47 శాతం నగర పోలీసులకే...
బడ్జెట్‌లో భేషైన కేటాయింపులు
‘ట్విన్ టవర్స్’కు రూ.140 కోట్లు
‘లక్ష కళ్ళ’ కోసం రూ.225 కోట్లు
మొత్తమ్మీద సిటీకి రూ.565 కోట్ల నిధులు
సైబరాబాద్ కమిషనరేట్‌కు మరో రూ.42 కోట్లు
సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం నగర పోలీసు విభాగానికి పెద్దపీట వేసింది. హోం శాఖకు మొత్తం రూ.1200 కోట్లు కేటాయించగా... ఇందులో రూ.565 కోట్లు (47 శాతం) నగర పోలీసు విభాగానికి దక్కాయి. ‘లక్ష కళ్ళ’ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాజెక్టుకు అత్యధికంగా రూ.225 కోట్లు కేటాయించింది. ‘ట్విన్ టవర్స్’గా పిలిచే బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మించనున్న అత్యాధునికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (సీసీసీ) తొలివిడతగా రూ.140 కోట్లు ఇచ్చింది. 2015-16 బడ్జెట్‌లో నగర కమిషనరేట్‌కు రూ.186 కోట్లు వచ్చాయి. మొత్తమ్మీద ఈ బడ్జెట్‌లో సిటీ కాప్స్‌కు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్‌లో జంట కమిషనరేట్ల అధికారులు రూ.245 కోట్ల ప్రతిపాదనలు పం పగా... ఏకంగా రూ.607 కోట్లు కేటాయించడం గమనార్హం.
ఐసీసీసీ ఏర్పాటుకు తొలి అడుగు...
బంజారాహిల్స్‌లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్-క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే రూ.302 కోట్లు మంజూరు చేయగా... ఈ బడ్జెట్‌లో మరో రూ.140 కోట్లు కేటాయించారు.
డేగ‘కళ్ళ’ కోసం రూ.225 కోట్లు...
నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. రెండు కమిషనరేట్లలోనూ కలిపి లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తొలిబడ్జెట్‌లోనే రూ.69 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్‌లో రూ.225 కోట్లు కేటాయించింది.
మౌలిక వసతులకు రూ.70 కోట్లు....
ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పోలీసు అధికారులు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నారు. దీనికోసం పోలీసుస్టేషన్ల స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆధునిక హంగులతో కూడిన ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల ఏర్పాటు, ప్రత్యేకంగా రిసెప్షన్ ఏరియా తదితరాల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. కొత్తగా పోలీసుక్వార్టర్స్ నిర్మాణం, ఉన్న వాటి అభివృద్ధి, అధికారుల కార్యాలయాలు, సిబ్బందికి బ్యారెక్స్ తదితరాల నిర్మాణ అవసరాలు, యంత్రసామాగ్రి కొనుగోలు కోసం రూ.40 కోట్లు నగర కమిషనరేట్‌కు ఈ బడ్జెట్‌లో దక్కాయి.
‘ట్రాఫిక్ టెక్నాలజీ’కి రూ.100 కోట్లు
సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ పథకం కింద ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ.50 కోట్ల అంచనాలతో టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.
వ్యవస్థీకృత నేరాలకు చెక్ చెప్పేందుకు రూ.30 కోట్లు
సైబర్ నేరాలతో పాటు వ్యవస్థీకృతంగా రెచ్చిపోతున్న ముఠాల పైనా నగర పోలీసులు సాంకేతిక యుద్ధం చేయనున్నారు. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్స్, ఇతర ఉపకరణాల ఖరీదుతో పాటు క్రైమ్ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి సంబంధించిన నగర పోలీసులు పంపిన ప్రతిపాదనలపై స్పందించిన సర్కారు రూ.30 కోట్లు కేటాయించింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసు బారెక్స్ నిర్మాణం, పోలీసుస్టేషన్లలో అదనపు ఫ్లోర్లు నిర్మాణం, రిపెప్షన్ సెంటర్ల ఏర్పాటు, ఇతర ఉపకరణాల ఖరీదు కోసం రూ.42 కోట్లు కేటాయించింది. ఈ కమిషనరేట్‌కు సంబంధించిన సీసీ కెమెరాల ఏర్పాటు సైతం హైదరాబాద్ కేంద్రంగానే జరుగనుంది.
సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు
నగర కమిషనరేట్‌కు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి నగర పోలీసు విభాగం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చరిత్రలో తొలిసారిగా బడ్జెట్‌లో నగరానికి పెద్దపీట వేశారు. ప్రజల ఆశలు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ఇది ఎంతో ఉపయుక్తం. ఆధునిక టెక్నాలజీ, సీసీ కెమెరాల ఏర్పాటు, క్రైమ్ కంట్రోల్ టెక్నాలజీ, ఐసీసీసీ నిర్మాణానికి నిధులు సమకూరాయి. నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చడంలో ఇవి ఎంతో ఉపయుక్తం కానున్నాయి. - ఎం.మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్