విశాఖ రైల్వేజోన్‌ పట్టాలెక్కేనా!? | Nirmala Sitharaman will present the Union Budget in the Lok Sabha | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వేజోన్‌ పట్టాలెక్కేనా!?

Published Tue, Jul 23 2024 5:13 AM | Last Updated on Tue, Jul 23 2024 5:13 AM

Nirmala Sitharaman will present the Union Budget in the Lok Sabha

కొత్త లైన్లకు కేంద్రం నిధులిచ్చేనా!? 

రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై డిమాండ్‌ చేయని చంద్రబాబు 

2014–18 మధ్య నిధులు సాధించలేని వైనం 

రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రుల వద్ద ఊసెత్తని టీడీపీ, జనసేన ఎంపీలు 

ప్రస్తుత ఎన్డీయేలో భాగస్వామిగా అయినా సాధిస్తారా? 

దీర్ఘకాలంగా నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులకైనా మోక్షం లభిస్తుందా?

సాక్షి, అమరావతి: పదేళ్లుగా వేధిస్తున్న రాష్ట్ర విభజన గాయాలకు ఈసారైనా కాస్త సాంత్వన కలుగుతుందా? విశాఖపట్నం రైల్వేజోన్‌ పట్టాలు ఎక్కుతుందా? 2014–18 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగ­స్వామిగా ఉండి కూడా రైల్వే ప్రాజెక్టులను సాధించలేని చంద్రబాబు ఇప్పుడైనా తీసుకొస్తారా? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జన­సేన రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు సాధిస్తాయా!?..  

..ఇదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్‌. కేంద్ర ఆరి్థకమంత్రి నిర్మలా సీతారామన్‌ 2024–25 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రాష్ట్రానికి రైల్వే కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది.  

పట్టాలెక్కని దశాబ్దాల డిమాండ్‌.. 
విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్‌. అహేతుకంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి సాంత్వన కలిగించేందుకు 2014లో విభజన చట్టంలో ప్రత్యేక రైల్వేజోన్‌ హామీనిచి్చంది. ఆ తర్వాత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వేజోన్‌ అంశం నత్తనడకను తలపిస్తోంది. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుచేస్తామన్నారుగానీ ఇప్పటివరకు మళ్లీ ఆ ఊసెత్తలేదు. పైగా.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం రైల్వేజోన్‌ గురించి పట్టించుకోనేలేదు. 

ఇక 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీని గురించి గట్టిగా పట్టుబట్టింది. కీలక ప్రతిపాదనలతో కూడిన నివేదికను అప్పట్లో కేంద్రానికి ప్రత్యేకంగా సమరి్పంచింది. దీంతో విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రైల్వే­శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవస­రాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వేజోన్‌ కార్యాలయాల నిర్మాణానికి ఇటీ­వల రూ.170 కోట్లు సైతం మోదీ సర్కారు కేటా­యించింది. 

కానీ, రైల్వేజోన్‌ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. మరోవైపు.. విశాఖలో రైల్వే­జోన్‌ ఏర్పాటునకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైల్వేశాఖకు భూమి కూడా కేటాయించింది. కానీ, ఆ భూమిపై అనవసర రాద్ధాంతం చేస్తూ కేంద్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోంది. అవసరమైతే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి కేటాయిస్తామని చెప్పినా సరే కేంద్రం నుంచి స్పందన శూన్యం.  

కీలక ప్రాజెక్టులపై వరాల జల్లు కురిసేనా? 
రాష్ట్రంలో పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా నత్తనడకన సాగుతున్న ఈ ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రభుత్వం తగినన్ని నిధులు రాబడుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర నుంచి భారీగా నిధుల కేటాయింపునకు నిరీక్షిస్తున్న కీలక రైల్వే 
ప్రాజెక్టులివే.. 

»  బెంగళూరు–కడప రైల్వేలైన్‌ 
» విజయవాడ–గూడూరు మూడో రైల్వేలైన్‌ 
» నడికుడి–శ్రీకాళహస్తి లైన్‌ 
» నరసాపురం–కోటిపల్లి లైన్‌ 
» డోన్‌–అంకోలా లైన్‌ 
» విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ–    నాగ్‌పూర్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు 
» రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ 
» కొత్త ఆర్వోబీల నిర్మాణం  

రైల్వే ప్రాజెక్టు ఊసెత్తని బాబు, పవన్‌.. 
ఇక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భా­గ­స్వాములుగా ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాజెక్టుల సాధనపై ఇప్పటి­వరకు దృష్టిసారించనేలేదు. సీఎంగా బాధ్య­తలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నెలరోజుల్లోనే నాలుగుసార్లు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతుందని తెలిసినా సరే ఆయన రైల్వే ప్రాజెక్టుల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించలేదు. మరోవైపు.. ఉప ముఖ్య­మంత్రి పవన్‌కళ్యాణ్‌ అయితే సరేసరి. టీడీపీ, జనసేన ఎంపీ­లు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లలేదు. 

నిజానికి.. విశాఖపట్నం రైల్వేజో­న్‌ ఏర్పాటు చేయాలంటే.. భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్‌లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా­టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా­ల ఏర్పాటు తదితర అంశాలను కొలిక్కి తెచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ, ఆ దిశగా చంద్రబాబు, పవన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడమేలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement