత భారీ పెట్టుబడులకు కుదిరిన ఒప్పందాలు ఏమయ్యాయని నిలదీశారు. ఎక్కడ పరిశ్రమలు వచ్చాయి?.. ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా వై.ఎస్.జగన్ అసెంబ్లీలో ఉత్తరాంధ్ర సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా దీనిపై ప్రభుత్వం మాత్రం సూటిగా సమాధానం ఇవ్వకుండా పలాయనవాదం ప్రదర్శించడం విస్మయపరిచింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement