సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న కొత్త లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్ ప్రాజెక్టులకు 2022–23 కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈ బడ్జెట్‌లో కేంద్రం రూ.7,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన రూ.5,812 కోట్ల కంటే ఇది 21 శాతం ఎక్కువ. ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబించాయి.
2022–23 బడ్జెట్‌లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు
► నడికుడి – శ్రీకాళహస్తి కొత్త లైన్‌కు రూ.1,501 కోట్లు కేటాయించింది. 309 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ. 2,289 కోట్లతో 2011–12లో చేపట్టారు. తగినన్ని నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు 46 కి.మీ. పనులే పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.
► కోటిపల్లి–నరసాపూర్ కొత్త లైన్‌కు కేంద్రం రూ.358 కోట్లు కేటాయించింది. 57 కి.మీ. ఈ లైన్‌ను రూ.2,120 కోట్లతో 2000–01లో ప్రారంభించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు వేగంగా సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు తాజా బడ్జెట్‌లో ఎక్కువ నిధులిచ్చింది.
► కడప – బెంగళూరు కొత్త లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాయలసీమను కర్ణాటకతో మరింతగా అనుసంధానిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.2,706 కోట్లతో చేపట్టే 255 కి.మీ. కొత్త లైన్‌కు 2008–09లో ఆమోదం లభించింది. ఏపీ పరిధిలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే మొదటి దశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.289 కోట్లు కేటాయింపుతో మిగిలిన పనులు జోరందుకోనున్నాయి.
► 221 కిలోమీటర్ల విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నరసాపూర్–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్‌లో రూ.1,681 కోట్లు కేటాయించడం విశేషం. 2011–12లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు తగినన్ని నిధుల్లేక నత్తనడకన సాగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నాలతో గత రెండు బడ్జెట్లలో ఎక్కువ నిధులిచ్చారు. దీంతో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 144 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇప్పుడు భారీగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
► విజయవాడ– గూడూరు మూడో లైన్‌కు తాజా బడ్జెట్‌లో కేంద్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. 288 కి.మీ. మేర నిర్మించే మూడో లైన్‌లో ఇప్పటికి 55 కి.మీ. మేరే పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈసారి ఎక్కువ నిధులు కేటాయించారు.
► రాష్ట్రం నుంచి దేశ రాజధానికి వెళ్లే కీలకమైన విజయవాడ– కాజీపేట మార్గంలో మూడో లైన్‌కు రూ.592 కోట్లు కేటాయించారు. రూ.1,953 కోట్లతో 220 కి.మీ. నిర్మించే ఈ లైన్‌లో నిధులు లేక ఇప్పటివరకు 17.5 కి.మీ. పనులే పూర్తి చేశారు. తాజా కేటాయింపులతో పనులు వేగం పుంజుకోనున్నాయి.
► రూ.3,631 కోట్లతో 401 కి.మీ. గుంటూరు – గుంతకల్ డబ్లింగ్‌ను 2016–17లో ఆమోదించారు. అరకొర నిధులతో ఇప్పటి వరకు 92 కి.మీ. పనులే చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.803 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నాయి.
► గుత్తి–ధర్మవరం డబ్లింగ్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. రూ.714 కోట్లతో 91 కి.మీ. ఈ ప్రాజెక్టును 2015–16లో ఆమోదించారు. ఇప్పటివరకు 57 కి.మీ. పనులు పూర్తయ్యాయి.
► దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు రైల్వే స్టేషన్లలో బైపాస్ లైన్ల కోసం రూ.407.47 కోట్లు కేటాయించారు. వాటిలో విజయవాడ, రేణిగుంట, గుత్తి, తెలంగాణలో కాజీపేట, వాడి రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
► చిత్తూరు జిల్లా పాకాల – అనంతపురం జిల్లా ధర్మవరం మార్గం విద్యుదీకరణకు రూ.131 కోట్లు, కర్నూలు జిల్లా నంద్యాల –
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మార్గంలో విద్యుద్దీకరణకు రూ.51 కోట్లు కేటాయించారు.
► కర్నూలులో మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.58 కోట్లు కేటాయించారు.
► తిరుపతి రైల్వే స్టేషన్‌లో దక్షిణ ముఖద్వారం పనులకు రూ.3 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.6.5 కోట్లు కేటాయించారు.
ప్రత్యేక జోన్ లేకపోవడంతో ఏపీకి తీవ్ర నష్టం
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లేకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మరోసారి సుస్పష్టమైంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పూర్తిగా ఒడిశాకే ప్రాధాన్యమిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేసిందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో మొత్తం 12 కొత్త లైన్ల పనులకు నిధులు కేటాయిస్తే వాటిలో ఏపీ పరిధిలోని నౌపడ–గుణుపూర్– తెరుబలి లైన్ ఒక్కటే ఉంది. అది కూడా 20 శాతమే ఏపీలో ఉంటుంది. 80 శాతం ఒడిశాలోనే ఉంటుంది. ఆ లైన్‌కు కూడా కేవలం రూ.10 కోట్లే కేటాయించారు.
ఇక ఈ జోన్ పరిధిలో 28 డబ్లింగ్ పనులకు నిధులివ్వగా, ఏపీ పరిధిలోనివి నాలుగే ఉన్నాయి. వాటిలో కూడా అత్యధిక భాగం ఒడిశాకు ప్రయోజనం కలిగించేవే. ఒడిశాలోని టిట్లాఘర్ – ఏపీలోని విజయనగరం మూడోలైన్‌కు రూ.961 కోట్లు కేటాయించారు. కొత్తవలస–ఒడిశాలోని కోరాపుట్ డబ్లింగ్ పనులకు రూ.348.94 కోట్లు ఇచ్చారు. ఒడిశాలోని ఖుర్దారోడ్, ఏపీలోని విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు కలిపి రూ.4.18 కోట్లు కేటాయించారు. ఒడిశాలోని భద్రక్ –ఏపీ లోని విజయనగరం మూడోలైన్ మిగులు పనులకు రూ.కోటి మాత్రమే కేటాయించారు. ప్రత్యేక జోన్ ప్రకటించి ఉంటే ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చి ఉండేవని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment