రిక్తహస్తం
బడ్జెట్‌లో గుంటూరు డివిజన్‌కు నూతన కేటాయింపులు శూన్యం
రైల్వే జోన్ ప్రస్తావనే లేదుమౌలిక వసతులకంటే టెక్నాలజీకే ప్రాధాన్యం
పెండింగ్ ప్రాజెక్టులకే నిధులుసామాన్య ప్రయాణికుల్లో తీవ్ర నిరాశ
నవ్యాంధ్రరాజధానిలో బడ్జెట్ రైలు ఆగలేదు. గుంటూరు రైల్వే డివిజన్‌కు నూతన కేటాయింపుల ఊసే లేదు. ఇప్పుడిప్పుడే రాజధాని అమరావతి నిర్మాణ పనులు పుంజుకుంటున్న నేపథ్యంలో గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి కనెక్టవిటి అత్యవసరం. బడ్జెట్ కేటాయింపుల్లో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు మినహా నూతన రైళ్లు, రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.
నగరంపాలెం (గుంటూరు) కేంద్రమంత్రి సురేష్‌ప్రభు గురువారం పార్లమెంట్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ గుంటూరు డివిజన్ ప్రజలను నిరాశకు గురిచేంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై చేస్తున్న హడావుడి కార్యరూపం దాల్చేందుకు చాలాకాలం పట్టేలా ఉందని భావించారో ఏమో కనీసం రాజధాని ప్రాంతంలో రైల్వేలైన్ల అభివృద్ధిపై హామీలు కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. మౌలిక వసతుల కంటే టెక్నాలజీకే ప్రాధాన్యమిచ్చారు.
వీటికి నిధులొచ్చే అవకాశం..
గుంటూరు - విజయవాడకు రాజధాని ప్రాంతమైన అమరావతి మీదుగా సుమారు 85 కి.మీ, నల్లపాడు-బీబీనగర్‌కు 243 కి.మీ డబ్లింగ్ సర్వేకు అనుమతించింది. ఇక విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా నూతన రైల్వేజోన్ ఊసేలేదు. డివిజన్‌లో ప్రధానమంత్రి ప్రయార్టీ ప్రాజెక్టుల కింద నడుస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి పనులకు రూ.182 కోట్లు, గతంలో పనులు ప్రారంభించి ఆగిపోయిన మాచర్ల-నల్లగొండ రైల్వే లైన్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. దేశం మెత్తంలోని పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలపడం ద్వారా డివిజన్‌లో ప్రస్తుతం జరుగుతున్న తెనాలి-గుంటూరు డబ్లింగ్, గుంటూరు- నంద్యాల విద్యుదీకరణ పనులకు బడ్జెట్ నిధులు వచ్చే అవకాశం ఉంది.
ప్రజాప్రతినిధుల సమర్థతను బట్టే సౌకర్యాలు
రాష్ట్రప్రభుత్వ కేంద్రమంత్రి సురేష్‌ప్రభు గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో భాగస్వామ్యంతో గుంటూరు-నంద్యాల డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. మేళచెర్వు-జగ్గయ్యపేట పెండింగ్ ప్రాజెక్టుకు రూ.110 కోట్లు కేటాయింపు ద్వారా భవిష్యత్తులో గుంటూరు డివిజన్‌కు విష్ణుపురం మీదుగా సరుకురవాణా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక వివరాలు లేకుండా దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లకు వైఫై, 311 స్టేషన్లులో సీసీ కెమేరాల ఏర్పాటు, అన్ రిజర్వుడ్, సూపర్‌ఫాస్ట్ అంత్యోదయ ట్రైన్లు, దీన్‌దయాళ్ కోచ్‌లు, రిజర్వేషన్, పర్యటకరంగ ప్రయాణికుల కోసం హమ్‌సఫర్, తేజస్, ఉదయ్, రైళ్లు నడపాలని ప్రకటించారు. దీని వలన జోన్ స్థాయిలో అధికారుల సమర్థతను బట్టి, ప్రజప్రతినిధులు రైల్వే బోర్డుపై తెచ్చే ఒత్తిడి వలనే ఈ సౌకర్యలు డివిజన్‌కు సమకూరే అవకాశం ఉంది.
భద్రతకు ఆన్‌లైన్ టెక్నాలజీ
రైల్వే శాఖలో ఆన్‌లైన్ టెక్నాలజీని ప్రయాణికులకు, భద్రతకు విస్తృతంగా వినియోగించేలా పథకాల రూపకల్పన చేయనున్నారు. ప్లాట్ ఫాం టికెట్‌ను యాప్ ద్వారా అందించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. సగటు రైల్వే ప్రయాణికుడికి మేలు చేయలేని బడ్జెట్‌గా దీనిని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్‌లో 2016-17 సాధించనున్న లాభాలు ప్రస్తావించటం, పీపీపీ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ద్వారా, రైల్వేశాఖలో భవిష్యత్తులో జరిగే ప్రయివేటీకరణకు ఇది నాంది బడ్జెట్ అవుతుందంటున్నారు. ఇక ఉద్యోగుల సంక్షేమంపై కనీస ప్రస్తావనే లేదు.
మంగళగిరికీ మొండిచేయి..
మంగళగిరి : నవ్యాంధ్ర నూతన అమరావతి రాజధానిలో ప్రధాన స్టేషన్‌గా వున్న మంగళగిరిలోనే బడ్జెట్ రైలు కూత వినిపించలేదు. అధికారులు,అధికారపార్టీనేతలు గొప్పగా చెప్పిన రైల్యే లైన్లు విస్తరణ,దేశనలుమూలలకు నూతన రైళ్లు దక్కకపోగా సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్న కనీస మౌలిక వసతులుకు బడ్జెట్‌లో స్థానం దక్కకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. స్టేషన్‌లో కనీసం రెండో రిజర్యేషన్ కౌంటర్, ప్రయాణికుల విశ్రాంతి గదులతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాటుకు దిక్కు లేకపోవడం విశేషం. గత ఏడాది దక్షిణ మధ్య రైల్యే జీఎం పర్యటించిన సమయంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల సంక్షేమసంఘం ప్రతినిధులు కలిసి పలు వినతులు చేశారు.రాజధాని స్టేషన్‌లో మరిన్ని మౌలికవసతులతో పాటు స్టేషన్ అభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు చేశామని బడ్జెట్‌లో నిధులు కెటాయించిన వెంటనే స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని చెప్పిన అధికారులు ఆమేరకు చేతలలో సాధించలేకపోవడం గమనార్హం.