ప్రభు కొత్త ఒరవడి | As it happened: Railway Budget 2015 | Sakshi
Sakshi News home page

ప్రభు కొత్త ఒరవడి

Published Fri, Feb 27 2015 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

As it happened: Railway Budget 2015

సంప్రదాయాన్ని తోసిరాజనడం, నూతన ఒరవడికి ప్రయత్నించడం సాహసమే. రైల్వేమంత్రి సురేష్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టుల, కొత్త రైళ్ల ఊసెత్తకుండా ఆ సాహసం చేశారు. రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించడం మొదలుకొని ప్రయాణికులు ఎదుర్కొనే వివిధ ఇబ్బందులపైనా తొలిసారి దృష్టిపెట్టారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక కేటాయింపులు చేశారు.

బడ్జెట్‌తో ప్రమేయం లేకుండానే చార్జీలు బాదుడు ప్రభుత్వాలకు అలవాటైపోయింది గనుక... ప్రసంగం మొదట్లోనే చార్జీలు పెంచడం లేదని ప్రభు చెప్పినా అదేమీ ఊరటనిచ్చే విషయం కాదు. ఎన్‌డీఏ సర్కారు వచ్చాక గత జూన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కసారిగా చార్జీలు 14.2 శాతం పెంచారు. ఆ సందర్భంలోనే సరుకు రవాణా చార్జీలు కూడా 6.5 శాతం పెరిగాయి.
 
 ఈ ఏడాది మూలధన వ్యయాన్ని 52 శాతం పెంచి దాన్ని లక్ష కోట్ల రూపాయలు చేస్తున్నట్టు ప్రకటించడం బాగానే ఉన్నా అందులో 42 శాతాన్ని రుణ సేకరణ ద్వారా సమీకరించుకోవాలని రైల్వేమంత్రి నిర్ణయించారు. ఆ రుణ భారాన్ని తగ్గించుకోవడానికైనా భవిష్యత్తులో చార్జీల పెంపు తప్పనిసరవుతుంది. ఆ సంగతలా ఉంచి అసలు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఎలా వ్యయం చేయదల్చుకున్నదీ చెప్పలేదు.

దీనికి తోడు వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి బలోపేతం చేస్తామని చెప్పారు. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టదల్చుకున్నట్టు ప్రకటిస్తూనే ప్రైవేటీకరణ ఉద్దేశం లేదని మంత్రి చెబుతున్నారు. అదే సమయంలో రైలు మార్గాల నిర్మాణంలో ప్రైవేటు భాగ స్వామ్యం ఉంటుందని చూచాయిగా చెప్పారు.
 
ఇప్పటికే ప్లాట్‌ఫాంల నిర్వహణ మొదలుకొని పార్కింగ్ సేవల వరకూ ప్రైవేటు సంస్థలను వినియోగిస్తున్నారు. కేటరింగ్, బెడ్ రోల్స్ పంపిణీ విధులు ప్రైవేటుకే అప్పగించారు. రిటైరవుతున్నవారి స్థానంలో కాంట్రాక్టు నియామకాలు పెరిగాయి. మొత్తంగా 18 లక్షల మంది సిబ్బంది అవసరమైనచోట ఇప్పుడు కాంట్రాక్టు సిబ్బందిని కలుపుకున్నా 14 లక్షలకు మించి లేరని చెబుతున్నారు. మిగిలినవాటి సంగతెలా ఉన్నా తగినంత మంది సిబ్బంది లేకపోవడం, కాంట్రాక్టు నియామకాలకు మొగ్గుచూపడం పర్యవ సానంగా ప్రమాణాలు కొరవడి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతున్నదని నిపు ణులు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు రైలు మార్గాల నిర్మాణంలో కూడా ప్రైవేటుకు చోటు కల్పించడం అలాంటి ప్రమాదాల బెడదను మరింత పెంచుతుంది.
 
 ఇక సిమెంటు, బొగ్గు, ఆహారధాన్యాలు, పప్పుధాన్యాలు, యూరియా, కిరోసిన్, వంటగ్యాస్‌లపై రవాణా చార్జీలను దాదాపు 10 శాతం పెంచడం ద్వారా రూ. 4,000 కోట్లు అదనంగా రాబట్టడానికి ప్రభు నిర్ణయించారు. ఈ భారమంతా అంతిమంగా సామాన్యులపైనే పడుతుంది. సరుకులను పునర్ వర్గీకరించామని, దూరాన్నిబట్టి చార్జీలను హేతుబద్ధం చేశామని ఆయన చెప్పడం నొప్పి తెలియకుండా చేయడానికేననడంలో సందేహం లేదు. ఆయన ఏం చెప్పినా సరుకు రవాణా రాబడి రూ. 4,000 కోట్లు పెరుగుతుందనడం నిజం. అసలు డీజిల్ ధర గణనీయంగా తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీల పెంపు కాదు...తగ్గింపు ఉండాలి. ఎందుకంటే గతంలో చార్జీలు పెంచిన ప్రతిసారీ ప్రభుత్వాలు డీజిల్ ధరల పెంపునే సాకుగా చూపాయి. తగ్గించవలసి వచ్చేసరికి అలాంటివన్నీ ప్రభుత్వాలు ఎందుకు మరిచిపోతాయో అర్ధంకాదు.
 
 ప్రతి బడ్జెట్‌లోనూ భారీగా సంకల్పం చెప్పుకోవడం, క్రియకొచ్చేసరికి దేన్నీ పట్టించుకోకపోవడం ఈ ఆరున్నర దశాబ్దాల్లోనూ పాలకులు అనుసరిస్తున్న విధానం. సొంత రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు తరలించుకుపోవడం... ఆదాయాన్ని గానీ, అవసరాలనుగానీ పరిగణనలోకి తీసుకోకుండా స్వస్థలాలకు కొత్త రైళ్లు ప్రకటించడం రైల్వే మంత్రులుగా ఉన్నవారు ఇంతకాలంగా అనుసరిస్తున్న ధోరణి. సురేష్ ప్రభు ఆ బాట పట్టనందుకు ఆయన్ను అభినందించాలి.
 
 ప్రతి బడ్జెట్‌లోనూ కొత్త రైలు మార్గాలను ప్రకటించడం, వాటికోసం సర్వేలని చెప్పి ఏళ్లకేళ్లు కాలక్షేపం చేయడం... సర్వే నివేదికలొచ్చినా పనులు ప్రారంభించడానికి ఉత్సాహం చూపకపోవడం రివాజుగా మారింది. ప్రభు పుణ్యమా అని ఈసారి అలాంటి కొత్త మార్గాల సంతర్పణకు బ్రేకు పడింది. అయితే, ఇప్పుడు వివిధ దశల్లో ఉన్న సర్వేలనైనా త్వరితగతిన పూర్తిచేయడం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులను ఇతోధికంగా పెంచడం అవసరం. ఆ విషయంలో నిరాశే కలుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5,000 కిలోమీటర్ల మేర 36 కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేయడానికంటూ సర్వేలు చేయించారు. వాటిలో దాదాపు 30 సర్వేలు పూర్తయ్యాయి.
 
 తీరా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడివడ్డ రెండు రాష్ట్రాలకూ ఒక్క కొత్త రైలు మార్గం కూడా రాలేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకైనా కేటాయింపులు ఇతోధికంగా పెంచి త్వరితగతిన పూర్తిచేసే ఉద్దేశం ఉన్నట్టు కనబడటం లేదు. ఇక విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఎటో కొట్టుకుపోయింది. ఈ బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదు. వివిధ పార్టీల ఎంపీలు గుర్తుచేశారు గనుక కనీసం అందుకు సంబంధించి ఏం చేయదల్చుకున్నదీ చెప్పాలన్న స్పృహ కూడా రైల్వేమంత్రికి లేకపోయింది.
 
 రూ.850 కోట్లు వ్యయమయ్యే జంటనగరాల ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు ఈ బడ్జెట్‌లో రూ. 25 కోట్లు మాత్రమే కేటాయించడం తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికున్న నిర్లక్ష్యాన్ని తెలియజెబుతుంది. ప్రస్తుతం ఉన్న రైళ్ల గురించీ, ప్రాజెక్టుల గురించీ లోతుగా సమీక్షించాక కొత్తవాటి సంగతి చూస్తామని ప్రభు చెబుతున్నారు. అదే సందర్భంలో అధికాదాయం తెస్తున్న ప్రాంతాలను ఎలా ఆదుకోవాలో, ఏ విధంగా అభివృద్ధిపరచాలో యోచిస్తే తెలుగు రాష్ట్రాలు రెండింటికీ మేలు జరుగుతుంది. ఆ పని సాధ్యమైనంత త్వరగా జరగాలని కోరుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement