Andhra Pradesh Sent Key Proposals To Central Railway Budget Projects - Sakshi
Sakshi News home page

ఆశల పట్టాలపై రైల్వే ప్రాజెక్టులు

Published Tue, Jan 31 2023 2:03 AM | Last Updated on Tue, Jan 31 2023 5:30 PM

Andhra Pradesh sent key proposals to Central Railway Budget Projects - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ రైలు ఈసారైనా రాష్ట్రంలో ఆగుతుందా.. దీర్ఘకాలిక రైల్వే ప్రాజెక్టులను గమ్యస్థానానికి చేరుస్తుందా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2023–24కు గాను కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో అంతర్భాగంగానే రైల్వే బడ్జెట్‌ను కూడా ఆమె సమర్పిస్తారు. దీంతో ఈసారైనా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. రైల్వే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధా­న్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

ఈమేరకు కేంద్ర రైల్వేశాఖకు స్పష్టమైన ప్రతిపాద­నలు పంపింది. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న నాలుగు ప్రధాన ప్రాజెక్టులతోపాటు ప్రత్యేక ఫ్రైట్‌ కారిడార్, ఆర్వోబీల నిర్మాణాన్ని ఆమోదించాలని కోరింది. ప్రధానంగా భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి నిర్మాణ వ్యయా­న్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్విభజన చట్టం హామీలను గుర్తు­చేస్తూ విశాఖపట్నం రైల్వేజోన్‌ ఆచరణలోకి వచ్చే­లా చూడాలని కోరింది. ఆ చట్టం ప్రకారం కొత్త­గా రెండులైన్లకు పచ్చజెండా ఊపాలని ప్రతిపాదించింది.

ఈ నాలుగు.. ఇంకెన్నేళ్లు?
రాష్ట్రంలో 4 ప్రధాన ప్రాజెక్టులు దశాబ్దాల తర­బడి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. అహేతుక రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో భూసేకరణ వ్యయాన్ని భరిస్తామని, ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టులు..

► కడప–బెంగళూరు రైల్వేలైన్‌ను రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో 268 కిలోమీటర్ల మేర నిర్మించాలని 2008–09 బడ్జెట్‌లో ఆమోదించారు. నాలుగుదశల ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు మొదటిదశ కింద కడప–పెండ్లమర్రి లైన్‌లో కేవలం రూ.350 కోట్ల పనులు చేశారు. 1,531 ఎకరాలను భూమిని సేకరించి ఇస్తామని, ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 

► నడికుడి–శ్రీకాకుళహస్తి రైల్వేలైన్‌ పనులు 20 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని అందించడంతోపాటు ఆ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేందుకు ఈ ప్రాజెక్టును 2009లో ఆమోదించారు. రూ.2,400 కోట్లతో ఆమోదించిన ఈ ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాల మేరకు రూ.4,500 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు 1,300 కోట్ల మేర పనులు చేశారు. భూసేకరణ ప్రక్రియను తాము త్వరగా పూర్తిచేస్తామని, మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే భరించి త్వరలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 

► రాయదుర్గం–తుముకూరు ప్రాజెక్టును రూ.3,404 కోట్లతో ఆమోదించారు. ఇప్పటివరకు రూ.520 కోట్ల పనులే చేశారు. మిగిలిన నిధులను కూడా కేంద్రమే కేటాయించి ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

► కీలకమైన కొవ్వూరు–నరసాపురం లైన్‌ వ్యయాన్ని కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తం రూ.2,125 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు వరకు రూ.300 కోట్ల పనులు మాత్రమే కేంద్ర రైల్వేశాఖ పూర్తిచేసింది. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని, అందుకు భూసేకరణను దాదాపు పూర్తిచేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

రెండు కొత్త లైన్లకు ప్రతిపాదన
రాష్టపునర్విభజన చట్టం ప్రకారం రెండు రైల్వేలైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వేలైన్‌కు రూ.709 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించారు. ఆ రైల్వేలైన్‌కు ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొండపల్లి–కొత్తగూడెం మధ్య కొత్త రైల్వేలైన్‌ వేయాలని ప్రతిపాదించింది. అందుకోసం సర్వే నిర్వహించి డీపీఆర్‌ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కోరింది.

28 ఆర్వోబీలు నిర్మించాలి
రాష్ట్రంలో లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఆర్‌వోబీ)ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అందుకోసం 54 ఆర్వోబీల నిర్మాణాన్ని గతంలోనే ప్రతిపాదించింది. వాటిలో 26 ఆర్వోబీలను రైల్వేశాఖ ఇప్పటికే ఆమోదించింది. మిగిలిన 28 ఆర్వోబీలను కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.  

డోన్‌లో లోకోషెడ్‌ ఏర్పాటుచేయాలి
కర్నూలు జిల్లా డోన్‌ కేంద్రంగా రైల్వే కోచ్‌ల సెకండరీ మెయింటనెన్స్‌ లోకోషెడ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకోసం 100 ఎకరాలు కేటాయిస్తామని తెలిపింది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. 

కొత్త రైళ్లు కావాలి
రాష్ట్రానికి కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగాఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వేయాల్సి ఉంది. 

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలు ఎక్కించాలి
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఈ ఏడాది అయినా ఆచరణరూపం దాలుస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఆశగా, ఆసక్తిగా చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి డీపీఆర్‌ను రూపొందించింది కూడా. 900 ఎకరాల రైల్వే భూములను గుర్తించి అందులో 150 ఎకరాల్లో ప్రధాన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు.

రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో 170 మంది గెజిటెడ్‌ అధికారులు, 1,200 మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒత్తిడితో జోనల్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రూ.170 కోట్లు  కేటాయించింది. అన్నీ ఉన్నా సరే.. విశాఖపట్నం రైల్వే జోన్‌ ఇంకా ఆపరేషన్‌లోకి రాలేదు. వాల్తేర్‌ డివిజన్‌ను కొనసాగిస్తూ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్‌లో అయినా రైల్వే జోన్‌ ఆపరేషన్‌లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 

సీమ, ఉత్తరాంధ్ర మధ్య ప్రత్యేక ఫ్రైట్‌ కారిడార్‌
రాయలసీమను ఉత్తరాంధ్రతో అనుసంధానిస్తూ ప్రత్యేక ఫ్రైట్‌ కారిడార్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు ఈ ప్రత్యేక కారిడార్‌తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల కార్గో రవాణా ఊపందుకుంటుందని  తెలిపింది. తద్వారా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో రాయలసీమకు నేరుగా రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement