విశాఖకు జోన్ ఇవ్వమని మళ్లీ కోరుతున్నా
అమరావతిని బెంగళూరు, హైదరాబాద్‌తో అనుసంధానించాలి: సీఎం
సాక్షి, విజయవాడ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మంజూరు చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును మరోసారి కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేవన్నారు. విజయవాడ–హౌరా మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన హమ్ సఫర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 00890)ను గురువారమిక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి రైల్వేమంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు తదితరులు పచ్చ జెండా ఊపి వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించారు.
సత్యనారాయణపురంలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ కేంద్రంలో త్రీఫేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సిమ్యులేటర్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను వీడియో లింక్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో అమరావతిని అనుసంధానం చేయాలన్నారు. కొత్తగా మంజూరైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి దోహదపడతాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.