
దార్శనికత లేదు: విపక్షాలు
ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఏమాత్రం పస లేదని విపక్షాలు మండిపడ్డాయి.
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఏమాత్రం పస లేదని విపక్షాలు మండిపడ్డాయి. రైల్వేకు ఉన్న ఎన్నో మంచి ఆలోచనలను అమల్లోకి పెట్టే దార్శనికత, రోడ్‌మ్యాప్ కొరవడ్డాయని విమర్శించాయి. ఈ బడ్జెట్‌పై ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉంది. యూపీఏ ప్రకటించిన పాత వాటికే మార్పులు చేశారు’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు.
ఈ మేరకు కాంగ్రెస్ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించింది. బడ్జెట్‌లో మంచిపదాలను రంగరించారని, అయితే లక్ష్యాలను ఎలా సాధిస్తారన్న దార్శనికత లేదని రైల్వే మాజీ మంత్రి, లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే పార్లమెంట్ వెలుపల విలేకర్లతో అన్నారు. ‘ప్రభుత్వ-ప్రైవేట్ విధానం, నిర్మాణం-నిర్వహణ-బదిలీ(బీఓటీ) విధానాల పాటిస్తామని రైల్వే మంత్రి చెప్పారు. అయితే ఇతరులపై ఆధారపడితే అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశంలేకపోవచ్చు’ అని అన్నారు.
బడ్జెట్‌లో కేవలం కలలు గుప్పించారని మరో రైల్వే మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేదీ ఆరోపించారు. రైల్వేకు 50 శాతం నిధుల కొరత ఉందని, దీన్నెలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. బడ్జెట్ నిరాశగా ఉందని బీజేడీ నేత తథాగత సత్పత్తి అన్నారు. సురేశ్ ప్రభు ప్రవేశపెట్టింది బడ్జెటే కాదని, ఓ విజన్ డాక్యుమెంట్ మాత్రమేనని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. ‘ఏ కార్యాచరణా లేని గొప్ప ఆలోచనలు, ప్రయాణికుడు లేని బోగీలా ఉంది. డీజిల్ ధరలు తగ్గినందున చార్జీలూ తగ్గించాల్సింది’ అని బిహార్ సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రాజెక్టులకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో స్పష్టత లేదు. పూర్తిగా నిరాశచెందాం’ అని శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ వ్యాఖ్యానించారు.