ఉసూరుమనిపించారు..
♦ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ రైల్వేజోన్ తెస్తామన్నారు..
♦ సీమ నుంచి రాజధానికి రైల్ కనెక్టివిటీ అని బీరాలు పలికారు
♦ బాబు వినతులు చెత్తబుట్టలో వేసిన కేంద్రం
♦ రాష్ట్రంపై కనికరం చూపని రైల్వే మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఏదో చేసేస్తారన్న రాష్ట్ర ప్రజానీకం ఆశలు అడియాసలయ్యాయి. కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రైల్వుశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్‌కు ఈసారీ నిరాశే మిగిల్చారు. పెండింగ్ రైలు ప్రాజెక్టులకు మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రైల్వే ప్రాజెక్టులపై చేసిన విజ్ఞప్తులు చెత్తబుట్టపాలయ్యాయి. విశాఖకు రైల్వేజోన్ తెస్తాం.. నడికుడి-బీబీనగర్ లైన్ విస్తరణ అదిగో.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజధానిలో దేశంలోనే తొలి రైల్వే యూనివర్సిటీ సాధిస్తాం.. అంటూ బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఏ రకంగానూ తన పలుకుబడిని ఉపయోగించలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ రైల్వేజోన్ తూచ్!
విశాఖ రైల్వే జోన్ ప్రకటన సమాచారం తమకుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి రైల్వే బడ్జెట్‌కు ముందు ఊరిస్తూ వచ్చారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్రం ఆ హామీని అటకెక్కించింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో విశాఖ రైల్వే జోన్‌పై ప్రధాని కార్యాలయం ఆరా తీసిందని, వెంటనే జోన్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించిందని సర్కారు ఊదరగొట్టినా నిష్ర్పయోజనంగా మారింది.
అడిగిందేంటి.. ఇచ్చిందేంటి?
పీపీపీ విధానంలో విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, గూడూరు, గుంతకల్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరింది. కానీ తిరుపతి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఒకటే ఇచ్చారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
రాజధాని అమరావతికి అనంతపురం నుంచి సీమ జిల్లాలను కలుపుతూ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విజయవాడ-గుంటూరు వయా అమరావతికి 67 కి.మీ. కొత్త లైన్‌కు సర్వే, దర్శి-నరసరావుపేట 65 కి.మీ. మేర కొత్త లైన్‌కు, కంభం-ఒంగోలు 115 కి.మీ. లైన్‌కు సర్వే చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.
సర్క్యులర్ మెమూ రేక్‌ల నిర్వహణకు రాజమహేంద్రవరంలో రూ.7.2 కోట్లతో వసతులు కల్పిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు.
నడికుడి-శ్రీకాళహస్తికి రూ.200 కోట్లు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, రూ.180 కోట్లతో సరిపెట్టారు.