సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరం (2024–25)లో నీటిపారుదల రంగానికి రూ.37 వేల కోట్లను కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. మంగళవారం నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు.
2024– 25లో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల నిమిత్తం రూ.14,462.17 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది కాక రూ.3000 కోట్లను తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ కింద తీసుకున్న రుణాలకు చెల్లింపులున్నాయని అధికారులు నివేదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సృష్టించేలా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్సాగర్, నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్), మొడికుంటవాగు, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, పెద్దవాగు (జగన్నాధపూర్), చనాకా కొరాటా, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) మురళీధర్ రావు పాల్గొన్నారు.
విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం..
విద్యుత్ సంస్థల్లో మరో ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment