సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్ పట్టాలెక్కుతుందా!?.. లేదా మరోసారి నిరాశను మిగులుస్తూ కేంద్రం వెయిటింగ్ లిస్టులో పెడుతుందా!?..
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టనున్న 2022–23 వార్షిక బడ్జెట్‌పైనే యావత్ రాష్ట్రం దృష్టిసారించింది. నిజానికి దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అలాగే.. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల్లో న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
పట్టాలెక్కుతుందా.. అటకెక్కిస్తారా!
విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో కూడా దీని ఏర్పాటు గురించి హామీ ఇచ్చినప్పటికీ 2018 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు అంటే 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. మరోవైపు.. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధంచేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. కానీ, గత రెండు బడ్జెట్‌లలోనూ రైల్వేజోన్‌పై కేంద్రం మొండిచేయి చూపించింది.
గత బడ్జెట్‌లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. ప్రభుత్వం అనుమతిస్తే దక్షిణా కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసేందుకు రైల్వేబోర్డు సిద్ధంగా ఉంది. కానీ, జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వమే రాజకీయంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైల్వేజోన్‌పై కేంద్రం స్పష్టతనివ్వాలని రాష్ట్రం కోరుకుంటోంది. కేంద్రం ఇప్పుడు ప్రకటిస్తే ఏడాదిలో కొత్త జోన్ ఏర్పాటు సాధ్యపడుతుంది. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకుంటే ఇక రైల్వేజోన్ అంశం అటకెక్కినట్లేనని కూడా నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: Parliament Budget Session 2022)
డివిజన్లపై మరింత స్పష్టత అవసరం
విశాఖపట్నం రైల్వే జోన్‌తోపాటు దాని పరిధిలోని డివిజన్ల ఏర్పాటులోనూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. 2019లో కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం.. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఏపీ, ఒడిశాలలో విస్తరించి ఉన్న వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో ఉంది. వాల్తేర్ డివిజన్‌ను రెండుగా విభజిస్తారు. ఒడిశాలోని ప్రాంతాలతో రాయగడ కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటుచేసి తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో ఉంటుంది. అలాగే, ఏపీలోని ప్రాంతాలను విజయవాడ కేంద్రంగా ఉన్న రైల్వే డివిజన్‌లో కలుపుతారు. దీనిపై ఉత్తరాంధ్రలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. వాల్తేరు డివిజన్‌లేని రైల్వేజోన్‌తో ప్రయోజనంలేదని స్పష్టంచేశారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖపట్నం రైల్వేజోన్ మాత్రమే కావాలని స్పష్టంచేస్తున్నారు. అంతగా కావాలంటే విజయవాడ, గుంటూరులలో ఉన్న రైల్వే డివిజన్‌లను ఏకంచేసి ఓ డివిజన్ చేయొచ్చని నిపుణులు సూచించారు. దాంతో ఏపీ పరిధిలో మూడు రైల్వే డివిజన్‌లే ఉంటాయని చెప్పారు. ఈ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
రైల్వే జోన్‌తోపాటు బడ్జెట్‌లో రాష్ట్రం ఆశిస్తున్నవి..
► కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్‌ల సెకండరీ మెయింటెనెన్స్ లోకోషెడ్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు 100 ఎకరాలు కేటాయిస్తామని కూడా చెప్పింది. దాంతో రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం.
► రాష్ట్రానికి కనీసం రెండు కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్‌ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది.ఇక విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ వేయాల్సి ఉంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతికి పగటిపూట నడిచే రైళ్లు కూడా వేయాలని ప్రతిపాదించారు.
► విజయవాడ–ఖరగ్‌పూర్ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుచేస్తామని గత బడ్జెట్‌లో కేంద్రం పేర్కొంది. కానీ, ఇంతవరకు పట్టించుకోలేదు. ఆ కారిడార్ కోసం ప్రత్యేకంగా లైన్ నిర్మించే అంశంపై మంగళవారం బడ్జెట్‌లో స్పష్టతఇవ్వాలని కోరుకుంటోంది.
► మచిలీపట్నం–భీమవరం–నిడదవోలు డబ్లింగ్ పనులు, విజయవాడ–గూడూరు మూడో లైన్ పూర్తి కోసం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉంది.
► రాష్ట్రంలో ఆర్వోబీలు నిర్మాణం సందిగ్ధంలో పడింది. గుజరాత్ తమ వాటా నిధులు మంజూరు చేయనప్పటికీ ఆ రాష్ట్రంలో ఆర్వోబీలను పూర్తిచేశారు. రాష్ట్ర విభజన, కరోనా పరిస్థితులతో రాబడి కోల్పోయిన ఏపీలో మాత్రం రాష్ట్ర వాటా నిధులతో ముడిపెడుతూ పనులు నిలిపివేయడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నిధుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమనే విషయాన్ని రైల్వేశాఖ గుర్తించాలని వారు సెప్టెంబర్ సమావేశంలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment