సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లోని రైల్వే పద్దులో మోదీ ప్రభుత్వం ఈసారి తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. కనీసం కొత్త లైన్లు, సర్వేలను సైతం ప్రస్తావించలేదు. కేవలం పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులతోనే సరిపెట్టింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.
ఈసారి దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786.19 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ. 8,349.75లతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులు, ఇతర పనులకు రూ. 4,418 కోట్లు లభించాయి. ఈ మొత్తం గతేడాది కేటాయింపు (రూ. 3,048 కోట్లు)ల కంటే 45 శాతం ఎక్కువ కావడం విశేషం. దక్షిణమధ్య రైల్వే పరిధిలోకే వచ్చే ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం రూ. 8,406 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయింపు (రూ. 7,032)ల కంటే 20 శాతం ఎక్కువ.
గతం కన్నా రూ. 5,437 కోట్లు ఎక్కువ..
ఈసారి దక్షిణమధ్య రైల్వే జోన్‌కు గత బడ్జెట్ కంటే ఏకంగా రూ. 5,437 కోట్లు ఎక్కువగా కేటాయించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు జోన్ పరిధిలోకి వచ్చే కర్ణాటక, మహారాష్ట్రలో రైల్వే లైన్ల ఏర్పాటుకు కూడా ఈ కేటాయింపులు ఊతమిస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులతోపాటు జోన్ పరిధిలో మరో 105 స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నాం. నగరానికి అత్యంత కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తి చేసేలా ఏకంగా రూ. 600 కోట్లు కేటాయింపు ఆ ప్రాజెక్టుకు పెద్ద మలుపు కానుంది.
– అరుణ్‌కుమార్‌జైన్, జీఎం దక్షిణ మధ్య రైల్వే
Comments
Please login to add a commentAdd a comment