కొత్త లైన్లు లేవు.. ఉన్నవాటికే నిధులు | Allocation of funds for railway projects in Telangana | Sakshi
Sakshi News home page

కొత్త లైన్లు లేవు.. ఉన్నవాటికే నిధులు

Published Fri, Feb 2 2024 4:06 AM | Last Updated on Fri, Feb 2 2024 9:20 AM

Allocation of funds for railway projects in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌లో రైల్వే శాఖకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల సర్వేలాంటి కొత్తవాటి జోలికి కేంద్రప్రభుత్వం పోలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోనే సరిపెట్టింది. ఆర్మూరు–ఆదిలాబాద్, వికారాబాద్‌–కృష్ణా లైన్లు సహా సికింద్రాబాద్‌–కాజీపేట మూడో లైన్‌లాంటి వాటి ఊసే లేకుండా రాష్ట్రానికి కేటాయింపులు చేసింది.

తేడాది బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.4418 కోట్లు కేటాయించగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం మధ్యంతర బడ్జెట్‌లో రూ.5,071 కోట్లను ప్రతిపాదించింది. ఇది అంతకుముందు బడ్జెట్‌ కంటే 15 శాతం ఎక్కువ కావటం విశేషం. 2022–23లో రూ.2,038 కోట్లు కేటాయించారు. ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా... 

కాజీపేట–విజయవాడ మూడో లైను: రూ.310 కోట్లు.
ఇది 2012–13లో మంజూరైంది. పూర్తి నిడివి 219 కి.మీ.. దీని అంచనా వ్యయం రూ.1857 కోట్లు. విజయవాడ–కొండపల్లి వైపు పని పూర్తి కాగా, ఇప్పుడు విజయవాడ–ఖమ్మం మధ్య నిర్వహిస్తున్నారు. గత బడ్జెట్‌లో రూ.337 కోట్లు కేటాయించారు.  

కాజీపేట–బల్లార్షా మూడో లైను: రూ.300 కోట్లు. 
ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. కాజీపేట హసన్‌పర్తి మధ్య పనులు జరగాల్సి ఉండగా, ఎగువ భాగంలో దాదాపు పూర్తయ్యాయి. గత బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించారు. 

మనోహరాబాద్‌–కొత్తపల్లి: రూ.350 కోట్లు 
ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరు కాగా, నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ.. అంచ నా వ్యయం రూ.1160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భ రించనుండగా, రాష్ట్రప్రభుత్వం ఒకవంతుతో పాటు భూసేకరణ వ్యయాన్ని భరిస్తుంది. సిద్దిపేట వరకు పనులు పూర్తి కా వటంతో సికింద్రాబాద్‌–సిద్దిపేట మధ్య రైలు సర్విసులు మొ దలయ్యాయి. సికింద్రాబాద్‌–సిరిసిల్ల మధ్య భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నిధులు డిపాజిట్‌ చేయకపోవటంతో పనులు ఆగాయి. గత బడ్జెట్‌లో రూ.185 కోట్లు కేటాయించారు. 

భద్రాచలం–సత్తుపల్లి:రూ.6 కోట్లు 
ఇది 2010–11లో మంజూరైంది. నిడివి 54 కి.మీ. అంచనా వ్యయం రూ.704 కోట్లు. సింగరేణితో కలిపి రైల్వే ఈ సంయుక్త ప్రాజెక్టును చేపట్టింది. బొగ్గు తరలింపు ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారు.  

ఎంఎంటీఎస్‌ రెండో దశ: రూ.50 కోట్లు 
నగర ట్రాఫిక్‌కు ఊరటనిచ్చే ఈ ప్రాజెక్టును 2012–13లో మంజూరు చేశారు. అంచనా వ్యయం రూ.817 కోట్లు. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా రూ.450 కోట్లు. కానీ రాష్ట్రప్రభుత్వం రూ.130 కోట్లతోనే సరిపుచ్చింది. గత బడ్జెట్‌లో భారీగా నిధులు విడుదల కావటంతో పనులు వేగంగా సాగాయి. దీంతో ప్రాజెక్టు సిద్ధమైంది. 

ఘట్‌కేసర్‌–యాదాద్రి ఎంఎంటీఎస్‌: రూ.10 కోట్లు 
రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదన్న ఉద్దేశంతో రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. గత బడ్జెట్‌లో నామమాత్రంగా రూ. 10 లక్షలతో సరిపెట్టింది. కానీ ఈసారి రూ.10 కోట్లు కేటాయించటంతో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.  

చర్లపల్లి శాటిలైట్‌ టెర్మి నల్‌:రూ.46 కోట్లు
సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయంగా చర్లపల్లిలో టెర్మి నల్‌ నిర్మించారు. ఇందులో 6 ప్లాట్‌ఫామ్స్, 5 పిట్‌ లైన్లు ఉంటాయి. రైల్వే కోరినంత భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించలేదన్న విమర్శ ఉంది. దీంతో దీన్ని ఆశించినస్థాయిలో కాకుండా చిన్నదిగానే నిర్మించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి.  

భద్రాచలం–కొవ్వూరు: రూ.10 లక్షలు 
ఇది కీలకప్రాజెక్టు అయినప్పటికీ నిధుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. గత బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించగా ఈసారి నామమాత్రపు నిధులతోనే సరిపెట్టారు.  

మణుగూరు–రామగుండం: రూ.5 కోట్లు కీలక ప్రాజెక్టుకు తొలిసారి భారీ నిధులు 
కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌–విజయవాడ మార్గం ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయ లైను అవసరం ఏర్పడింది. నడికుడి మీదుగా బీబీనగర్‌– గుంటూరు మార్గాన్ని దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. 248 కి.మీ. మేర  రెండోలైన్‌ నిర్మించాల్సి ఉంది. రూ.2853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.

రెండు లైన్లు పూర్తయితే  ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచుతారు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. గత బడ్జెట్‌లో రూ.60 కోట్లు  ప్రతిపాదించగా, సవరించిన అంచనాల్లో దాన్ని రూ.10 కోట్లకు కుదించారు. అవి కూడా విడుదల కాలేదు. తొలిసారిగా ఆ ప్రాజెక్టుకు రూ.200 కోట్లను తాజా బడ్జెట్‌లో  ప్రతిపాదించారు. 

కాజీపేట వ్యాగన్‌ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు 
కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్‌ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.140 కోట్లు ప్రతిపాదించారు. తొలుత వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపుగా మంజూరు చేసిన దీన్ని.. గత బడ్జెట్‌లో వ్యాగన్‌ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. అంచనా వ్యయాన్ని రూ.521 కోట్లకు పెంచారు. గతేడాది నుంచి పనులు ఊపందుకున్నాయి.

ఆ ప్రాంతాన్ని చదును చేయటం, కొన్ని షెడ్లు నిర్మించటం, ఒక ఆర్‌యూబీని సిద్ధం చేయటం.. తదితరాలు పూర్తి చేశారు. ఇప్పుడు మెరుగ్గానే నిధులు వచ్చినందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు వేగంగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి సంవత్సరం నాటికి అది పూర్తయి పని ప్రారంభించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement