రైల్వే జోన్‌పై నాన్చుడు
- నిర్దిష్ట హామీ ఇవ్వని కేంద్రమంత్రి
- మంత్రి వైఖరిపై సందేహాలు
- నిరాశ పర్చిన సురేష్ ప్రభు పర్యటన
విశాఖపట్నం సిటీ : రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ దిశగా స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేత వైఖరి అవలంభించారు. చూస్తున్నాం...పరిశీలిస్తున్నాం అని చెప్పి తప్పించుకున్నారు. విశాఖలో బుధవారం బీజేపీ సభలో పాల్గొన్న ఆ యన్ను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, రైల్వే జోన్ ప్రకటించాలని కోరారు. వీరి విన్నపాల తర్వాత ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు గానీ ఇస్తామని సూటిగా ప్రకటించలేదు.
విజయవాడ-గుంటూరు, గుంతకల్లులలో కూడా రైల్వే జోన్ కోసం అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జోన్‌పై మంత్రి మాటలు సందేహాలకు తావిస్తున్నాయి. జోన్ స్వరూపంపై కూడా రైల్వే మంత్రి నేరుగా స్పందించలేదు. అత్యధిక ఆదాయాన్నిచ్చే కేకే లైన్‌ను వదులుకునేది లేదని ఒడిశా పట్టుబడుతోంది. కేకే లైన్ లేని వాల్తేరు డి విజన్ ఆర్ధికంగా నిలదొక్కుకోలేదు. అందుకే ప్రస్తుత వాల్తేరు డివిజన్‌తో పాటు రాష్ట్ర పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కానీ ఆ అంశంలో కూడా మంత్రి సురేష్ ప్రభు స్పష్టత ఇవ్వకపోవడంపై రైల్వే వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో ఆర్‌ఆర్‌బి పరీక్షా కేంద్రం డిమాండ్‌ను కూడా మంత్రి పట్టించుకోలేదు. మొత్తం మీద రైల్వేమంత్రి పర్యటన ఉత్తరాంధ్ర వాసులకు కొంత నిరాశే మిగిలింది. పోర్టు కాలుష్య సమస్య పరిష్కారానికి కూడా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. తగినన్ని రైల్వే రేక్‌లు లేకపోవడం వల్ల పోర్టులోని బొగ్గు, ఇనుప ఖనిజం రవాణా ఆలస్యమవుతోందని పలువురు మంత్రికి వివరించారు. విశాఖ పోర్టుకు రైల్వే రేక్ కేటాయింపులు పెంచాలని కోరారు.
దీనిపై మంత్రి హామీ ఇవ్వలేదు. రైల్వే శాఖ రేక్‌ల సంఖ్య పెంచలేమని తేల్చిచెప్పారు. ప్రైవేట్ కంపెనీలే రేక్‌లను నిర్మించుకుని రవాణా చేసుకునే వెసులబాటు కల్పిస్తామన్నారు. జోన్‌పై నిరాశ పరిచారని శ్రామిక్ యూనియన్ మహిళా విభాగం అధ్యక్షురాలు షలీల్ ఆవేదన వ్యక్తంచేశారు. స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఓబీసీ రైల్వే ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు పెదిరెడ్ల రాజశేఖర్ వ్యాఖ్యానించారు.