ఆవిరయ్యాయి. అనుకున్నట్టే మన ‘సార్లు’ ఈసారి కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సాధించితీరతామన్న ఎంపీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గతవారం హైదరాబాద్‌లో సమీక్షించి ఫలితమేమిటని జిల్లావాసులు నిట్టూరుస్తున్నారు. కాకినాడ మెయిన్ లైన్‌ను ఈసారి పట్టాలెక్కించాలన్న కృష్ణారావు సూచనకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పుడు.. బడ్జెట్‌లో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల్ని కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు కరుణించలేదు. నాలుగు దశాబ్దాలుగా కాకినాడ సహా జిల్లావాసులు గంపెడాశతో ఎదురు చూస్తున్న కాకినాడ మెయిన్‌లైన్ డిమాండ్‌కు బడ్జెట్‌లో రిక్తహస్తమే ఎదురైంది. ఎప్పుడో ఆమోదం లభించిన ప్రాజెక్టు కావడంతో ఏటా మాదిరిగానే బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.10 లక్షలు విదిల్చారు. కేవలం 21 కిలోమీటర్ల నిడివి కలిగిన లైన్ నిర్మాణంతో కాకినాడను మెయిన్‌లైన్‌తో అనుసంధానించే దిశగా ఎంపీల ప్రయత్నం కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు సాధిస్తామని ఆర్భాటంగా ప్రకటించే ఎంపీలు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రకటించే కొత్త ప్రభుత్వం..
మొదటి బడ్జెట్ అద్భుతంగా ఉంటుందని ఊహించిన ప్రజలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇదివరకటి ప్రభుత్వాల బాటలోనే పయనించిన ‘మోదీ రైలు’ షరా మామూలుగానే ‘తూర్పు’ తీరం చేరలేదు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనకు కానీ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు కానీ, కొత్త రైళ్ల ప్రకటనకు కానీ చోటు లేకుండా పోయింది. రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సంక్షేమం అనే రెండు అంశాలనూ పక్కనపెట్టి రూపొందించిన ఈ బడ్జెట్ ప్రగతినిరోధకంగా ఉందని, మోదీ రైల్ గాడీ ఒట్టి గారడీగా మిగిలిందని జిల్లాకు చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతిసారీ అన్యాయమే..
రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రతిసారీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉన్నప్పుడే న్యాయం జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయింది. ఆంధ్రావాసుల కలగా ఉన్న విజయవాడ, విశాఖ జోన్‌ల కోరిక నెరవేరడంలేదు. ప్రత్యేక రాష్ట్రంలో రైల్వే లైన్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవటం బాధాకరం.
- పిల్లి సుభాష్‌చంద్రబోస్,
మాజీ మంత్రి, పీఏసీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
నిరాశపరచిన బడ్జెట్
రైల్వే బడ్జెట్ జిల్లావాసుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కొత్త ప్రభుత్వమైనా క్లియర్ చేస్తుందనుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు, రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదో చేస్తుందని ప్రజలు ఆశ పడ్డారు. కనీసం కొత్త రైళ్లను కూడా రైల్వే మంత్రి ప్రకటించకపోవడం విచారకరం. కాకినాడను మెయిన్ రైల్వే లైనుతో అనుసంధానించడం, కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను ఏర్పాటువంటి డిమాండ్లు దీర్ఘకాలంగా ఉన్నవే. వాటిని మరోసారి నిర్లక్ష్యం చేశారు.
- ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ
చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనం
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపారు. రాష్ట్రానికి కొత్త లైన్లు, కొత్త రైళ్లు వస్తాయని, ముఖ్యంగా కోనసీమ రైల్వేలైనుకు మోక్షం కలుగుతుందని ప్రజలు ఆశించారు. విజయవాడ రైల్వే జోన్ ఏర్పాటు డిమాండ్ అసలు ప్రస్తావనకే నోచుకోలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా ఏ ప్రయోజనాలూ సాధించలేకపోయింది. ఆ పార్టీ ఎంపీల నోటికి సీఎం చంద్రబాబు తాళం వేసి పంపించడమే దీనికి కారణం.
- చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట
రైల్వే జోన్‌పై అన్యాయం
రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి మొండిచేయి చూపారు. సాయం చేసి ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం అన్యాయం. సాధారణ బడ్జెట్‌లోనైన నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. లోటు బడ్జెట్‌ను భర్తీ చేయడానికి అవసరమైన మొత్తం నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను.
- దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని
జిల్లాకు మొండిచెయ్యి
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచెయ్యి చూపడం దారుణం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాకినాడ మెయిన్ లైన్ సాధనలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. కోనసీమలో అలంకారప్రాయంగా మారిన రైలు పట్టాలను తొలగించడం మేలు. జనాభా పరంగా రాష్ట్రంలోనే పెద్దదైన మన జిల్లాకు బడ్జెట్‌లో నిరాశ ఎదురవడం దురదృష్టకరం. వచ్చే బడ్జెట్‌లోనైనా జిల్లాకు అధిక నిధులు, కాకినాడ మెయిన్‌లైన్ పనుల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి.
- వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కొత్త రైలుగాని, కొత్త లైన్లుగాని ప్రకటించలేదు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. తూర్పు తీరంలో ఏర్పాటు చేస్తామన్న కోస్తా కారిడార్‌ను పశ్చిమ తీరానికి తరలించుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ ప్రాంతం రాజధాని కాబోతోంది. అక్కడికి ప్రజల రాకపోకలు పెరిగాయి. అయినా వసతుల కల్పన, కొత్త రైళ్లు వేయడంపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కొవ్వూరు - భద్రాచలం రైల్వే లైను నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.
- వంతల రాజేశ్వరి, ఎమ్మెల్యే, రంపచోడవరం
ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యం లేదు
రైల్వే బడ్జెట్‌లో ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆధునికీరణ అవసరమే. కానీ దాంతోపాటు ఎంతోకాలంగా కోరుతున్న రైల్వే లైన్ల విస్తరణ పనులు కూడా అవసరమే. వీటిపై గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చూపింది. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైనుపై జిల్లావాసులకు నిరాశే మిగిలింది.
- జక్కంపూడి విజయలక్ష్మి,
సీజీసీ సభ్యురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
నిధుల కేటాయింపు ఉంటుందని ఎదురుచూశా
కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైనుకు ఈసారి రైల్వే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించాను. కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తారని ఎదురు చూశాను. ఇందుకోసం రైల్వే మంత్రిని, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందించాను. వారిచ్చిన భరోసాను బట్టి ఈసారి నిధులపై గట్టి నమ్మకం పెట్టుకున్నాను. పెండింగ్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు పార్లమెంటులో చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయింపు భారీగా ఉంటుందని ఎదురు చూశా. కానీ ఆ స్థాయిలో నిధులు కేటాయించలేదు.
- డాక్టర్ పండుల రవీంద్రబాబు, ఎంపీ, అమలాపురం
ప్రతి రైల్వే బడ్జెట్‌లో ఇదే నిర్లక్ష్యం
కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను పెండింగ్ ప్రాజెక్టుపై పధ్నాలుగేళ్లుగా ప్రతి రైల్వే బడ్జెట్‌లో కొనసాగుతున్న నిర్లక్ష్యమే ఈసారీ కొనసాగింది. కోనసీమవాసులు చిరకాల వాంఛ అయిన ఈ లైనును సాధించడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. 15 ఏళ్ల నుంచి ఇక్కడి అవసరాలు, ప్రజల ఆకాంక్షలను రైల్వే శాఖ కనీసంగా కూడా పరిగణనలోకి తీసుకోవటంలేదు. వినతుల ద్వారా ఈ లైను సాకరమయ్యే పరిస్థితి కనిపించటంలేదు. ప్రజా ఉద్యమాల ద్వారానే రైల్వే శాఖ దిగివచ్చేలా చేయాలి.
- గిడుగు రుద్రరాజు, ప్రధాన కార్యదర్శి,
ఏపీసీసీ అమలాపురం
అక్కరకు రాని రూ.5 కోట్లు
కోటిపల్లి - నర్సాపురం రైల్వేలైనుకు ఈసారి కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తారని, దీంతో పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.5 కోట్లు కేటాయించారు. గతంలో ఎప్పుడూ రూ.కోటి లేదా రూ.అరకోటి కేటాయించే రైల్వే శాఖ ఈసారి కాస్త పెంచింది. అయినా అవి అక్కరకు రావు. ఇక ప్రజా ఉద్యమానికి తెర తీయాల్సిందే. మా సమితి ద్వారా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం.
- డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్, కోనసీమ రైల్వే సాధన సమితి, అమలాపురం
అభివృద్ధి నిరోధక బడ్జెట్
రైల్వే బడ్జెట్ పూర్తి అభివృద్ధి నిరోధకంగా ఉంది. విభజన అనంతరం విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఊసే లేకుండా పోయింది. కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైను మినహా కొత్త రైళ్లు కూడా లేవు. పెండింగ్ ప్రాజెక్టులైన కాకినాడ మెయిన్‌లైన్, కోటిపల్లి - నర్సాపురం, కొవ్వూరు - భద్రాచలంపై ఎలాంటి ప్రకటనా లేకపోవడం బాధాకరం. ప్రజలపై భారం లేదంటూనే సిమెంటు, స్టీలు, బొగ్గుపై రవాణా చార్జీలు పెంచారు. తద్వారా పరోక్ష భారం పడుతుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రైల్వే టిక్కెట్ల ధరలు కూడా తగ్గాలి.
- కందుల దుర్గేష్, అధ్యక్షుడు,
జిల్లా కాంగ్రెస్ కమిటీ
వాస్తవానికి దగ్గరగా ఉంది
రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పథకాలు పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. చార్జీలు పెంచకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయం. ప్రత్యేక సదుపాయాలు కల్పించి ప్రయాణికులకు పెద్ద పీట వేశారు. సాధారణ రైళ్లలోనూ ప్రయాణికులకోసం అనేక సదుపాయాలు కల్పించడం అభినందనీయం.
- వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షులు, బీజేపీ
ప్రజల ఆశలను నట్టేట ముంచారు
జిల్లా ప్రజల ఆశలను ప్రజాప్రతినిధులు నట్టేట ముంచారు. పెండింగ్‌లో ఉన్న కాకినాడ మెయిన్ లైన్, కోటిపల్లి - నర్సాపురం లైన్లపై బడ్జెట్‌లో కనీస ఊసెత్తకపోవడం విచారకరం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటే రైల్వే రంగాన్ని ప్రైవేటుపరం చేయడమే.
- తాటిపాక మధు,
జిల్లా కార్యదర్శి, సీపీఐ
శుష్క వాగ్దానాలు..శూన్యహస్తాలు
ఎటువంటి కేటాయింపులూ లేని మొదటి రైల్వే బడ్జెట్‌గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలతో మంత్రి ప్రసంగం సాగింది. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం దారుణం. జిల్లా ప్రజలను నిరాశపర్చడమేకాకుండా దేశ ప్రజలను మోదీ మోసం చేశారు.
- దడాల సుబ్బారావు,
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం
‘తూర్పు’ చేరని రైలు
Published Fri, Feb 27 2015 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement