railway budget 2015
-
రైల్వే బడ్జెట్ అబద్ధాల పుట్ట
రైల్వే బడ్జెట్ పూర్తిగా అబద్ధాల పుట్ట అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ ఇంత అన్యాయంగా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో మీ లోపాయికారీ ఒప్పందం ఏంటని నిలదీశారు. తెలుగు రాష్ట్రాలకు అరకొర నిధులు మాత్రమే ఇచ్చినా, రెండు రాష్ట్రాల సీఎంలయిన ఇద్దరు చంద్రులు ఎందుకు స్పందించడంలేదని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. -
చుక్ చుక్... హైటెక్
ఆధునీకరణ పట్టాలపైకి ‘సురేశ్‌ప్రభు రైలు’ పరుగులు న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలు కానున్న 2015-16 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను సురేశ్‌ప్రభు గురువారం నాడు పార్లమెంటుకు సమర్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈ బడ్జెట్లో ఒక్క కొత్త రైలును కానీ, ఒక్క కొత్త రైలు మార్గాన్ని కానీ ప్రకటించలేదు. ఉన్న రైళ్ల సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రస్తుత రైలు మార్గాలను పొడిగించి, బలోపేతం చేస్తామని చెప్పారు. కొత్త ప్రాజెక్టులేవీ ఇవ్వలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తిచేయటానికే ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. అయితే.. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ప్రతిపాదనలపై సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బడ్జెట్లో ప్రయాణ చార్జీలను పెంచలేదు. కానీ.. సరుకు రవాణా చార్జీలను పది శాతం మేర పెంచారు. వచ్చే ఐదేళ్లలో 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ఈ పెట్టుబడులను మార్కెట్ రుణాలు, పింఛను నిధులు, బహుళ అభివృద్ధి బ్యాంకుల నుంచి సమీకరిస్తామని చెప్పారు. ఇందులో రైల్వేలు కేటాయించే నిధులు ఎంతనేది మాత్రం చెప్పలేదు. రాబోయే ఏడాదికి మాత్రం మూలధన వ్యయం ఏకంగా 52 శాతం పెంచుతూ.. వచ్చే ఏడాది లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైల్వేల ప్రయివేటీకరణ ఉండదని.. అది ప్రభుత్వరంగ సంస్థగానే ప్రజలకు సేవలందిస్తుందని ఉద్ఘాటించారు. అయితే.. రైల్వేల విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం అమలు చేస్తామన్నారు! సరుకు రవాణా చార్జీల పెంపు... ‘‘నేను ప్రయాణ చార్జీలను పెంచలేదు’’ అని బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే ప్రకటించిన సురేశ్ ప్రభు.. 12 రకాల సరకుల రవాణా చార్జీలను మాత్రం పది శాతం మేర పెంచటం గురించి మాత్రం ప్రస్తావించలేదు. సరుకుల రవాణా చార్జీల జాబితా ‘హేతుబద్ధీకరణ’ పేరుతో కాగితాలపైనే ఆ పని కానిచ్చారు. వాస్తవానికి.. డీజిల్ ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖకు 12,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయల వరకూ ఆదా అవుతుందని రైల్వే అధికారుల అంచనా. అయినా.. సరుకు రవాణా ద్వారా మరో రూ. 4,000 కోట్లు ఆదాయం పెంచుకునేలా ఆ చార్జీలను ‘సవరించారు’. ఎరువుల రవాణా చార్జీలు 10 శాతం పెంపు వల్ల.. ఇప్పటికే రూ. 3,000 కోట్ల మేరకు ఉన్న సబ్సిడీ భారం మరో రూ. 300 కోట్ల మేర పెరగనుంది. అయితే.. ఈ భారాన్ని ఎరువుల ధరలను పెంచి రైతులపై మోపబోమని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించటం కాస్తంత ఊరటనిచ్చింది. కానీ.. ఆహార ధాన్యాల రవాణా చార్జీలు పది శాతం పెరగటం వల్ల రూ. 600 కోట్ల వరకూ భారం పడుతుందని.. వీటితో పాటు సిమెంట్, బొగ్గు, గ్యాస్, కిరోసిన్ వంటి సరుకులు రవాణా చార్జీల పెంపు వల్ల.. ఆయా సరుకుల ధరలు పెరుగుతాయని.. ఈ భారం అంతిమంగా ప్రజలపైనే పడుతుందని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు. 4, 5, 11 - ఇది రైల్వేమంత్రి మంత్రం... ఎటువంటి భారీ ప్రకటనలూ లేకుండా రూపొందించిన బడ్జెట్లో.. రైల్వేల్లో పెట్టుబడుల లోపం అనే విషవలయానికి చరమగీతం పలకడానికి.. నాలుగు లక్ష్యాలు, ఐదు చోదకాలు, 11 ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. రాబోయే తొమ్మిదేళ్ల కాలంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరచటం రైల్వేల స్వల్ప కాలిక లక్ష్యమని చెప్పారు. ఆర్థికవ్యవస్థ ప్రధాన చోదకశక్తిగా రైల్వేలను మళ్లీ అభివృద్ధి చేయటం, అధిక పెట్టుబడుల కోసం వనరులను సమీకరించటం, భారీ మార్గాలపై ఒత్తిడిని తగ్గించటం, రైళ్ల వేగాన్ని పెంచటం, ప్రయాణ సదుపాయాలు, భద్రతాచర్యలు మెరుగుపరచటం, రైల్వే మౌలికసదుపాయాల బలోపేతం తదితర 11 అంశాలపై ప్రధాన దృష్టి ఉంటుందని చెప్పారు. ఎంపిక చేసిన శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు, బి-కేటగిరీ రైల్వేస్టేషన్లలోనూ వైఫై సదుపాయం, మరో 200 రైల్వే స్టేషన్లు ఆదర్శ స్టేషన్ల పథకం కిందికి తేవటం వంటి చర్యలను రైల్వేమంత్రి ప్రకటించారు. నాలుగు లక్ష్యాలు 1) ప్రయాణికుల అనుభూతిని సుస్థిరంగా మెరుగుపరచటం, 2) రైల్వేలను సురక్షితమైన రవాణా సాధనంగా మలచటం, 3) రైల్వే మౌలిక సదుపాయాల సామర్థ్యాలను విస్తరించటం, ఆధునీకరించటం, 4) సామర్థ్య విస్తరణకు, క్షీణిస్తున్న ఆస్తులను తిరిగి బలోపేతం చేయటానికి వీలుగా భారీ మిగులు సృష్టించటం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించటం అనేవి నాలుగు లక్ష్యాలుగా చెప్పారు. వీటిలో.. రోజు వారీ ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 2.1 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచటం; రైలు మార్గాల నిడివిని 20 శాతం - ఇప్పుడున్న 1.14 లక్షల కిలోమీటర్ల నుంచి 1.38 లక్షల కిలోమీటర్లకు - పెంచటం; వార్షిక సరుకు రవాణా సామర్థ్యాన్ని 100 కోట్ల టన్నుల నుంచి 150 కోట్ల టన్నులకు పెంచటం వంటివి ఉన్నాయి. ఐదు చోదకాలు 1) రైల్వేలను సంపూర్ణంగా రూపాంతరం చేయటానికి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక, 2) నిధుల లభ్యత, చిట్టచివరి మైలు అనుసంధానం కోసం రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బహుముఖ సంస్థలు, ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం, 3) ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల సమీకరణ, 4) నిర్వహణ విధానాలను పునర్వ్యవస్థీకరించటం, 5) పాలన, పారదర్శకతల ప్రమాణాలను నిర్దేశించటం అనేవి ఐదు చోదకాలుగా పేర్కొన్నారు. 9,420 కిలోమీటర్ల లైన్ల సామర్థ్యం పెంపు... రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు, సదుపాయాలను మెరుగుపరిచేందుకు రైల్వేమంత్రి అనేక చర్యలు ప్రకటించారు. గుర్తించిన రైళ్లలో మరిన్ని సాధారణ తరగతి బోగీలను ఏర్పాటు చేస్తామన్నారు. 9,420 కిలోమీటర్ల రైల్వే లైన్ల సామర్థ్యాన్ని విస్తరించటానికి రూ. 96,182 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. నాలుగు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం ఈ ఏడాది పూర్తవుతుందని.. మరో 6,608 కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణ పూర్తవుతుందని చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులకు సులభతరంగా ఉండేలా బోగీ తయారీ పథకాన్ని సమీక్షిస్తామని పేర్కొన్నారు. ముంబై - అహ్మదాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ఏర్పాటుపై అధ్యయన నివేదిక మరో నాలుగైదు నెలల్లో అందుతుందని చెప్పారు. భద్రతా చర్యలకు సంబంధించి వార్షిక లక్ష్యాలను గుర్తించేందుకు.. ఐదేళ్ల కార్పొరేట్ భద్రతా ప్రణాళిక మూడు నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు. మెట్రో సిటీల మధ్య రైళ్ల వేగం పెంపు మెట్రో సిటీల మధ్య నడిచే రైళ్ల వేగం గణనీయంగా 200 కిలోమీటర్ల వరకు పెరగనుంది. ఎంపిక చేసిన తొమ్మిది రైల్వే కారిడార్లలో ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై వంటి మెట్రో నగరాల మధ్య ప్రయాణం రాత్రి గడిచేలోగా పూర్తయ్యేలా చూడటమే ఇందులోని ప్రధానాంశం. ఆయా తొమ్మిది రైల్వే కారిడార్లలో ప్రస్తుతం గంటకు 110, 130 కిలోమీటర్లుగా ఉన్న రైళ్ల వేగాన్ని.. ఇకపై 160, 200 కిలోమీటర్లకు పెంచనున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు తగినట్టుగా ట్రాక్‌లను మెరుగుపరచడం, బోగీలను ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, వంటి చర్యలు చేపడతామని తెలిపారు. గూడ్స్ రైళ్ల సగటు వేగాన్ని కూడా పెంచనున్నట్లు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ వంటి ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకు ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. వీలైన ప్రతి చోటా సౌర విద్యుదుత్పత్తి ప్రయాణికుల చార్జీలను పెంచకూడదన్న నిర్ణయం వెనుక ఇటీవలి కాలంలో డీజిల్ ధరలో చోటుచేసుకున్న భారీ తగ్గుదల కూడా ఒక కారణమని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ప్రయాణికులకు అందిస్తున్న సేవల్లో మెరుగుదలను చూపకముందే చార్జీలను పెంచడం అన్యాయమని తనకు అనిపించిందన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రైల్వేలకు చెందిన స్థలాలను, స్టేషన్లను, ట్రాకులను సౌర విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించుకుంటామన్నారు. అవకాశమున్న ప్రతి చోటా సౌరఫలకాలను ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేస్తామన్నారు. హైటెక్ మార్గంలో సురేశ్‌ప్రభు రైలు... * 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం * ప్రత్యేక ఈ-టికెటింగ్ వెబ్సైట్ రూపకల్పన, డెబిట్ కార్డుతో టికెట్లు పొందే సౌకర్యం * ఆన్లైన్లో విశ్రాంతి గదుల బుకింగ్, వికలాంగులకు వీల్‌చైర్ బుకింగ్ * టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే నచ్చిన ఆహారం ఎంచుకునే సదుపాయం * బ్రాండెడ్ సంస్థలు, ఫుడ్-చైన్ సంస్థలతో ప్రయాణికులకు ఆహార సరఫరా * 120 రోజుల ముందుగానే ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం * స్టేషన్‌కు వచ్చిన ఐదు నిమిషాల్లోనే సాధారణ టికెట్ పొందేలా సదుపాయాలు * రైల్ కమ్ రోడ్ టికెట్లను మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించటం * రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయటం * ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనల కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన * భద్రత, సేవలకు సంబంధించి 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఫోన్ లైన్లు * బోగీల ద్వారాలను వెడల్పు చేయటం, పెద్ద స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల అమరిక * రైళ్లలో బెర్తుల ఆధునీకరణ, డిజైన్, నాణ్యత, శుభ్రతల ప్రమాణాల పెంపు * స్లీపర్ బోగీల్లో పై బెర్తుల్లోకి ఎక్కేందుకు ఆధునిక మడత నిచ్చెన్ల అమరిక * రైల్వే స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్త విభాగం ఏర్పాటు * బోగీల్లోనూ చెత్తడబ్బాల ఏర్పాటు, రైలు బోగీల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు * శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు, అన్ని రైళ్లలో మొబైల్ ఫోన్ చార్జింగ్ సౌకర్యాలు * మహిళల భద్రత కోసం రైళ్లలో సీసీటీవీ కెమెరాలతో నిఘా * 9 రైల్వే కారిడార్లలో రైళ్ల వేగాన్ని 200 కిలోమీటర్ల వరకూ పెంచటం * ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థను స్థాపించటం అమ్మో.. ఎంత పొడుగో? ‘బండెనక బండి కట్టి..’ అన్నట్లు ఒకదాని వెనుక మరొకటి బోగీలతో రైళ్లు సాగిపోతూనే ఉంటాయి. మరి వాటి పొడవెంతుంటుందో తెలుసా?.. మన దేశంలో గూడ్స్ రైళ్లు 1.2 కిలోమీటర్ల వరకూ, ప్రయాణికుల రైళ్లు 600 మీటర్ల వరకూ ఉంటాయి. కానీ పశ్చిమ ఆస్ట్రేలియాలో బీహెచ్పీ సంస్థ ఏకంగా 682 వ్యాగన్లతో 7.35 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును నడిపింది. 8 ఇంజన్లను వాడిన ఈ రైలు ఏకంగా లక్ష టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించింది. దక్షిణాఫ్రికాలో 660 వ్యాగన్లతో 7.3 కి.మీ పొడవైన రైలును నడిపారు.. ఇది 16 ఇంజన్లతో 70 వేల టన్నుల సామగ్రిని మోసుకెళ్లింది. రష్యా కూడా 439 వ్యాగన్లతో 6.5 కిలోమీటర్ల పొడవైన రైలును నడిపింది. ఇక బెల్జియంలో 70 కోచ్‌లతో 1.8 కి.మీ. పొడవున్న ప్యాసింజర్ రైలును నడిపారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో 90 కోచ్‌లతో 1.2 కి.మీ. పొడవైన రైళ్లను నడుపుతారు. సామగ్రి మోసుకుపోవడానికి గూడ్స్ రైలు.. మనం వెళ్లడానికి ప్రయాణికుల రైలు.. కానీ ప్రత్యేకంగా రచయితల కోసమే ఒక రైలును నడుపుతారని తెలుసా? అమెరికాలో ‘ఆమ్ట్రాక్’ సంస్థ ‘ఆమ్ట్రాక్ రెసిడెన్సీ’ పేరిట ఈ రైలును నడుపుతుంది. కొన్ని నెలల పాటు వేలాది కిలోమీటర్ల దూరం సాగే ఈ ప్రయాణంలో రచయితలు ఎలాంటి బాదరబందీ లేకుండా ప్రశాంతంగా రచనలు చేసుకోవచ్చు. ప్రకృతి సోయగం, గ్రామీణ వాతావరణం, వివిధ ప్రాంతాలు, సంస్కృతుల మధ్య జరిగే ఈ రైలు ప్రయాణానికి అవకాశం ఉండేది మాత్రం కేవలం 24 మందికే. ఒక్కొక్కరికి రైల్లోనే ఒక గది, దానిలో బెడ్, రాసుకోవడానికి టేబుల్, భోజన సౌకర్యమూ ఉంటుంది. బాగా డిమాండ్ ఉండే ఈ ‘ఆమ్ట్రాక్ రెసిడెన్సీ’లో ప్రయాణం చేయాలంటే మనం రాసే రచనలతో పాటు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇలా ఈ సారి 16,000 దరఖాస్తులురాగా.. అందులోంచి 115 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఇంకా తుది 24 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. ప్రభుత్వ సహకారం 40,000 కోట్లు! ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రైల్వే బడ్జెట్ వ్యయం రూ. 1,00,011 కోట్లు కాగా, అందులో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం రూ. 40 వేల కోట్లు ఉంది. అంటే మొత్తం రైల్వే బడ్జెట్లో ప్రభుత్వ స్థూల బడ్జెటరీ మద్దతు(జీబీఎస్) 41.6%. గత ఆర్థిక సంవత్సరం రైల్వేలకు ప్రభుత్వం ఇచ్చిన బడ్జెటరీ మద్దతు రూ. 30 వేల కోట్లు కాగా, ఈ ఏడాది అది భారీగా పెరిగి రూ. 40 వేల కోట్లకు చేరింది. మిగతా మొత్తంలో అంతర్గత వనరుల ద్వారా రూ. 17,793 కోట్లు, డీజిల్ సెస్ ద్వారా రూ. 1,645 కోట్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) ద్వారా రూ. 17 వేల కోట్లు, ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య పథకాల ద్వారా రూ. 6 వేల కోట్లను సేకరించాలనుకుంటోంది. ఇవి పోనూ మిగతా నిధుల సేకరణలో ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఎల్ఐసీ తదితర కార్పొరేషన్ల సహకారం తీసుకోనుంది. -
సదా మీ సేవలో..!
* ప్రయాణికుల స్వర్గధామంగా రైల్వేలు * సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ * అడుగడుగునా అభివృద్ధికి ప్రణాళికలు * రైళ్లు, స్టేషన్లలో అనేక మార్పులకు ప్రతిపాదనలు * వసతుల కల్పనకు రూ. 12,500 కోట్లు * గత కేటాయింపుల కంటే 67 శాతం అధికం స్వచ్ఛ రైల్ - స్వచ్ఛ భారత్ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ స్వచ్ఛ రైల్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. స్టేషన్లను, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు శిక్షణనిప్పించి ఇంటిగ్రేటెడ్ క్లీనింగ్ ప్రవేశపెడతామని సురేశ్ ప్రభు తెలిపారు. పర్యావరణహితం కోసం చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే కేంద్రాలను కూడా కోచ్ టర్మినల్స్ వద్ద ఏర్పాటు చే స్తామన్నారు. గతంలో చేపట్టిన 120 రైల్వే స్టేషన్లకుతోడు మరో 650 స్టేషన్ల పరిధిలో కొత్త మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే కోచుల్లో 17,388 బయో మరుగుదొడ్లను అమర్చామని, మరో 17 వేల టాయిలెట్లను కూడా మార్చుతామని చెప్పారు. మరో ఆరు నెలల్లో వ్యాక్యూమ్ టాయిలెట్లను రూపొందించే బాధ్యతను రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్డీఎస్వో)కు అప్పగించినట్లు తెలిపారు. నాన్ ఏసీ రైళ్లలోనూ చెత్తడబ్బాలు(డస్ట్‌బిన్స్) ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులకు సరికొత్త రైల్వేలను పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆ దిశగా బడ్జెట్లో అనేక చర్యలను ప్రతిపాదించారు. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, బయో టాయ్లెట్లు, ఐదు నిమిషాల్లో జనరల్ టికెట్ల జారీ, రైళ్లలో భద్రత, కొత్త డిజైన్లతో సీట్లు, 24 గంటల హెల్ప్‌లైన్, సకల రుచులతో నాణ్యమైన ఆహారం, వైఫై వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వసతుల కల్పన కోసం మొత్తంగా రూ. 12,500 కోట్లను కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపుల కన్నా 67 శాతం అధికంకావడం గమనార్హం. స్టేషన్ల అభివృద్ధి, సరుకు నిర్వహణ కేంద్రాల ఏర్పాటు కోసం ఏకంగా లక్ష కోట్లను ప్రతిపాదించారు. వచ్చే ఐదేళ్లలో రైలు ప్రయాణికులు భిన్నమైన అనుభవాన్ని పొందుతారని ప్రభు వ్యాఖ్యానించారు. వినియోగదారుల నుంచి సలహాలు సుపరిపాలనలో భాగంగా రైల్వే ఉద్యోగులతో చర్చించడం, సోషల్ మీడియా ద్వారా వినియోగదారులతో ముచ్చటించడం ద్వారా 2 వేలకుపైగా సలహాలు, సూచనలు అందాయని మంత్రి తెలిపారు. వాటి పరిశీలన జరుగుతోందని, కొన్నింటిని ఈ బడ్జెట్లోనే చేర్చామన్నారు. రైల్వేల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల తమశాఖ దేశ పురోభివృద్ధికి ఇంజన్‌గా మారుతుందని ప్రభు అభివర్ణించారు. 24 గంటల హెల్ప్‌లైన్ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు 138 హెల్ప్‌లైన్ నంబర్ ఇకపై 24/7 పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఓ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఒకటో తేదీ నుంచే ఉత్తర రైల్వే పరిధిలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చే స్తామన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం నిర్భయ నిధిని వినియోగించనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన బోగీల్లో నిఘా కెమెరాలను ప్రయోగాత్మకంగా అమర్చుతామన్నారు. ప్రయాణికుల సంతృప్తే ముఖ్యం వచ్చే ఐదేళ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు రైల్వే మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా కృషి చేస్తామని ఉద్ఘాటించారు. పరిశుభ్రత, సురక్షిత ప్రయాణం, రైళ్ల వేగం పెంపు వంటి చర్యలతో ప్రయాణికుల ఇబ్బందులను తొలగిస్తామని, వారి నుంచి అందే ఫిర్యాదులను త్వరితంగా పరిష్కరిస్తామని మంత్రి వివరించారు. ఆపరేషన్ 5 నిమిషాలు జనరల్ టికెట్లు పొందడానికి ప్రయాణికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి ప్రస్తావించారు. వారి కష్టాలను దూరం చేసేందుకు ‘ఆపరేషన్ ఐదు నిమిషాలు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్ కు వచ్చిన ఐదు నిమిషాల్లోనే జనరల్ టికెట్ పొందగలిగేలా చేయడమే దీని లక్ష్యం. ఇందుకోసం హాట్బటన్స్, కాయిన్ వెండింగ్ మెషీన్స్, ఎస్డీటీ(సింగిల్ డెస్టినేషన్ టెల్లర్)ల సేవలను విస్తృతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. డెబిట్ కార్డుతోనూ పనిచేసే ఏటీవీఎంలను ప్రవేశపెడతామన్నారు. అలాగే ప్రత్యేక ఈ-టికెటింగ్ పోర్టల్‌ను కూడా అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా కూడా జనరల్ టికెట్లు ఇచ్చే విధానాన్ని కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు చెప్పారు. వికలాంగులు రాయితీతో కూడిన ఈ-టికెట్లు పొందే సౌకర్యం కల్పిస్తామన్నారు. టికెట్ రద్దు చేసుకుంటే బ్యాంకింగ్ సిస్టం ద్వారానే డబ్బును తిరిగి చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సురేశ్‌ప్రభు తెలిపారు. జమ్మూ రూట్లో ఉన్న రైల్-కమ్-రోడ్ టికెట్ల విధానాన్ని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. సైనికుల సులభ ప్రయాణం కోసం డిఫెన్స్ ట్రావెల్ సిస్టంను అభివృద్ధిపరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 120 రోజుల ముందు నుంచే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇది 60 రోజులుగా ఉంది. హాయిగా పడక వచ్చే ఆరు నెలల్లో రైళ్లలో బెర్త్‌లను మెరుగుపరుస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. డిజైన్, నాణ్యత, శుభ్రత విషయంలో జాగ్రత్త తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థను సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్లో టికెట్‌తో పాటే డబ్బు చెల్లించే ప్రయాణికులందరికీ బెడ్‌రోల్స్‌ను అందించే సౌకర్యాన్ని విస్తృతం చేస్తామని చెప్పారు. టికెట్‌తోపాటే పసందైన ఆహారం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన రైల్వేశాఖ ప్రస్తుత బడ్జెట్లో వారికి ఇష్టమైన ప్రాంతీయ రుచులను అందించే ఉద్దేశంతో ప్రఖ్యాత ఫుడ్ చైన్ సంస్థలను రంగంలోకి దించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎక్కువ రైళ్లకు ఈ సేవలను విస్తరిస్తామని రైల్వేమంత్రి చెప్పారు. రైల్వే కారిడార్లలో బేస్ కిచెన్లను ఏర్పాటు చేసి పేరున్న ఏజెన్సీలతో ఆహార సేవలను అందిస్తామన్నారు. తక్కువ ధరకే స్వచ్ఛమైన నీటిని అందించే విక్రయ యంత్రాలను అత్యధిక స్టేషన్లకు విస్తరిస్తామన్నారు. సుఖమయ ప్రయాణం రైళ్లలో వినోదానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ డివిజన్లో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టామని, దానికి వచ్చే స్పందనను బట్టి ఇతర డివిజన్లకు విస్తరిస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. మొబైల్ ఫోన్ చార్జింగ్ సౌకర్యాన్ని జనరల్ బోగీల్లోనూ కల్పిస్తామని, స్లీపర్ క్లాస్‌లో మరిన్ని అమర్చుతామని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న రైళ్లలో బోగీలను పెంచడం ద్వారా బెర్త్‌ల సంఖ్యను పెంచుతామని, ఎంపిక చేసిన రైళ్లలో సామాన్యుల కోసం జనరల్ బోగీలను పెంచుతామని చెప్పారు. స్లీపర్ బోగీల్లో పెబైర్తుల్లోకి ఎక్కేందుకు మడత నిచ్చెనల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు రైళ్లలో ప్రవేశద్వారం వెడల్పు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే వారికి కింది బెర్తులు కేటాయించే ఏర్పాట్లు చేస్తామన్నారు. మహిళల భద్రతకు త్రీ-టైర్ బోగీల్లో మధ్య సీట్లను కేటాయిస్తామన్నారు. ప్రయాణికులకు పిక్ అండ్ డ్రాప్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచన ఉందన్నారు. ఎ-కేటగిరీ స్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్న వై-ఫై సౌకర్యాన్ని బి-కేటగిరీ స్టేషన్లకూ విస్తరిస్తామన్నారు. పెద్ద స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను అమర్చడానికి రూ. 120 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది గత కేటాయింపుల కంటే 76 శాతం అధికమని పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం వచ్చే రెండేళ్లలో ‘ట్రెయిన్ సెట్’గా పిలిచే ఆధునిక రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు. స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను పెంచేందుకు నిధుల కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎంపీలు ముందుకు రావాలని రైల్వే మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలకు, రైల్వేలకు అనుసంధానంగా పనిచేసేలా స్థానిక ఎంపీల నేతృత్వంలో ఎక్కడికక్కడ డివిజనల్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 9 కారిడార్లలో రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న గంటకు 110-130 కిలోమీటర్ల నుంచి 160-200 కిలోమీటర్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ఎస్ఎంఎస్ అలర్ట్ రైలు వచ్చి/పోయే తాజా వేళలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందించేలా ఎస్ఎంఎస్ అలర్ట్ సేవలను ప్రవేశపెడుతున్నట్లు ప్రభు ప్రకటించారు. అలాగే ప్రయాణికుడు దిగే స్టేషన్ రావడానికి అరగంట ముందే అలర్ట్ ఎస్ఎంఎస్ పంపుతామని చెప్పారు. టీటీఈలకు ప్రత్యేక పరికరాలను అందించి ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలు, చార్టులు పొందే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ విధానంతో పేపర్ వినియోగాన్ని తగ్గించడమే కాక టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికులకు వేగంగా డబ్బు తిరిగి వ్వడం సాధ్యమవుతుందని మంత్రి వివరించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కస్టమర్ పోర్టల్, కేంద్రీకృత రైల్వే డిస్ప్లే నెట్వర్క్ వంటి సౌకర్యాలను మరింత ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఏం ఒరిగిందని...!
కొత్త రైల్వే బడ్జెట్ కూడా పాత సంప్రదాయాన్నే కొనసాగించిందని నేతలు మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం చేసే విధానాన్ని కొత్త ప్రభుత్వమూ కొనసాగించిందని, ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనాలు శూన్యమని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. చాలా కాలంగా ైరె ల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారైనా అమాత్యులు దయ చూపిస్తారని ఆశ పడినా, చివరకు నిరాశే మిగిలిందని నాయకులు, ప్రజలు తెలిపారు. బీజేపీ, టీడీపీ నేతలు మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. - విజయనగరం టౌన్, ఫోర్ట, కురుపాం కొత్తదనం లేని రైల్వే బడ్జెట్.. కొత్తదనం లేని బడ్జెట్‌తో ఈ సారి కూడా జిల్లాకు మొండి చేయే మిగిలింది. దశాబ్దాలుగా ఇచ్చిన హామీలు ఇచ్చినట్లే ఉండి పోయాయి. కనీసం కొత్త రైళ్లు లేవు, లైన్లూ లేవు. ఈ బడ్జెట్‌తో ఉత్తరాంధ్రాకు తీవ్ర అన్యాయమే జరిగింది. - పాముల పుష్పశ్రీవాణి, కురుపాం ఎమ్మెల్యే నిరాశే... రైల్వే బడ్జెట్ ప్రజలకు నిరాశే మిగి ల్చింది. రైల్లో ప్రయాణించే వారి వద్ద నుంచి వసూలు చేసే చార్జీలు పెంచకున్నా రవాణా చార్జీలు పెంచటం ద్వారా పరోక్షంగా భారం మోపారు. ఈ విధానం ద్వారా నిత్యావసరల ధరలు పెరుగుతాయి. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదు. ఎప్పటి నుంచో విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తు న్నా అది జరగని పరిస్థితి. ఇంత మంది ఎంపీలు, ముఖ్యమంత్రులు ఉన్నా ప్రయోజనం లేకపోతోంది. - కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎప్పటిలాగానే అన్యాయం... రైల్వే బడ్జెట్ ప్రకటనలో ఎప్పటిలా నే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశా రు. బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోంది. అత్యధిక ఆదాయాన్నిస్తున్న విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌గా ప్రకటించకపోవటం అన్యాయం. ఈ రైల్వే బడ్జెట్ ద్వారా ఆంధ్రులకు కలిసొచ్చేది లేకున్నా అదనంగా రవణా చార్జీల పేరుతో డబ్బు గుంజు కుంటున్నారు. ఈ వైఖరిని వ్యతిరేకిస్తున్నాం. - పెనుమత్స సాంబశివరాజు, కేంద్రపాలక మండలి సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో... ఎలాంటి ప్రయాణచార్జీలు , రవాణా చార్జీలు పెంచకుండా సామాన్య ప్రజ లకు అందుబాటులో రైల్వే బడ్జెట్ ఉం ది. మహిళల భద్రత కోసం, సీసీ కెమెరాలతో కోచ్‌లు ఏర్పాటు చేయడం, మహిళల పట్ల బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. రైతులకు వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేవిధంగా పచ్చి సరుకులు రవాణాకు ప్రత్యేక బోగీలు కేటాయించడం అభినందనీయం. - బవిరెడ్డి శివప్రసాదరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పనిభారమే... ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగులు రిటైరయ్యారు. ప్రైవేటీకరణ దిశగా చేసే ఆలోచనలు మానుకోవాలి. దీనివల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. ఉన్న వారికి పనిభారం రెట్టింపవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విశాఖ నుంచి విజయవాడ వరకూ ఇంటర్ సిటీ ఏర్పాటుచే యాల్సి ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. - జి.కాశిబాబు, శ్రామిక్ కాంగ్రెస్ బ్రాంచ్ సెక్రటరీ, విజయనగరం మొండిచేయి కొత్త రైళ్ల ప్రతిపాదన లేకండా ఉత్తరాంధ్రకు మరోసారి మొండిచేయి చూపించారు. పేపర్‌లెస్ టికెటింగ్ విధానం వల్ల ఉన్న ఉద్యోగాలు తగ్గిపోతాయి. కొత్తగా ఉద్యోగకల్పన ఉండదు. జనరల్ బోగీలు పెంచడం శుభపరిణామం. - జి.నాగేశ్వరరావు, శ్రామిక్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి, విజయనగరం తీరని అన్యాయం... కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు ప్రజలకు తీరని అ న్యాయం జరిగింది. కొత్తరైళ్లు, లైన్ల గురించి ప్రస్తావించకుండా కంటి తుడుపుగా మరుగుదొడ్లు నిర్మిస్తాం, మినరల్ వాటర్ ఇస్తామనం హాస్యాస్పదం. - యడ్ల రమణమూర్తి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇది తీవ్ర అన్యాయం రైల్వే మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. 20వేల మంది అభిప్రాయాలు తీసుకున్న ఆయన ఇచ్చే బడ్జెట్ గొప్పగా వస్తుందనకునే వా రందరి ఆశలను నీరు గార్చారు. ఖాళీగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల భర్తీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. - డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్, రైల్వే ఓబీసీ సెల్ నాయకులు ఆశాజనకంగా లేదు ప్రయాణికులకు భద్రత, సౌకర్యం, సంతృప్తి పరంగా కొన్ని చర్యలు చేపట్టారు. కొత్త జోన్గానీ, రైళ్లుగానీ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ ఆశాజనకంగా లేని బడ్జెట్ ఇది. కొత్త రైళ్లు లేవు. ప్రాజెక్టులు లేవు. చార్జీలు పెంచకపోవడం, వైఫై వంటి సౌకర్యాలు పెట్టడం హర్షణీయం. - ద్వారపు రెడ్డి జగదీష్, టీడీనీ జిల్లా అధ్యక్షుడు కొత్తదనమేమీ లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగలేదు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేశారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే ఐదేళ్లలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. బడ్జెట్లో కొత్తదనమేమీ లేదు. కొత్త రైళ్ల ఊసేలేదు. - తమ్మినేని సూర్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి -
కరుణించని ప్రభు
విజయనగరం టౌన్ : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలకు పరిష్కారమార్గం చూపకపోవడంతో జిల్లావాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అశోక్ చొరవతో ప్రత్యేక జోన్ వస్తుందనుకున్న ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ఎప్పటిలాగానే రైల్వే బడ్జెట్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. 2015-16 బడ్జెట్‌ను పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు జిల్లాకు మొండిచేయి చూపించారు. చాలా ఏళ్లగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపలేదు. కొత్త ఇంటర్ సిటీలు వ స్తాయని, రాష్ట్ర విభజన తర్వాత విశాఖ నుంచి విజయవాడ వరకూ, అదేవిధంగా విశాఖ నుంచి భువనేశ్వర్ వరకూ ప్రత్యే క రైళ్లు ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉందన్న ప్రజల ఆశలు నీరుగారాయి. బడ్జెట్లో పాత వాటి ఊసేలేదు...కొత్త ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లేదు. గత ఏడాది ఒక్క రైలుతో సరిపెట్టగా, ఈ ఏడాది అదీ లేకుండా చేశారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడంపై విమర్శ లు వ్యక్తమయ్యాయి. పట్టాలెక్కని హామీలివే.... ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా చేయాలన్న ఆశ అడియాశగానే మిగిలింది. విజయనగరం నుంచి రాజాం మీదగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రస్తావనే లేకుండాపోయింది. విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్థారణ కేంద్రం తదితర వన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇక ఏళ్ల నాటి డిమాండ్లైన పలాస-విశాఖ రైలు, సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న ది అలానే ఉండిపోయాయి. సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మిం చిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాం డ్కు మోక్షం కలగలేదు ఇక రూ.10కోట్లుకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి డిమాండ్ జాబితాలో చేరిపోయింది. ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా అంతే. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. దాన్నీ పట్టించుకోలేదు వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులు వినతులుగానే మిగిలిపోయాయి. -
ఇంకా రైలెక్కలేదు..
న్యూఢిల్లీ: జపాన్, చైనాల్లో విమానాలతో పోటీ పడుతూ బుల్లెట్ రైళ్లు దూసుకెళుతున్నాయి.. భారత్ వంటి దేశాల్లో లోపలా, బయటా కిక్కిరిసిన జనాలతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.. మరోవైపు ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో రైళ్లే లేవు. ప్రత్యక్షంగా రైలును చూడని, ఎక్కని జనం కోట్లలో ఉన్నారు మరి. ప్రస్తుతం దాదాపు 25 దేశాల్లో అసలు రైళ్లే లేవు. మన పొరుగునే ఉన్న భూటాన్ నుంచి సైప్రస్, ఉత్తర తిమోర్, కువైట్, లిబియా, మకావూ, మాల్టా, నైగర్, ఓమన్, పపువా న్యూగినియా, ఖతార్, రువాండా, సాన్ మారినో, సోలోమన్ ఐలాండ్స్, సోమాలియా, టోంగా, ట్రినిడాడ్, యెమెన్, బహమాస్, బురుండి, బహ్రెయిన్ వంటి దేశాల్లో రైళ్లే లేవు. వీటిలో కొన్నింటిలో బ్రిటిష్ పాలనా కాలంలో రైళ్లు తిరిగినా.. ఇప్పుడు మూలనపడ్డాయి. మరి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే రైలు మార్గాలను నిర్మించుకుంటున్నాయి. ఇక ప్రపంచంలోనే అతి తక్కువగా మొనాకోలో కేవలం 1.7 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది. అలాగే లావోస్‌లో 3.5 కిలోమీటర్లు, నౌరూలో 3.9, లీచెన్‌స్టైన్‌లో 9.5, బ్రూనైలో 13, పరాగ్వేలో 38, సెయింట్ కిట్స్‌లో 58, మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 59 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కిలోమీటర్లకన్నా తక్కువగా రైలు మార్గాలున్న దేశాల సంఖ్య ఏకంగా 64 కావడం కొసమెరుపు. రైల్వే ట్రాక్నూ ఎత్తాల్సిందే.. అంతటా రైలొస్తే గేట్లు వేస్తారు... ఇక్కడ మాత్రం పడవలొస్తే రైలు పట్టాలనే ఎత్తేస్తారు.. వెళ్లిపోయాక మళ్లీ దించేస్తారు.. ఆశ్చర్యపోతున్నారా? మన దేశ దక్షిణ దిశన చిట్టచివర ఉన్న రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతూ సముద్రంపై ఈ రైల్వే వంతెన ఉంది. రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జికి ఎటు చూసినా సముద్రం.. మధ్యలో మన రైలు.. కిటికీలోంచి చూద్దామన్నా గుండెలు గుభేలుమనడం ఖాయం. 1902లో రూ. 70 లక్షలతో 600 మందితో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మధ్యలో పాక్ జలసంధిపై రెండు వైపులా ఎత్తగలిగే 65.2 మీటర్ల పొడవున ‘కాంటిలివర్’ బ్రిడ్జినీ నిర్మించారు. ఎప్పుడో వందేళ్ల కింద 1914లో రైళ్లు నడవడం మొదలుపెట్టినా... ఇప్పటికీ వంతెన దృఢంగా ఉంది. 1964లో వచ్చిన భారీ తుపానును ఇది తట్టుకుని నిలవడం అప్పటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. -
చుక్ చుక్... హైటెక్ !
రైల్వేల సామర్థ్యం పెంపు, విస్తరణకే పెద్దపీట ప్రయాణికులకు హైటెక్ సౌకర్యాలు, మెరుగైన సదుపాయాలు.. మరిన్ని స్టేషన్లలో వైఫై, రైళ్లలో వినోదం, భద్రతాచర్యలు రైళ్లు, స్టేషన్ల పరిశుభ్రతకు ‘స్వచ్ఛ రైల్’ ప్రయాణ చార్జీల్లో పెంపులేదు సరుకు రవాణా చార్జీలు 10 శాతం పెంపు దీంతో రూ. 4 వేల కోట్ల అదనపు ఆదాయం ఆహారధాన్యాలు, సిమెంట్, ఇనుము, బొగ్గు, గ్యాస్‌లపై భారం రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక 9 కారిడార్లలో వేగం 200 కి.మీ. వరకూ పెంపు కొత్త రైళ్లు, కొత్త మార్గాలను తర్వాత ప్రకటిస్తాం పార్లమెంటుకు 2015-16 రైల్వే బడ్జెట్‌ను సమర్పించిన రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ఆధునీకరణ పట్టాలపైకి ‘ప్రభు రైలు’ పరుగులు భారతీయ రైల్వే వ్యవస్థను ‘హైటెక్’ మార్గంలో నడిపే దిశగా రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తొలి రైల్వేబడ్జెట్‌ను ఆవిష్కరించారు. కొత్త రైళ్లు, కొత్త మార్గాలు, కొత్త ప్రాజెక్టులు వంటి ప్రకటనలు పక్కనపెట్టి.. వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచటం, మరింతగా విస్తరించటం, బలోపేతం చేయటం, ప్రమాణాలను మెరుగుపరచటానికే పూర్తి ప్రాధాన్యమిచ్చారు. ఎన్డీఏ సర్కారు ‘స్మార్ట్’ ప్రణాళికలు, ‘స్వచ్ఛ’ కార్యక్రమాలకు అనుగుణంగా.. రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే సేవలు, సదుపాయాలను సాంకేతికంగా ఆధునీకరించే ప్రణాళికలు ప్రకటించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యంతో మొదలుపెట్టి.. ప్రయాణికుల సదుపాయాలు, సౌకర్యాలను ఆధునీకరించటం కోసం తాజా బడ్జెట్లో రూ. 12,500 కోట్లు కేటాయించారు. రైళ్ల వేగాన్ని గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచుతామన్నారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తామని.. ప్రయాణికులకు భిన్నమైన అనుభవాన్ని అందిస్తామని ప్రకటించారు. -
రైల్వే బడ్జెట్-సైడ్‌లైట్స్...
ఎంపీల్యాడ్స్ నిధులా.. నో..నో! - ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో వసతులను మెరుగుపర్చేందుకు ఎంపీల్యాడ్స్ నిధులను ఇవ్వాలంటూ మంత్రి సురేశ్ ప్రభు చేసిన విజ్ఞప్తికి నో.. నో.. అంటూ ప్రతిపక్ష సభ్యులంతా ముక్తకంఠంతో తిరస్కరించారు. - మంత్రి ప్రసంగం ముగిసినా, కొత్త రైళ్ల ఊసేమీ లేకపోవడంతో ప్రతిపక్షంలోని అనేక మంది సభ్యులు నిరాశలో మునిగి పోయినట్లు కనిపించారు. - రైల్వేను మెరుగుపర్చేందుకు తన దీర్ఘకాలిక విజన్‌ను వివరించే ముందు.. ‘హే ప్రభూ.. ఏ కైసే హోగా?(దేవుడా, ఇదెలా చేయాలి?)’ అంటూ మంత్రి సురేశ్ ప్రభు చమత్కరించారు. - ‘కుచ్ నయా జోడ్ నా హోగా, కుచ్ పురానా తోడ్నా హోగా(కొన్ని కొత్తవాటిని చేర్చాలి. కొన్ని పాతవాటిని వదిలేయాలి)’ వంటి సూక్తులు వల్లిస్తూ ప్రసంగాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు. - రోడ్డు రవాణా మంత్రి గడ్కారీ వైపు చూస్తూ.. రోడ్డు రవాణా కన్నా రైల్వేలు తక్కువ కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తాయని, ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తాయని మంత్రి చమత్కరించగా, గడ్కారీ అంగీకరించినట్లుగా తలఊపారు. - తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ప్రతిపక్షం నుంచి అభ్యంతరాలేమీ రానీయకుండానే మంత్రి తన ప్రసంగాన్ని సాఫీగా ముగించారు. -
బడ్జెట్ బండి.. ఆగలేదండి
ఏలూరు/భీమవరం :రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇక్కడి స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పిం చాలని, నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ నిర్మించాలని, భీమవరం-గుడివాడ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు అధిక నిధుల కేటాయించాలని, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ఎంపీలు రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు ప్రతిపాదనలు ఇచ్చారు. బడ్జెట్ ప్రకటనను చూస్తే అవన్నీ బుట్టదాఖలైనట్టు స్పష్టమైంది. ఎంపీలను దూరం పెట్టారా బడ్జెట్ కసరత్తులో భాగంగా ఎంపీల నుంచి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రతిపాదనలు స్వీకరించారు. చివరకు వాటిని పట్టించుకోలేదు. ఈ తీరు చూస్తుంటే ఎంపీలను దూరం పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే సౌకర్యాల కోసం ఎంపీ కోటా నిధులను వెచ్చించాలని సూచించడం ఎంపీలను అయోమయంలోకి నెట్టేసింది. లిఫ్ట్‌లు.. ఎస్కలేటర్లు ఏ స్టేషన్లకో.. ప్రధాన రైల్వేస్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. జిల్లాలోని ఎన్ని స్టేషన్లకు ఈ సౌకర్యం కల్పిస్తారనేది తేలాల్సి ఉంది. అసలు మన జిల్లాలోని స్టేషన్లను ప్రధాన స్టేషన్లుగా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. మరోవైపు గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం స్టేషన్లలో సదుపాయాలు ఏమైనా కల్పిస్తారా లేదా అన్నది స్పష్టం కాలేదు. బడ్జెట్లో ఈ ప్రస్తావన కనిపించలేదు. ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా 970 చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. మన జిల్లాల్లో 15చోట్ల ఆర్వోబీలు నిర్మించాలనే ప్రతిపాదనలు దశాబ్దాల క్రితమే రైల్వే శాఖకు వెళ్లాయి. ఈసారైనా ఈ ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. కోటిపల్లికి దారేది కమలనాథులపై ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కోనసీమ రైల్వే ప్రాజెక్ట్‌పై పెట్టుకున్న ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి యూపీఏ సర్కారు తరహాలోనే ఎన్డీయే కూడా మొండిచెయ్యి చూపించింది. గత ఏడాది బడ్జెట్లో ఈ లైన్‌కు రూ.11 కోట్లు కేటాయిం చగా, ఈసారి రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజె క్ట్ ప్రతిపాదనల్ని సజీవంగా ఉంచడానికి మినహా ఈ కేటాయింపులు ఎందుకూ సరిపోవు. అదేవిధంగా విజయవాడ-భీమవరం బ్రాంచిలైన్ డబ్లింగ్ పనుల కోసం రూ.1,500 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది కేవలం రూ.150 కోట్లు మాత్రమే కేటాయించారు. -
దార్శనికత లేదు: విపక్షాలు
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఏమాత్రం పస లేదని విపక్షాలు మండిపడ్డాయి. రైల్వేకు ఉన్న ఎన్నో మంచి ఆలోచనలను అమల్లోకి పెట్టే దార్శనికత, రోడ్‌మ్యాప్ కొరవడ్డాయని విమర్శించాయి. ఈ బడ్జెట్‌పై ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉంది. యూపీఏ ప్రకటించిన పాత వాటికే మార్పులు చేశారు’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించింది. బడ్జెట్లో మంచిపదాలను రంగరించారని, అయితే లక్ష్యాలను ఎలా సాధిస్తారన్న దార్శనికత లేదని రైల్వే మాజీ మంత్రి, లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే పార్లమెంట్ వెలుపల విలేకర్లతో అన్నారు. ‘ప్రభుత్వ-ప్రైవేట్ విధానం, నిర్మాణం-నిర్వహణ-బదిలీ(బీఓటీ) విధానాల పాటిస్తామని రైల్వే మంత్రి చెప్పారు. అయితే ఇతరులపై ఆధారపడితే అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశంలేకపోవచ్చు’ అని అన్నారు. బడ్జెట్లో కేవలం కలలు గుప్పించారని మరో రైల్వే మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేదీ ఆరోపించారు. రైల్వేకు 50 శాతం నిధుల కొరత ఉందని, దీన్నెలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. బడ్జెట్ నిరాశగా ఉందని బీజేడీ నేత తథాగత సత్పత్తి అన్నారు. సురేశ్ ప్రభు ప్రవేశపెట్టింది బడ్జెటే కాదని, ఓ విజన్ డాక్యుమెంట్ మాత్రమేనని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. ‘ఏ కార్యాచరణా లేని గొప్ప ఆలోచనలు, ప్రయాణికుడు లేని బోగీలా ఉంది. డీజిల్ ధరలు తగ్గినందున చార్జీలూ తగ్గించాల్సింది’ అని బిహార్ సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రాజెక్టులకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో స్పష్టత లేదు. పూర్తిగా నిరాశచెందాం’ అని శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ వ్యాఖ్యానించారు. -
రైల్వేలో పెట్టుబడులు పెట్టండి: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు స్పందించి ముందుకు వచ్చి రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం పొందాలని కోరారు. ఢిల్లీలోని శ్రమ శక్తిభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రైల్వే బడ్జెట్ రాబోయే ఐదేళ్లు దేశానికి దిశానిర్దేశం చేసేలా ఉందని అభివర్ణించారు. -
బ్లాక్ టికెటింగ్‌కు ఊతం
120 రోజులు టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్‌కు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: అడ్వాన్స్ టికెట్ బుకింగ్ విషయంలో బ్లాక్ మార్కెట్‌కు అవకాశం కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్‌కు 60 రోజుల గరిష్ట సమయం అందుబాటులో ఉండగా దాన్ని తాజా బడ్జెట్లో మంత్రి సురేశ్ ప్రభు 120 రోజులకు పెంచారు. అంటే నాలుగు నెలల ముందే టికెట్ రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించారన్నమాట. గతంలో కూడా 120 రోజుల ముందస్తు అవకాశం ఉండేది. కానీ దళారులు టికెట్లను ముందుగానే బ్లాక్ చేసుకుని ఎక్కువ ధరకు నల్లబజారులో విక్రయిస్తున్నట్లు తేలటంతో రెండేళ్ల క్రితం దాన్ని 60 రోజులకు కుదించారు. కానీ ప్రభు మళ్లీ 120 రోజులకు పెంచటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రయాణికులు నాలుగు నెలల ముందు టికెట్ రిజర్వ్ చేసుకోవటం అరుదు. నెల, రెండు నెలల ముందు మా త్రమే ఎక్కువ మంది చేసుకుంటారు. దీన్ని గుర్తించే గతంలో గడువును 60 రోజు లకు కుదించారు. దీనిపై పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాలేదు. అయినా సురేశ్ ప్రభు దాన్ని మార్చటం విశేషం. టికెట్ బ్లాక్‌లో అమ్మేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కొద్ది రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే జీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాంటి దళారులపై నిఘా వేసేందుకు 10 రోజుల స్పెషల్ డ్రైవ్ కూడా మొదలు పెట్టారు. కానీ బ్లాక్ మార్కెటింగ్‌కు ఊతమిచ్చేలా ఇప్పుడు నిర్ణయం తీసుకోవటం విశేషం. -
‘తూర్పు’ చేరని రైలు
ఆవిరయ్యాయి. అనుకున్నట్టే మన ‘సార్లు’ ఈసారి కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సాధించితీరతామన్న ఎంపీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గతవారం హైదరాబాద్‌లో సమీక్షించి ఫలితమేమిటని జిల్లావాసులు నిట్టూరుస్తున్నారు. కాకినాడ మెయిన్ లైన్‌ను ఈసారి పట్టాలెక్కించాలన్న కృష్ణారావు సూచనకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పుడు.. బడ్జెట్లో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల్ని కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు కరుణించలేదు. నాలుగు దశాబ్దాలుగా కాకినాడ సహా జిల్లావాసులు గంపెడాశతో ఎదురు చూస్తున్న కాకినాడ మెయిన్‌లైన్ డిమాండ్‌కు బడ్జెట్లో రిక్తహస్తమే ఎదురైంది. ఎప్పుడో ఆమోదం లభించిన ప్రాజెక్టు కావడంతో ఏటా మాదిరిగానే బడ్జెట్లో మొక్కుబడిగా రూ.10 లక్షలు విదిల్చారు. కేవలం 21 కిలోమీటర్ల నిడివి కలిగిన లైన్ నిర్మాణంతో కాకినాడను మెయిన్‌లైన్‌తో అనుసంధానించే దిశగా ఎంపీల ప్రయత్నం కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు సాధిస్తామని ఆర్భాటంగా ప్రకటించే ఎంపీలు పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించే కొత్త ప్రభుత్వం.. మొదటి బడ్జెట్ అద్భుతంగా ఉంటుందని ఊహించిన ప్రజలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇదివరకటి ప్రభుత్వాల బాటలోనే పయనించిన ‘మోదీ రైలు’ షరా మామూలుగానే ‘తూర్పు’ తీరం చేరలేదు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనకు కానీ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు కానీ, కొత్త రైళ్ల ప్రకటనకు కానీ చోటు లేకుండా పోయింది. రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సంక్షేమం అనే రెండు అంశాలనూ పక్కనపెట్టి రూపొందించిన ఈ బడ్జెట్ ప్రగతినిరోధకంగా ఉందని, మోదీ రైల్ గాడీ ఒట్టి గారడీగా మిగిలిందని జిల్లాకు చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారీ అన్యాయమే.. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రతిసారీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉన్నప్పుడే న్యాయం జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయింది. ఆంధ్రావాసుల కలగా ఉన్న విజయవాడ, విశాఖ జోన్ల కోరిక నెరవేరడంలేదు. ప్రత్యేక రాష్ట్రంలో రైల్వే లైన్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు లేకపోవటం బాధాకరం. - పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి, పీఏసీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాశపరచిన బడ్జెట్ రైల్వే బడ్జెట్ జిల్లావాసుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కొత్త ప్రభుత్వమైనా క్లియర్ చేస్తుందనుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు, రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదో చేస్తుందని ప్రజలు ఆశ పడ్డారు. కనీసం కొత్త రైళ్లను కూడా రైల్వే మంత్రి ప్రకటించకపోవడం విచారకరం. కాకినాడను మెయిన్ రైల్వే లైనుతో అనుసంధానించడం, కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను ఏర్పాటువంటి డిమాండ్లు దీర్ఘకాలంగా ఉన్నవే. వాటిని మరోసారి నిర్లక్ష్యం చేశారు. - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనం రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపారు. రాష్ట్రానికి కొత్త లైన్లు, కొత్త రైళ్లు వస్తాయని, ముఖ్యంగా కోనసీమ రైల్వేలైనుకు మోక్షం కలుగుతుందని ప్రజలు ఆశించారు. విజయవాడ రైల్వే జోన్ ఏర్పాటు డిమాండ్ అసలు ప్రస్తావనకే నోచుకోలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా ఏ ప్రయోజనాలూ సాధించలేకపోయింది. ఆ పార్టీ ఎంపీల నోటికి సీఎం చంద్రబాబు తాళం వేసి పంపించడమే దీనికి కారణం. - చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట రైల్వే జోన్‌పై అన్యాయం రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి మొండిచేయి చూపారు. సాయం చేసి ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం అన్యాయం. సాధారణ బడ్జెట్లోనైన నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. లోటు బడ్జెట్‌ను భర్తీ చేయడానికి అవసరమైన మొత్తం నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను. - దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని జిల్లాకు మొండిచెయ్యి రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచెయ్యి చూపడం దారుణం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాకినాడ మెయిన్ లైన్ సాధనలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. కోనసీమలో అలంకారప్రాయంగా మారిన రైలు పట్టాలను తొలగించడం మేలు. జనాభా పరంగా రాష్ట్రంలోనే పెద్దదైన మన జిల్లాకు బడ్జెట్లో నిరాశ ఎదురవడం దురదృష్టకరం. వచ్చే బడ్జెట్లోనైనా జిల్లాకు అధిక నిధులు, కాకినాడ మెయిన్‌లైన్ పనుల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. - వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కొత్త రైలుగాని, కొత్త లైన్లుగాని ప్రకటించలేదు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. తూర్పు తీరంలో ఏర్పాటు చేస్తామన్న కోస్తా కారిడార్‌ను పశ్చిమ తీరానికి తరలించుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ ప్రాంతం రాజధాని కాబోతోంది. అక్కడికి ప్రజల రాకపోకలు పెరిగాయి. అయినా వసతుల కల్పన, కొత్త రైళ్లు వేయడంపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కొవ్వూరు - భద్రాచలం రైల్వే లైను నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. - వంతల రాజేశ్వరి, ఎమ్మెల్యే, రంపచోడవరం ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యం లేదు రైల్వే బడ్జెట్లో ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆధునికీరణ అవసరమే. కానీ దాంతోపాటు ఎంతోకాలంగా కోరుతున్న రైల్వే లైన్ల విస్తరణ పనులు కూడా అవసరమే. వీటిపై గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చూపింది. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైనుపై జిల్లావాసులకు నిరాశే మిగిలింది. - జక్కంపూడి విజయలక్ష్మి, సీజీసీ సభ్యురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిధుల కేటాయింపు ఉంటుందని ఎదురుచూశా కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైనుకు ఈసారి రైల్వే బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించాను. కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తారని ఎదురు చూశాను. ఇందుకోసం రైల్వే మంత్రిని, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందించాను. వారిచ్చిన భరోసాను బట్టి ఈసారి నిధులపై గట్టి నమ్మకం పెట్టుకున్నాను. పెండింగ్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు పార్లమెంటులో చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయింపు భారీగా ఉంటుందని ఎదురు చూశా. కానీ ఆ స్థాయిలో నిధులు కేటాయించలేదు. - డాక్టర్ పండుల రవీంద్రబాబు, ఎంపీ, అమలాపురం ప్రతి రైల్వే బడ్జెట్లో ఇదే నిర్లక్ష్యం కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను పెండింగ్ ప్రాజెక్టుపై పధ్నాలుగేళ్లుగా ప్రతి రైల్వే బడ్జెట్లో కొనసాగుతున్న నిర్లక్ష్యమే ఈసారీ కొనసాగింది. కోనసీమవాసులు చిరకాల వాంఛ అయిన ఈ లైనును సాధించడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. 15 ఏళ్ల నుంచి ఇక్కడి అవసరాలు, ప్రజల ఆకాంక్షలను రైల్వే శాఖ కనీసంగా కూడా పరిగణనలోకి తీసుకోవటంలేదు. వినతుల ద్వారా ఈ లైను సాకరమయ్యే పరిస్థితి కనిపించటంలేదు. ప్రజా ఉద్యమాల ద్వారానే రైల్వే శాఖ దిగివచ్చేలా చేయాలి. - గిడుగు రుద్రరాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీసీసీ అమలాపురం అక్కరకు రాని రూ.5 కోట్లు కోటిపల్లి - నర్సాపురం రైల్వేలైనుకు ఈసారి కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తారని, దీంతో పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ బడ్జెట్లో కేవలం రూ.5 కోట్లు కేటాయించారు. గతంలో ఎప్పుడూ రూ.కోటి లేదా రూ.అరకోటి కేటాయించే రైల్వే శాఖ ఈసారి కాస్త పెంచింది. అయినా అవి అక్కరకు రావు. ఇక ప్రజా ఉద్యమానికి తెర తీయాల్సిందే. మా సమితి ద్వారా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. - డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్, కోనసీమ రైల్వే సాధన సమితి, అమలాపురం అభివృద్ధి నిరోధక బడ్జెట్ రైల్వే బడ్జెట్ పూర్తి అభివృద్ధి నిరోధకంగా ఉంది. విభజన అనంతరం విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఊసే లేకుండా పోయింది. కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైను మినహా కొత్త రైళ్లు కూడా లేవు. పెండింగ్ ప్రాజెక్టులైన కాకినాడ మెయిన్‌లైన్, కోటిపల్లి - నర్సాపురం, కొవ్వూరు - భద్రాచలంపై ఎలాంటి ప్రకటనా లేకపోవడం బాధాకరం. ప్రజలపై భారం లేదంటూనే సిమెంటు, స్టీలు, బొగ్గుపై రవాణా చార్జీలు పెంచారు. తద్వారా పరోక్ష భారం పడుతుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రైల్వే టిక్కెట్ల ధరలు కూడా తగ్గాలి. - కందుల దుర్గేష్, అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ వాస్తవానికి దగ్గరగా ఉంది రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పథకాలు పూర్తి చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. చార్జీలు పెంచకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయం. ప్రత్యేక సదుపాయాలు కల్పించి ప్రయాణికులకు పెద్ద పీట వేశారు. సాధారణ రైళ్లలోనూ ప్రయాణికులకోసం అనేక సదుపాయాలు కల్పించడం అభినందనీయం. - వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షులు, బీజేపీ ప్రజల ఆశలను నట్టేట ముంచారు జిల్లా ప్రజల ఆశలను ప్రజాప్రతినిధులు నట్టేట ముంచారు. పెండింగ్‌లో ఉన్న కాకినాడ మెయిన్ లైన్, కోటిపల్లి - నర్సాపురం లైన్లపై బడ్జెట్లో కనీస ఊసెత్తకపోవడం విచారకరం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటే రైల్వే రంగాన్ని ప్రైవేటుపరం చేయడమే. - తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి, సీపీఐ శుష్క వాగ్దానాలు..శూన్యహస్తాలు ఎటువంటి కేటాయింపులూ లేని మొదటి రైల్వే బడ్జెట్‌గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలతో మంత్రి ప్రసంగం సాగింది. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం దారుణం. జిల్లా ప్రజలను నిరాశపర్చడమేకాకుండా దేశ ప్రజలను మోదీ మోసం చేశారు. - దడాల సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం -
ఆశ నిరాశేనా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రజలకు అత్యంత ఆవశ్యకత కలిగిన ప్రయాణం అంటే రైల్వేనేనని ఠక్కున చెప్పవచ్చు. దూర ప్రయాణాలకే కాదు, లోకల్ రైళ్లపై కూడా రాష్ట్ర ప్రజలు అధికంగా ఆధారపడుతున్నారు. చెన్నై, తిరుచ్చి, మధురై, కన్యాకుమారీలను కలుపుతూ 738 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబుల్‌లైన్‌గా విస్తరించాలనే పథకం రాష్ట్ర ప్రజలకే కాక, పర్యాటకులకు సైతం ఎంతో ప్రయోజనకరం. ఈ పథకం వల్ల దక్షిణ రైల్వేకు అధిక ఆదాయం సమకూరడం ఖాయం. చెన్నై-కన్యాకుమారి రైల్వే పథకం తొలి దశ పనులను 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు. దీంతో చెన్నై నుంచి మదురై వరకు డబుల్‌లైన్ పనులు పూర్తిచేశారు. ఆ తరువాత 2012-13 ైరె ల్వేబడ్జెట్‌లో మధురై, తిరునెల్వేలీ, కన్యాకుమారీ వరకు డబుల్‌లైన్ పనులకు నిధుల కేటాయింపు తగ్గుతూ వస్తోంది. ఈ కారణంగా చెన్నై-కన్యాకుమారీ మధ్య విద్యుద్దీకరణతో కూడిన డబుల్‌ైలైన్ పనులు పదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ప్రతి బడ్జెట్లోనూ కొద్ది మొత్తంలో నిధులు విదులుస్తున్న మూలంగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకం పరిస్థితిని బేరీజు వేసుకుంటే తమిళనాడుపై కేంద్రానికి ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నాయో తేటతెల్లం అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం కింద చెన్నై-చెంగల్పట్టు మధ్య పనులు పూర్తయ్యాయి. చెంగల్పట్టు-విళుపురం మధ్య పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. తరువాత దశగా విళుపురం నుంచి దిండుగల్లు వరకు డబుల్‌లైన్ పనులకు రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేశారు. ఇందులో రూ.600 కోట్లు నిధులు కేటాయించారు. విళుపురం-దిండుగల్లు మధ్య 69 కిలో మీటర్ల వరకు డబుల్‌లైన్ పనులు ఇటీవలే ప్రారంభించారు. మిగతా దూరానికి రూ.700 కోట్లు కేటాయిస్తేనే పూర్తవుతుంది. అంతేగాక రూ.700 కోట్లు ఈ ఏడాది విడుదలైతేనే రాబోయే రెండేళ్లలో విళుపురం-దిండుగల్లు మధ్యను డబుల్‌లైన్ పనులు పూర్తవుతాయి. దిండుగల్లు నుంచి మధురైకి ఇప్పటికే డబుల్‌లైన్ పనులు సిద్దంగా ఉన్నందున చివరి దశగా కన్యాకుమారి వరకు డబుల్‌లైన్ పనులను ప్రారంభించవచ్చు. మధురై నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 245 కిలోమీటర్ల దూరంపై సర్వేకూడా పూర్తయింది. చివరి దశ పనులకు రూ.1916 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. చివరి దశ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఏ రాజకీయవాది, ఏ అధికారి హామీ ఇవ్వడం లేదు. విళుపురం-దిండుగల్లు పనులకు రూ.700 కోట్లు కేటాయించిన తరువాతనే చివరి దశపై దృష్టి సారిస్తారు. అప్పటి కూడా ఒకే దఫాగా నిధులు కేటాయిస్తారనే నమ్మకం లేదని తెలుస్తోంది. చివరి దశ పనులు పూర్తి కావాలంటే కనీసం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలిస్తే చెన్నై-కన్యాకుమారి మధ్య విద్యుద్దీకరణతో డబుల్ లైన్ రైలు మార్గానికి కనీసం 5 ఏళ్లు ఖాయంగా భావించవచ్చు. రూ.2700 కోట్లు కేటాయిస్తే పనులు తొందరగా పూర్తిచేయవచ్చు. అయితే చెన్నై-కన్యాకుమారి రైలు మార్గం ప్రాధాన్యత తెలిసినా దక్షిణాదికి చెందిన రాజకీయనేతలు మిన్నకుండిపోతున్నారు. ఈ పథకం పూర్తయితే కన్యాకుమారి, నెల్లై, మధురై మీదుగా చెన్నై చేరుకోవడానికి ఒక గంట సమయం ఆదా అవుతుంది. అంతేగాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు విద్యుత్ రైలును ప్రవేశపెట్టవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు రైలు మార్గం పథకం కింద దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నిర్మాణ పనులు పూర్తికాగా తమిళనాడు మాత్రమే డబుల్‌లైన్ విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు పోటాపోటీగా తమ పరిధిలోని రైల్వే పనులపై సమష్టిగా దృష్టి సారిస్తుండగా, తమిళనాడు నేతలు మాత్రం అనైక్యతను ప్రదర్శించడం వల్ల కేంద్రం సైతం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజా బడ్డెట్‌లోనూ రాష్ట్రంలోని పనులకు గణనీయమైన స్థాయిలో నిధుల కేటాయింపు జరగక పోవడంతో రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. మోసగించారు: బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయిలో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశతో ఎదురుచూసున్న రైల్వే బడ్జెట్లో చివరకు అందరినీ మోసగించారని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు 60 శాతం వరకు తగ్గిన కారణంగా టికెట్టు చార్జీలను తగ్గించి ఉండవచ్చన్నారు. ఇందుకు విరుద్ధంగా సరకు రవాణా చార్జీలను పెంచివేశారని వ్యాఖ్యానించారు. కేంద్రం చేతిలో మోసపోయిన తమిళ ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రైల్వేబడ్జెట్ సంతృప్తికరం: ప్రయాణికుల చార్జీలు పెంచకుండా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ సంతృప్తినిచ్చిందని అన్నాడీఎంకే అధినేత్రి,మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని అన్నారు. ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల రక్షణ రైల్వేస్టేషన్లు, భోగీల్లో పారిశుధ్యం వంటివాటిపై దృష్టి సారించడం ముదావహమన్నారు. తమిళనాడులో ప్రతిపాదనలో ఉన్న హైస్పీడ్ రైళ్లకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె కోరారు. మొత్తం మీద 2015-16 రైల్వే బడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. -
ప్రభు కొత్త ఒరవడి
సంప్రదాయాన్ని తోసిరాజనడం, నూతన ఒరవడికి ప్రయత్నించడం సాహసమే. రైల్వేమంత్రి సురేష్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టుల, కొత్త రైళ్ల ఊసెత్తకుండా ఆ సాహసం చేశారు. రైల్వే స్టేషన్లోకి ప్రవేశించడం మొదలుకొని ప్రయాణికులు ఎదుర్కొనే వివిధ ఇబ్బందులపైనా తొలిసారి దృష్టిపెట్టారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక కేటాయింపులు చేశారు. బడ్జెట్‌తో ప్రమేయం లేకుండానే చార్జీలు బాదుడు ప్రభుత్వాలకు అలవాటైపోయింది గనుక... ప్రసంగం మొదట్లోనే చార్జీలు పెంచడం లేదని ప్రభు చెప్పినా అదేమీ ఊరటనిచ్చే విషయం కాదు. ఎన్డీఏ సర్కారు వచ్చాక గత జూన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కసారిగా చార్జీలు 14.2 శాతం పెంచారు. ఆ సందర్భంలోనే సరుకు రవాణా చార్జీలు కూడా 6.5 శాతం పెరిగాయి. ఈ ఏడాది మూలధన వ్యయాన్ని 52 శాతం పెంచి దాన్ని లక్ష కోట్ల రూపాయలు చేస్తున్నట్టు ప్రకటించడం బాగానే ఉన్నా అందులో 42 శాతాన్ని రుణ సేకరణ ద్వారా సమీకరించుకోవాలని రైల్వేమంత్రి నిర్ణయించారు. ఆ రుణ భారాన్ని తగ్గించుకోవడానికైనా భవిష్యత్తులో చార్జీల పెంపు తప్పనిసరవుతుంది. ఆ సంగతలా ఉంచి అసలు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఎలా వ్యయం చేయదల్చుకున్నదీ చెప్పలేదు. దీనికి తోడు వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి బలోపేతం చేస్తామని చెప్పారు. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టదల్చుకున్నట్టు ప్రకటిస్తూనే ప్రైవేటీకరణ ఉద్దేశం లేదని మంత్రి చెబుతున్నారు. అదే సమయంలో రైలు మార్గాల నిర్మాణంలో ప్రైవేటు భాగ స్వామ్యం ఉంటుందని చూచాయిగా చెప్పారు. ఇప్పటికే ప్లాట్‌ఫాంల నిర్వహణ మొదలుకొని పార్కింగ్ సేవల వరకూ ప్రైవేటు సంస్థలను వినియోగిస్తున్నారు. కేటరింగ్, బెడ్ రోల్స్ పంపిణీ విధులు ప్రైవేటుకే అప్పగించారు. రిటైరవుతున్నవారి స్థానంలో కాంట్రాక్టు నియామకాలు పెరిగాయి. మొత్తంగా 18 లక్షల మంది సిబ్బంది అవసరమైనచోట ఇప్పుడు కాంట్రాక్టు సిబ్బందిని కలుపుకున్నా 14 లక్షలకు మించి లేరని చెబుతున్నారు. మిగిలినవాటి సంగతెలా ఉన్నా తగినంత మంది సిబ్బంది లేకపోవడం, కాంట్రాక్టు నియామకాలకు మొగ్గుచూపడం పర్యవ సానంగా ప్రమాణాలు కొరవడి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతున్నదని నిపు ణులు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు రైలు మార్గాల నిర్మాణంలో కూడా ప్రైవేటుకు చోటు కల్పించడం అలాంటి ప్రమాదాల బెడదను మరింత పెంచుతుంది. ఇక సిమెంటు, బొగ్గు, ఆహారధాన్యాలు, పప్పుధాన్యాలు, యూరియా, కిరోసిన్, వంటగ్యాస్‌లపై రవాణా చార్జీలను దాదాపు 10 శాతం పెంచడం ద్వారా రూ. 4,000 కోట్లు అదనంగా రాబట్టడానికి ప్రభు నిర్ణయించారు. ఈ భారమంతా అంతిమంగా సామాన్యులపైనే పడుతుంది. సరుకులను పునర్ వర్గీకరించామని, దూరాన్నిబట్టి చార్జీలను హేతుబద్ధం చేశామని ఆయన చెప్పడం నొప్పి తెలియకుండా చేయడానికేననడంలో సందేహం లేదు. ఆయన ఏం చెప్పినా సరుకు రవాణా రాబడి రూ. 4,000 కోట్లు పెరుగుతుందనడం నిజం. అసలు డీజిల్ ధర గణనీయంగా తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీల పెంపు కాదు...తగ్గింపు ఉండాలి. ఎందుకంటే గతంలో చార్జీలు పెంచిన ప్రతిసారీ ప్రభుత్వాలు డీజిల్ ధరల పెంపునే సాకుగా చూపాయి. తగ్గించవలసి వచ్చేసరికి అలాంటివన్నీ ప్రభుత్వాలు ఎందుకు మరిచిపోతాయో అర్ధంకాదు. ప్రతి బడ్జెట్లోనూ భారీగా సంకల్పం చెప్పుకోవడం, క్రియకొచ్చేసరికి దేన్నీ పట్టించుకోకపోవడం ఈ ఆరున్నర దశాబ్దాల్లోనూ పాలకులు అనుసరిస్తున్న విధానం. సొంత రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు తరలించుకుపోవడం... ఆదాయాన్ని గానీ, అవసరాలనుగానీ పరిగణనలోకి తీసుకోకుండా స్వస్థలాలకు కొత్త రైళ్లు ప్రకటించడం రైల్వే మంత్రులుగా ఉన్నవారు ఇంతకాలంగా అనుసరిస్తున్న ధోరణి. సురేష్ ప్రభు ఆ బాట పట్టనందుకు ఆయన్ను అభినందించాలి. ప్రతి బడ్జెట్లోనూ కొత్త రైలు మార్గాలను ప్రకటించడం, వాటికోసం సర్వేలని చెప్పి ఏళ్లకేళ్లు కాలక్షేపం చేయడం... సర్వే నివేదికలొచ్చినా పనులు ప్రారంభించడానికి ఉత్సాహం చూపకపోవడం రివాజుగా మారింది. ప్రభు పుణ్యమా అని ఈసారి అలాంటి కొత్త మార్గాల సంతర్పణకు బ్రేకు పడింది. అయితే, ఇప్పుడు వివిధ దశల్లో ఉన్న సర్వేలనైనా త్వరితగతిన పూర్తిచేయడం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులను ఇతోధికంగా పెంచడం అవసరం. ఆ విషయంలో నిరాశే కలుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5,000 కిలోమీటర్ల మేర 36 కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేయడానికంటూ సర్వేలు చేయించారు. వాటిలో దాదాపు 30 సర్వేలు పూర్తయ్యాయి. తీరా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడివడ్డ రెండు రాష్ట్రాలకూ ఒక్క కొత్త రైలు మార్గం కూడా రాలేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకైనా కేటాయింపులు ఇతోధికంగా పెంచి త్వరితగతిన పూర్తిచేసే ఉద్దేశం ఉన్నట్టు కనబడటం లేదు. ఇక విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఎటో కొట్టుకుపోయింది. ఈ బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. వివిధ పార్టీల ఎంపీలు గుర్తుచేశారు గనుక కనీసం అందుకు సంబంధించి ఏం చేయదల్చుకున్నదీ చెప్పాలన్న స్పృహ కూడా రైల్వేమంత్రికి లేకపోయింది. రూ.850 కోట్లు వ్యయమయ్యే జంటనగరాల ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు ఈ బడ్జెట్లో రూ. 25 కోట్లు మాత్రమే కేటాయించడం తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికున్న నిర్లక్ష్యాన్ని తెలియజెబుతుంది. ప్రస్తుతం ఉన్న రైళ్ల గురించీ, ప్రాజెక్టుల గురించీ లోతుగా సమీక్షించాక కొత్తవాటి సంగతి చూస్తామని ప్రభు చెబుతున్నారు. అదే సందర్భంలో అధికాదాయం తెస్తున్న ప్రాంతాలను ఎలా ఆదుకోవాలో, ఏ విధంగా అభివృద్ధిపరచాలో యోచిస్తే తెలుగు రాష్ట్రాలు రెండింటికీ మేలు జరుగుతుంది. ఆ పని సాధ్యమైనంత త్వరగా జరగాలని కోరుకుందాం. -
ఫోర్త్ ఎస్టేట్ : రైల్వే బడ్జెట్ - విశ్లేషణ
-
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ‘గగన్’ భద్రత
దేశంలో కాపలాలేని రైల్వే గేట్ల వద్ద ఏటా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాల వల్ల యువతే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. భారతీయ రైల్వేల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రైల్వే లెవల్ క్రాసింగ్‌లు 31,846 ఉండగా.. వాటిలో 3,438 కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లే. ఈవిషయాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం తన రైల్వే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా స్వయంగా వెల్లడించారు. వీటివద్ద పటిష్టమైన భద్రత కోసం రూ. 6,750 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ప్రమాదాలను నివారించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయమై భారతీయ రైల్వే ఉన్నతాధికారులు తమతో చర్చలు జరుపుతున్నారని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ కూడా ధ్రువీకరించారు. జీపీఎస్ (గ్లోబల్ పొజిషింగ్ సిస్టమ్) ఆధారంగా పనిచేసే జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ (గగన్)ను ఉపయోగిస్తే కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోని కొన్ని విమానాశ్రయాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. వాటిలో హైదరాబాద్‌లోని విమానాశ్రయం కూడా ఉంది. ఈ వ్యవస్థను దేశంలోని ఇతర విమానాశ్రయాలకు కూడా విస్తరించేందుకు భారత ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇటీవలనే అనుమతి మంజూరు చేసింది. ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ ద్వారా పనిచేసే ‘గగన్’ను ఇస్రో 2008లోనే అభివృద్ధి చేసింది. అయితే అదే ఏడాది ప్రయోగించాలనుకున్న జీశాట్ ప్రయోగం అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం వల్ల గగన్‌ను అమల్లోకి తీసుకరావడం ఆలస్యం అయిది. ట్రయల్స్ పూర్తి చేసుకొని 2014లోనే విమానయాన రంగంలో గగన్ అమల్లోకి వచ్చింది. రన్‌వేపై విమానాలు సురక్షితంగా దిగేందుకు ఈ గగన్‌ను ఉపయోగిస్తున్నారు. రన్‌వేపై కదలికలను త్రీ డెమైన్షన్లో గగన్ కచ్చితంగా విమానం పైలట్‌కు చూపిస్తుందని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వివరించారు. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద కదలికలను కచ్చితంగా అంచనా వేసే గగన్ వ్యవస్థను రైలు ఇంజన్ బోగీలోగానీ గార్డు బోగీలోగానీ అమర్చవచ్చని ఆయన చెప్పారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాలు, బాటసారులు ఎంతవేగంగా పట్టాలు దాటుతారో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అతివేగంగా దూసుకొచ్చే రైల్లోని డ్రైవర్‌కు రైల్వే క్రాసింగ్ వద్ద కదలికలు కచ్చితంగా తెలిసినంత మాత్రాన రైలు ప్రమాదాలు నివారించగలమా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
దారీ తెన్నూ లేని రైల్వే బడ్జెట్
దేశంలో పెండింగ్‌లో ఉన్న వందలాది ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆర్థిక వనరులు లేక కునారిల్లుతున్న భారతీయ రైల్వే వ్యవస్థకు ఈసారైనా దశ, దిశ నిర్దేశిస్తారనుకున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరాశా నిస్పృహలనే మిగిల్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంలో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు ‘యథాతథ’ స్థితికే పెద్ద పీట వేశారు. ప్రయాణికుల చార్జీలను పెంచకుండా ప్రజలను కరుణించిన ప్రభువు సరకు రవాణా చార్జీలను సవరించడం ద్వారా మధ్యతరగతి ప్రజలపై వెనుక నుంచి పెను భారమే మోపారు. ఒక్క కొత్త రైలును కూడా ప్రవేశపెట్టకుండా అన్ని రాష్ట్రాల అంచనాలను తలకిందులు చేశారు. అయితే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లను ఏర్పాటు చేస్తామని, కొత్తగా పలు రైల్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని, రైల్వే స్టేషన్లను ప్రక్షాళిస్తామని, వై-ఫై సేవలు అందిస్తామంటూ కొంత ఊరట కలిగించారు. మోదీ కలల ప్రాజెక్టైన బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ముందుగా ముంబై-అహ్మదాబాద్ మధ్య సాధ్యాసాధ్యాల విశ్లేషణ జరుగుతోందని, ఈ ఏడాదిలోగా నివేదిక వస్తోందంటూ ఆ అంశాన్నీ దాటవేశారు. 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సురేశ్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ప్రణాళిక కేటాయింపులను 1,00,011 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇది 2014-20015 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌కు 52 శాతం అదనం. ప్రయాణికుల చార్జీల ద్వారా రూ. 50, 175 కోట్లు వస్తాయని, సరకు రవాణా ద్వారా రూ. 1,21,423 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రైల్వేల ప్రస్తుత పరిస్థితికి కారణం కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక వనరులను సమకూర్చుకోక వడమేనంటూ నెపాన్ని గతం మీద నెట్టి వేశారు. రానున్న ఐదేళ్లలో రైల్వేల అభివృద్ధికి ఏకంగా రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ భవిష్యత్తును భావితరానికి వదిలేశారు. దారీతెన్నూ లేని రైల్వే వ్యవస్థకు ‘ఓ ప్రభువా దారి చూపించు’ అంటూ ఆ దేవుడిపైనే భారం వేశారు. రైలు రవాణా చార్జీలను సవరించడంలో ఉప్పు లాంటి వస్తువులను కనుకరించినా సిమెంట్, స్టీల్, చమురు, బొగ్గు, కోల్ లాంటి సరకులపై భారం వేశారు. సవరించిన చార్జీల ద్వారా ఈ సరకుల ధరలు పెరిగి మధ్యతరగతి ప్రజలపై భారం పడక తప్పదు. నిత్యావసర వస్తువుల నిర్వచనాన్ని మార్చి, దూరాభారాన్ని బట్టి సరకు రవాణా చార్జీలను 10 శాతం వరకు పెంచారు. ఈ కారణంగా కూరగాయలు, పళ్లు, నూనెల ధరలు పెరగడం వల్ల పేద ప్రజలపై భారం పడుతుందనడంలో సందేహం లేదు. సరకు రవాణా చార్జీలను సవరించడం వల్ల రాబడి ఎంత పెరుగుతుందో సీఏగా అనుభవం ఉన్న సురేశ్ ప్రభు తేల్చలేక పోయారు. లోక్‌సభలో దాదాపు గంటసేపు ప్రసంగించిన ప్రభు.. ప్రయాణికుల సౌకర్యాలను పెంచడం, వారి భద్రతకు ప్రాధాన్యతనివ్వడం, వీటికి రైల్వేల మనుగడకు మధ్య సమతౌల్యం సాధించడం తన లక్ష్యమని చెప్పారు. తన లక్ష్యాలను సాధించడంలో భాగంగా గుర్తించిన రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వై-ఫై సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్లలో అదనంగా 650 మరుగు దొడ్లను నిర్మిస్తామని చెప్పారు. ఇదే ఏడాది 6,608 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను విద్యుద్దీకరిస్తామని అన్నారు. ప్రయాణికుల భద్రత కోసం 3,438 లెవల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం రూ. 6,750 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 970 రైల్ కమ్ రోడ్డు వంతెనలను నిర్మిస్తామని ప్రకటించారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఎస్ఎంఎస్ పద్ధతి ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్లలోకి వచ్చిన ఐదు నిమిషాల్లోగానే టిక్కెట్ తీసుకునేందుకు వీలుగా ‘ఆపరేషన్ 5 మినిట్’ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ప్రయాణికులు 200 రోజులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకునే స్కీమ్‌ను ప్రవేశ పెడుతున్నామంటూ ఏజెంట్ల వ్యవస్థకు పరోక్షంగా తెరతీశారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. -
శతాబ్ది రైళ్లలో ఇక వినోదం కూడా!
దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు కొత్తగా వినోదాన్ని కూడా జోడిస్తున్నారు. ఇంతకాలం ఈ రైళ్లలో ఉచితంగా టీ, స్నాక్స్, భోజనాలు ఇచ్చేవారు. టికెట్ ధరలోనే వీటి ధర కూడా కలిపి ఉండేది. ఇది ప్రయాణికులకు చాలా సౌఖ్యంగా ఉండేది. దూరప్రయాణాల్లో ప్రత్యేకంగా భోజనాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్లలో నాణ్యమైన ఆహారమే అందించేవారు. ఇప్పుడు దీనికితోడు వినోదాన్ని కూడా జోడిస్తే.. ఈ రైళ్లకు మరింత ఆదరణ లభించడం ఖాయం. వోల్వో బస్సులు, ఇతర దూరప్రాంత బస్సుల్లో ఎల్ఈడీ టీవీలలో సినిమాలు వేయడం మనకు ఎప్పటినుంచో తెలుసు. మరి శతాబ్ది రైళ్లలో కూడా ఇలాగే సినిమాలు చూపిస్తారో, లేక పాటలు వినిపిస్తారో చూడాల్సి ఉంది. -
120 రోజులు ముందుగానే రైల్వే రిజర్వేషన్
రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైలు ప్రయాణికులకు ఓ కొత్త వరం ప్రకటించారు. అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఇపుడున్న 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. ఇంతకుముందు 90 రోజుల ముందుగానే ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ తర్వాత దాన్ని 60 రోజులకు తగ్గించారు. దాంతో 60 రోజుల వరకు ఆగిన తర్వాత మాత్రమే ముందుగా ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చేది. తాజాగా రైల్వే మంత్రి చేసిన ప్రకటనతో.. 120 రోజులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఏర్పడింది. అయితే ఇది కొంత మందికి వరంగానే పరిణమిస్తుంది గానీ.. కొందరికి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్లకు బాగా ముందే టికెట్లు మొత్తం బుక్ అయిపోవడంతో.. తర్వాత చేసుకుందామని ఆగేవాళ్లకు టికెట్లు దొరికే అవకాశం ఉండదు. -
మహాప్రభో!!
-
24 ఏళ్ళుగా పెండింగ్‌లో రైల్వే ప్రాజెక్ట్‌లు
-
రైల్వే బడ్జెట్ మరి కాసేపట్లో పట్టాలెక్కనుంది
-
కొత్త రైల్వే జోన్ లేనట్టేనా?
-
బడ్జెట్ పై ఉత్కంఠ