నటి ట్వీట్కు స్పందించి మంత్రి సాయం
ముంబై: బాలీవుడ్ నటి రేణుక సహాని చేసిన ట్వీట్కు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెంటనే స్పందించారు. అనారోగ్యానికి గురైన రేణుక వదినకు వెంటనే సాయం చేయాల్సిందిగా రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు. రేణుక భర్త అశుతోష్ రాణా సోదరి అయిన కామిని గుప్తా (63) ఢిల్లీ నుంచి ముంబైకి సువిధ ఎక్స్ప్రెస్లో ఒంటరిగా ప్రయాణిస్తోంది. శనివారం రాత్రి ఆమె రేణుకకు ఫోన్ చేసి, తనకు అస్వస్థతగా ఉందని చెప్పింది. రేణుక వెంటనే రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసి, సాయం చేయాల్సిందిగా కోరింది.
మంత్రి ఆదేశాల మేరకు కొన్ని నిమిషాల్లోనే రైల్వే అధికారులు రేణుకను సంప్రదించి వివరాలు అడిగారు. రైలు రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్కు వెళ్లేసరికి అక్కడ వైద్యులు బృందం సిద్ధంగా ఉన్నారు. ఛాతినొప్పితో బాధపడుతున్న కామినికి వైద్యులు చికిత్స చేశారు. తాను మంత్రికి ట్వీట్ చేసిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోపే తన వదినకు వైద్యులు చికిత్స చేశారని రేణుక తెలిపారు. కామిని ఎలాంటి సమస్య లేకుండా ముంబైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారని చెప్పింది. సమస్యల్లో ఉన్న ప్రయాణికులు ఎవరు ట్వీట్ చేసినా రైల్వే మంత్రి వెంటనే స్పందిస్తారని, వివరాలు తెలుసుకుని సాయం చేయాల్సిందిగా ఆదేశిస్తారని అధికారులు తెలిపారు.