Railway Minister Suresh Prabhu
-
రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
-
రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. రైల్వే లోకోమోటివ్స్ తయారీలో ఖ్యాతి గడించిన ప్రముఖ హైదరాబాదీ కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించనుంది. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌లో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రైల్వే లోకోమోటివ్స్ తయారీలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలో ఉండటం గర్వకారణమన్నారు. 1990లో ఎలాంటి హడావుడి లేకుండా ఏర్పాటైన ఈ సంస్థ నేడు ఎలక్ట్రోమెకానికల్ ఉత్పత్తుల్లో ప్రపంచ స్థాయి కంపెనీలైన జీఈ, సెమెన్, మిట్సుబుషి, తోషిబా, హిటాచీలతో పోటీపడి లోకోమోటివ్లను ఉత్పత్తి చేస్తోందని ప్రశంసించారు. పరిశోధనలు, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) అవసరాల కోసం ఈ పరిశ్రమలో ఏకంగా 500 మంది ఇంజనీర్లు పని చేస్తుండటం గొప్ప విషయమన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమ కోసం టీఎస్ఐఐసీ ద్వారా 100 ఎకరాలను కేటాయించామని తెలిపారు. మరో మూడు, నాలుగు నెలల్లో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు చేతి వేళ్ల మీద లెక్కబెట్ట గల సంఖ్యలోనే ఉన్నాయని పేర్కొన్నారు. డీజిల్ లోకోమోటివ్‌లు, ఎలక్ట్రికల్ లోకోమోటివ్లను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. అమెరికా, ఐరోపాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ చైర్మన్ యుగంధర్ రెడ్డి తనతో అన్నారని, ఆయన ఆత్మవిశ్వాసాన్ని గౌరవిస్తామని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలతోనే పోటీ: యుగంధర్ రెడ్డి కోల్‌కతాలోని ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)తో కలసి తాము గంటకు 160 కి.మీల వేగంతో నడిచే రైళ్లకు డిజైన్ రూపకల్పన చేస్తున్నామని మేధా సర్వో డ్రైవ్స్ చైర్మన్ యుగంధర్ రెడ్డి పేర్కొన్నారు. 1990లో హైదరాబాద్‌లో రూ.25 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ప్రారంభమైన తమ పరిశ్రమ ఇప్పుడు రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిందని తెలిపారు. తమ ఉత్పత్తులకు దేశీయ పరిశ్రమలతో ఎలాంటి పోటీ లేదని, ప్రపంచ అగ్రగామి కంపెనీలైన జీఈ, తోషిబా, హిటాచీలతోనే పోటీ అని పేర్కొన్నారు. తాము రూపొందించిన లోకోమోటివ్ కంట్రోల్స్‌తో దేశంలో 5 వేల రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. 2008లో ఈ లోకోమోటివ్ పరికరానికి రూపకల్పన చేశామని, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయన్నారు. దేశంలో నడుస్తున్న రైళ్లలో 50 శాతం డీజిల్ లోకోమోటివ్లను తామే ఉత్పత్తి చేశామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కశ్యప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా ఏటా 200 నుంచి 300 రైల్వే కోచ్‌లను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇప్పటికే తమ పరిశ్రమ ద్వారా ఇరాన్, టాంజానియా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర 15 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, త్వరలో విదేశీ దిగుమతుల కోసం ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యాదవ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ వెంకట నరసింహారెడ్డి, మేధా సర్వో డ్రైవ్స్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘విభజన’ హామీ నిలబెట్టుకోలేదు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత 6 నెలల్లోనే వరంగల్ జిల్లాలో భారతీయ రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని మూడున్నరేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు సీఎం కేసీఆర్ స్వయంగా కలసి ఈ హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారని, రాష్ట్ర ఎంపీలు లోక్‌సభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. అయినా కేంద్రం ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
రాజీనామా చేస్తా..
-
రాజీనామా చేస్తా..
♦ వరుస రైలు ప్రమాదాలతో సురేశ్‌ప్రభు కలత ♦ రాజీనామాపై తొందరపడవద్దని వారించిన ప్రధాని న్యూఢిల్లీ: ఐదు రోజుల వ్యవధిలో రెండు భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో రైలు ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే రాజీనామాపై తొందరపడవద్దని ప్రధాని సురేశ్‌ప్రభును వారించారు. బుధవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సురేశ్‌ప్రభు ప్రధానితో సమావేశమయ్యారు. ‘‘నేను ప్రధాని మోదీతో సమావేశమయ్యాను. ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తానని చెప్పాను. అయితే ఆయన నన్ను వేచి ఉండాలని చెప్పారు’’ అని ప్రభు ట్వీటర్లో వెల్లడించారు. ఈనెల 19న ఉత్తరప్రదేశ్‌లో కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది ప్రయాణికులు మరణించగా.. మరో 150 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. బుధవారం అదే రాష్ట్రంలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో సురేశ్‌ప్రభు తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ట్వీటర్లో ఆయన ఉద్వేగంగా స్పందించారు. యూపీలో జరిగిన రెండు ప్రమాదాలు తనను తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. జవాబుదారీతనం అనేది ప్రభుత్వంలో మంచి విధానమని, రైల్వే మంత్రి ప్రతిపాదనపై తుది నిర్ణయం ప్రధాని మోదీదే అని కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. సురేశ్‌ప్రభుని తొలగించాలి: కాంగ్రెస్ రైల్వే మంత్రిగా సురేశ్‌ప్రభు విఫలమయ్యారని, ఆయనను పదవి నుంచి తొలగించాలని, బాధ్య తాయుతమైన వ్యక్తికి ఆ బాధ్యతలను అప్పగిం చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మోదీ ప్రభుత్వం వచ్చాక 28 భారీ రైలు ప్రమాదాలు జరిగాయని, 259 మంది ప్రాణాలు కోల్పోగా.. 973 మంది గాయపడ్డారని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పారు. -
విశాఖకు జోన్ ఇవ్వమని మళ్లీ కోరుతున్నా
అమరావతిని బెంగళూరు, హైదరాబాద్‌తో అనుసంధానించాలి: సీఎం సాక్షి, విజయవాడ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మంజూరు చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును మరోసారి కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేవన్నారు. విజయవాడ–హౌరా మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన హమ్ సఫర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 00890)ను గురువారమిక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి రైల్వేమంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు తదితరులు పచ్చ జెండా ఊపి వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించారు. సత్యనారాయణపురంలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ కేంద్రంలో త్రీఫేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సిమ్యులేటర్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను వీడియో లింక్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో అమరావతిని అనుసంధానం చేయాలన్నారు. కొత్తగా మంజూరైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి దోహదపడతాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి రూ.1729 కోట్లు - రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు వెల్లడి - పలు రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ మాత్రం నిధుల కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సకాలంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు చెప్పారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి బడ్జెట్లో రూ.1729 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు సమానంగా నిధులు కేటాయిస్తాయని, 25 శాతం మూలధనంగా సమకూర్చి మిగతా నిధులను తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను శనివారం ఆయన హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో వీడియో ద్వారా ప్రారంభించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కల్వకుంట్ల కవిత, ఏపీ జితేందర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, డి.శ్రీనివాస్, బి.బి.పాటిల్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు శ్రీవాస్గౌడ్, బి.గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్–మోర్తాడ్ మార్గం ప్రారంభం... ఈ కార్యక్రమంలో సురేశ్‌ప్రభు... నిజామాబాద్–మోర్తాడ్, దేవరకద్ర–జక్లేర్ కొత్త రైల్వే మార్గాలను, నిజామాబాద్– కరీంనగర్, మహబూబ్‌నగర్–జక్లేర్ మధ్య డెమూ ప్యాసిం జర్ రైళ్లను ప్రారంభించారు. మహబూబ్‌నగర్– సికింద్రా బాద్ కొత్త రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేశారు. పూర్తిగా నగదు రహిత సేవలను అందుబాటులోకి తెచ్చిన నాంపల్లి, సికింద్రాబాద్, బాసర, గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, రాయచూర్, ఔరంగాబాద్, నాందేడ్ రైల్వేస్టేషన్లను డిజిటల్ పేమెంట్ స్టేషన్లుగా ప్రకటించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో 225 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ పవర్, వాటర్ రీసైక్లింగ్ యూనిట్లు, పునరుద్ధరించిన నిజాం కాలం నాటి ఆలుగడ్డ బావిని మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి, మహారాష్ట్రలో గుడిపడవ పండుగల కానుకగా అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ఈ ఏడాది రూ.4 వేల కోట్లు ఆదా అయినట్లు మంత్రి చెప్పారు. ప్రతి రైల్వే స్టేషన్లో సోలార్ పవర్ యూనిట్‌ను ప్రారంభిస్తాం. ఆలుగడ్డబావి వంటి నీటి వనరులను పునర్వినియోగంలోకి తేవడంతో పాటు, వాటర్ రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా ద.మ.రైల్వేలో ఏటా రూ.2.5 కోట్లు ఆదా అవుతుంది. రాష్ట్రంలో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు రైల్వే స్థలాల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. లింగంపల్లిలో రెండు రైళ్లకు హాల్టింగ్... ప్రయాణికుల కోరిక మేరకు ముంబై–భువనేశ్వర్ (11019/11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–పుణే ఎక్స్‌ప్రెస్ (17014/17013) రైళ్లను లింగంపల్లి స్టేషన్లో హాల్ట్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. భద్రాచలం రోడ్డు నుంచి భద్రాచలంటౌన్ వరకు రైల్వేలైన్ నిర్మించాలని దత్తాత్రేయ కోరారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపట్ల ఎంపీ కవిత సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో పెద్దపల్లి–నిజామాబాద్ రైలును రిమోట్ ద్వారా ప్రారంభిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు. చిత్రంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీలు మల్లారెడ్డి, జితేందర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు -
‘డబుల్’ ఇళ్లకు రైల్వే భూమి ఇవ్వండి
రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కోరిన మంత్రి కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పరిధిలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభును మంత్రి కె.తారక రామారావు కోరారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లతో కలసి కేటీఆర్ గురువారం ఇక్కడి రైల్వే భవన్లో ప్రభుతో సమావేశమయ్యారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే టెర్మినళ్ల విస్తర ణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ భూమి బదలాయింపునకు అభ్యర్థించడంతో.. దానికి బదులుగా డబుల్ బెడ్రూం ఇళ్లకు అవసరమైన 32 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్రానికి కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభు.. భూమి బదలాయింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉప్పల్–వరంగల్ స్కైవేకు ఆర్థిక సాయం చేయండి.. రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్–వరంగల్ రహదారి మార్గంలో రూ.1,300 కోట్లు వెచ్చించి స్కైవే నిర్మాణానికి నిర్ణయించిందని, భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కేటీఆర్ కోరారు. దిల్సుఖ్నగర్, ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో రహదారులు, బెంగళూరు మార్గంలో ఎయిర్పోర్ట్, ఆరాంఘర్ చౌరస్తా రహదారుల అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారం పది రోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని గడ్కారీ హామీ ఇచ్చారు. అనంతరం ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపెరల్ పార్క్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. మింట్ పత్రిక ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్, మొబైల్ గవర్నెన్స్, డిజిటల్ లావాదేవీలకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు
వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సాక్షి, విశాఖపట్నం/రైల్వేస్టేషన్ (విజయవాడ): ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన స్టేషన్ పునరభివృద్ధి (రీ–డెవలప్మెంట్) ప్రాజెక్టును రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నం, విజయవాడ స్టేషన్లు కూడా ఉన్నాయి. విశాఖ స్టేషన్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. -
25న కమాక్యా–బెంగుళూరు రైలు ప్రారంభం
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ నెల 25వ తేదీన కమాక్యా–బెంగళూరు కాంట్ హంసఫర్ వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (02504) 25న మధ్నాహ్యం 12.15 నిమిషాలకు కమాక్యాలో బయలుదేరి 27 సాయంత్రం 5 గంటలకు బెంగళూరు చేరుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 10.55 గంటలకు విజయవాడ చేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కమాక్యాకు చేరుకుంటుంది. తిరిగి కమాక్యాలో మంగళవారం రాత్రి 8.10 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 7.45 గంటలకు విజయవాడకు, గురువారం రాత్రి 9.15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. -
'హైస్పీడ్ రైలు అధ్యయనంలో విజయవాడను చేర్చండి'
న్యూ ఢిల్లీః ప్రతిపాదిత మైసూర్-బెంగళూరు-చెన్నై రైల్వే కారిడార్ మార్గంపై అధ్యయనాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరానికి పొడిగించాలని భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు జర్మన్ రవాణా మంత్రి అలెగ్జాండర్ డాబ్రింట్‌ను కోరారు. భారత రైల్వే మంత్రి అభ్యర్థన మేరకు జర్మన్ రవాణా మంత్రి మూడు రోజుల పర్యటన నిమిత్తం మన దేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి సంబంధించి ఇరు దేశాల మధ్య పలు కీలక చర్చలు శుక్రవారం ఇక్కడి రైల్వే భవన్లో సాగాయి. ఏప్రిల్ 2016లో సురేష్ ప్రభు జర్మనీలో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య రైల్వే రంగంలో సహకారానికి ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో అలెగ్జాండర్ డాబ్రింట్ మన దేశానికి వచ్చారు. రైళ్ల వేగం పెంచడం, ప్రయాణికులు, వస్తువుల రవాణా లైన్ల సామర్థ్యాన్ని పెంచడం, హైస్పీడ్ రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. దేశ రైల్వే మంత్రి సురేష్‌ప్రభు సూచనల మేరకు భారత రైల్వేలో ప్రమాద రహిత మిషన్ లక్ష్యంగా రైలు సేవల్లో భద్రత అంశంపై ఇరు దేశాల మధ్య సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే గంటకు మూడు వందల కిలోమీటర్లకు పైబడి వేగం గల హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటుపై జర్మనీ రైల్వే విభాగం అధ్యయనం చేయాలని గతంలో భారత రైల్వే శాఖ ప్రతిపాదించింది. మైసూరు-బెంగళూరు-చెన్నై కారిడార్‌లో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు ఈ అధ్యయనం ఉద్దేశించింది. అయితే ఈ ప్రతిపాదనలో కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడను కూడా చేర్చాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తాజాగా జర్మనీ మంత్రిని కోరారు. మైసూరు-బెంగళూరు, చెన్నై-విజయవాడ కారిడార్ వల్ల ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించడమే కాకుండా దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలు అనుసంధానమవుతాయని సురేష్ ప్రభు అభిలషించారు. అధ్యయనంలో విజయవాడను కూడా చేర్చాలన్న తాజా ప్రతిపాదనను విన్న జర్మనీ మంత్రి సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ అధ్యయనం 2017 జనవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ అధ్యయనానికి వ్యయాన్ని జర్మనీ ప్రభుత్వం భరిస్తుంది. -
ఎంపీ మిథున్‌రెడ్డి కృషి వల్లే ఆర్యూబీ
రాజంపేటః రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి వల్లే రాజంపేటకు ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) మంజూరైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్యూబీ నిర్మిత ప్రదేశాన్ని పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనరు పోలా శ్రీనువాసులరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాయల్లారెడ్డితో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ ఈ యేడాది రైల్వే బడ్జెట్ నిర్వహించిన క్రమంలో రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్పందించి ఆర్యూబీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. రైల్వే , ఆర్అండ్బీ అధికారులు సమన్వయంగా త్వరితగతిన ఆర్యూబీని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్యూబిని మంజూరు చేసి నిర్మించడం వల్ల రాయచోటి–రాజంపేట మార్గంలో రాకపోకలు సులభతరంగా కొనసాగుతున్నాయన్నారు. అలాగే రాజంపేటకు కేంద్రీయ విద్యాలయంను తీసుకురావడంలో ఎంపీ మిథున్‌రెడ్డి కృషిని ఆయన గుర్తు చేశారు. ఇలా రాజంపేటకు అభివృద్ధికి తన వంతుగా ఎంపీ కృషి చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి పథకాలను తామే తీసుకొచ్చినట్లుగా ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏనాడైనా ఢిల్లీకి వెళ్లి ఈ పథకాల గురించి మంత్రులను కలిసారా అని ప్రశ్నించారు. . -
రైల్వేలో రూపాయి అవినీతికీ తావివ్వం
సాక్షి, హైదరాబాద్: రైల్వేశాఖలో ఒక్క రూపా యి అవినీతికి కూడా తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. రైల్వేను గొప్ప సంస్థగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఉద్యోగులు బాసటగా నిలవాలని కోరా రు. సోమవారం ఉదయం ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ), కాజీపేట-ముంబై తడోబా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లను, నిజామాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రెండు లిఫ్టులను రిమోట్ ద్వారా ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని నాగులపల్లి స్టేషన్-ఢిల్లీలోని తుగ్లకాబాద్ మధ్య కార్గో ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)ను సికింద్రాబాద్ స్టేషన్ నుంచే ప్రారంభించారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రైల్వేకు విపరీతంగా పెరుగుతున్న నిర్వహణ వ్యయం పెద్ద సమస్యగా మారింది. ఈ దశలో ఖర్చును నియంత్రించే చర్యలు చేపట్టడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిం చాలి. అందుకే సంస్కరణల దిశగా సాగుతున్నాం’’ అని అన్నారు. తాను ఇక దక్షిణాదిలో రైల్వే విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. రైల్వే స్థలాల్లో ఉన్న చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించి ఆ నీటిని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ పొదుపు చర్యల వల్ల ఇటీవల రూ. 3,500 కోట్ల పొదుపు సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలిచే క్రమంలో నాగులపల్లి, చర్లపల్లి స్టేషన్లలో భారీ హరిత టెర్మినళ్లను నిర్మించనున్నట్లు ప్రభు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హన్సరాజ్ గంగారామ్ అహిర్, బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయి ని నర్సింహారెడ్డి మహేందర్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. రైల్వేకు స్వర్ణయుగం తేవాలి అంతకుముందురైల్ కళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాల్లో సురేశ్ ప్రభు పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల విషయంలో ఉద్యోగులు చూపే ఉత్సాహాన్ని రైల్వే కు స్వర్ణయుగం తేవటంలోనూ చూపాలన్నా రు. కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూని యన్ ప్రతినిధులు శివగోపాల్ మిశ్రా, శంకరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నిరసన నినాదాలతో హోరెత్తించారు. -
రైలు ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధుల డుమ్మా
సమాచారం ముందుగా ఇవ్వలేదని ఆగ్రహం రైల్వే, రాష్ట్ర అధికారుల మధ్య పొరపచ్చాలు విజయవాడ : రైలు ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు పలువురు డుమ్మాకొట్టారు. విజయవాడ - ధర్మవరం (17215నంబరు) రైలును మంగళవారం న్యూఢిల్లీ నుంచి రిమోట్ వీడియో లింకు ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఆ రైలుకు విజయవాడలో రైల్వే జీఎం ఆధ్వర్యంలో అధికారులు పచ్చజెండా ఊపి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు రైల్వేస్టేషన్లో ఎంతో ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఇప్పటి వరకు రైళ్లు మంజూరు చేయలేదని తప్పుబట్టిన తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు కొత్త రైలు ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మాకొట్టారని రైల్వే వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్ విజయవాడ నుంచి రాయలసీమవైపు బయలుదేరే రైళ్లు కావాలని ఈ ప్రాంత ప్రయాణికులు అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. వారు కోరుకున్నట్లుగానే విజయవాడ నుంచి రాయలసీమకు వైపు వెళ్లేలా విజయవాడ - ధర్మవరం రైలును రైల్వేమంత్రి సురేష్ ప్రభు మంజూరు చేశారు. ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తరువాత రాష్ట్రానికి మంజూరు చేసిన రెండో రైలు ఇది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగుల కోసం గత నెలలో అమరావతి- సికింద్రాబాద్ మధ్య కొత్త రైలును మంజూరు చేసిన విషయం విదితమే. రైల్వే, రాష్ట్ర యంత్రాంగం మధ్య పొరపచ్చాలు.... పుష్కరాల పేరుతో మంత్రులు, జిల్లా అధికార యంత్రాంగం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటే తాము ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటూ జిల్లా యంత్రాంగం, మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలను రైల్వే తోసిపుచ్చుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు చివర్లో ఉన్న స్థలాన్ని బలవంతంగా తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులు ప్రయత్నిస్తే రైల్వే అధికారులు అడ్డుకున్నారు. పుష్కర ఘాట్ల నిర్వహణలో జిల్లా, రైల్వే అధికారుల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే మంత్రులు కొత్త రైలు ప్రారంభోత్సవానికి డుమ్మాకొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కరోజు ముందే పిలిచారని... కొత్త రైలు మంజూరు చేసిన విషయం రైల్వే అధికారులకే ఆలస్యంగా అందింది. దీంతో అప్పటికప్పుడు కార్యక్రమాన్ని నిర్ణయించుకుని రాష ్టమ్రంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ మండలిబుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)తో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి పేర్లతో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఒక్క రోజు ముందుగా తమకు తెలపడమేమిటంటూ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహించి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని సమాచారం. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య రైలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరైన మంత్రులు, తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు సీఎం విదేశీ పర్యటనలో ఉండటంతో తమతమ పనుల్లోబిజీబిజీగా ఉండీ ఈ కార్యక్రమానికి రాలేదని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. -
ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణకు కృషి చేస్తా
- ఆ చట్ట సవరణకు ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకువస్తా - రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ప్రమాణ స్వీకారం సాక్షి, న్యూఢిల్లీ: లోప భూయిష్టంగా ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం పకడ్బందీగా అమలయ్యేందుకు వీలుగా చట్ట సవరణకు కృషి చేస్తానని వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు, విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. మొదటి సభ్యుడినవడం సంతోషం ప్రమాణ స్వీకారం అనంతరం విజయసాయిరెడ్డి పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడారు. ‘‘మొట్టమొదటిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రవేశిస్తుండటం.. సభకు పార్టీ నుంచి మొట్టమొదటి సభ్యుడిగా అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సహకరించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వం అనేది ఒక అలంకారమైన పదవిగా నేను భావించడం లేదు. ప్రజల ఆకాంక్షలను, ఆశలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి చేస్తానని విన్నవించుకుంటున్నా. రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా. ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం, పారిశ్రామిక కారిడార్, 13వ షెడ్యూలులో పొందుపరిచిన ప్రతి అంశం పార్లమెంటులో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషిచేస్తాను. భారత దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య ఫిరాయింపులు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు వేరే పార్టీకి మారడం చట్ట విరుద్ధమని అందరికీ తెలుసు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో చర్యలకు ఒక కాలపరిమితి లేనందున స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఫిరాయింపుల చట్టానికి సవరణ తెచ్చేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాను. ఈ సెషన్లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రాజ్యసభ సభ్యుడిగా నా వంతు కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మంగళవారం మధ్యాహ్నం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
హైదరాబాద్- విజయవాడ సూపర్‌ఫాస్ట్
- ఉద్యోగులకు ప్రత్యేక రైలు - 14 బోగీలు, ఒకటే స్టాప్ - ఐదున్నర గంటల్లో గమ్యం సాక్షి, విజయవాడ: హైదరాబాద్, విజయవాడ మధ్య రైల్వే శాఖ సూపర్‌ఫాస్ట్ రైలును ప్రవేశపెడుతోంది. ఈ రైలును విజయవాడలో 20వ తేది రాత్రి 8.30 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభిస్తారని రైల్వే ఏసీఎం రాజశేఖర్ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ రైలు వెలగపూడిలోని తాత్కాలిక రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల పనివేళలకు అనుకూలంగా ఉంటుంది. విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో ఉద్యోగులకు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు వేళలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ రైలులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఐదున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. గుంటూరులో ఒకటే స్టాప్.. విజయవాడ-సికింద్రాబాద్ (నెం: 12795) రైలు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, సాయంత్రం 6.20 గంటలకు గుంటూరుకు, రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-విజయవాడ (నెం: 12796) రైలు ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి 10.08 గంటలకు గుంటూరుకు, 11 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ రైలు గుంటూరులో రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. వారంలో ఆదివారం మినహా మిగతా 6 రోజులు ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం 14 బోగీలు ఉండగా.. రెండు ఎస్ఎల్ఆర్, రెండు ఏసీ చైర్‌కార్, 10 సీటింగ్ ఉంటాయి. ఉదయం పూట నడిచే రైళ్లు కావడంతో బెర్త్‌లు ఉండవు. మొత్తం రైలంతా సీటింగే ఉంటుందని రాజశేఖర్ తెలిపారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతోపాటు పలువురు ప్రముఖులు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మురళీమోహన్, టీటీడీ చైర్మన్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అశోక్‌లేలాండ్ కంపెనీ ఎండీ వినోద్ కే దాసరి స్వామిని దర్శించుకుని రూ.18 లక్షల విలువ చేసే లారీని టీటీడీకి విరాళంగా అందజేశారు. -
సురేష్ ‘ప్రభు’ కరుణించేనా?
► నేడు ముఖ్యమంత్రితో భేటీ ► సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ► రాజధానికి రైలుమార్గం, ప్రత్యేక జోన్, పుష్కరాలకు నిధులు ప్రధానాంశాలు సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్న రైల్వే మంత్రి సురేష్ ‘ప్రభు’ తొలిసారిగా శనివారం రాష్ట్ర రాజధాని విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా తనను రాజ్యసభకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమవుతారు. కొత్త రాష్ట్రం ఏర్పడి రెండు రైల్వేబడ్జెట్‌లు గడిచిపోయినా ఈ ప్రాంతానికి ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులు ఏమీ మంజూరు కాలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన అధికారపార్టీ ఎంపీలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చేందుకు టీడీపీ-బీజేపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిరకాల వాంఛగా రైల్వే జోన్.. ఈస్ట్‌కోస్ట్ రైల్వే నుంచి విశాఖపట్నం డివిజన్‌ను, దక్షిణ మధ్య రైల్వే నుంచి విజయవాడ డివిజన్‌ను విడదీసి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ కావాలనే డిమాండ్ ఈ ప్రాంత వాసుల నుంచి అనేక సంవత్సరాలుగా వస్తోంది. రాజధానికి కొత్త రైల్వే మార్గం .. విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి 67 కి.మీ. నూతన రైలు మార్గం ఏర్పాటుకు ఇప్పటికే రైల్వే అధికారులు సర్వే పూర్తిచేశారు. ఈ నూతన రైలు మార్గాన్ని నిర్మిస్తామని రైల్వే మంత్రి శనివారం నగరానికి వచ్చిన సందర్భంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆన్లైన్ ద్వారా ఈ రైల్వేమార్గానికి ప్రారంభోత్సవం చేయించాలనే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలిసింది. డబుల్ డెక్కర్ రైళ్లు.. విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం- సికింద్రాబాద్ వయా విజయవాడ మీదగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు ఇప్పటికే ట్రయిల్ రన్‌ను అధికారులు పూర్తిచేశారు. కేవలం రైల్వే బోర్డు నుంచి అనుమతులు వస్తే ఈ రైళ్లు నడిచే అవకాశం ఉంది. పుష్కరాలకు పుష్కలంగా నిధులు.. పుష్కరాలకు ఇప్పటికే రూ.14 కోట్లతో రైల్వేశాఖ పుష్కర పనుల్ని ప్రారంభించింది. 600 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా గుణదల, రాయనపాడు, కొండపల్లి, రామవరప్పాడు స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా ప్రకటించి పుష్కరాలకు వీటి అభివృద్ధికి నిధులు కావాలని కోరే అవకాశం ఉంది. దీనివల్ల ప్రధాన స్టేషన్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. -
ప్రభు స్పందించాడు! 20 నిమిషాల్లోనే సాయం!!
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వేమంత్రి సురేశ్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తన కొడుకును ఆదుకోవాలంటూ ఓ తండ్రి ట్విట్టర్లో చేసిన విజ్ఞప్తికి.. 20 నిమిషాల్లోనే స్పందించి, సాయమందించి మరోసారి ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకున్నారు. @sureshpprabhu @RailMinIndia need medical attention..One of the child 6yrs old fell off upper seat..cut back of the head — Bibhuti (@goneinseconds) 31 March 2016 మార్చి 31న న్యూఢిల్లీ నుంచి వైష్ణో దేవీ ఆలయానికి తన కుటుంబంతోపాటు బిభూతి రైల్లో బయలుదేరి వెళ్లారు. అయితే, ప్రయాణిస్తుండగా అప్పర్ బెర్తు నుంచి తన ఆరేళ్ల కొడుకు కిందపడి.. తల వెనుకభాగంలో తెగిన గాయమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో సురేశ్ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖలకు ట్యాగ్ చేస్తూ వెంటనే ట్వీట్ చేశారు బిభూతి. తన కొడుకుకు రక్తస్రావం జరుగుతోందని, వెంటనే సాయమందించాలని వేడుకున్నాడు. కనీసం బ్యాండేజ్ అయినా అందించాలని ప్రార్థించాడు. కేవలం 20 నిమిషాల్లోనే ఆయన ట్వీట్‌కు స్పందన లభించింది. రైల్వేమంత్రిత్వశాఖ బిభూతికి సాయమందించేందుకు ముందుకొచ్చింది. ఆయన ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందిగా కోరింది. తదుపరి స్టేషన్ లుధియానాలో ఆ బాలుడికి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి తన బిడ్డకు సత్వరమే వైద్యసాయమందినందుకు బిభూతి రైల్వే మినిస్ట్రీకి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపాడు. @sureshpprabhu @RailMinIndia it's bleeding..pls help..atleast bandage — Bibhuti (@goneinseconds) 31 March 2016 @sureshpprabhu @RailMinIndia I am thankful to all of you for providing medical facility to my son in quickest possible time. Awesome support — Bibhuti (@goneinseconds) 31 March 2016 నిజానికి గోయింగ్ ఇన్ సెకండ్స్ పేరిట ట్విట్టర్లో ఖాతా కలిగిన బిభూతి అంతకుముందు రైల్వేమంత్రిత్వశాఖను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. తాము ప్రయాణిస్తున్న రైల్లో టాయ్‌లెట్ సరిగ్గా లేదని, దోమలు కుడుతున్నాయని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కూడా రైల్వేశాఖ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించింది. ఇటీవల ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు రైల్వేశాఖ వెంటనే స్పందిస్తున్నది. గత ఫిబ్రవరిలో ఓ జంట తమ బిడ్డ రైల్లో తప్పిపోయిందని ఫిర్యాదు చేయగా.. వారి బిడ్డను తిరిగి వారికి చేర్చడంలో సాయపడింది. అలాగే ఇతన విజ్ఞప్తుల విషయంలోనూ రైల్వేశాఖ సహకారమందిస్తుండటంతో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్నారు. -
విశాఖ రైల్వే జోన్‌ను ఏం చేశారు?
రైల్వే మంత్రికి మేకపాటి ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్‌ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం వివిధ పార్టీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వగా ముందుగా నలుగురైదుగురు సభ్యులు మాట్లాడారు. అప్పటికే ఆలస్యం కావడంతో స్పీకర్ ఇక ఇంతటితో ముగిద్దామని ప్రకటించారు. ఈ సమయంలో నెలకొన్న గందరగోళంలోనే మేకపాటి రైల్వే మంత్రిని ప్రశ్నించారు. -
అది సామాన్యుల బడ్జెట్
రైల్వే బడ్జెట్‌పై మంత్రి సురేశ్‌ప్రభు ♦ రైల్వే వృద్ధి కోసం మూడంచెల వ్యూహం న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్న విపక్షాల ఆరోపణలను రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తిప్పికొట్టారు. బడ్జెట్ సామాన్యుల కోసమే రూపొందించిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం సేవల మెరుగు, ఆదాయ సమీకరణ, వ్యయ నియంత్రణ అనే మూడంచెల వ్యూహాన్ని అమలుచేస్తామన్నారు. రైల్వేస్టేషన్లలో స్టాళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తామన్నారు. బుధవారం లోక్‌సభలో రైల్వేబడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. రైల్వేలో రిక్రూట్మెంట్కు ఆన్లైన్ పరీక్ష పద్ధతి తెచ్చామన్నారు. ప్రయాణ, రవాణా చార్జీల నుంచి మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీల సవరణల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎప్పుడు ధరలు పెంచినా ధరల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయని, అందువల్ల దీన్ని నివారించేందుకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైల్వే రెగ్యులేటరీ అథారిటీ పేరును ‘రైల్వే డెవలప్మెంట్ అథారిటీ’గా మార్చాలనుకుంటున్నామని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో చేపడతామన్నారు. దీనికయ్యే మొత్తాన్ని 0.1 శాతం నామమాత్ర వడ్డీతో రుణమిచ్చేందుకు జపాన్ అంగీకరించిందన్నారు. జాట్ ఆందోళనల వల్ల రైల్వేకి రూ.55.92 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. చర్చ తర్వాత రైల్వే బడ్జెట్ సంబంధ ద్రవ్యవినియోగ బిల్లులను, గ్రాంట్స్ డిమాండ్లను సభ ఆమోదించింది. జాతీయ జలరవాణా బిల్లుకు ఆమోదం 111 నదీమార్గాల్లో జలరవాణాను పెంచేందుకు ఉద్దేశించిన జాతీయ జలరవాణా బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. . బిల్లుకు లోక్‌సభ గత ఏడాదే ఆమోదం తెలిపింది. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచం
స్పష్టం చేసిన రైల్వే మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 110 కి.మీ. వేగంతో పయనిస్తుందని, ప్రయాణ సమయాన్ని కుదించడం సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమాధానమిచ్చారు. ఈ రైలు పేరును రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా గానీ, దురంతో ఎక్స్‌ప్రెస్‌గా గానీ మార్చడం వీలుపడదని తేల్చి చెప్పారు. ఏపీలోని ప్రధాన పట్టణాలను దేశ రాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్ట్‌లతో నడుస్తోందని, అందువల్ల వేగం పెంచడం, హాల్ట్‌లు కుదించడం సాధ్యపడదని వివరించారు. నాన్-ఏసీ బోగీలను కలపాలన్న వినతులు కూడా వచ్చాయని, అయితే 2014-15 బడ్జెట్లో ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించిన నేపథ్యంలో మార్చలేమని చెప్పారు. -
రిజర్వేషన్ ప్రయాణికులకు 3 రైళ్లు
♦ హమ్‌సఫర్, తేజస్, ఉదయ్‌గా నామకరణం ♦ అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ♦ దూరప్రాంత రైళ్లలో 2-4 దీన్ దయాళ్ అన్రిజర్వ్డ్ బోగీలు ♦ రైల్వే బడ్జెట్ ప్రసంగంలో సురేశ్ ప్రభు ప్రకటన న్యూఢిల్లీ రిజర్వేషన్ ప్రయాణికుల సౌకర్యం, సంతృప్తికి పెద్దపీట వేస్తూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో మూడు రైళ్లను ప్రకటించారు. హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ పేరిట ఈ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ‘‘ప్రతి వినియోగదారుడు మా బ్రాండ్ అంబాసిడర్. మా (రైల్వే) ఉనికికి కారణం వారే. అందుకే అతను/ఆమె ప్రయాణించే ప్రతిసారీ వారి ప్రయాణ సంతృప్తి పెరగాలి. రైలు ప్రయాణాన్ని సంతోషించదగ్గదిగా చేసేందుకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కొనసాగిస్తూనే ఉంటాం. ఏటా రైళ్లలో ప్రయాణించే 700 కోట్ల మంది ప్రయాణికుల్లో ప్రతిఒక్కరి సంతృప్తి కోసం నిరంతరం శ్రమిస్తాం’’ అని సురేశ్ ప్రభు చెప్పారు. రిజర్వేషన్ ప్రయాణికుల కోసం... ► హమ్‌సఫర్: పూర్తిగా థర్డ్ ఏసీ సర్వీసు. కోరుకున్న ప్రయాణికులకు భోజన సదుపాయం. ► తేజస్: దేశ రైలు ప్రయాణ భవిష్యత్తును చాటిచెప్పేలా గంటకు 130 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కవ వేగంతో ప్రయాణం. రైల్లో వినోదం, స్థానిక రుచులు, వైఫై సేవలు. ► ఉదయ్: అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రిపూట నడిచే ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ (ఉదయ్) ఎక్స్‌ప్రెస్. ప్రయాణికుల తరలింపు సామర్థ్యాన్ని 40% వరకు పెంచగల సామర్థ్యం దీనికి ఉంది. టారిఫ్, టారిఫ్యేతర చర్యల ద్వారా హమ్‌సఫర్, తేజస్‌ల ఖర్చును తిరిగి రాబడతారు. అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం... ► సామాన్యుల కోసం దూరప్రాంతాలకు పూర్తిగా అన్రిజర్వ్డ్ బోగీలతో అంత్యోదయ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. రద్దీ మార్గాల్లో అందుబాటులో సేవలు. ► ఎక్కువ మంది అన్రిజర్వ్డ్ ప్రయాణికులకు చోటు కల్పించేందుకు వీలుగా దూరప్రాంత రైళ్లలో రెండు నుంచి నాలుగు వరకు దీన్ దయాళ్ బోగీలు. ► ఈ బోగీల్లో అందుబాటులోకి తాగునీరు, మరిన్ని మొబైల్ చార్జింగ్ పాయింట్లు. రైల్వే పుష్టికి ‘సప్త’ పది.. న్యూఢిల్లీ: రైల్వే వ్యవస్థను మరింత సమర్థంగా తయారుచేసేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్లో ఏడు లక్ష్యాలను ప్రకటించారు. అవేంటంటే.. మిషన్ రఫ్తార్: సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం దీని ఉద్దేశం. వచ్చే ఐదేళ్లలో సూపర్ ఫాస్ట్ మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ల సగటు వేగాన్ని గంటకు 25 కి.మీ మేర పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యం. మిషన్ 25 టన్నులు: సరుకు రవాణా సామర్థ్యం పెంచి అధిక ఆదాయం ఆర్జించడం దీని ఉద్దేశం. 2016-17లో 25 టన్నుల యాక్సిల్ లోడ్ వ్యాగన్ల ద్వారా 10-20% సరుకును రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టారు. 2019-20 నాటికి 70% సరుకును ఈ వ్యాగన్ల ద్వారా రవాణా చేయాలి. మిషన్ 100: సైడ్ ట్రాక్‌లు, సరుకు రవాణా కేంద్రాల సంఖ్య పెంచడం దీని లక్ష్యం. ప్రస్తుతం వివిధ చోట్ల వీటి ఏర్పాటుకు 400 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో రెండేళ్లలో వంద సైడింగ్స్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. మిషన్ జీరో యాక్సిడెంట్: రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడం దీని లక్ష్యం. వచ్చే రెండుమూడేళ్లలో కాపలా లేని క్రాసింగ్‌లు లేకుండా చేస్తారు. రైళ్లు ఢీకొనకుండా ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తారు. మిషన్ పేస్(ప్రొక్యూర్మెంట్ అండ్ కన్జప్షన్ ఎఫిషియెన్సీ): రైల్వే పరికరాల కొనుగోలు, సేవల్లో నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. దీనిద్వారా 2016-17లో రూ.1,500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిషన్ బియాండ్ బుక్-కీపింగ్: రైల్వేలో ఖాతాల తనిఖీని పక్కాగా నిర్వహించడం దీని ఉద్దేశం. మిషన్ కెపాసిటీ యుటిలైజేషన్: 2019నాటికల్లా సిద్ధం కాబోయే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా రవాణా కారిడార్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని అధిక ఆదాయం ఆర్జించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు.. న్యూఢిల్లీ: రైల్వేలోని ప్రధానమైన ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు అడ్రోన్లు, జియో స్పేసియల్ శాటిలైట్ వ్యవస్థను వినియోగించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు సాంకేతికతపై ఆధారపడకూడదని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. అలాగే సరుకు రవాణా కారిడార్ పురోగతిని సమీక్షించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ విధానాన్ని వినియోగిస్తామని ప్రకటించారు. పర్యాటకం ప్రాముఖ్యత రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆయా రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలతో ఓ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి దీన్ని నేషనల్ రైల్ మ్యూజియంతో అనుసంధానం చేసి.. యునెస్కో ద్వారా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. ఈ సర్క్యూట్ ప్యాకేజీలో జాతీయ జంతువైన పులులుండే అభయారణ్యాలైన కన్హా, పెంచ్, బాంధవ్గఢ్లను కలపనున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కేంద్రం ఆరోగ్య శాఖతో ఒప్పందం కుదుర్చుకుని రైల్వే ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేయనున్నాయి. దీని ద్వారా రైలు ప్రయాణికులకు దారి పొడవునా ఎక్కడైనా అత్యవసర వైద్యసేవలందేలా చొరవతీసుకుంటారు. గ్యాంగ్మెన్లకు రక్షక్ పథకం పేరుతో.. ప్రత్యేక సదుపాయాలు కల్పించటం, ట్రాక్ రక్షణ (పెట్రోలింగ్)లో వీళ్లు వాడే పరికరాల బరువు తగ్గించేందుకు ఏర్పాట్లు. వినియోగదారుల సేవలో.. ప్రధాన వ్యాపార భాగస్వాములతోపాటు చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతి జోనల్ రైల్వే పరిధిలో కస్టమర్ కమిట్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వ్యాగన్లను లీజుకు ఇచ్చే వ్యవస్థను సులభతరం చేయనున్నారు. యువత కోసం.. ప్రతి ఏడాది వందమంది ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆహ్వానం పలికి 2-6 నెలలపాటు ఇంటర్న్న్షిప్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని రైల్వే పరిధిలో స్కిల్ డెవలప్మెంట్కు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యుత్, నీటిని ఆదా చేసేందుకు.. శక్తి వినియోగాన్ని 10 నుంచి 15 శాతం తగ్గించాలనే లక్ష్యంతోపాటు విద్యుత్‌ను ఆదా చేసేందుకు వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను ఎల్ఈడీ లైట్లతో ముస్తాబు చేయనున్నారు. ► రైళ్లు, రైల్వే స్టేషన్లో నీటి వినియోగాన్ని అవసరమైనంతమేరకే పరిమితం చేసి.. వృథాను అరికట్టేందుకు ఏర్పాట్లు. 2వేలకు పైగా రైల్వే స్టేషన్లలో వర్షపునీటిని సద్వినియోగపరుచుకునేలా ఏర్పాట్లు చేసేందుకు నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ► గిర్డర్ బ్రిడ్జెస్లో స్టీల్ స్లీపర్స్‌కు బదులుగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే రీసైకిల్ ప్లాస్టిక్‌తో చేసిన స్లీపర్స్‌ను వినియోగించాలని నిర్ణయం. ► భవిష్యత్తులో 32 స్టేషన్లు, 10 కోచింగ్ డిపోల్లో నీటి రీసైక్లింగ్ డిపోలను ఏర్పాటుచేయటం. మొబైల్ యాప్స్.. టికెటింగ్ సమస్యలు, ఫిర్యాదులు-సూచనలకోసం రెండు యాప్‌లను రూపొందించటం. రైలు మిత్ర సేవ... కొంకణ్ రైల్వేలో వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఉన్న ‘సారథి సేవ’ను బలోపేతం చేయటంతోపాటు రైలు మిత్ర సేవ పేరుతో దేశవ్యాప్తంగా అమలుచేయ టం. దీని ద్వారా బ్యాటరీ ఆధారిత కారు, పోర్టర్ సేవలను విస్తృత పరచటం. సాంకేతికంగా స్టేషన్లను ఆధునీకరించి.. రెండువేల స్టేషన్లలో 20వేల స్క్రీన్స్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయటం ఇందులో భాగం. దివ్యాంగుల కోసం.. దివ్యాంగులకు అన్ని సౌకర్యాలుండేలా స్టేషన్ల ఆధునీకరణ. ఏ1 క్లాసు స్టేషన్లలో దివ్యాంగులను టాయిలెట్ తీసుకెళ్లేందుకు సహాయకుల ఏర్పాటు. ప్రయాణ బీమా బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు ప్రయాణ బీమా కల్పించేలా ఏర్పాటు. ట్రెయిన్ నం. 2016 బడ్జెట్ బండిలో ఏముందంటే..? రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్లో అన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు యత్నించినట్లు కనిపించింది. ప్రధాని మోదీ మానసపుత్రికలైన ‘స్వచ్ఛభారత్’, ‘డిజిటల్ ఇండియా’కు బడ్జెట్లో పెద్దపీట వేశారు. మౌలిక వసతులకూ ప్రాధాన్యం ఇచ్చారు. చిరు వ్యాపారులకు కస్టమర్ కేంద్రం నుంచిప్రయాణికులకు బీమా వరకు పలు కొత్త కార్యక్రమాలను ప్రతిపాదించారు. ఆ విశేషాలేమిటంటే.. యాత్రాస్థలాలను కలుపుతూ... ► అజ్మీర్, అమృత్సర్, బిహార్ షరీఫ్, చెంగనూర్, ద్వారక, గయ, హరిద్వార్, మథుర, నాగపట్నం, నాందేడ్, నాసిక్, పాలి, పారస్నాథ్, పూరి, తిరుపతి, వైలకన్ని, వారణాసి, వాస్కో వంటి యాత్రాస్థలాలను కలుపుతూ ‘ఆస్థా సర్క్యూట్’ను ప్రారంభించటంతోపాటు.. ఆయా రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ► పోర్టర్లకు కొత్త యూనిఫామ్‌లను సమకూర్చటంతోపాటు వారికి సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పించి సహాయకులుగా పిలవనున్నారు. ► జపాన్ ప్రభుత్వ సహకారంతో అహ్మదాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు. దీని ద్వారా భారతీయ రైల్వే సాంకేతికంగా పురోగతి సాధించటంతోపాటు తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ► రైళ్లలో వినోదాన్ని అందించేందుకు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఆహ్వానించటం, అన్ని భారతీయ భాషల్లో ‘రైలు బంధు’ను అన్ని రిజర్వ్డ్ క్లాసులకు వర్తింపచేయటం. ► ‘క్లీన్ మై కోచ్’ సేవ ద్వారా ఎస్ఎంఎస్ పంపగానే.. బోగీని శుభ్రపరిచే వ్యవస్థ. ► హైటెక్ హంగులతో స్మార్ట్ కోచ్‌ల ఏర్పాటు ► సామాన్యుడికి లాభం చేకూర్చేలా పనిచేస్తున్న అన్ని రైల్వే స్టేషన్లలో రైలు ఆగేలా చర్యలు పెట్టుబడుల ‘సూత్ర’ం..ప్రభు మంత్రం న్యూఢిల్లీ: రైల్వే శాఖలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశ్లేషించి నిర్ణయించేందుకు ఆ శాఖ ఓ కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృం దంలోని ఉద్యోగులకు వేతనాలు, స్టార్టప్ కంపెనీల కోసం రైల్వే బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించింది. స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్, అనలిటిక్స్ (సూత్ర) పేరుతో ఓ బృందాన్ని నియమించినట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. సూత్రలో ప్రముఖ విశ్లేషకులు ఉంటారని చెప్పారు. రైల్వే శాఖకు ఏటా 100 టెరా బైట్ల సమాచారం వస్తుందని, అయితే దీన్ని వ్యాపారపరంగా విశ్లేషించి లబ్ధిపొందే పరి స్థితి ఇప్పటి వరకూ లేదన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సూత్ర కోసం కేటాయించిన నిధులు వినియోగిస్తామన్నారు. భారత రైల్వే ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలకు కొత్త ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు కనుగొంటామని పేర్కొన్నారు. రతన్ టాటా నేతృత్వంలో రైల్వేల పర్యవేక్షణకు ‘కాయకల్ప్’ అనే ఇన్నోవేటివ్ కౌన్సిల్‌ను సురేశ్ ప్రభు ఏర్పాటు చేస్తారు. దేశంలోని ప్రఖ్యాత పెట్టుబడిదారులు, జాతీయ రైల్వే అకాడమీ, రైల్వే బోర్డు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు ఈ కౌన్సిల్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని ప్రభు పేర్కొన్నారు. రైల్వే వర్క్‌షాప్‌లు, ఉత్పత్తి కర్మాగారాల్లోని సిబ్బంది సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా ప్రోత్సహించేందుకు ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్ డెవలప్మెంట్ అథారిటీ.. మెరుగైన సేవలు, పోటీ తత్వం పెంచటం, వినియోగదారుల హక్కులను కాపాడటం, సేవల్లో ప్రమాణాలు పాటించటం వంటి అంశాలపై భాగస్వామ్య పక్షాలతో చర్చించాక నిర్ణయం తీసుకోవటం. ► నవారంభ్, నవీనీకరణ్: రైల్వే బోర్డును పునర్వ్యవస్థీకరించటంతోపాటు బోర్డు చైర్మన్‌కు విశేషాధికారాలను కల్పించాలని నిర్ణయం. బోర్డులో దేశవ్యాప్త డెరైక్టరేట్లను ఏర్పాటుచేసి వెనకబడ్డ జోన్లలో లాభాలు తెచ్చే యత్నాలను ప్రోత్సహించటం. రైల్వేల్లో అధికారుల నియామకాలు చేపట్టడంతోపాటు రైల్వేల వ్యాపారం పెరిగేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించటం. ► సశస్తీకరణ్: రైల్వేల్లో దీర్ఘకాల(10 ఏళ్లు), మధ్యమ ప్రణాళికలను నిర్దేశించుకుని వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్‌ను స్థాపించటం. దేశవ్యాప్తంగా రైలు సేవలను మెరుగుపరిచేందుకు నేషనల్ రైల్ ప్లాన్‌ను రూపొందించుకోవటం. ► ఏకీకరణ్: రైల్వే శాఖ నిర్వహిస్తున్న అన్ని కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావటం. ► శోధ్ ఔర్ వికాస్: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేల అభివృద్ధి కోసం ప్రయోగాలు చేసేందుకు.. వ్యూహాత్మక సాంకేతికత, సమగ్రాభివృద్ధికి ప్రత్యేక రైల్వే వ్యవస్థ (శ్రేష్ఠ)ను ఏర్పాటుచేసుకోవటం ఇందులో భాగం. ప్రస్తుతమున్న ఆర్డీఎస్వో రోజువారీ విషయాలను చూసుకుంటే.. శ్రేష్ఠ దీర్ఘకాలిక అవసరాలపై దృష్టి సారిస్తుంది. ► విశ్లేషణ్: వ్యూహాత్మక పెట్టుబడులు, కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ (సూత్ర)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► నవ్చ్రన: సంస్థ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకోసం రూ. 50 కోట్ల మూలధనాన్ని సమకూర్చటం ఈ రైళ్లు యమా ఫాస్ట్... ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకెళ్లే రైళ్లు ఏయే దేశాల్లో ఉన్నాయి? అవి గంటకు ఎంత స్పీడుతో వెళ్తాయి? ఓ లుక్కేద్దామా? 430 కి.మీ షాంఘై మగ్లేవ్- చైనా లోంగ్యాంగ్లోని మెట్రోలైన్ స్టేషన్ నుంచి షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మధ్య ఈ రైలు దూసుకెళ్తుంది. ఏప్రిల్ 2004 నుంచి పట్టాల ‘పైన’ పరుగులు పెడుతోంది. 380 కి.మీ హార్మోనీ సీఆర్‌హెచ్- చైనా ఈ సూపర్‌ఫాస్ట్ రైలు బీజింగ్-షాంఘై మధ్య పరుగులు పెడుతుంది. 2010 అక్టోబర్‌లో పట్టాలెక్కింది. చైనాలోనే వుహాన్-గ్వాంగ్జో మధ్య కూడా ఈ రకానికి చెందిన రైలు నడుస్తుంది. 360 కి.మీ ఏజీవీ ఇటాలో- ఇటలీ యూరోప్‌లో అత్యంత అధునాతనమైన రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఇటలీలోని నపోలీ-రోమా- ఫిరెంజ్- బొలాగ్నా- మిలాన్ కారిడార్ మధ్య నడుస్తోంది. 2012 నుంచి ఇది సేవలు అందిస్తోంది. 350 కి.మీ సీమెన్స్ వెలారో ఇ-స్పెయిన్ ఇది స్పెయిన్‌లోని బార్సిలోనా-మాడ్రిడ్ మధ్య పరుగెడుతోంది. ఈ ట్రెయిన్‌ను తయారు చేసివ్వాలని స్పెయిన్ రైల్వే.. సీమెన్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. 2007 నుంచి ఈ రైలు పరుగులు తీస్తోంది. మన ‘బుల్లెట్’ ఎప్పుడో? దేశంలోనే తొలిసారిగా ముంబై-అహ్మదాబాద్ మధ్య (534 కి.మీ.) బుల్లెట్ రైలును కిందటి బడ్జెట్లో ప్రకటించారు. ఇది గంటకు 320 కి.మీ. వేగంతో ప్రయాణించనుంది. ఈ ప్రత్యేక కారిడార్ నిర్మాణానికి రూ.90 వేల కోట్లు అవసరమని అంచనా. ఈ చరిత్ర రైలు పట్టాలపై.. చరిత్రలో కొన్ని మరుపురాని సంఘటనలు ఉంటాయి. మరికొన్ని చరిత్రనే మలుపు తిప్పిన ఘటనలు ఉంటాయి! అలా రైల్వే కూడా చరిత్రపుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించింది. అలాంటి కొన్ని సంఘటనల సమాహారం.. 1893 అది జాత్యహంకారానికి పరాకాష్ట! నల్లవాడన్న ఒకే ఒక్కకారణంతో మహాత్మా గాంధీకి దక్షిణాఫ్రికాలో 1893లో జరిగిన అవమానం!! ఆ అవమానమే ఆయన్ను.. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించేలా చేసింది. డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లే రైల్లో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎక్కారంటూ గాంధీని పీటర్‌మారిట్జ్‌బర్గ్ వద్ద నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫాంపైకి తోసివేశారు. అలా ఆ రైలు ఘటన చరిత్రలో నిలిచిపోయింది! 1901 ‘‘నా జీవితంలో ఇకపై ఎప్పుడు రెలైక్కినా.. నిరుపేదలు వెళ్లే మూడో తరగతి కంపార్టుమెంటుల్లోనే ప్రయాణం చేస్తా...!’’ కలకత్తాలో కాంగ్రెస్ మహాసభల అనంతరం మహాత్మాగాంధీ తీసుకున్న గొప్ప నిర్ణయమిదీ! అన్నట్టుగానే బతికి ఉన్నంతకాలం దేశంలో రైల్లో ఎక్కడికి వెళ్లినా మూడో తరగతిలోనే ప్రయాణం చేశారు. చివరికి ఆయన చితాభస్మాన్ని కూడా అలహాబాద్‌కు మూడో తరగతిలోనే తరలించారు. 1947 రైల్లో జనం.. రైలుపైన జనం.. డోర్లు.. కిటికీలు పట్టుకుని వేలాడుతూ జనం.. ఒక్క మాటలో చెప్పాలంటే అది రైలు కాదు.. జనప్రవాహం! దేశ విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ వెళ్లేందుకు.. ఆ దేశం నుంచి భారత్ వచ్చేందుకు ప్రజలు పోటెత్తారు. 1975 జనవరి 2. బిహార్‌లోని సమస్తిపూర్. అప్పటి రైల్వేమంత్రి ఎల్ఎన్ మిశ్రా ఓ రైల్వేలైన్ ప్రారంభించడానికి వచ్చారు. ఒక్కసారిగా భారీ పేలుడు. శర్మతోపాటు చాలామంది చనిపోయారు. అసలు ఈ బాంబు పేలుడుకు కారణ మెవరు? మంత్రిని ఎందుకు హతమార్చారు? ఈ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. -
డ్రీమ్స్ ఎక్కువ ..డీజిల్ తక్కువ !
కష్టాల పట్టాలపై ‘ప్రభు రైలు’ కలల ప్రయాణం ఈ ఏడాది ఆదాయార్జనలో వెనుకబడిన రైల్వేశాఖ ప్రయాణికులకు ప్రత్యేకం ♦ జనని పథకం కింద చిన్నారులకు ఆహారం, వేడి పాలు, నీళ్లను అందుబాటులో ఉంచుతారు. ♦ ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న అన్ని తరగతుల ప్రయాణికులకు ఎంపిక చేసిన ♦ రైల్వేస్టేషన్లలో డిస్పోజబుల్ బెడ్‌రోల్స్ అందిస్తారు. ♦ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా లోకల్ ట్రైన్ టికెట్లు, 139కు కాల్ చేస్తే ‘వన్ టైమ్ పాస్వర్డ్’ ద్వారా పీఆర్ఎస్ టికెట్లు రద్దు. ♦ టికెట్లపై బార్కోడ్ల ముద్రణ ♦ వికల్ప్ ద్వారా ప్రయాణికులు కోరుకున్న రైళ్లలో ప్రత్యామ్నాయ వసతి కల్పించటం కలలు... ► ఢిల్లీ - చెన్నైలను కలుపుతూ ఉత్తర - దక్షిణ కారిడార్, ఖరగ్‌పూర్ - ముంబైలను కలుపుతూ తూర్పు - పడమర కారిడార్, ఖరగ్‌పూర్ - విజయవాడలను కలుపుతూ తూర్పు తీర కారిడార్లను మూడేళ్లలో నిర్మించటం. ► 3 రకాల కొత్త ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు.. హమ్‌సఫర్, తేజాస్, డబుల్ డెక్కర్ ఉదయ్, ఏసీ రిజర్వేషన్ లేని సూపర్‌ఫాస్ట్ రైలు అంత్యోదయ, తీర్థ స్థలాలను కలుపుతూ ‘ఆస్థా’ రైళ్లు ప్రవేశపెట్టడం. ► చెన్నైలో భారతదేశపు తొలి ఆటో హబ్ ఏర్పాటు. ఏడాదిలో రూ. 40 వేల కోట్ల వ్యయంతో రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీల ఏర్పాటు. ► వచ్చే ఏడాది 2,000 కిలోమీటర్ల లైన్ల విద్యుదీకరణ.. 300 రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు. ఈ ఏడాది కల్లా 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తేవటం.. రానున్న రెండేళ్లలో మరో 400 స్టేషన్లలో ఆ సౌకర్యం ఏర్పాటు. ► మొత్తం మీద రూ. 92,714 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 44 కొత్త ప్రాజెక్టులను కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలు చేయటం. కష్టాలు... ► ‘‘ఇది సవాళ్ల సమయం. మేం రెండు ఎదురుగాలులను ఎదుర్కొంటున్నాం. అవి ఏమాత్రం మా నియంత్రణలో లేనివి. (అవి) అంతర్జాతీయంగా మందగమనం కారణంగా మన ఆర్థికవ్యవస్థ మూల రంగాల వృద్ధి నెమ్మదించటం.. ఏడో వేతన సంఘం ప్రభావం...’’ అని రైల్వేమంత్రే స్వయంగా పేర్కొన్నారు. ► 2015-16 సంవత్సరంలో రూ. 1.83 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రూ. 15,744 కోట్లు తగ్గింది. ఆర్థికవ్యవస్థలో మూల రంగం నుంచి డిమాండ్ తగ్గటం కారణంగా సరుకు రవాణా ఆదాయం తగ్గిపోయింది. ► ప్రస్తుత ఏడాది ఆదాయం కన్నా పది శాతం ఎక్కువగా వచ్చే ఏడాదిలో రూ. 1.84 లక్షల కోట్లు ఆదాయార్జన లక్ష్యమని ప్రకటించారు. ఆర్థికవ్యవస్థ మూల రంగం వృద్ధి ఆరోగ్యవంతంగా ఉంటుందన్న ఆశతో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ.. అది ఆశే.. గ్యారంటీ లేదు. ► ఏడో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వస్తుండటంతో వచ్చే ఏడాది రైల్వేపై దాదాపు రూ. 32,000 కోట్ల అదనపు భారం పడుతోంది... రైల్వే కష్టాల్లో ఉన్నాకూడా.. ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. న్యూఢిల్లీ: ఒకవైపు ఈ ఏడాది అనుకున్న ఆదాయం రాలేదు. లక్ష్యానికి రూ. 15.7 వేల కోట్ల దూరంలోనే మన రైలు బండి ఆగిపోయింది. మరోవైపు.. వచ్చే ఏడాది ఏడో వేతన సంఘం అమలు భారం రైల్వేలపై భారీగానే పడనుంది. దాదాపు రూ. 32 వేల కోట్లు అదనపు వ్యయం కానుంది. పరిస్థితి సవాళ్లతో కూడుకుని ఉందని స్వయంగా అమాత్యులే ప్రకటించారు. అవి తన నియంత్రణలో లేనివనీ వక్కాణించారు. అలాగని.. చార్జీలు పెంచలేదు. ప్రయాణ చార్జీలు కానీ, సరకు రవాణా చార్జీల జోలికి పోలేదు. కానీ.. వచ్చే ఏడాది బడ్జెట్లో కొన్ని కొత్త కలలను రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ఆవిష్కరించారు. మూడు రకాల కొత్త సూపర్ ఫాస్ట్ ఏసీ రైళ్లు; మరో రకం ఏసీ, రిజర్వేషన్ లేని సూపర్‌ఫాస్ట్ రైలు; ముఖ్యమైన తీర్థస్థలాలను కలుపుతూ ఆస్థా రైళ్లు.. మూడేళ్లలో ఉత్తర - దక్షిణ, తూర్పు - పడమర, తూర్పు తీర రవాణా కారిడార్ల నిర్మాణం.. వంటి ఆశావహ ప్రాజెక్టులను ప్రకంటించారు. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, ఆధునీకరణ చర్యలతో పాటు.. స్టేషన్లలోనూ, రైళ్లలోనూ వసతి సదుపాయాల పెంపు.. మహిళలకు, వృద్ధులకు, విలేకరులకు పలు తాయిలాలు ప్రకటించారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,823 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 790 కోట్ల మేర ప్రస్తుతం నడుస్తున్న, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. 4 కొత్త రకం రైళ్లు... రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు 2016-17 సంవత్సరానికి రైల్వేబడ్జెట్‌ను గురువారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన సమర్పించిన రెండో రైల్వే బడ్జెట్ ఇది. దాదాపు గంటసేపు ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రకటించిన కొత్త రకం రైళ్లలో.. మూడో తరగతి ఏసీతో నడిచే ‘హమ్‌సఫర్’ సర్వీసు మొదటిది. రెండోది.. దేశంలో రైలు ప్రయాణ భవిష్యత్తును ప్రతిబింబించే ‘తేజాస్’ సర్వీసు. ఇది 130 కిలోమీటర్ల వేగంతో నడవటమే కాక.. వినోదం, స్థానిక ఆహారం, వైఫై వంటి సర్వీసులూ ఉంటాయి. మూడోది ఉదయ్ (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి ఎక్స్‌ప్రెస్). అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రివేళ ఈ రైలు నడుస్తుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికుల ప్రయాణ నాణ్యతను పెంపొందించటం కోసం దూర ప్రాంతాల మధ్య ‘అంత్యోదయ’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే.. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోని పలు రైళ్లలో ‘దీన్ దయాళ్’ పేరుతో రిజర్వేషన్ లేని బోగీలు రెండు, మూడు చేరుస్తామని చెప్పారు. అందులో తాగునీరు, మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం ఎక్కువ ఏర్పాట్లు ఉంటాయన్నారు. 3 కొత్త రవాణా కారిడార్లు... ఇక కొత్త సరకు రవాణా కారిడార్ల ప్రాజెక్టుల్లో భాగంగా.. ఢిల్లీ - చైన్నై నగరాలను కలుపుతూ ఉత్తర - దక్షిణ కారిడార్, ఖరగ్‌పూర్ - ముంబైలను కలుపుతూ తూర్పు - పడమర కారిడార్, ఖరగ్‌పూర్ - విజయవాడలను కలుపుతూ తూర్పు తీర కారిడార్లను నిర్మిస్తామని రైల్వేమంత్రి ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులను 2019 కల్లా పూర్తిచేస్తామని.. వాటిని నిర్దిష్ట కాలావధిలో అమలు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి సహా వినూత్న నిధుల కేటాయింపు పథకాలతో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తామని చెప్పారు. అలాగే.. రూ. 40 వేల కోట్ల వ్యయం కాగల రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీలను కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. అవి ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది వెల్లడించలేదు. ఇక చెన్నైలో దేశంలోనే తొలి ఆటో హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైల్ డెవలప్మెంట్ అథారిటీ.. సరకు రవాణా టారిఫ్ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తామని ప్రభు హామీ ఇచ్చారు. ఇతర రవాణా పద్ధతులతో పోటీపడేలా ధరలను రూపొందించటానికి సమీక్ష చేపడతామని చెప్పారు. అదనపు ఆదాయాన్ని సముపార్జించటానికి సరకు రవాణా బాస్కెట్‌ను విస్తరిస్తామన్నారు. సేవలకు న్యాయమైన ధరలను నిర్ణయించటానికి, పోటీని పెంపొందించటానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపడటానికి, సామర్థ్య ప్రమాణాలను నిర్ధారించటానికి రైల్ డెవలప్మెంట్ అథారిటీని నెలకొల్పుతామని ప్రభు ప్రకటించారు. సంబంధిత భాగస్వాములతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు సిద్ధమవుతుందని తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం దీర్ఘ కాలిక దృష్టితో ‘జాతీయ రైల్వే ప్రణాళిక’ను తొలిసారిగా రూపొందించనున్నట్లు సురేశ్‌ప్రభు వివరించారు. పెట్టుబడి వ్యయం 1.21 లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.21 లక్షల కోట్ల ప్రణాళికా వ్యయంతో బడ్జెట్ అంచనాలను రూపొందించినట్లు రైల్వేమంత్రి తెలిపారు. గత సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రణాళికా వ్యయం సగటుకన్నా ఇది రెట్టింపని చెప్పారు. ప్రస్తుత సంవత్సరం కన్నా ఇది 20 శాతం అధికం. సామర్థ్య నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టులకు కచ్చితమైన నిధులు అందేలా చూడటం కోసం.. వివిధ మార్గాల నుంచి నిధులు సేకరిస్తామని చెప్పారు. రైల్వే ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయీ ఆర్థికాభివృద్ధిని ఐదు రూపాయలు పెంచుతుందని పేర్కొన్నారు. 2015-16 సంత్సరంలో నిర్వహణ దామాషా (ఆపరేషన్ రేషియో) 90 శాతంగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం అది 92 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. 2020 నాటికి సామాన్యుల కలలు సాకారం సామాన్యుడు సుదీర్ఘ కాలంగా కోరుకుంటున్న ఆకాంక్షలు 2020 నాటికి సాకారమవుతాయని రైల్వేమంత్రి తన విజన్‌ను వివరిస్తూ పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న రైళ్లలో రిజర్వుడు వసతి, టైమ్-టేబుల్ ప్రకారం నడిచే రవాణా రైళ్లు, భద్రత రికార్డును మెరుగుపరచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లన్నిటినీ తొలగించటం, సమయపాలనను మెరుగుపరచటం, రవాణా రైళ్ల అధిక వేగం, మానవ వ్యర్థాల నేరు విసర్జనను సున్నాకు తీసుకెళ్లటం లక్ష్యాలుగా చెప్పారు. మార్చికల్లా కాంట్రాక్టులన్నీ కేటాయింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి ముందే.. సివిల్ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన కాంట్రాక్టులన్నిటి కేటాయింపు పూర్తవుతుందని ప్రభు తెలిపారు. అంతకుముందు ఆరేళ్లలో కేవలం రూ. 13,000 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇవ్వగా.. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రూ. 24,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వసూళ్ల అంచనా 1.84 లక్షల కోట్లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రవాణా వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లు ఉంటాయని బడ్జెట్లో అంచనా వేశారు. అందులో ప్రయాణ ఆదాయం 12.4 శాతం మేర పెరుగుతుందన్న అంచనాతో.. రూ. 51,012 కోట్ల ఆదాయ లక్ష్యం ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగం ఆరోగ్యవంతమైన వృద్ధి సాధిస్తుందన్న అంచనాతో.. వచ్చే ఏడాది రైల్వే సరకు రవాణా 500 కోట్ల టన్నుల మేర అదనంగా పెరుగుతుందని లెక్కగట్టారు. ఆ మేరకు సరకు రావాణా ఆదాయం రూ. 1.17 లక్షల కోట్లు ఉంటుందని అంచనాగా పేర్కొన్నారు. ఇతరత్రా మార్గాల్లో రూ. 15,775 కోట్లు ఆర్జిస్తామని అంచనా వేశారు. ప్రయాణ చార్జీల రాయితీ నష్టం రూ. 30,000 కోట్లుగా ఉండగా.. ప్రభుత్వం నుంచి రూ. 40,000 కోట్లు బడ్జెటరీ మద్దతుగా రైల్వేలు పొందనున్నాయి. బడ్జెట్ హై లైట్స్.. రైల్వే చార్జీలు పెంచలేదు. ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలు యథాతథం రూ.8.5 లక్షల కోట్లతో ఐదేళ్లలో రైల్వేల ఆధునీకరణ 2016-17లో ైరె ల్వేలో 1.21 కోట్ల పెట్టుబడులు ► హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ పేర్లతో కొత్తగా మూడు సూపర్‌ఫాస్ట్ రైళ్లు ► ప్రముఖ పుణ్యతీర్థాలను అనుసంధానిస్తూ ఆస్థా సర్క్యూట్ ► సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ పేరుతో సూపర్‌ఫాస్ట్ రైలు ► నీళ్లు, మొబైల్ చార్జింగ్ వసతులతో సాధారణ ► ప్రయాణికులకు దీన్‌దయాళు కోచ్‌లు 50% సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తుల్లో అదనపు కోటా 400 రైల్వే స్టేషన్లలో వైఫై. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మరో 100 స్టేషన్లలో వైఫై 30,000 వచ్చే ఏడాదికల్లా రైళ్లలో ఏర్పాటు చేసే బయో టాయ్లెట్లు ► 2020కల్లా డిమాండ్‌కు అనుగుణంగా {పయాణికులందరికీ రిజర్వేషన్ సదుపాయం ► ఇ-టికెట్ల జారీ సామర్థ్యం నిమిషానికి 2,000 నుంచి 7,200కు పెంపు ► ముఖ్యమైన అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు ► వచ్చే ఏడాదికల్లా రైళ్లలో 30 వేల బయో టాయ్లెట్లు ► పాత్రికేయులు రాయితీ టికెట్లను ఆన్లైన్ ద్వారా కూడా పొందే సదుపాయం... ప్రయోగప్రాతిపదికన టికెట్లపై బార్కోడ్ ► విదేశీ డెబిట్/క్రెడిట్ కార్డులపైనా ఇ-టికెట్లు ► త్వరలో చేతిలో ఇమిడే మిషన్ల ద్వారా రైల్వే టికెట్ల జారీ. ► వికలాంగులు, వృద్ధులకు ‘రైల్ మిత్ర’ ద్వారా సేవలు ► ప్రయాణికులకు ఐచ్చిక ప్రయాణ బీమా ► చిన్న పిల్లలకు ఆహారం అందించేందుకు జననీ సేవ ► అటోమేటిక్ డోర్లు, బయో వాక్యూమ్ టాయిలెట్లతో స్మార్ట్ బోగీలు ► టికెట్ల జారీ, ఫిర్యాదులు తదితరాలకు మొబైల్ యాప్ ► బోగీల్లో జీపీఎస్ ఆధారిత డిజిటల్ సమాచార బోర్డులు ► ప్రయాణికుల చార్జీల్లో రాయితీలకు రూ.30 వేల కోట్లు లక్ష్యానికి దూరంగా ఆదాయార్జన ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయార్జన సాధించలేదు. 2015-16 సంవత్సరంలో రూ. 1.83 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఏడాది ఆదాయం రూ. 15,744 కోట్లు తగ్గింది. ప్రయాణ, సరకు రవాణా ఆదాయాలు రెండూ అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. మూల రంగం నుంచి డిమాండ్ తగ్గటం కారణంగా సరకు రవాణా ఆదాయం తగ్గిపోయింది. ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నంలో రూ. 8,720 కోట్లు ఆదా చేసినట్లు లెక్కలు చూపారు. అయితే.. గత ఏడాది కాస్త ఆదాయం పెంచుకోవటానికి సరకు రవాణా చార్జీలను స్వల్పంగా పెంచిన సురేశ్‌ప్రభు.. ఈ ఏడాది పరిస్థితి గడ్డుగా ఉన్నా కూడా.. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చార్జీల జోలికి పోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ. -
ఉసూరుమనిపించారు..
♦ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ రైల్వేజోన్ తెస్తామన్నారు.. ♦ సీమ నుంచి రాజధానికి రైల్ కనెక్టివిటీ అని బీరాలు పలికారు ♦ బాబు వినతులు చెత్తబుట్టలో వేసిన కేంద్రం ♦ రాష్ట్రంపై కనికరం చూపని రైల్వే మంత్రి సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఏదో చేసేస్తారన్న రాష్ట్ర ప్రజానీకం ఆశలు అడియాసలయ్యాయి. కేంద్ర రైల్వే బడ్జెట్లో రైల్వుశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్‌కు ఈసారీ నిరాశే మిగిల్చారు. పెండింగ్ రైలు ప్రాజెక్టులకు మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రైల్వే ప్రాజెక్టులపై చేసిన విజ్ఞప్తులు చెత్తబుట్టపాలయ్యాయి. విశాఖకు రైల్వేజోన్ తెస్తాం.. నడికుడి-బీబీనగర్ లైన్ విస్తరణ అదిగో.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజధానిలో దేశంలోనే తొలి రైల్వే యూనివర్సిటీ సాధిస్తాం.. అంటూ బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఏ రకంగానూ తన పలుకుబడిని ఉపయోగించలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ రైల్వేజోన్ తూచ్! విశాఖ రైల్వే జోన్ ప్రకటన సమాచారం తమకుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి రైల్వే బడ్జెట్‌కు ముందు ఊరిస్తూ వచ్చారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్రం ఆ హామీని అటకెక్కించింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో విశాఖ రైల్వే జోన్‌పై ప్రధాని కార్యాలయం ఆరా తీసిందని, వెంటనే జోన్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించిందని సర్కారు ఊదరగొట్టినా నిష్ర్పయోజనంగా మారింది. అడిగిందేంటి.. ఇచ్చిందేంటి? పీపీపీ విధానంలో విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, గూడూరు, గుంతకల్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరింది. కానీ తిరుపతి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఒకటే ఇచ్చారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతికి అనంతపురం నుంచి సీమ జిల్లాలను కలుపుతూ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విజయవాడ-గుంటూరు వయా అమరావతికి 67 కి.మీ. కొత్త లైన్‌కు సర్వే, దర్శి-నరసరావుపేట 65 కి.మీ. మేర కొత్త లైన్‌కు, కంభం-ఒంగోలు 115 కి.మీ. లైన్‌కు సర్వే చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. సర్క్యులర్ మెమూ రేక్‌ల నిర్వహణకు రాజమహేంద్రవరంలో రూ.7.2 కోట్లతో వసతులు కల్పిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. నడికుడి-శ్రీకాళహస్తికి రూ.200 కోట్లు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, రూ.180 కోట్లతో సరిపెట్టారు. -
నిధులు నిల్.. లైన్ క్లియర్
♦ రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం ♦ సర్వే పనులకు నిధులు విదల్చని వైనం ♦ మెతుకుసీమపై ప్రభుదయ అరకొరే.. ♦ మనోహరాబాద్-కొత్తపల్లి లైన్‌కు రూ. 30 కోట్లు ♦ మెదక్-అక్కన్నపేటకు రూ.5 కోట్లు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ; మెతుకుసీమకు మళ్లీ అరకొర నిధులే విదిల్చారు.. పాత రైల్వే లైన్ పనులకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండానే.. కొత్త రైలు మార్గం ప్రతిపాదనతో రైల్వే మంత్రి సురేష్ ప్రభు జిల్లా ప్రజలను సంతోషపరిచే ప్రయత్నం చేశారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌కు రూ 30 కోట్లు, మెదక్- అక్కన్నపేట లైన్‌కు రూ 5 కోట్లు మాత్రమే కేటాయించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ - జహీరాబాద్ రైలు మార్గాన్ని ఈ బడ్జెట్లో ఆమోదించారు. పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలను కలుపుతూ జహీరాబాద్ వరకు రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో 70 కిలో మీటర్ల మేర కొత్త రైలు మార్గం కోసం గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సర్వే పనుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. కేటాయింపులు అంతంతే.. జహీరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలిని (నిమ్)్జ ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో ఈ రైల్వే లైన్ తప్పని సరి అయింది. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి బీదర్ వరకు మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదించారు. జిల్లాలోని నారాయణఖేడ్ మీదుగా వెళ్లే ఈరైల్వే లైన్‌కు కూడా ఆమోదం లబించింది. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే మార్గానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు తీవ్ర నిరాశపరిచాయి.తూప్రాన్ మండలం మనోహరాబాద్ నుంచి కరీంనగర్ మండలం కొత్తపల్లి వరకు దాదాపు 148 కిలో మీటర్ల పొడవు , రూ.308 కోట్ల అంచనా వ్యయంతో 2005లో ఈ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు దాని అంచాన వ్యయం రూ. 1000 కోట్లకు పెరిగింది. జిల్లాలో 88 కిలో మీటర్ల వరకు లైన్ వెళుతోంది. 2014-15 బడ్జెట్లో కేవలం రూ.10 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. తొలివిడతగా 27 కిలో మీటర్ల మేర సేకరించిన 387 ఎకరాల భూమిని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ రైల్వే అధికారులకు అప్పగించారు. మరో 61 కిలోమీటర్ల మేరకు భూ సేకరణ ప్రక్రియ వేగ వంతం చేశారు. భూ సేకరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నందున ఈ బడ్జెట్లో మనోహరాబాద్ రైల్వే లైన్‌కు పెద్ద పీట వేస్తారని అందరూ భావించారు. కానీ తాజాగా రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించి ప్రజలను నిరాశపరిచారు. ‘మెదక్-అక్కన్నపేట’పై నీళ్లు తుదిదశలో ఉన్న మెదక్- అక్కన్నపేట రైల్వే లైన్ మీద కేంద్ర మంత్రి కనికరం చూపించలేదు. కేవలం రూ. 5 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కొత్త బ్రాడ్‌గేజ్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పూర్తి చేశారు. మొత్తం 17 కిలో మీటర్ల మేరకు దాదాపు 318 ఎకరాల భూమి సేకరించారు. భూమి కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది. స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. కానీ బడ్జెట్లో కేవలం రూ 5 కోట్లు మాత్రమే కేటాయించడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిరాశే మిగిలింది.. 2016-27 రైల్వే బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు మళ్లీ నిరాశే మిగిలింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు రూ.5 కోట్లు, కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్‌కు రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. కొత్తగా బోధన్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్‌కు 138 కి.మీ., సికింద్రాబాద్-సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు 64 కి.మీ. రైలు మార్గం మంజూరు చేసినా నిధులివ్వలేదు. లింగంపల్లి నుంచి సంగారెడ్డి, జోగిపేట, మెదక్, సిద్దిపేట మీదుగా పెద్దపల్లికి కొత్తలైన్ నిర్మించాలన్న జిల్లా ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరలేదు. - ఆర్.సత్యనారాయణ, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జిల్లాకు మళ్లీ మొండిచెయ్యి రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే మిగిలింది. అక్కన్నపేట-సిద్దిపేట లైన్‌కు సర్వే జరిగినా హామీ ఇవ్వలేదు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు సౌకర్యం, సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వరకు లైన్ అవసరమైనా కేటాయించలేదు. - ఎ.మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి బడ్జెట్లో ఆ ఊసే లేదు.. రైల్వే లైన్ ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. బడ్జెట్లో జిల్లాకు సంబంధించి ఊసే లేదు. ఎంపీలూ కృషి చేయలేదు. రాష్ట్రం వెనుకబడిందనే తెలంగాణ తెచ్చుకున్నాం. నిధులు లేకుంటే ఎలా అభివృద్ధి చెందుతుంది. జిల్లాకు అన్యాయం జరిగింది. - సునీత లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఏదీ ప్రాధాన్యం? వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధ్యాన క్రమం లో నిధులు కేటాయిస్తామని తరచూ చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాటలు వట్టి మాటలే. మంజూరైన వాటిని నిధులు లేవు. కొత్త లైన్ల ఊసే లేదు. - కె.రాజయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాకు అన్యాయం రైల్వే బడ్జెట్లో జిల్లాకు అన్యాయం జరిగింది. జిల్లా ఎం పీలు ఏం చేస్తున్నారు. జిల్లాలో రైల్వే సౌకర్యం ఎంత ఎ క్కువ ఉంటే అంత అభివృద్ధి చెందుతుంది. బంగారు తెలంగాణ కావాలంటే జిల్లాలో రైల్వే లైన్లు ఎక్కువ ఏర్పాటు చేయాలి. టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చే సుకుంటున్నారు. అభివృద్ధి గురించి వారికి పట్టడం లేదు. - గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు పేదలకు ఉపయోగం కేంద్ర ప్రభుత్వం పేదలకు, మధ్య తరగతి ప్రయాణికులకు ఉపయోగపడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ చేసిన పాపాలు కడగాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. దేశాభివృద్ధి, లక్ష్యాలకు అనుకుణంగానే బడ్జెట్ ఉంది. - కాసాల బుచ్చిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు