∙ఆ ఊసేలేకుండా కేంద్రమంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం
‘జోన్’ సాధనలో చంద్రబాబు విఫలం
ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీకి రిక్తహస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని హామీగా ఉన్న విశాఖపట్నం రైల్వేజోన్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేస్తామన్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుపై లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్‌లో కనీస ప్రస్తావన కూడా లేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా సీఎం చంద్రబాబు విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ సాధనలో పూర్తిగా విఫలమయ్యారు. 2014–19 మధ్య వైఫల్యాలను పునరావృతం చేస్తూ మరోసారి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం చొరవచూపడం లేదన్నది స్పష్టమవుతోంది.
రైల్వేజోన్ ఊసేలేదు..
2024–25 వార్షిక బడ్జెట్‌లో అంతర్భాగంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. గత బడ్జెట్‌లలో జోన్ ఏర్పాటు ప్రక్రియను సూత్రప్రాయంగా ప్రారంభించామని చెప్పిన కేంద్రం ఆచరణలో వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ రూపొందించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఒత్తిడితో విశాఖలో కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు కూడా కేటాయించింది.
ఆరిలోవలో రైల్వేకు భూముల కేటాయింపు కూడా గత ప్రభుత్వంలో జరిగింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం టీడీపీ ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందున ఈసారి రైల్వేజోన్‌పై స్పష్టత వస్తుందేమోనన్న రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లుజల్లింది. అసలు బడ్జెట్ ప్రసంగంలో రైల్వేజోన్ గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం విస్మయం కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులైన రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హస్తినలో డిమాండ్ చేయనేలేదు.
ఒడిశాలో బీజేపీ ప్రయోజనాల కోసమేనా?
ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. నిజానికి.. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా జోన్‌లో అత్యధిక రాబడి వస్తున్న వాల్తేర్ డివిజన్‌ను ఏకంగా రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే వీలైనంత వరకు విశాఖ రైల్వేజోన్ అంశాన్ని సాగదీస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా దీనిపై కేంద్రాన్ని నిలదీయకపోవడం రాష్ట్రానికి శాపంగా పరిణమిస్తోంది.
‘బ్లూ బుక్’ వస్తేనే..
ఇక కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు కేటాయింపులపై సమగ్ర వివరాలతో ‘బ్లూ బుక్’ రైల్వే కార్యాలయానికి చేరితేగానీ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కేటాయింపులు ఏమిటన్న దానిపై స్పష్టతరాదు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఏయే ప్రాజెక్టులకు ఎంతమేర కేటాయింపులు చేశారన్నది మంగళవారం బడ్జెట్‌లో పేర్కొంది.
కానీ, బ్లూ బుక్ వస్తేగానీ అందులోని వివరాలు తెలియవు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల కోసం సర్వేలు, కొత్త ఆర్వోబీల నిర్మాణం, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు, కొత్త రైళ్ల కేటాయింపులు మొదలైన అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment