కొత్త రైల్వేమంత్రిగా మరో కేంద్ర మంత్రి?
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాల నేపథ్యంలో రైల్వేశాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే మంత్రిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని నియమించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతోపాటు రోడ్డు, రైల్వే ,రవాణా శాఖలను కలిపి ఒకటి చేయాలనికూడా ప్రభుత్వం యోచిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రోడ్డు, రవాణా మంత్రి గా ఉన్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలను కూడా అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా నివేదికల ప్రకారం సురేష్ ప్రభు రాజీనామాకు ఆమోదం లభిస్తుందనీ, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి గడ్కరీ రైల్వేమంత్రి పదవిని చేపట్టనున్నారని తెలుస్తోంది. గత అయిదు రోజుల్లో రెండు బ్యాక్-టు-బ్యాక్ ప్రమాదాల కారణంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దురదృష్టకరమైన ప్రమాదాలు, ప్రయాణీకులు విలువైన జీవితాలను కోల్పోవటం గాయపడటం తనకు చాలా బాధ కలిగించిందంటూ బుధవారం మధ్యాహ్నం రైల్వే మంత్రి వరుస ట్వీట్‌లలో ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేల మెరుగుకోసం తన రక్తాన్ని, చెమటను, అంకితం చేశానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు. అయితే ప్రధాని వేచి వుండమని సూచించినట్టు ట్వీట్ చేశారు.
అటు రైల్వే బోర్డు ఛైర్మన్ పదవికి ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశోక్ లోహానీ నియమితులయ్యారు. ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ స్థానంలో రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అశ్వని ప్రస్తుతం ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరోవైపు కేంద్ర క్యాబినెట్ లో అతి త్వరలోనే భారీ మార్పులు చేర్పులు జరగనున్నాయినే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ‍్యంగా తమిళనాడులో పళని స్వామి, పన్నీరు సెల్వం విలీనం తరువాత అన్నాడీఎంకేకు క్యాబినెట్‌లో బెర్త్ ఖాయం అనే వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.