రైళ్లు ఆలస్యమయ్యాయో.. ఇక అంతే!
రైళ్లు ఆలస్యం అవుతున్నాయంటే పదే పదే ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు సీరియస్ అయ్యారు. రైళ్లన్నీ సకాలంలో తిరిగేలా చూసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒక సీనియర్ అధికారి తప్పనిసరిగా నైట్ షిఫ్టులో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని, తద్వారా రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించాలని జోనల్ స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.
జాతీయ రైలు విచారణ వ్యవస్థలో ఉన్న సమయాలకు, భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్లలో ఉన్న సమయాలకు మధ్య ఉన్న తేడాలను కూడా సురేష్ ప్రభు గుర్తించారు. ఈ రెండింటికి, రైళ్లు వాస్తవంగా నడుస్తున్న సమయాలకు కూడా తేడా ఉండటం గమనార్హం. ఈ సమస్యను కూడా తక్షణం పరిష్కరించాలని రైల్వే అధికారులను ఆయన ఆదేశించారు. గత సంవత్సరం ఏప్రిల్ 1-16 తేదీల మధ్య రైళ్లు సకాలంలో నడిచే తీరు 84 శాతం వరకు ఉండగా, ఈ సంవత్సరం అది 79 శాతానికి పడిపోయింది. రైళ్లు ఆలస్యం కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని, దీన్ని వెంటనే అరికట్టాలని గట్టిగా చెప్పారు. చుట్టుపక్కల డివిజన్లకు చెందిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆలస్యాలను నివారించాలన్నారు.