Railway land
-
సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు?
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే వాళ్లంతా ఈ పాటికి రోడ్డున పడేవాళ్లే. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయేవాళ్లే. ఎముకలు కొరికే చలిలో చంటిపిల్లలు, వృద్ధులు, గర్భిణులతో నానా అంతా అగచాట్లు పడేవారే. ‘ఇది రైల్వే స్థలం. మీరు వారం రోజుల్లోగా ఖాళీ చేయాలనేది’ హైకోర్టు ఆదేశం అని స్థానిక అధికారులు చెప్పగానే వాళ్లంతా నెత్తినోరూ బాదుకున్నారు. ‘‘మానవత్వం ఉన్న వాళ్లు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? నిలువ నీడ లేకుండా చేస్తారా?’’ అని మొత్తుకున్నారు. ప్రార్థనలు చేశారు. బైఠాయించారు. ప్రభుత్వం దృష్టికి తమ గోడును తీసికెళ్లేందుకు కొవ్వొత్తుల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ప్రదేశంలో అనేక మంది కాపురం ఉంటున్నారు. వాటిని గఫూర్ బస్తీ, ఢోలక్ బస్తీ, ఇందిరానగర్ అని పిలుస్తారు. అక్కడ ఇళ్లే కాదు. ప్రభుత్వ పాఠశాలలున్నాయి. నాలుగు గుళ్లు, పది మసీదులు, ఒక బ్యాంకు, కొన్ని షాపులు ఉన్నాయి. వాళ్లంతా నిరుపేదలు. అందులో ఎక్కువ మంది ముస్లింలు. దాదాపు నాలుగువేల కుటుంబాలు. మొత్తం 50వేల మంది దాకా ఉంటారు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కాదని చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థం అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్లు హఠాత్తుగా ఆక్రమణదారులు ఎలా అవుతారు. ముందూ వెనక చూడకుండా, ఒక ప్రత్యామ్నాయం అనేది చూపకుండా ప్రభుత్వం వాళ్లని ఖాళీ చేయమని ఎలా చెబుతుంది? రైల్వే శాఖ ఏం చెబుతోంది? కొంత మంది అక్కడ భూమిని లీజుకు తీసుకున్నారు. కొంత మంది భూమిని ప్రభుత్వవేలంలో కొనుక్కున్నారు. జిల్లా కోర్టుల్లో దీనికి సంబంధించిన అర్జీలు కూడా ఉన్నాయి. చాలా మంది దగ్గర చట్టబద్ధమైన పత్రాలున్నాయని కూడా చెబుతున్నారు. ఈశాన్య రైల్వేశాఖ ఈ భూమి విషయంలో పొంతనలేని వాదనలు చేస్తోంది. ఒకసారి 78 ఎకరాలు ఆక్రమించారని చెబితే, మరోసారి 29 ఎకరాలు ఆక్రమణ పాలయిందని చెబుతోంది. 2014లో ఈ అంశంపై ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలయినప్పుడు అక్కడ నిర్వాసితులను ఆక్రమణదారులు అని పేర్కొనకపోవటం గమనార్హం. గతంలో ఈ వివాదాన్ని పరిష్కరించటానికి ఒక ఎస్టేట్ అధికారిని నియమించారు. ఆయన ఈ స్థలం రైల్వేదని తేల్చేశారు. 2017లో కూడా హైకోర్టు ఒకసారి అక్కడున్నవారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తే, అప్పుడు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెప్పింది? ఈ భూమిపైన హల్ద్వానీ నివాసితులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులేదని భావించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తక్షణం వారిని తొలగించాలని ఆదేశించింది. అవవసరమైతే సాయుధ బలగాల సహకారం తీసుకునయినా అక్కడున్న వాళ్లని తరిమివేయటానికి, రైల్వే అధికారులకు, జిల్లా యంత్రాంగానికి అనుమతులిచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సామాజిక కార్యకర్త, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్.ఎ.నజీర్, పి.ఎస్.నరసింహతో కూడిన బెంచీ దీనికి సానుకూలంగా స్పందించింది. ‘‘ఇది మానవీయ సమస్య. దీనికి ఆచరణ యోగ్యమైన పరిష్కారం కనుగొనాలి’’ అని సూచించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఒక పద్ధతి ప్రకారమే మేం ముందుకు వెళుతున్నామని రాష్ట్రప్రభుత్వం పేర్కొన్నా, దశాబ్దాలుగా ఉంటున్న వారిని సాయుధ పోలీసు బలగాలు ఉపయోగించి ఎలా ఖాళీ చేయిస్తారని న్యాయమూర్తులు నిలదీశారు. ఆశ్రయం పొందే హక్కు (రైట్ టు షెల్టర్): ఆశ్రయం పొందే హక్కుఅనేది భారతదేశంలో వివాదాస్పదమైన హక్కుగా చెప్పుకోవాలి. పునరావాస కల్పన అనే దాన్ని ప్రభుత్వాలు కూడా అంతగా పట్టించుకోవు. ఆశ్రయం పొందే హక్కు అనేది రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద ప్రతి ఒక్కరికీ లభించే హక్కు. సుప్రీంకోర్టు 1996లో ఒక కేసులో ( చమేలి సింగ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్) ఈ మేరకు తీర్పునిచ్చిన విషయం గమనార్హం. పునరావాసం, ఆశ్రయం పొందే హక్కులను సంబంధించి 1990లో ఇచ్చిన మరో తీర్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జంతువులు ఆశ్రయం కల్పించటం అనేది వాటి శరీరానికి రక్షణ కల్పిస్తే చాలు, అదే మనుషులయితే వారికి తగిన వసతి కల్పించాలి. వారు శారీరకంగా, మానసికంగా, తెలివితేటలపరంగా ఎదగటానికి అవసరమైన చర్యలు చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. హల్ద్వానీ కేసులో ప్రభుత్వం వారిని అక్కడ నుంచి తొలగించటానికి ముందు వారికి ప్రత్యామ్యాయనివాసాలు చూపించవలసి ఉంది. దశాబ్దాలుగా వారు అక్కడ నివసిస్తున్నారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. మరో వైపు హల్ద్వానీ కేసు సుప్రీంకోర్టుకు ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. స్థానిక రాజకీయ ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు చేయకుండా మార్గదర్శకాలు అందించటానికి అది వీలుకల్పించింది. ప్రస్తుతానికి గండం గడిచినట్టే. హల్ద్వానీవాసులకు ఎలాంటి ముప్పు లేదు. వచ్చేనెలలో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. అప్పుడు నివాసితులు ఆశించిన పూర్తి న్యాయం లభిస్తుందని కోరుకుందాం. -
రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్ పీరియడ్‌ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్‌కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. పీఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వేభూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. అయిదేళ్లలో 300 పిఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారాయన. Union Cabinet has approved policy on long-term leasing of Railways' Land to implement PM Gati Shakti framework. 300 cargo terminals will be developed in 5 years: Union Minister Anurag Thakur on Union Cabinet decisions pic.twitter.com/i3VEwVSXYs — ANI (@ANI) September 7, 2022 ప్రైవేటీకరణలో భాగంగానే.. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న రైల్వే లీజ్ నిర్ణయాలు.. నీతి ఆయోగ్ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్.. 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్ లీజింగ్ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజ్‌కు ఇవ్వాలని, పీపీపీ పద్దతిలో రైల్వే భూములను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కూడా కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించింది. పీఎం శ్రీస్కూల్స్ కేంద్ర కేబినెట్లో ఇవాళ.. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. అలాగే.. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్‌ను ఎంపిక చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో రూ. 27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉండనుంది. నూతన జాతీయ విద్యావిధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అనుభవాలు, ప్రాక్టీకల్స్ ఆధారంగా విద్యాబోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర కేబినెట్ భావిస్తోంది. ఇదీ చదవండి: హెలికాప్టర్ సర్వీస్ పేరిట కుచ్చు టోపీ -
ఆ భూములను వాడుకునే వీలు కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రక్షణశాఖ, రైల్వేశాఖ అధీనంలోని భూములు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజావసరాలకు వినియోగించుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో ‘అవసరార్థం స్థిరాస్తి సేకరణ చట్ట సవరణ’ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల రక్షణశాఖకు చెందిన బైసన్‌పోలో మైదానాన్ని తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు ఆ శాఖ అంగీకరించింది. రక్షణ అవసరాల కోసం హైదరాబాద్‌లో రక్షణశాఖకు భూములిస్తే.. ఆ శాఖ స్థానికంగా ఉండే ప్రజలను ఇబ్బందిపెట్టేలా నిబంధనలు పెడుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి వేధింపులు మానుకోవాలి. జాతీయ భద్రత గురించి భూములు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకొని చర్చలు జరపాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భూములు బదిలీ చేసుకోవాలి గానీ వెల కట్టడం సరికాదు’ అని అన్నారు. నాడు ‘కల్యాణలక్ష్మి’ ఉండుంటే..: కడియం తొర్రూరు రూరల్ (పాలకుర్తి): ‘నాకు ఆరుగురు అక్కాచెల్లెళ్లు.. పేదలైన మా తల్లిదండ్రులు బిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు నానా కష్టాలు పడ్డారు.. ఇప్పటిలా కల్యాణలక్ష్మి ఉంటే మాకు ఆ ఇబ్బందులు ఉండేవి కావు’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నాటి కష్టాలను గుర్తుచేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం గ్రామంలో బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ తనకు ముగ్గురు ఆడపిల్లలేనని, ఒక్క కొడుకైనా కలగకపాయేనని కన్నతల్లి ఆవేదన చెందేదని, కానీ.. కూతుళ్లను ఉన్నతంగా చదివించి ఉత్తములుగా తీర్చిదిద్దానని చెప్పారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లిది.. తనది ఒకే గ్రామమని.. ఉన్నత కుటుంబం నుంచి ఎర్రబెల్లి, పేద కుటుంబం నుంచి తాను అభివృద్ధి చెందామని అన్నారు. -
‘డబుల్’ ఇళ్లకు రైల్వే భూమి ఇవ్వండి
రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కోరిన మంత్రి కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పరిధిలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభును మంత్రి కె.తారక రామారావు కోరారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లతో కలసి కేటీఆర్ గురువారం ఇక్కడి రైల్వే భవన్లో ప్రభుతో సమావేశమయ్యారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే టెర్మినళ్ల విస్తర ణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ భూమి బదలాయింపునకు అభ్యర్థించడంతో.. దానికి బదులుగా డబుల్ బెడ్రూం ఇళ్లకు అవసరమైన 32 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్రానికి కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభు.. భూమి బదలాయింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉప్పల్–వరంగల్ స్కైవేకు ఆర్థిక సాయం చేయండి.. రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్–వరంగల్ రహదారి మార్గంలో రూ.1,300 కోట్లు వెచ్చించి స్కైవే నిర్మాణానికి నిర్ణయించిందని, భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కేటీఆర్ కోరారు. దిల్సుఖ్నగర్, ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో రహదారులు, బెంగళూరు మార్గంలో ఎయిర్పోర్ట్, ఆరాంఘర్ చౌరస్తా రహదారుల అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారం పది రోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని గడ్కారీ హామీ ఇచ్చారు. అనంతరం ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపెరల్ పార్క్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. మింట్ పత్రిక ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్, మొబైల్ గవర్నెన్స్, డిజిటల్ లావాదేవీలకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
రైల్వేల్యాండ్‌లో ఆక్రమణలు కూల్చివేత
హైదరాబాద్: రైల్వేల్యాండ్‌లో అక్రమంగా వేసిన గుడిసెలను రైల్వే అధికారులు తొలగిస్తున్న క్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ గూడు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ నిరసన చేపడుతున్నారు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్, ఎస్.పీ నగర్‌లోని రైల్వే ల్యాండ్‌లో గత కొంత కాలంగా కొందరు గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు రైల్వే అధికారులు వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తుండగా.. స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పడానికి యత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. -
రైల్వేకు 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం
న్యూఢిల్లీ: రైల్వే శాఖ అధీనంలో 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖకు మొత్తం 4,61,487 హెక్టార్ల భూమి ఉందని రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఇందులో 4,14,240 హెక్టార్లు తమశాఖ కార్యకలాపాలకు వినియోగిస్తున్నామని, మిగతా స్థలం ఖాళీగా ఉందని రాజ్యసభలో చెప్పారు. ఖాళీగా ఉన్న స్థలం ఎక్కువ శాతం రైల్వే పట్టాల వెంట నిలువుగా ఉందని తెలిపారు. సర్వీసింగ్, ట్రాక్ నిర్వహణకు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ ఖాళీ స్థలం అవసరమవుతుందన్నారు. అవసరానికి అనుగుణంగా దీన్ని వినియోగిస్తామని చెప్పారు. రైల్వే భూముల రికార్డుల డిజిటలైజేషన్ దాదాపు పూర్తైందని మంత్రి తెలిపారు.