
దారీ తెన్నూ లేని రైల్వే బడ్జెట్
దేశంలో పెండింగ్‌లో ఉన్న వందలాది ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆర్థిక వనరులు లేక కునారిల్లుతున్న భారతీయ రైల్వే వ్యవస్థకు ఈసారైనా దశ, దిశ నిర్దేశిస్తారనుకున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరాశా నిస్పృహలనే మిగిల్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంలో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు ‘యథాతథ’ స్థితికే పెద్ద పీట వేశారు. ప్రయాణికుల చార్జీలను పెంచకుండా ప్రజలను కరుణించిన ప్రభువు సరకు రవాణా చార్జీలను సవరించడం ద్వారా మధ్యతరగతి ప్రజలపై వెనుక నుంచి పెను భారమే మోపారు. ఒక్క కొత్త రైలును కూడా ప్రవేశపెట్టకుండా అన్ని రాష్ట్రాల అంచనాలను తలకిందులు చేశారు. అయితే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లను ఏర్పాటు చేస్తామని, కొత్తగా పలు రైల్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని, రైల్వే స్టేషన్లను ప్రక్షాళిస్తామని, వై-ఫై సేవలు అందిస్తామంటూ కొంత ఊరట కలిగించారు. మోదీ కలల ప్రాజెక్టైన బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ముందుగా ముంబై-అహ్మదాబాద్ మధ్య సాధ్యాసాధ్యాల విశ్లేషణ జరుగుతోందని, ఈ ఏడాదిలోగా నివేదిక వస్తోందంటూ ఆ అంశాన్నీ దాటవేశారు. 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సురేశ్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ప్రణాళిక కేటాయింపులను 1,00,011 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇది 2014-20015 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌కు 52 శాతం అదనం. ప్రయాణికుల చార్జీల ద్వారా రూ. 50, 175 కోట్లు వస్తాయని, సరకు రవాణా ద్వారా రూ. 1,21,423 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
రైల్వేల ప్రస్తుత పరిస్థితికి కారణం కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక వనరులను సమకూర్చుకోక వడమేనంటూ నెపాన్ని గతం మీద నెట్టి వేశారు. రానున్న ఐదేళ్లలో రైల్వేల అభివృద్ధికి ఏకంగా రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ భవిష్యత్తును భావితరానికి వదిలేశారు. దారీతెన్నూ లేని రైల్వే వ్యవస్థకు ‘ఓ ప్రభువా దారి చూపించు’ అంటూ ఆ దేవుడిపైనే భారం వేశారు.
రైలు రవాణా చార్జీలను సవరించడంలో ఉప్పు లాంటి వస్తువులను కనుకరించినా సిమెంట్, స్టీల్, చమురు, బొగ్గు, కోల్ లాంటి సరకులపై భారం వేశారు. సవరించిన చార్జీల ద్వారా ఈ సరకుల ధరలు పెరిగి మధ్యతరగతి ప్రజలపై భారం పడక తప్పదు. నిత్యావసర వస్తువుల నిర్వచనాన్ని మార్చి, దూరాభారాన్ని బట్టి సరకు రవాణా చార్జీలను 10 శాతం వరకు పెంచారు. ఈ కారణంగా కూరగాయలు, పళ్లు, నూనెల ధరలు పెరగడం వల్ల పేద ప్రజలపై భారం పడుతుందనడంలో సందేహం లేదు. సరకు రవాణా చార్జీలను సవరించడం వల్ల రాబడి ఎంత పెరుగుతుందో సీఏగా అనుభవం ఉన్న సురేశ్ ప్రభు తేల్చలేక పోయారు.
లోక్‌సభలో దాదాపు గంటసేపు ప్రసంగించిన ప్రభు.. ప్రయాణికుల సౌకర్యాలను పెంచడం, వారి భద్రతకు ప్రాధాన్యతనివ్వడం, వీటికి రైల్వేల మనుగడకు మధ్య సమతౌల్యం సాధించడం తన లక్ష్యమని చెప్పారు. తన లక్ష్యాలను సాధించడంలో భాగంగా గుర్తించిన రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వై-ఫై సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్లలో అదనంగా 650 మరుగు దొడ్లను నిర్మిస్తామని చెప్పారు. ఇదే ఏడాది 6,608 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను విద్యుద్దీకరిస్తామని అన్నారు. ప్రయాణికుల భద్రత కోసం 3,438 లెవల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం రూ. 6,750 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 970 రైల్ కమ్ రోడ్డు వంతెనలను నిర్మిస్తామని ప్రకటించారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఎస్‌ఎంఎస్ పద్ధతి ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్లలోకి వచ్చిన ఐదు నిమిషాల్లోగానే టిక్కెట్ తీసుకునేందుకు వీలుగా ‘ఆపరేషన్ 5 మినిట్’ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ప్రయాణికులు 200 రోజులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకునే స్కీమ్‌ను ప్రవేశ పెడుతున్నామంటూ ఏజెంట్ల వ్యవస్థకు పరోక్షంగా తెరతీశారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.