సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు.
అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్ పీరియడ్‌ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్‌కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. పీఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వేభూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. అయిదేళ్లలో 300 పిఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారాయన.
Union Cabinet has approved policy on long-term leasing of Railways' Land to implement PM Gati Shakti framework. 300 cargo terminals will be developed in 5 years: Union Minister Anurag Thakur on Union Cabinet decisions pic.twitter.com/i3VEwVSXYs
— ANI (@ANI) September 7, 2022
ప్రైవేటీకరణలో భాగంగానే.. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న రైల్వే లీజ్ నిర్ణయాలు.. నీతి ఆయోగ్ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్.. 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్ లీజింగ్ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజ్‌కు ఇవ్వాలని, పీపీపీ పద్దతిలో రైల్వే భూములను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కూడా కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించింది.
పీఎం శ్రీస్కూల్స్
కేంద్ర కేబినెట్‌లో ఇవాళ.. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. అలాగే.. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్‌ను ఎంపిక చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో రూ. 27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉండనుంది. నూతన జాతీయ విద్యావిధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అనుభవాలు, ప్రాక్టీకల్స్ ఆధారంగా విద్యాబోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర కేబినెట్ భావిస్తోంది.
ఇదీ చదవండి: హెలికాప్టర్ సర్వీస్ పేరిట కుచ్చు టోపీ
Comments
Please login to add a commentAdd a comment