‘డబుల్’ ఇళ్లకు రైల్వే భూమి ఇవ్వండి
రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కోరిన మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పరిధిలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభును మంత్రి కె.తారక రామారావు కోరారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లతో కలసి కేటీఆర్ గురువారం ఇక్కడి రైల్వే భవన్‌లో ప్రభుతో సమావేశమయ్యారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే టెర్మినళ్ల విస్తర ణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ భూమి బదలాయింపునకు అభ్యర్థించడంతో.. దానికి బదులుగా డబుల్ బెడ్రూం ఇళ్లకు అవసరమైన 32 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్రానికి కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభు.. భూమి బదలాయింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉప్పల్–వరంగల్ స్కైవేకు ఆర్థిక సాయం చేయండి..
రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్–వరంగల్ రహదారి మార్గంలో రూ.1,300 కోట్లు వెచ్చించి స్కైవే నిర్మాణానికి నిర్ణయించిందని, భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కేటీఆర్ కోరారు. దిల్‌సుఖ్‌నగర్, ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో రహదారులు, బెంగళూరు మార్గంలో ఎయిర్‌పోర్ట్, ఆరాంఘర్ చౌరస్తా రహదారుల అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారం పది రోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని గడ్కారీ హామీ ఇచ్చారు. అనంతరం ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్, సిరిసిల్లలో అపెరల్ పార్క్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. మింట్ పత్రిక ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్, మొబైల్ గవర్నెన్స్, డిజిటల్ లావాదేవీలకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.