సదా మీ సేవలో..! | Swachch railway programme to be done soon, says Suresh prabhu | Sakshi
Sakshi News home page

సదా మీ సేవలో..!

Published Fri, Feb 27 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

సదా మీ సేవలో..!

సదా మీ సేవలో..!

*    ప్రయాణికుల స్వర్గధామంగా రైల్వేలు
*   సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ
*    అడుగడుగునా అభివృద్ధికి ప్రణాళికలు
*    రైళ్లు, స్టేషన్లలో అనేక మార్పులకు ప్రతిపాదనలు

*    వసతుల కల్పనకు రూ. 12,500 కోట్లు
*    గత కేటాయింపుల కంటే 67 శాతం అధికం

 
 స్వచ్ఛ రైల్ - స్వచ్ఛ భారత్
పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ స్వచ్ఛ రైల్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. స్టేషన్లను, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు శిక్షణనిప్పించి ఇంటిగ్రేటెడ్ క్లీనింగ్ ప్రవేశపెడతామని సురేశ్ ప్రభు తెలిపారు. పర్యావరణహితం కోసం చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే కేంద్రాలను కూడా కోచ్ టర్మినల్స్ వద్ద ఏర్పాటు చే స్తామన్నారు. గతంలో చేపట్టిన 120 రైల్వే స్టేషన్లకుతోడు మరో 650 స్టేషన్ల పరిధిలో కొత్త మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే కోచుల్లో 17,388 బయో మరుగుదొడ్లను అమర్చామని, మరో 17 వేల టాయిలెట్లను కూడా మార్చుతామని చెప్పారు. మరో ఆరు నెలల్లో వ్యాక్యూమ్ టాయిలెట్లను రూపొందించే బాధ్యతను రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్‌డీఎస్‌వో)కు అప్పగించినట్లు తెలిపారు. నాన్ ఏసీ రైళ్లలోనూ చెత్తడబ్బాలు(డస్ట్‌బిన్స్) ఏర్పాటు చేస్తామన్నారు.  
 
ప్రయాణికులకు సరికొత్త రైల్వేలను పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆ దిశగా బడ్జెట్‌లో అనేక చర్యలను ప్రతిపాదించారు. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, బయో టాయ్‌లెట్లు, ఐదు నిమిషాల్లో జనరల్ టికెట్ల జారీ, రైళ్లలో భద్రత, కొత్త డిజైన్లతో సీట్లు, 24 గంటల హెల్ప్‌లైన్, సకల రుచులతో నాణ్యమైన ఆహారం, వైఫై వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వసతుల కల్పన కోసం మొత్తంగా రూ. 12,500 కోట్లను కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపుల కన్నా 67 శాతం అధికంకావడం గమనార్హం. స్టేషన్ల అభివృద్ధి, సరుకు నిర్వహణ కేంద్రాల ఏర్పాటు కోసం ఏకంగా లక్ష కోట్లను ప్రతిపాదించారు. వచ్చే ఐదేళ్లలో రైలు ప్రయాణికులు భిన్నమైన అనుభవాన్ని పొందుతారని ప్రభు వ్యాఖ్యానించారు.  
 
 వినియోగదారుల నుంచి సలహాలు
సుపరిపాలనలో భాగంగా రైల్వే ఉద్యోగులతో చర్చించడం, సోషల్ మీడియా ద్వారా వినియోగదారులతో ముచ్చటించడం ద్వారా 2 వేలకుపైగా సలహాలు, సూచనలు అందాయని మంత్రి తెలిపారు. వాటి పరిశీలన జరుగుతోందని, కొన్నింటిని ఈ బడ్జెట్‌లోనే చేర్చామన్నారు. రైల్వేల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల తమశాఖ దేశ పురోభివృద్ధికి ఇంజన్‌గా మారుతుందని ప్రభు అభివర్ణించారు.
 
 24 గంటల హెల్ప్‌లైన్
 ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు 138 హెల్ప్‌లైన్ నంబర్ ఇకపై 24/7 పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఓ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఒకటో తేదీ నుంచే ఉత్తర రైల్వే పరిధిలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చే స్తామన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం నిర్భయ నిధిని వినియోగించనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన బోగీల్లో నిఘా కెమెరాలను ప్రయోగాత్మకంగా అమర్చుతామన్నారు.  
 
 ప్రయాణికుల సంతృప్తే ముఖ్యం
 వచ్చే ఐదేళ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు రైల్వే మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా కృషి చేస్తామని ఉద్ఘాటించారు. పరిశుభ్రత, సురక్షిత ప్రయాణం, రైళ్ల వేగం పెంపు వంటి చర్యలతో ప్రయాణికుల ఇబ్బందులను తొలగిస్తామని, వారి నుంచి అందే ఫిర్యాదులను త్వరితంగా పరిష్కరిస్తామని మంత్రి వివరించారు.  
 
 ఆపరేషన్ 5 నిమిషాలు
 జనరల్ టికెట్లు పొందడానికి ప్రయాణికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి ప్రస్తావించారు. వారి కష్టాలను దూరం చేసేందుకు ‘ఆపరేషన్ ఐదు నిమిషాలు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్ కు వచ్చిన ఐదు నిమిషాల్లోనే జనరల్ టికెట్ పొందగలిగేలా చేయడమే దీని లక్ష్యం. ఇందుకోసం హాట్‌బటన్స్, కాయిన్ వెండింగ్ మెషీన్స్, ఎస్‌డీటీ(సింగిల్ డెస్టినేషన్ టెల్లర్)ల సేవలను విస్తృతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. డెబిట్ కార్డుతోనూ పనిచేసే ఏటీవీఎంలను ప్రవేశపెడతామన్నారు.
 
 అలాగే ప్రత్యేక ఈ-టికెటింగ్ పోర్టల్‌ను కూడా అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా కూడా జనరల్ టికెట్లు ఇచ్చే విధానాన్ని కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు చెప్పారు. వికలాంగులు రాయితీతో కూడిన ఈ-టికెట్లు పొందే సౌకర్యం కల్పిస్తామన్నారు. టికెట్ రద్దు చేసుకుంటే బ్యాంకింగ్ సిస్టం ద్వారానే డబ్బును తిరిగి చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సురేశ్‌ప్రభు తెలిపారు. జమ్మూ రూట్‌లో ఉన్న రైల్-కమ్-రోడ్ టికెట్ల విధానాన్ని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. సైనికుల సులభ ప్రయాణం కోసం డిఫెన్స్ ట్రావెల్ సిస్టంను అభివృద్ధిపరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 120 రోజుల ముందు నుంచే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇది 60 రోజులుగా ఉంది.
 
 హాయిగా పడక
 వచ్చే ఆరు నెలల్లో రైళ్లలో బెర్త్‌లను మెరుగుపరుస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. డిజైన్, నాణ్యత, శుభ్రత విషయంలో జాగ్రత్త తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇప్పటికే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థను సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో టికెట్‌తో పాటే డబ్బు చెల్లించే ప్రయాణికులందరికీ బెడ్‌రోల్స్‌ను అందించే సౌకర్యాన్ని విస్తృతం చేస్తామని చెప్పారు.
 
 టికెట్‌తోపాటే పసందైన ఆహారం
 ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన రైల్వేశాఖ ప్రస్తుత బడ్జెట్‌లో వారికి ఇష్టమైన ప్రాంతీయ రుచులను అందించే ఉద్దేశంతో ప్రఖ్యాత ఫుడ్ చైన్ సంస్థలను రంగంలోకి దించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎక్కువ రైళ్లకు ఈ సేవలను విస్తరిస్తామని రైల్వేమంత్రి చెప్పారు. రైల్వే కారిడార్లలో బేస్ కిచెన్లను ఏర్పాటు చేసి పేరున్న ఏజెన్సీలతో ఆహార సేవలను అందిస్తామన్నారు. తక్కువ ధరకే స్వచ్ఛమైన నీటిని అందించే విక్రయ యంత్రాలను అత్యధిక స్టేషన్లకు విస్తరిస్తామన్నారు.
 
 సుఖమయ ప్రయాణం
 రైళ్లలో వినోదానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ డివిజన్‌లో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టామని, దానికి వచ్చే స్పందనను బట్టి ఇతర డివిజన్లకు విస్తరిస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. మొబైల్ ఫోన్ చార్జింగ్ సౌకర్యాన్ని జనరల్ బోగీల్లోనూ కల్పిస్తామని, స్లీపర్ క్లాస్‌లో మరిన్ని అమర్చుతామని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న రైళ్లలో బోగీలను పెంచడం ద్వారా బెర్త్‌ల సంఖ్యను పెంచుతామని, ఎంపిక చేసిన రైళ్లలో సామాన్యుల కోసం జనరల్ బోగీలను పెంచుతామని చెప్పారు. స్లీపర్ బోగీల్లో పెబైర్తుల్లోకి ఎక్కేందుకు మడత నిచ్చెనల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు రైళ్లలో ప్రవేశద్వారం వెడల్పు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే వారికి కింది బెర్తులు కేటాయించే ఏర్పాట్లు చేస్తామన్నారు. మహిళల భద్రతకు త్రీ-టైర్ బోగీల్లో మధ్య సీట్లను కేటాయిస్తామన్నారు. ప్రయాణికులకు పిక్ అండ్ డ్రాప్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచన ఉందన్నారు. ఎ-కేటగిరీ స్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్న వై-ఫై సౌకర్యాన్ని బి-కేటగిరీ స్టేషన్లకూ విస్తరిస్తామన్నారు.
 
  పెద్ద స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను అమర్చడానికి రూ. 120 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది గత కేటాయింపుల కంటే 76 శాతం అధికమని పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం వచ్చే రెండేళ్లలో ‘ట్రెయిన్ సెట్’గా పిలిచే ఆధునిక రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు. స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను పెంచేందుకు నిధుల కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎంపీలు ముందుకు రావాలని రైల్వే మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలకు, రైల్వేలకు అనుసంధానంగా పనిచేసేలా స్థానిక ఎంపీల నేతృత్వంలో ఎక్కడికక్కడ డివిజనల్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 9  కారిడార్లలో రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న గంటకు 110-130 కిలోమీటర్ల నుంచి 160-200 కిలోమీటర్లకు పెంచనున్నట్లు వెల్లడించారు.
 
 ఎస్‌ఎంఎస్ అలర్ట్
 రైలు వచ్చి/పోయే తాజా వేళలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందించేలా ఎస్‌ఎంఎస్ అలర్ట్ సేవలను ప్రవేశపెడుతున్నట్లు ప్రభు ప్రకటించారు. అలాగే ప్రయాణికుడు దిగే స్టేషన్ రావడానికి అరగంట ముందే అలర్ట్ ఎస్‌ఎంఎస్ పంపుతామని చెప్పారు. టీటీఈలకు ప్రత్యేక పరికరాలను అందించి ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలు, చార్టులు పొందే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ విధానంతో పేపర్ వినియోగాన్ని తగ్గించడమే కాక టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికులకు వేగంగా డబ్బు తిరిగి వ్వడం సాధ్యమవుతుందని మంత్రి వివరించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కస్టమర్ పోర్టల్, కేంద్రీకృత రైల్వే డిస్‌ప్లే నెట్‌వర్క్ వంటి సౌకర్యాలను మరింత ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement